‘కళా’కాంతుల పసిడి ‘మాకినీడి’

23 కవితాసంపుటాలను ముద్రించిన మాకినీడిలో ఓ తాత్వికత నిండిన మార్మికుడు, దార్మికత నిండిన నాస్తికుడు. మానవత్వం నిండిన సామ్రాజ్యోద్యమకారుడు, సమ్యక్ జ్ఞానంతో జీవితాన్ని తడిమిన సత్యశోధకుడు, కవిత్వ పరమార్థాన్ని తెలియచెప్పిన సాధకుడు దర్శనమిస్తారు! ఎందుకంటే … ఆయన వ్రాసింది కవిత్వం!! తన దినచర్యలో బాగమైన కవితారచన వదలని వ్యసనమై; ఆత్మ సౌందర్యంతో నిండిన అంతరదృష్టిని, దిగులు గాఢతని, నిరీక్షణ నిగూఢతని మనసును పొంగించి వ్రాయించింది. నూతన పద ప్రయోగాలకు, భావ సాంద్రతకు… పైగా పండిన అనుభవం నిండుగా ఉన్న కవి, మెండైన కవితల ఆసామి మాకినీడి!! తనకు 60 వసంతాలు నిండున్న శుభ తరుణంలో ‘షష్టి పూర్తి ఉత్సవాలు జరుగుతున్న తరుణమిది. 45 సంత్సరాలుగా రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ సాహితీక్షేత్రంలో హాలికుడై కొన్ని వేల రచనలు చేసి, శతాధిక గ్రంథాలను సృజించి సమాజానికి పంచారు. మరెన్నో అముద్రితాలను అక్కున చేర్చుకొని తన సాహిత్యఝరిని సమాజానికి పరిపూర్ణంగా పంచాలని తపించే సత్కవీంద్రులు మాకినీడి సూర్యభాస్కర్ గారి 60 వసంతాల పండుగ 20-08-2022, ఆదివారం కాకినాడలో జరుగుతున్న సందర్భంగా…

శ్రీ రంగనాయకులు, సరస్వతిగార్ల తొలిచూలు పంట మాకినీడి సూర్య భాస్కర్ గారు. కాకినాడ స్థిరనివాసి. తండ్రి శ్రీరంగనాయకులు ప్రభుత్వ ఖజానా సంస్థలో దిగువ శ్రేణి గుమస్తా జీవితం నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ పదోన్నతులపై సహాయ ఖజానాధికారిగా పిల్లల్ని ఊరూరా బాగానే త్రిప్పారు.

కుదురు లేని జీవితానికి పిల్ల చదువు సంధ్యలకు ఏ అడ్డురాకుండా తల్లిలాలన కాపుకాసింది. 1వ తరగతి కాకినాడలో శ్రీ శారదా స్పెషల్ మునిసిపల్ ఎలిమెంటరీ స్కూల్ లోను, 2,3,4 తరగతులు రామచంద్రాపురంలోని పిల్లవారి స్కూల్ లోను; 5వ తరగతి నెల్లూరులోను; 6,7 తరగతులు తునిలోని మహారాజావారి పాఠశాలలోను, 8వ తరగతి ‘భారతీయ విజ్ఞానమందిర్’ అనే కాన్వెంటు స్కూలులోను; 9, 10 తరగతులు మళ్ళీ కాకినాడలోని పి.ఆర్. గవర్నమెంటు స్కూలులోను చదివినా చెదరిని ద్యాస విద్యార్జనకు మరింతగా బాసటై నిలిచింది.

డిగ్రీ కోసం నెల్లూరు జిల్లాలోని కావలి ‘జవహర్ భారతి కళాశాలలో చేరటం అదృష్టంగా భావిస్తారు భాస్కర్ గారు. తాను చేసింది బి.యస్.సి. (డైరీ సైన్స్) అయినా, సైన్సేతర అధ్యాపకులు కూడా భాస్కర్ గారిపై శిష్యవాత్సల్యాన్ని కురిపించేవారని; సాహిత్య పరంగా హేమాహేమీలైన లెక్చరర్లు ఆసమయంలో పనిచేస్తుండేవారని… ముఖ్యంగా పాలిటిక్స్ లెక్చరర్ శ్రీ కె.వి. రమణారెడ్డి గారు, తెలుగు అధ్యాపకులు కీ.శే. శ్రీ భుజంగరాయ శర్మ, డా. శ్రీమతి ఉమగారు, వి. చెంచయ్యగారి వంటివారితో తనకు సత్సంబంధాలుండేవని; అవి తన రచనా వ్యాసంగం భిన్న కోణాల్లో సాగి తననొక కవిగా, విమర్శకుడిగా, కథకుడిగా, కళా విమర్శకుడిగా, విద్యావేత్తగా, బాలసాహితీద్రష్టగా, ఫ్రీ లాన్సర్ గా తీర్చిదిద్దేందుకు తోడ్పడ్డాయన్నది శ్రీ మాకినీడి గారి భావన.

భీమవరంలోని ‘డి.యన్.ఆర్. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్’లో బి.ఎడ్. చేశారు. ఉద్యోగం చేసుకుంటూనే ఆంధ్రాంగ్లాలల్లో ఎం.ఏ. డిగ్రీలు పొందారు. 1991 మార్చి 3వ తేదీన శ్రీమతి సుభద్రగారితో మాకినీడి సూర్యభాస్కర్ గారి వివాహం జరిగింది. వీరికొక కుమార్తె; పేరు డా. సౌమ్య. తండ్రికి తగ్గ తనయ.

మహాత్మాగాంధీ కార్పోరేషన్ మునిసిపల్ హైస్కూల్లో ఆంగ్ల భాష బోధకులుగా ఉద్యోగంలో కుదురుకున్నాక స్థిరజీవనం ఏర్పడ్డది. మనోవృత్తిగా సాగుతున్న సృజన వ్యాపక సేధ్యానికి మరింతగా సమయాన్ని కేటాయించి పెద్దపీట వేయటం జరిగింది. దీనికి తన దినచర్యను తనదైన శైలిలో మలుచుకున్నారు. ప్రతిరోజు అర్థరాత్రి క్యాలెండరులో తేదీ మారి ఓ గంట గడవగానే తనకు శుభోదయం ప్రారంభమౌతుంది. అంటే రాత్రి ఒంటి గంటకు నిద్రలేస్తారన్నమాట. మనకు అయిదు / ఆరు అయ్యేంతవరకు తన సాహిత్య పఠనం, లేఖనం, కాలకృత్యాలు, స్నానాధికాలు ముగించుకున్న తర్వాత… ఉద్యోగ నిర్వహణకై పరుగు…సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన తర్వాత రాసిన వాటిని ఫెయిర్ చేసుకోవడం, రాత్రి భోజనం ఏడుగంటలకే ముగించి ఉత్తర ప్రత్యుత్తరాలు చూసుకొని ఠంచనుగా తొమ్మిది గంటలకే పడుకోవడం వీరి నిత్యకృత్యం.

సమాజానికి కలం ద్వారానే కాకుండా, సంపాదనను వృత్తికి అనుసంధానిస్తూ కొన్ని సేవాకార్యక్రమాలు చేసారు మాకినీడిగారు. ‘లాంగ్వేజ్ స్టూడెంట్స్ రిక్రియేషన్ వర్క్ షాప్’ LSRW (L-Learning, S.Speaking, R-Reading and W-Writing) పేరిట కాకినాడ మునిసిపల్ పాఠశాలల విద్యార్ధులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, డ్రాయిగ్ పోటీలనెన్నో నిర్వహిస్తూ వారి ప్రాథమిక భాషా నైపుణ్యాలను పెంచే కృషిచేస్తున్నారు. ‘యంగ్ పెన్స్’ పేర త్రైమాసిక బులిటెనను విడుదల చేస్తూ విద్యార్థులను ప్రోత్సహించారు. అలాగే ప్రతి సంవత్సరం కాకినాడ మునిసిపల్ పాఠశాల పరిధిలో 10వ తరగతి ప్రథమస్థానాన్ని సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు నగదు ప్రోత్సాహంతో పాటు ఆ స్కూలుకు రోలింగ్ షీల్డును ఇస్తువచ్చారు.

‘మాకినీడి సాహితీ పురస్కారాలు’ పేర ఒక కవిని, ఒక విమర్శకుడిని, ఒక కథకుడిని గుర్తించి వెయ్యినూటపదహార్లు నగదు బహుమానంతో పాటు మెమొంటో, శాలువతో సత్కరిస్తువచ్చారు. ఈ కార్యక్రమాలను వీరి తాతగారి పేరుమీదుగా ఏర్పాటు చేసిన ‘శ్రీ మాకినీడి సూరన్న
మెమోరియల్ ట్రస్టు – కాకినాడ” ఆధ్వర్యంలో నిర్వహించేవారు. ఈ కార్యక్రమాలకు పూర్తి అండదండలు తండ్రి మాకినీడి శ్రీ రంగనాయకులు గారి నుండి అందేవి.

10వ తరగతి చదువుతున్నప్పట వయసుకే దైవ భక్తివసుడైన మాకినీడి పద్యాలు రాయడం మొదలుపెట్టారు. తొలిరోజుల్లో రాసిన పద్యాలు కొన్ని చేజారిపోగా, పదిలపరిచిన కొన్నింటిని కూర్చి మొదటిది ‘చూపునిమ్ము’ అనే ఖండికను 1980న రూపొందించారు. (ఈ పద్య ఖండికలన్నీ 1997లో సుమకవితాంజలి పేర తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆర్ధిక సహాయంతో ప్రచురించబడటం విశేషం.)
ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పోరేషను ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తుండగా (1986-89) అందులోని ఒక అంశం మాకినీడి గారి దృష్టిని ఆకర్షించింది. “ఇదివరలో మీరు ఏమైనా రచనలు చేశారా?” అన్నది దరఖాస్తులోని ఒక ప్రశ్న. ఆ ప్రేరణతో ఆచంట జూనియర్ కళాశాలలో పని చేస్తున్న రోజుల్లోనే “దూడల మరణాలు – ఒక పరిశీలన” అనే పేరుతో వ్యాసాన్ని రాసి తెలుగు అకాడమీ, పత్రికా విద్యా వైజ్ఞానిక మాసపత్రికకు పంపడం, అది మార్చి 1989 ప్రతిలో అచ్చుకావడం జరిగింది. ఇదే పత్రికలో అచ్చయిన వీరి తొలి రచన. ఆ తర్వాత వరుసగా పాడిపరిశ్రమ, పశు యాజమాన్యం, పాలు – పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాసాలను పుంఖాను పుంఖాలుగా రాశారు. రాసినవన్నీ తెలుగు, అన్నదాత, ఏనిమల్ వెల్ఫేర్, యోజన వంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆ విధంగా రాస్తూ రాస్తూ తెలుగు పత్రికలో కనీసం సబ్జెక్టుకు ఒక వ్యాసం చొప్పున రాయాలని / రావాలని అనుకున్నారు మాకినీడి. ఆ విధంగా గణితం, చరిత్ర, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, మతం, విద్య, పరిశోధన, లిపి, భాష, పారిభాషికత, కళ మొదలైన సబ్జెక్టులలో వివిరిగా వ్యాసాలు రాసి తెలుగులో ప్రచురించారు. దాదాపు ఒక్క తెలుగు పత్రికలోనే చాలా వ్యాసాలు వచ్చాయి. ఆక్రమంలో కళకు సంబంధించిన వ్యాసాలను నిరంతరంగా వ్రాసేందుకు పూనుకోగా ‘మిసిమి’ పత్రికాధిపతులు దారాళంగా ప్రచురించేందుకు దారులు తెరిచారు. ప్రతినెల ‘మిసిమి పత్రికలో మాకినీడి గారి వ్యాసం ఒకటి తప్పక వుండేది. ఈ వ్యాసాలన్నీ మంచి విద్యావేత్తగా మాకినీడి గారికి అంఖండ కీర్తిని కట్టబెట్టాయి. కళావిమర్శకునిగా ముద్రను వేసాయి.

ఆ తర్వాత నెమ్మదిగా వీరి రచనా ప్రస్థానం సాహిత్యంలోకి ప్రవేశించింది. మొదటి కథ ‘అంతస్సౌందర్యం’ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంక్రాంతి కథల పోటీకి ఎంపికై, 1991లో ప్రచురింపబడింది. మొదటి వ్యాసం ‘శ్రీశ్రీ ప్రతీకతా శిల్పం’ తెలుగు మాసపత్రికలో 1992 జులైలో ప్రచురించబడింది. ‘తెలుగు ఛందము-పరిణామ చందము’ అన్న వ్యాసంలో ఉటంకించబడి, మొదటి కవిత ‘తెలుగు విద్యార్థి’లో 1994 జూలైలో ప్రచురించబడింది. స్వతంత్రంగా ప్రచురింపబడిన తొలి పద్యకవిత ‘దైన్యభారతి’ 1994 స్వాతంత్ర్యదిన ప్రత్యేక సంచిక (ఆగస్టు 15)లో ప్రచురించబడగా, తొలి వచన కవిత ‘నగరజీవితం’ 23-7-1995 ఆదివారం ‘ఆంధ్రభూమి’ దినపత్రిక ‘దర్బార్’ శీర్షికలో ప్రచురింపబడింది. అయితే అంతకుముందు ‘నేను’ అనే కవిత డిగ్రీ చదివేటప్పుడు విశ్వోదయ ‘కాంపస్ జర్నల్’లో 1982లో ప్రచురింపబడింది.

Makineedi books

భాస్కర్ గారికి చిత్రలేఖనంలో కూడా ఆసక్తిమెండు “విస్తృతంగా చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొనాలని అభిలాష. కళావిమర్శక వ్యాసం ‘కళాశాస్త్ర దర్శనం – భిన్నదృక్పథం’ మిసిమి పత్రికలో జనవరి 1994లో ప్రచురింపబడింది.
సుమారు నలుబది నాలుగు మంది కవి – చిత్రకారుల్ని రాష్ట్రమంతా గాలించి, దొరకపుచ్చుకుని; కవుల్లో దాగిన చిత్రకారుల్ని, చిత్రకారుల్లో దాగిన కవుల్ని ‘కవి-చిత్రకారులు’ అన్న శీర్షికన చినుకు, విశాలాక్షి సాహిత్య మాస పత్రికల పాఠకులకు పరిచయం చేసిన కాలమిష్టు శ్రీ మాకినీడి.
నేడు శ్రీ మాకినీడి సూర్యభాస్కర్ గారు తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోను సృజన చేసిన సాహిత్యకారులు. సమీక్షల ద్వారా సాహిత్య వ్యాసాల ద్వారా తోటి సాహిత్యకారుల మంచి రచనలను పాఠకలోకానికి పరిచయం చేస్తూ… ఈ మధ్యనే తొలి తెలుగు సానట్ ను సృజించి మరో నూతన సాహిత్య ప్రక్రియను తెలుగు వారికి పరిచయం చేసారు. ఈ మాకినీడి షష్ట్యబ్ది వేడుకలను జరుపుకుంటున్న 40 ఏళ్ళ సాహిత్యకారుడుగా; శతాధిక గ్రంథాలను ముద్రించి, మరో 50 పుస్తకాలను ముద్రణకు సిద్ధంగా ఉంచుకున్న అక్షర శ్రామికుడిగా తాను మాత్రమే అంతటి వాడననుకోక తోటి వారిని తనంతటి వారిగా తయారు చేయగలిగిన సమర్ధుడు, సహృదయుడు – స్ఫూర్తి ప్రదాత. తన సాహిత్యాన్ని స్ఫుసించిన విద్యార్థులు డాక్టరేట్లు, యంఫిల్ పట్టాలను

పుచ్చుకున్నవారు సుమారుగా ఉన్నారు. స్వయంగా వారిపైననే వచ్చిన పుస్తకాల సంఖ్య-9. వీరి అచ్చయిన పుస్తకాలకంటే అచ్చుఅవ్వాల్సిన పుస్తకాల సంఖ్య ఎక్కువ.

వీరుపొందిన అవార్డులు, రివార్డులు, ప్రశంసలు:

1). కోనసీమ చిత్రకళా పరిషత్, అమలాపురం-మెరిటోరియస్ అవార్డు-1993, రాష్ట్రస్థాయి నగదు బహుమతి-1995, చిత్రకళా వైజయంతి అవార్డు – 2010
2). బాలభాషా ప్రచారపరిషత్, కాకినాడ – ధాతనామ ఉగాది పురస్కారం – 1996
3) బెస్ట్ సర్వీసెస్ అవార్డు, గణతంత్ర దినోత్సవం – 2002
4) బాలవేదిక అభినందన సత్కారాలు – 2003, ఉపాధ్యాయ రత్నం – 2004
5) శ్రీ నోరి వీరవెంకట ఉదయభాస్కరం స్మారక పురస్కారం – 2004
6) జిల్లా ఉత్తమ అపాధ్యాయ అవార్డు – 2005
7) కళామిత్ర అవార్డు – 2003 & 2004
8) తానా – అమెరికా అవార్డు – 2006
9) తామా – అమెరికా అవార్డు – 2006
10) వై.యస్. మెమోరియల్ అవార్డు – 2009
11) బాలవాణి కవిత్వ అవార్డు – 2010
12) ఆంధ్ర సారస్వత సమితి – మచిలీపట్నం – ఉగాది సాహిత్య ప్రతిభా పురస్కారం 2010 (వచనకవిత్వానికి)
పైన తెలిపిన అవార్డులనే కాక యింకా ఎన్నో సత్కారాలను, పురస్కారాలను మాకినీడి సూర్యభాస్కర్ గారు అందుకున్నారు. స్థలాభావంచేత ఉటంకించ లేక పోతున్నాం.

కరోనా సంక్షోభంలో ప్రత్యక్ష సభలకు వీలుపడక… జూమ్ వేదికపై 2021 ఆగష్టు 17న ప్రారంభమైన షష్ట్యబ్ది వేడుకల్లో భాగంగా శ్రీ మాకినీడి సాహిత్యంపై సమీక్షాసమాలోచనలను ఆరింటిని నిర్వహించటం జరిగింది. ఒక్కో సభ దాదాపు 3 గంటలపాటు కొనసాగింది. వీటిలో దాదాపు 50 మంది లబ్దప్రతిష్టులైన సాహితీ మూర్తులు వివిధ ప్రాంతాల నుండి ఉపన్యసించి దిగ్విజయాన్ని కూర్చారు. జూమ్ వేదికపై సాగిన ప్రతి సభావిశేషాన్ని https://www.youtube.com/watch?v=wzRO4uigPQc యూట్యూబ్ ఛానల్ లింక్ లో 12 ఎపిసోడ్లుగా నిక్షిప్తంచేసి సాహిత్యా భిలాషులకు మరింత చేరువచేయటం జరిగింది.

శ్రీ మాకినీడి సృజనకు పాఠక దేవుళ్ళ ఆకాంక్షలు తోడై శతాయుషుని కూర్చాలని… 64కళల.కాం పాఠకుల తరపున మరోమారు వారికి కళాభివందనాలు సమర్పించుకుంటూ…

ఆత్మకూరు రామకృష్ణ

1 thought on “‘కళా’కాంతుల పసిడి ‘మాకినీడి’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap