అతనో కళాప్రభంజనం…  

చాలా ఏళ్ళ క్రితం ఓ మహా పురుషుడు మనిషి లక్ష్యాన్ని గురించి వివరిస్తూ “ప్రస్తుతం నీ వున్న స్థితి భగవంతుడు నీకిచ్చిన వరం. భవిష్యత్ లో నీవెలా ఉండాలి అనుకుంటున్నావో అలా వుండి నిరూపించుకోవడం అన్నది భగవంతుడికి నీవిచ్చే నైవేద్యం అన్నాడు”… నిజంగా అద్భుతమైన సూచన కదా! లక్ష్యం అనేది వుండాలి మనిషికి ఆ లక్ష్యం కోసం అహోరాత్రులు శ్రమించే తపన కూడా కావాలి. అలా వున్నప్పుడు ప్రతిమనిషీ తాననుకున్న రంగంలో గొప్పవాడౌతాడు.

లక్ష్యం వుందతనికి, ఆ లక్ష్యం కోసం రేయింబవళ్లు పరిశ్రమించే తపన కుడా వుంది. అందుకే తన కళా దాహార్తిని తీర్చుకునే క్రమంలో అడ్డంకులుగా అనిపించిన ఆర్ధిక ప్రయోజనాలను సైతం అవలీలగా వదిలేసాడు. మనుగడెంతటి కష్ఠమైనా కళనే తన ఇష్టంగా, సర్వస్వంగా భావించాడు. చేస్తున్నది చిత్రకళా అద్యాపనమే. నెలనెలా నిలకడగా నికర జీతాన్నిచ్చే ప్రభుత్వ ఉద్యోగమే కానీ ఏదో ఆసంతృప్తి, తనలోని చిత్రకళా దాహార్తిని తీర్చేలా ఆ వృత్తి అతనికి అనిపించలేదు. పగలు, రాత్రి ఒకటే కల, రంగుల కల, ఎప్పుడూ రంగులు, రంగులు రంగులు… అదే లోకం… అదే సర్వస్వం… అపారమైన, అవ్యాజమైన తన కళానురక్తికి తన భార్య కూడా చలించిపోయింది, ఎంతటి ఆర్ధిక ఇబ్బందులెదురైనా ఆనందపు లక్ష్యాలను చేరుకోవాలని భావించిన తన భర్త ఆలోచనకు ఆమె ఎదురు చెప్పలేకపోయింది. ఫలితం…. ప్రభుత్వ ఉద్యోగానికి స్వస్తి పలికారు. ద్విగుణీకృత ఉ త్సాహంతో రంగుల లోకంలో తేలియాడాడు. ఇప్పుడతని కుంచె తాకిన వర్ణాలు సప్తస్వరనాదాలను పలికిస్తాయి, రంగుల రాగాల నాలపిస్తాయి. తన అద్భుత వర్ణ విన్యాసంతో పురాణ, కావ్య నాయికలను ఎంత రమ్యంగా సృష్టించగలడో, చారిత్రక, సాంస్కృతీ వ్యక్తుల రూపాలను కూడా అంతే గొప్పగా తీర్చిదిద్దగలడు. తన చిత్రాలతో సమాజంలో చైతన్యాన్ని గొప్పదైన శిల్పకళలో కూడా మహా పురుషుల రూపాలను ఎంతో గొప్పగా తీర్చిదిద్దిగలడు. ఇలా బహుముఖాలుగా తన కళాప్రాభవాన్ని విస్తరించుకొని, జాతీయ, అంతర్జాతీయంగా ప్రశంసలందుకొంటున్న చిత్రకళా రత్నం డాక్టర్ మర్లపూడి ఉ దయకుమార్.

పుట్టింది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీమతి మర్లపూడి పుష్పమ్మ, ఇజ్రాయెల్ దంపతులకు 1959 ఫిబ్రవరి 6వ తేదీన. చదివింది పాలకొల్లులో, చిత్రకళాభ్యసనం చేసింది ఆంధ్రవిశ్వవిద్యాలయం విశాఖపట్నంలో. మూడవ ఏటనే మొదటి సారి తన ఇంటి ఎదురుగా కనిపించే అందమైన గుర్రపుబండి బొమ్మను వేసి అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేస్తే, ఆరో ఏట రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీల్లో తాజ్ మహల్ ముందు గులాబి పరిమళాన్ని ఆప్షనిస్తూ జ్ఞాపకాలను నెమరు వేసుకొంటున్న షాజహాన్ బొమ్మను “కళాప్రియ” పేరుతో ప్రదర్శించిన ఉదయ్ పలువురి ప్రశంసలతో పాటు బంగారు పతకాన్ని కైవసం చేసుకొన్నాడు. 1970లో అనగా తన 12వ ఏటనే భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ క్యాంప్ లో శ్రీ వంగా నరసింహారావుగారి ప్రోత్సాహంతో తొలిసారిగా నిర్వహించిన తన వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శనలో అప్పటి విద్యాశాఖామంత్రి మండలి వెంకటకృష్ణారావు గారి స్పాట్ పెయింటింగ్ వేయగా ఆశ్చర్యచకితుడైన మంత్రి ఉదయ్ ని కౌగింలించుకోవడం తనకు గొప్ప ప్రశంసలతో పాటు తన చిత్రకళాభివృద్ధికి ప్రోత్సహకరమైందని చెప్తారు ఉదయ్.

తండ్రి గొప్ప చేయి తిరిగిన చిత్రకారుడు. స్టంప్ పౌడర్ తో అద్భుతమై రూపచిత్రాలు వేసిన చిత్రకారుడే కానీ ఉదయ్ ని మాత్రం చిత్రకళ వైపు పంపేందుకు ఇష్టపడలేదు. ఉన్నత చదువులు చదివించి గొప్ప ఉద్యోగంలో చూడాలని అనుకున్నాడు. కానీ చిత్రకళే ఊపిరిగా జీవిస్తున్న ఉ దయ్ కు తన తండ్రి నిర్దేశించిన మార్గం కంటే తనకు ఇష్టమైన మార్గాన్నే కోరుకున్నాడు. అందుకే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి. ఎఫ్.ఏ. కోర్స్ లో చేరాడు 1979సం.లో అక్కడ చిత్రకళాభ్యసనం చేస్తున్న రోజుల్లో అనాటమీపై మంచి పట్టు సాధించి న్యూడ్ పెయింటింగ్స్ వేసే నిమిత్తం అతడు మోడల్స్ ని ఉపయోగించుకోవడం అప్పుడు విశాఖపట్నంలో గొప్ప సంచలనం సృష్టించింది. బి.ఎఫ్.ఏ. చేస్తున్న కాలంలో అతడు వేసిన “ది క్రియేటర్, ఊర్వశి, పురూరవ, విధురపత్ని, ఉదయ్ 2020 AD, నా తరమా భవసాగర మీదను, ఇలబ్రహ్మ లాంటి చిత్రాలు ఉదయ్ భావజాలానికి అద్దంపడతాయి.

కేవలం ఏకధోరణిలో ఒకే అంతానికి పరిమిత మవకుండా అతని కుంచె ఏ విషయాన్ని, ఎన్ని రకాలుగానైనా తన రంగుల విన్యాసం ద్వారా చూపరుల మానసాలను కొల్లగొట్టేలా చేయగలదని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి.

పాలస్తీనా ఉద్యం విమోచనా ఉద్యమం సందర్భంగా 1982లో ఉదయ్ వేసిన రెండు పోస్టర్ డిజైన్స్ అంతర్జాతీయంగా ఖ్యాతి చెందడం అతని ప్రతిభకు తార్కాణం. అలాగే ఇన్ కార్ అనే జాతీయ సముద్ర తీర ప్రాంత పరిశోధన సంస్థ కోరిక మేరకు 1985లో తుఫాన్ సమయాల్లో తీర ప్రాంత ప్రజలు తీసుకోవల్సిన జాగ్రత్తలు అన్న అంశంపై మూడు గంటల నిడివిగల వీడియో చిత్రం కోసం అవసరమైన పెయింటి ను వేసి జాతీయ, అంతర్జాతీయ సముద్రవైజ్ఞానిక సంస్థల ప్రశంసలను పొందారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ విశాఖపట్నం వారి దశమ వార్షికోత్సవం సందర్భంగా స్త్రీల ప్రధాన సమస్యలైన బాల్య వివాహాలు, విద్య, వరకట్న మరణాలు వంటి పలు అంశాలపై ఉదయ్ వేసిన పలు చిత్రాలు అక్కడ అధికారులు, అనధికారులుతో సహా అందరినీ ఆలోచింపజేసాయి.

తన తండ్రి ఆశయాలకనుగుణంగా M.I. IMAGES అనే సంస్థను స్థాపించి సారా వ్యతిరేఖ ప్రచారానికి అనుగుణంగా పెద్ద పెద్ద పెయింటింగ్స్ చిత్రించి అనేక ప్రాంతాల్లో వాటిని ప్రదర్శించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రభుత్వ విధానానికి వ్యతిరేఖంగా చిత్రాలు వేసి ప్రచారం చేస్తున్నందుకు గానూ అప్పటి ప్రభుత్వ జిల్లా స్థాయి అధికారుల ప్రతికూలతను ఎదుర్కొన్నారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పు కనుగుణంగా ఉదయ్ వేసిన ఆ సారావ్యతిరేక చిత్రాలనే… రాష్ట్ర సమాచార పౌర సంభందాల శాఖ వారి ఆధ్వర్యంలో సినీ స్టైడ్స్ పెద్ద పెద్ద పోస్టర్స్ మరియు 40 అడుగుల బారీ కటౌట్లుగా రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించి ప్రజలను చైతన్యపరిచారు. ప్రజాహితంతో వేసిన ఈ చిత్రాలకు గాను అప్పటి రాష్ట్ర గవర్నర్ కృష్ణకాంత్ చేతుల మీదుగా సత్కారం అందుకోవడం అతన ప్రతిభకు తార్కాణం.

1997లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో ఉదయ్ ‘పంచభూతాలు” పేరుతో వేసిన చిత్రాలు మరియు “శాంతి, శాంతి శాంతి:” పేరుతో బుద్దుని ఆశయాలను ప్రతిబింబిస్తూ వేసిన చిత్రాలు అక్కడ హాజరయిన దేశ విదేశీయుల మనసులను చూరగొన్నాయి.

పుంఖాను పుంఖాలుగా ఉదయ్ వేస్తున్న ఏ చిత్రాన్ని చూసిన వాటిలో అద్భుత రేఖా విన్యాసం, అచ్చెరువు గొలిపే రంగుల విన్యాసంతో పాటు ఓ సామాజిక బాధ్యత కనిపిస్తుంది. అతడు చిత్రించేందుకు ఎంచుకున్న అంశం నిశ్చలమైనదైనా, ప్రకృతి చిత్రమైనా, జానపద, చారిత్రక, పౌరాణిక, మూర్తి చిత్రాలైనా పూర్తి ఆధునికమైనదైనా ఏ చిత్రాన్ని చూసినా దానిలో ఖచ్చితమైన రేఖలు వర్ణాలతో అతడి కుంచే చేసే నాట్య విన్యాసాలు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తాయి.

పుట్టిన ప్రతి మనిషిని భగవంతుడు ఏదో ఒక ప్రయోజనం కోసమే ఈ లోకంలో సృష్టించాడు. ఆ లక్ష్యంతోనే ప్రతిమనిషీ తనకు చేతనైనంత స్థాయిలో తోటివారికి సేవ చేయాలని భావించే ఉదయ్ ఆ లక్ష్యాన్ని చిత్రకారుడిగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న పలు సామాజిక రుగ్మతలపై తన కుంచెను సందించి వందలాది చిత్రాలను సృజియించి సమాజ హితం కోసం పాటు పడడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరో ప్రశంసలకు పాత్రుడౌతున్నాడు. 1991లో తన జన్మస్థలమైన పాలకొల్లునందు “హరివిల్లు” ఆర్ట్ అకాడమీని స్థాపించి చిత్రకళారంగాన్ని ప్రోత్సహిస్తూ ఔత్సాహిక కళాకారులను తీర్చిదిద్దారు. తన తండ్రి ఇజ్రాయేల్ పేరిట అర్హులయిన అనేకమందికి వివిధ సహాయ సహకారాలందిస్తున్నారు. మత సామరస్యంపై విద్యార్ధులలో చక్కని అవగాహన కల్పించి జాతీయ సమైక్యత ఆవస్యకతను వివరించడానికి సేవ్ (SAVE) అన్న సంస్థ ద్వారా అనేక సదస్సులు పోటీలు నిర్వహించడమే గాక ఈ అంశంపై ఎన్నో చిత్రాలను సృష్టించారు.

క్రీస్తు జీవితంలోని (50) ప్రధాన ఘట్టాలను చిత్రాలుగా వేసి క్రీస్తు సందేశాన్ని భక్తుల హృదయాలలో చాటడమే గాక ఆవిధంగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించారు. మనదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సింగపూర్, డెన్మార్క్, ఇజ్రాయేల్, పాలస్తీనా, అమెరికా తదితర దేశాలలోని ప్రముఖ చర్చి ఏలలోను, అక్కడ ప్రముఖుల ఇళ్లల్లోనూ ఇతను వేసిన క్రీస్తు చిత్రాలతో పాటు వివిధ వ్యక్తుల రూపచిత్రాలు కొలువుదీరి ఉదయ్ కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చాయి. అంతేగాక 1999 మార్చినెలలో కువైట్ దేశంలో కమర్షియల్ బిజినెస్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆధ్వర్యంలో జరిగిన పెద్ద ఎగ్జిబిషన్ లో కొందరు విదేశీయులకు సూక్ష్మంగా చిత్రకళలోని మెళకువలను నేర్పి అక్కడ కువైట్ రాజవంశీయుల ప్రశంసలను అందుకోవడంతో పాటు గల్ఫ్ పత్రికలు అతని ప్రతిభను కొనియాడుతూ వ్యాసాలు ప్రచురించడం విశేషం.

రూపకళల్లో అతి గొప్పదైన శిల్పకళలోనూ ఉదయ్ ప్రతిభావంతుడని చెప్పడానికి రాష్ట్రంలో పలుచోట్ల వందలాదిగా అతడు రూపొందించిన సర్ఆర్ధర్ కాటన్ తదితర మహనీయుల విగ్రహాలు సాక్షీ భూతాలుగా నిలుస్తాయి.

ఇక అతని చిత్రకళా ప్రదర్శనల విషయానికి వచ్చినట్లయితే తన 12వ ఏటనే తొలివ్యక్తి గత చిత్రకళా ప్రదర్శన చేసిన ఉ దయ్ ఆ తర్వాత రాజమండ్రి విశాఖపట్నం, విజయవాడ, పాలకొల్లు, నర్సీపట్నం, నర్సాపురం, హైదరాబాద్, బెంగుళూర్ లతో పాటు కువైట్ దేశంలో కూడా తన వ్యక్తిగత చిత్ర ప్రదర్శన చేశారు. అలాగే తనతోటి చిత్రకారులతో కలిసి ఎన్నో సామూహిక చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించి ప్రస్తుతం రాష్ట్రంలో పలు చిత్రకళా సంస్థలు నిర్వహిస్తున్న చిత్రకళా పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

ఉదయ్ కుమార్ ప్రతిభను మెచ్చి ప్రశంసల జల్లును కురిపించిన వారిలో దివంగత లోకసభ స్పీకర్ బాలయోగి నుండి ఎందరో రాజకీయ ప్రముఖులతో పాటు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ రూపచిత్రాన్ని స్పాట్ పెయింటింగ్ వేసి దేశ ప్రథమపౌరుడి నుండి ప్రశంసలందుకున్నారు. క్రీస్తు జీవితం-అతని ఉపదేశాలపై ఉదయ్ చిత్రకళా రూపంలో చేసిన కృషిని గుర్తించి “లివింగ్ వాటర్ రేడియో మినిస్ట్రీ” విశాఖపట్నం వారు అతనికి డాక్టరేట్ ప్రధానం చేసిన సందర్భంలో, వాటర్, ఆయిల్, ఏక్రలిక్ తదితర ఏ మీడియంలో, ఏ శైలిలోనైనా సమర్ధవంతంగా, ఖచ్చితమైన రీతిలో రాపిడ్ వేగంగా అతడు చిత్రాలను సృజియించే తీరు నన్ను విస్మయపరుస్తుందని ప్రఖ్యాత చిత్రకారుడు పి.ఆర్. రాజుగారు పేర్కొంటే, అతని చిత్రాల్లో అనిర్వచనీయమైన తాత్వికత, గొప్ప తపనలు దాగి వున్నాయి. ఆ గీతల శైలి నన్నాదింపజేసింది. భవిష్యత్ లో భారతదేశం గర్వించ దగ్గ చిత్రకారుడిగా అతడు ప్రఖ్యాతి చెందగలడని, ప్రముఖ చిత్రకారులు బాపుచే ప్రశంసలందుకోవడం గొప్ప విషయం.

ఇటీవల జరిగిన ప్రపంచతెలుగు మహాసభల సందర్భంగా తెలుగు వెలుగులు పేరుతో పుంఖాలు-పుంఖాలుగా అతని కుంచె సృష్టించిన తెలుగు తేజోమూర్తుల రూపాలను చూసిన ఎవరైనా అతని కుంచె వేగానికి విస్మయం చెందుతారు. కేవలం వ్యక్తి హితమే కథ ముఖ్య లక్ష్యం కారాదు, సమాజహితం కూడా కావాలి. అని అభిలషించే డా. ఉదయ్ ఆ దిశగా తన కుంచె అస్త్రాన్ని పలుసామాజిక రుగ్మతాంశాలపై సంధింపజేసి, సమాజ చైతన్యానికి పాటు పడిన అరుదైన ప్రజా చిత్రకారుడు. అటు కళ-ఇటు సామాజిక సేవ రెండింటా అప్రతిహతంగా సాగుతున్న తన కళాసేవా ప్రస్థానంలో తన శ్రీమతి జాన్సీ లక్ష్మీ బాయి ప్రోత్సాహం మరువలేనిదని చెప్పుకొనే ఉదయ్ కుమార్ ప్రఖ్యాత చిత్రకారులు వైకుంఠం, బాపు తదితరులు ఆశించిన విధంగా మనదేశం గర్వించే చిత్రకారుడిగా ఖ్యాతిగాంచాలని ఆశిద్దాం.

4 thoughts on “అతనో కళాప్రభంజనం…  

  1. గురుతుల్యులు శ్రీ ఉదయ కుమార్ గారి గురించి ఎన్నో ఆశక్తి కరమైన సమాచారాన్ని అందించి చక్కని వ్యాసాన్ని ఇచ్చారు…

    గురుతుల్యులు శ్రీ ఉదయ్ కుమార్ గారికి నమస్కరిస్తూ…

    64 కళలు యాజమాన్యానికి ధన్యవాదములు..

    అంజి ఆకొండి
    కాట్రేనికోన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap