50వసంతాల సృజన కృషీవలుడు -‘మాకినీడి’

ఓ కళావిమర్శకుడు కలం ఝళిపించకుంటే నోరులేనిమూగ చిత్రాల రూపశిల్పుల గుండె చప్పుడు వినిపించదు. ఓ సాహితీవిమర్శకుడు కలం ఝళిపించకుంటే అక్షరమౌని హృదయ మరీచమర్మం ఎరుగజాలము. 50 సంవత్సరాలుగా రచనా వ్యాసంగాన్ని తన మదిభావాలవెల్లువను పాఠకులపై వరదలాకురిపించారు మాకినీడి సూర్య భాస్కర్.

సృజనాత్మకతా ఝరులు తొలకరులై, అమృతప్రాయాలై, ఆదరణ నింపే పలుకుల్లా అందిస్తూ, తోటి సృజనకారులు మనగలిగేలా మహోత్సాహంతో ముందుకు సాగేలా చేశారు. విరామమెరుగక సాహితీక్షేత్రంలో హాలికుడై కొన్ని వేల రచనలు చేసి, శతాధిక గ్రంథాలను సృజించి సమాజానికి అందించారు. మరెన్నో అముద్రితాలకు తుదిమెరుగులు దిద్దుతూ తనకు ప్రేరణనిచ్చే సమాజానికి వాటిని పరిపూర్ణంగా పంచాలని తపించే సత్కవీంద్రులు, మాకినీడి సూర్యభాస్కర్ గారు. సాహితీ క్షేత్రంలో ప్రవేశించి 50 వసంతాలు పూర్తి చెసుకుంటున్న సందర్భంగా… వారి నిరంతర కృషికి చిరు అక్షర కదంబ సమర్పణ.

తన దినచర్యలో భాగమైన కవితారచన వదలని వ్యసనమై, ఆత్మ సౌందర్యంతో నిండిన అంతరదృష్టి ప్రత్యేకమైన కవిత్వాన్నే రాయించింది. ఇప్పటికి 26 కవితా సంపుటాలను వెలువరించింది. నూతన పద ప్రయోగాలకు, భావ సాంద్రతకు… సాహిత్య పరిశీలనతో వయస్సుకు మించి పండిన అనుభవం నిండుగా ఉన్న కవి, మెండైన కవితల ఆసామి మాకినీడి!!
స్వర్గీయ శ్రీరంగనాయకులు, సరస్వతి గార్ల తొలిచూలు పంట మాకినీడి సూర్యభాస్కర్ గారు. కాకినాడ వీరి స్థిరనివాసం. తండ్రి శ్రీరంగనాయకులు ప్రభుత్వ ఖజానా సంస్థలో దిగువశ్రేణి గుమాస్తాగా జీవితాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ సహాయ ఖజానాధికారిగా ఎదిగారు. ఉద్యోగరీత్యా పిల్లల్ని ఊరూరా బాగానే త్రిప్పారు. కుదురు లేని జీవితానికి పిల్లల చదువు, సంధ్యలకు ఏ అడ్డురాకుండా తల్లి లాలన కాపుకాసింది.

డిగ్రీ కోసం 1982-1985 నెల్లూరు జిల్లాలోని కావలి ‘జవహర్ భారతి కళాశాలలో చేరడాన్ని అదృష్టంగా భావిస్తారు భాస్కర్‌. తాను అక్కడ చదివింది బి.యస్‌సి. (డైరీ సైన్స్) అయినా, సైన్సేతర అధ్యాపకులు, సాహితీ క్షేత్రంలో దురంధరులైన లెక్చరర్లు ఆప్పట్లో అక్కడ పనిచేస్తుండటం… వారు తనపై చూపిన శిష్య వాత్సల్యం మాకినీడిలోని సృజనాత్మకతకు, రచనా వ్యాసంగాన్ని భిన్నకోణాల్లోకి పరావర్తనం చెందించేలా చేసింది. తానొక కవిగా, విమర్శకుడిగా, కథకుడిగా, కళా విమర్శకుడిగా, విద్యావేత్తగా, బాలసాహితీద్రష్టగా, ఫ్రీ లాన్సర్‌గా తీర్చిదిద్దుకునేందుకు దోహదపడ్డాయి.

కాకినాడ కార్పోరేషన్ హైస్కూళ్ళలో ఆంగ్ల భాష బోధకులుగా ఉద్యోగంలో కుదురుకున్నాక స్థిరజీవనం ఏర్పడ్డది. మనోవృత్తిగా సాగుతున్న సృజన వ్యాపక సేధ్యానికి మరింతగా సమయాన్ని కేటాయించి పెద్దపీట వేయటం జరిగింది. దీనికి తన దినచర్యను తనదైన శైలిలో మలుచుకున్నారు. ప్రతిరోజు అర్థరాత్రి క్యాలెండరులో తేదీ మారిన ఒంటి గంటకు తనకు శుభోదయం ప్రారంభమౌతుంది. అంటే రాత్రి ఒంటి గంటకు నిద్రలేస్తారన్నమాట. అయిదు / ఆరు అయ్యేంతవరకు సాహిత్య పఠనం, లేఖనం, కాలకృత్యాలు, స్నానాధికాలు ముగించుకున్న తర్వాత… ఉద్యోగ నిర్వహణకు పరుగు తీసేవారు ఇదివరకు. రిటైరైన తరవాత ఒంటి గంట నుంచి 10-11గం వరకు రచనా వ్యాసంగంలో కూరుకుపోవడం ప్రస్తుత దినచర్య. రాత్రి భోజనం ఏడుగంటలకే ముగించి ఉత్తర ప్రత్యుత్తరాలు చూసుకొని ఠంచనుగా తొమ్మిది గంటలకే పడుకోవడం వీరి నిత్యకృత్యం.

సమాజానికి కలం ద్వారానే కాకుండా, సంపాదనను వృత్తికి అనుసంధానిస్తూ కొన్ని సేవాకార్యక్రమాలు చేసారు భాస్కర్ గారు. ‘లాంగ్వేజ్ స్టూడెంట్స్ రిక్రియేషన్ వర్క్‌షాప్’ (LSRW) పేరిట కాకినాడ మునిసిపల్ పాఠశాలల విద్యార్ధులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, డ్రాయిగ్ వంటి సృజనాత్మక పోటీలనెన్నో నిర్వహిస్తూ వారి ప్రాథమిక భాషా నైపుణ్యాలను పెంచే కృషిచేస్తున్నారు. ‘యంగ్‌పెన్స్’, ‘సృజన సేన’ పేర తైమాసిక, మాస బులిటెన్‌ను విడుదల చేస్తూ విద్యార్ధులను ప్రోత్సహించారు. అలాగే ప్రతి సంవత్సరం కాకినాడ మునిసిపల్ పాఠశాల పరిధిలో 10వ తరగతి ప్రథమస్థానాన్ని పొందిన విద్యార్ధినీవిద్యార్థులకు నగదు ప్రోత్సాహంతో పాటు ఆ స్కూలుకు రోలింగ్‌షీల్టును ఇస్తూ వచ్చా రు.

‘మాకినీడి సాహితీ పురస్కారాలు’ పేర ఒక కవిని, ఒక విమర్శకుడిని, ఒక కథకుడిని, ఒక సమాజ సేవకుణ్ణి గుర్తించి నగదు బహుమానంతో పాటు మెమొంటో, శాలువతో సత్కరిస్తువచ్చారు. ఈ కార్యక్రమాలను వీరి తాతగారి పేరుమీదుగా ఏర్పాటు చేసిన ‘శ్రీ మాకినీడి సూరన్న మెమోరియల్ ట్రస్టు, కాకినాడ” ఆధ్వర్యంలో నిర్వహించేవారు. ఈ కార్యక్రమాలకు పూర్తి అండదండలు తండ్రి మాకినీడి శ్రీరంగనాయకులు గారి నుండి అందేవి.

8వ తరగతి వయస్సులోనే దైవ భక్తివసుడైన మాకినీడి పద్యాలు రాయడం మొదలుపెట్టారు. బాగా మొదట్లో రాసినవి పోయినవి పోగా, ‘చూపునిమ్ము’అనే ఖండికను 1980లో రూపొందించారు. ఈ పద్యాలన్నీ ‘సుమకవితాంజలి’ పేరా 1992లో తిరుమల తితుపతి దేవస్థానం ప్రచురించింది.
ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తుండగా (1986) అందులోని ఒక అంశం భాస్కర్ గారి దృష్టిని ఆకర్షించింది. “ఇదివరలో మీరు ఏమైనా రచనలు చేశారా?” అన్నది దరఖాస్తులోని ఒక ప్రశ్న. ఆ ప్రేరణతో ఆచంట జూనియర్ కళాశాలలో రెండేల్ల ఇంటర్నిమీడియట్ ఒకేషనల్ డెయిరీ సైన్సు పార్ట్ టైం ఉపన్యాసకుడిగా చేస్తున్న రోజుల్లోనే “దూడల మరణాలు – ఒక పరిశీలన” అనే పేరుతో వ్యాసాన్ని రాసి తెలుగు అకాడమీ, విద్యా వైజ్ఞానిక మాసపత్రికకు పంపడం, అది మార్చి 1989 ప్రతిలో అచ్చుకావడం జరిగింది. ఇదే పత్రికలో అచ్చయిన వీరి తొలి రచన. ఆ తర్వాత వరుసగా పాడిపరిశ్రమ, పశు యాజమాన్యం, పాలు పాల -ఉత్పత్తులకు సంబంధించిన వ్యాసాలను పుంఖాను పుంఖాలుగా రాశారు. రాసినవన్నీ తెలుగు, అన్నదాత, ఏనిమల్ వెల్ఫేర్, యోజన వంటి పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆ విధంగా రాస్తూ రాస్తూ తెలుగు పత్రికలో కనీసం సబ్జెక్టుకు ఒక వ్యాసం చొప్పున రాయాలని / రావాలని అనుకున్నారు మాకినీడి. ఆ విధంగా గణితం, చరిత్ర, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం, మతం, విద్య, పరిశోధన, లిపి, భాష, పారిభాషికత, కళ మొదలైన సబ్జెక్టులలో వివిరిగా వ్యాసాలు రాసి తెలుగులో ప్రచురించారు. ఒక్కో విటమిన్ గురించి ఒక్కో వ్యాసం కూడా ప్రత్యేకంగా ప్రచురించారు. దాదాపు ఒక్క తెలుగు పత్రికలోనే చాలా వ్యాసాలు వచ్చాయి. ఆక్రమంలో కళకు సంబంధించిన వ్యాసాలను ప్రచురించేందుకు ‘మిసిమి’ పత్రికకు దారులు తెరువబడ్డాయి. ఆ కాలంలో ప్రతినెల ‘మిసిమి’పత్రికలో భాస్కర్‌గారి వ్యాసం తప్పక వుండేది. ఈ వ్యాసాలన్నీ మంచి విద్యావేత్తగా భాస్కర్ గారికి పేరుతెచ్చాయి.

ఆ తర్వాత నెమ్మదిగా వీరి రచనా ప్రస్థానం సాహిత్యంలోకి ప్రవేశించింది. మొదటి కథ ‘అంతస్సౌందర్యం’ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంక్రాంతి కథల పోటీకి ఎంపికై, 1991లో ప్రచురింపబడింది. మొదటివ్యాసం ‘శ్రీశ్రీ ప్రతీకతా శిల్పం’ తెలుగు మాసపత్రికలో 1992 జులైలో ప్రచురించబడింది. ‘తెలుగు ఛందము – పరిణామ చందము’ అన్న వ్యాసంలో ఉటంకించబడి. మొదటి కవిత తెలుగు విద్యార్ధిలో 1994 జూలైలో ప్రచురించబడింది. స్వతంత్రంగా ప్రచురింపబడిన తొలి పద్యకవిత ‘దైన్యభారతి’ 1994 స్వాతంత్య్రదిన ప్రత్యేక సంచిక (ఆగస్టు 15)లో ప్రచురించబడగా, తొలి వచన కవిత ‘నగరజీవితం’ 23-7-1995 ఆదివారం ఆంధ్రభూమి దినపత్రిక ‘దర్బార’ శీర్షికలో ప్రచురింపబడింది. అయితే అంతకుముందు ‘ఆశ-శ్వాశ’ పేరుతో 1976లో తొమ్మిదో తరగతిలో ఉండగా పాఠశాల మాగాజీన్లో ప్రచురింపబడింది. ఈ ప్రచురణే ఈనాటి ఈ సాహితీ స్వర్నోత్సవానికి ఆలంబన అయింది. ‘నేను’ అనే కవిత డిగ్రీ చదివేటప్పుడు విశ్వోదయ ‘కాంపస్ జర్నల’లో 1982లో ప్రచురింపబడింది. 1983 కాంపస్ జర్నల్లో ‘మేరా ఘర్’ పేరుతొ ప్రచురింపబడిన మొదటి హిందీ కవిత. 2010లో ‘నిరంతర బాజార్’ హిందీ కవితకు జాతీయ స్థాయి భిలాయి వాణి పురస్కారం లభించింది.
భాస్కర్ గారికి చిత్రలేఖనంలో కూడా ఆసక్తిమెండు “విస్తృతంగా చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొనాలని అభిలాష. తొలి కళావిమర్శక వ్యాసం ‘కళాశాస్త్ర దర్శనం – భిన్నదృక్పథం’ మిసిమి పత్రికలో జనవరి 1994లో ప్రచురింపబడింది. అప్పటి నుంచి చిత్రకళా మీద వందల కొద్దీ వ్యాసాలూ వివిధ పత్రికల్లో వచ్చ్చాయి. ఇప్పటికి కళా విమర్శ రంగంలో 30 పుస్తకాలు వెలువడ్డాయి.

సుమారు నలుబది నాలుగు మంది కవి – చిత్రకారుల్ని రాష్ట్రమంతా గాలించి, దొరకపుచ్చుకుని; కవుల్లో దాగిన చిత్రకారుల్ని, చిత్రకారుల్లో దాగిన కవుల్ని ‘కవి`చిత్రకారులు’అన్న శీర్షికన చినుకు, విశాలాక్షి సాహిత్య మాసపత్రికల పాఠకులకు పరిచయం చేసిన కాలమిష్టు మాకినీడి.
నేడు మాకినీడి సూర్యభాస్కర్ గారు తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోను తన సృజనానైపుణ్యాన్ని చూపిన సాహిత్యకారులు. సమీక్షల ద్వారా సాహిత్య వ్యాసాల ద్వారా తోటి సాహిత్యకారుల మంచి రచనలను పాఠకలోకానికి పరిచయం చేస్తూ… తెలుగులో తొలిసానట్‌ను 10-6-2021న సృజించి మరో నూతన సాహిత్య ప్రక్రియను తెలుగు వారికి పరిచయం చేసారు.

తన సాహిత్యకృషికి 50 ఏళ్ళ నిండిన సందర్భంగా మాకినీడి సాహితీ స్వర్ణోత్సవ వత్సరంగా 2026ను ప్రకటించారు. శతాధిక గ్రంథాలను ముద్రించి, మరో 50 పుస్తకాలను ముద్రణకు సిద్దంగా ఉంచుకున్న అక్షర శ్రామికుడు. తన సాహిత్యాన్ని స్ఫృసించిన విద్యార్థులు డాక్టరేట్లు, యంఫిల్ పట్టాలను పుచ్చుకున్నవారు. స్వయంగా వారిపైనే వచ్చిన పుస్తకాల సంఖ్య – 10. వీరుపొందిన అవార్డులు, రివార్డులు, ప్రశంసలు లెక్కకు మిక్కిలి.
కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు:
*అజో-విభో-కందాళం విశిష్ట సాహితీమూర్తి పురస్కారం – 2022
*అం.ప్ర. గిడుగు తెలుగు భాషా పురస్కారం -2026 (కళా విమర్శ రంగంలో, ఇదే మొదటిది)
*అం.ప్ర. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం -2025
*జిల్లా కలెక్టర్ బెస్ట్ సర్వీసెస్ అవార్డు, ‘గణతంత్ర దినోత్సవం’ 2002
*తానా ‘అమెరికా అవార్డు’ 2006
*తామా ‘అమెరికా అవార్డు’ 2006
ఆంధ్ర సారస్వత సమితి ‘మచిలీపట్నం’ ఉగాది సాహిత్య ప్రతిభా పురస్కారం 2010 (వచనకవిత్వానికి)
పైన తెలిపిన అవార్డులనే కాక సుమారు 60 పైన పురస్కారాలను, 1500 సన్మానాలను అందుకున్నారు మాకినీడి. స్థలాభావంచేత ఉటంకించ లేక పోతున్నాం.
మాకినీడి సృజనకు కళాభివందనాలు సమర్పించుకుంటూ…
-ఆత్మకూరు రామకృష్ణ

Share via
Copy link
Powered by Social Snap