‘దానవీర శూర కర్ణ’ సినిమాకు ప్రేరణ మోదుకూరి జాన్సన్!

మోదుకూరి జయంతి నెల ఆగస్టులో జెండా పండుగ సంబరాలు ముగిశాక, విజయవాడ ఐ.ఎం.ఏ. హాలులో సంస్కరణ సభ ఆగస్ట్ 20 శనివారం సాయంత్రం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఇందులో పలువురు సాహితీ వేత్తలు పాల్గొని జాన్సన్ రచనల వైశిష్ట్యాన్ని కొనియాడారు. ‘విరసం’ రాష్ట్ర కార్యదర్శి అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ గ్రామీణ నేపధ్యం తెలిసిన రచయిత మాత్రమే, ‘రైతు లేనిదే రాజ్యం లేదని…’ (పాడిపంటలు) సినీ గీతం రాయగలడని అన్నారు. ‘అరుంధతీయ వాణి ‘ పత్రిక చీఫ్ ఎడిటర్ ఎల్.ఎస్. రావు మాట్లాడుతూ సినిమా రచయితగా ఉ ంటూ 1972 నాటికే మెడ్రాస్ లో తన ఇంటి ముందు మోదుకూరి జాన్సన్ మాదిగ అని ‘నేమ్ బోర్డు’ పెట్టుకున్న ధీశాలి జాన్సన్ అని, ఎం.ఆర్.పి.ఎస్. ఆ తర్వాత ఎప్పటికో వచ్చిందని రావు గుర్తు చేసుకున్నారు. నగరంలోని మాదిగ రిటైర్డ్ అధికారులు, డాక్టర్లు పలువురు సభలో కనిపించారు.
సినిమా రంగంలోకి మోదుకూరి వెళ్ళక ముందు, థియేటర్ రంగంలో ఆయన ‘బిజీ’గా వున్న రోజుల్లో, విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరలోని బాప్టిస్ట్ నగర్ మిత్రులతో కలిసి నాటక ప్రదర్శనలు, మిత్రుల ఇష్టాగోష్ఠులు తరుచూ జరిగేవి అని, సీనియర్లు కొందరు పాత సంగతులు గుర్తు చేసుకున్నారు.
మోదుకూరి కన్నుమూశాక, నగరంలో జరిగిన తొలి సంస్మరణ సభ ఇది అని, అందుకు చొరవ చూపిన మిత్రులను అభినందించారు.

సభలో సినిమా రంగ విశ్లేషకులు రంగావఝుల భరద్వాజ మాట్లాడుతూ ‘కధానాయకుని కథ’ చిత్రంలో కర్ణ పాత్రను మోదుకూరి మలిచిన తీరు చూసి, ‘కర్ణ’ పాత్ర హీరోగా ఈ సినిమా నిర్మించాలనే ఆలోచన ఎన్టీఆర్‌కు కలిగిందని అన్నారు. మోదుకూరికి డేట్స్ కుదరక, దాన్ని కొండవీటి కవితో రాయించారని వెల్లడించారు. హీరో కృష్ణకు వరస ప్లాపు’లు వస్తున్నప్పుడు, చిత్ర నిర్మాతలు- ‘పాడి పంటలు’ కథతో ఆత్రేయను కలిసినప్పుడు, ‘నాకు ఇందులో ఎద్దులు, కొమ్ములు, పేడ, తప్ప ఇంకా ఏమీ కనబడటం లేదు అన్నారు’ అప్పుడు, జాన్సన్ రచనతో చిత్రం ‘సక్సెస్’ అయ్యి, మళ్ళీ హీరో కృష్ణ విజయబాట పట్టారని అన్నారు. చిత్రంలో- ‘మన జన్మ భూమి…’ గీతంలో- ‘నాగలితో నమస్కరించి, పారలతో ప్రణమిల్లి, గుండె గుప్పెట పట్టి గుప్పెడు గింజలు జల్లితే…’ వంటి పదాలు గ్రామీణ రైతు కూలి జీవితం తెలిసినవారే రాయగలరని భరద్వాజ, జాన్సన్ ప్రతిభను కొనియాడారు.

సినిమా దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ- జాన్సన్ రచనా శైలి భిన్నమైనది అన్నారు. ఆయన ‘రాడికల్ హ్యుమానిస్ట్’ అని, ‘సోగ్గాడు’ చిత్రం నుంచి ‘కరుణామయుడు’ చిత్రం వరకు ఆయనతో కలిసి పనిచేస్తూ ఆయన రచనలు దగ్గరగా చూశానని, ప్రతి డైలాగ్’లోనూ ఆయన బ్రతుకుతాడని అన్నారు. జాన్సన్ లాయర్ కావడం వల్ల సినిమా కధలో సీన్లు కూడా ఒక ‘ఆర్గ్యుమెంట్’తో ఒకదాని తర్వాత ఒకటి ఒక ‘ఆర్డర్’లో నడుస్తాయని విశ్లేషించారు. ఆ రోజుల్లోనే ‘స్క్రీన్ ప్లేపై గొప్ప పట్టు మోదుకూరి సాధించారని, సినిమా కళకు సంబంధించిన ప్రతి అంశం పట్ల ఆయనకు సాధికారికత ఉందని, జాన్సన్ స్వతహాగా నటుడు కావడం వల్ల పాత్రలకు సంభాషణలు రాసేటప్పుడు వాటిలో ఆ ‘ఫీల్’ డైలాగుల్లో కనిపిం చేది అన్నారు. బహుశా తెలుగునాట చిత్ర పరిశ్రమలో వున్న కులవివక్షను దృష్టిలో ఉంచుకుని కావొచ్చు, ‘జాన్సన్ మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావడం ఆయన కెరియర్ కు పెద్దగా ఉపయోగపడలేదు’ అని ఉమామహేశ్వరరావు అన్నారు.

మోదుకూరి నాటకాలు గురించి థియేటర్ ఆర్టిస్ట్ సుద్దపల్లి శరత్ వెంకయ్య మాట్లాడారు. సభకు కన్వీనర్ డా. వల్లూరి రామారావు మాట్లాడుతూ మోదుకూరి కుటుంబంతో బాల్యంలో కొలకలూరి నుంచి మెడ్రాస్ వరకు తన అనుబంధాన్ని సభలో పంచుకున్నారు. మోదుకూరి కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా ఆయన ఈ సభకు ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించారు. ఆకాశవాణి సీనియర్ ఎనౌన్సర్ (రిటైర్డ్) బి. జయప్రకాష్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సభలో ఇంకా- మోదుకూరి సహాయకుడు పీటర్ ప్రసాద్ (కాటూరు) విద్యావేత్త చోరగుడి ఇశ్రాయేల్ (గుడివాడ) రవీంద్ర కుమార్ (నందిగామ) మాట్లాడారు. అనపర్తి గుప్తా, చోరగుడి భాస్కరరావులు కోకన్వీనర్లుగా వ్యవహరించారు.

SA:

View Comments (1)

  • I like very much the story of MANAVUDU DANAVUDU (SOBHAN BABU). The story is of Sri Johnson Garu.