నూరేళ్ల ఐతిహాసిక ‘మాలపల్లి’ నవల

మాలపల్లి నవల వంద సంవత్సరాలుగా తెలుగు జాతి సామాజిక సాహిత్య సాంస్కృతిక పరిణామాలతో కలిసి ప్రవహిస్తున్న జీవనది. అప్పటికి నలభై ఏళ్లుగా ఎన్ని సార్లు కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులకు అది పాఠ్య గ్రంధం అయిందో తెలియదు కానీ 1976- 1977 కాకతీయ విశ్వవిద్యాలయం ఎమ్మే తొలి బ్యాచ్ విద్యార్థులకు, ప్రత్యేకించి ఒక సెమిస్టర్‌లో ఐచ్చికాంశంగా నవల పేపర్‌ను ఎంచుకొన్న వారికి పాఠ్య గ్రంధాలైన నాలుగు నవలలో మాలపల్లి కూడా ఉంది.

ఈ నవలను ఉన్నవ లక్ష్మీనారాయణ తన నలభై ఐదేళ్ళవయసులో పరిణత జీవితానుభవం నుండి వ్రాసాడు. వీరేశలింగం సంస్కరణ ఉద్యమంతో ప్రారంభించి, గిడుగు వ్యావహారిక భాషా ఉద్యమం, గురజాడ సామాజిక సాహిత్య దృక్పథం, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, అది ఆంధ్రుల ఆత్మగౌరవ ఉద్యమం, జాతీయోద్యమం, ప్రపంచ రాజకీయార్థిక తాత్విక చింతనలు, ఉద్యమాలు ఆచరణ మొదలైన వాటిలో ఒరిపిడి పడి పదునెక్కిన వ్యక్తిత్వం, జీవిత దృక్పథం ఉన్నవ లక్ష్మీ నారాయణది. ఈ క్రమంలో సమకాలీన సమాజంలో భావభౌతిక రంగాలలో సంచలనాత్మకమైన మార్పు దిశగా జరుగుతున్న సంఘర్షణ, సంవాదాలను నిశితంగా గమనిస్తూ వస్తున్న ఆయన ఆ మహాజీవన సంగ్రామాన్ని సంరంభాన్ని సృజనాత్మకంగా నమోదు చేయటానికి మాలపల్లి నవల వ్రాసాడు. పల్నాడు అటవీ ప్రాంతాల పుల్లరి విధానానికి వ్యతిరేకంగా తలెత్తిన ప్రజా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ కావటంవల్ల నెల్లూరు జైలులో గడిపిన ఏడాది కాలం అందుకు అవకాశం కల్పించింది. జైలు సెన్సారు, నిషేధాల నియంత్రణలను దాటుకొంటూ మనవరకు అందివచ్చిన ఈ నవల ఒక చారిత్రక అద్భుతం.

1872లో రంగరాజ చరిత్ర తెలుగులో నవలా ప్రక్రియను అంటుకట్టటానికి జరిగిన తొలి ప్రయత్నం కాగా 1878లో వచ్చిన రాజశేఖర చరిత్ర ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేసింది. అక్కడినుండి వలస సామాజిక సందర్భాలతో సంవదిస్తూ భూస్వామ్య బంధనాల నుండి విడివడుతూ అధునిక మానవుడు రూపొందుతున్న క్రమాన్ని వ్యక్తి చరిత్రలుగా నిరూపిస్తూ నవల గమనం సాగింది. నిజమైన అర్థంలో సామాజిక ప్రక్రియగా పరిపూర్ణత సాధించింది మాలపల్లి నవలలోనే. అందుకనే ఈ నవలతో తెలుగు నవలా సాహిత్య చరిత్ర వికాస యుగంలోకి అడుగు పెట్టింది అంటారు. తెలుగులో ఐతిహాసిక నవల ప్రారంభమైంది కూడా మాలపల్లి నవలతోనే.

ఉన్నవ లక్ష్మీనారాయణ
ఉన్నవ లక్ష్మీనారాయణ గాంధేయ వాదిగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర్యయోధుడుగా, తెలుగు నవలా సాహిత్య వైతాళికుడుగా విశేషమైన కీర్తి పొంది, సాహిత్యం ద్వారా హరిజనోద్ధరణకు కృషి చేసిన ప్రముఖ న్యాయవాది. ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. గుంటూరులో ఆయన స్థాపించిన శ్రీ శారదా నికేతన్ స్త్రీ విద్యను ప్రోత్సహించడంలో మంచి కృషి చేసింది.

ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా అప్పటి సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడు గ్రామంలో 1877 డిసెంబరు 4వ తేదీన శ్రీరాములు, శేషమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి శ్రీరాములు అచలయోగం అనే కుండలినీ విద్యను సాధన చేసేవాడు. కులతత్వమంటే విశ్వాసముండేది కాదు. ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. 1897లో గుంటూరులో మెట్రిక్యులేషన్ చదివాడు. 1906లో రాజమండ్రి ఉపాధ్యాయ శిక్షాణా కళాశాలలో శిక్షణ పొందాడు. 1916లో బర్లాండ్, డబ్లిన్ ‍లలో బారిష్టర్ చదువు సాధించాడు. 1892లోనే లక్ష్మీబాయమ్మతో వివాహం జరిగింది.

లక్ష్మీనారాయణ 1900లో గుంటూరులో ఉపాధ్యాయ వృత్తి నిర్వహించాడు. 1903లో అక్కడే న్యాయవాద వృత్తిని చేపట్టాడు. 1908లో ర్యాలీ కంపెనీలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు. 1917 లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు. 1923 లో కాంగ్రెసు స్వరాజ్య పార్టీలో చేరాడు. అలాగే ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు ఇద్దరులో ఒకడుగా ఎన్నికయ్యాడు. పల్నాడు పుల్లరి సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 1931లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో చేరినందుకు, 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో చేరినందుకు జైలు శిక్ష అనుభవించాడు.

సాంఘిక సేవ: ఉన్నవ ఎన్నో రకాల సంస్థలను స్థాపించి తన అపారమైన సేవలను అందించాడు. 1900 లో గుంటూరులో యంగ్‍మెన్స్ లిటరరీ అసోసియేషన్‍ను స్థాపించాడు. 1902లో అక్కడే వితంతు శరణాలయాన్ని స్థాపించాడు. వీరేశలింగం పంతులు అధ్యక్షతలో తొలి వితంతు వివాహం జరిపించాడు. వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయాన్ని 1906 లోను, పూనాలోని కార్వే మహిళా విద్యాలయాన్ని, 1912 లోను సందర్శించాడు. 1913 లో జొన్నవిత్తుల గురునాథంతో కలసి విశాలాంధ్ర పటం తయారుచేశాడు. రాయవేలూరు జైలు నుంచి విడుదల అయిన తర్వాత 1922లో గుంటూరులో శారదానికేతన్‍ను స్థాపించి బాలికలకు విద్యావకాశాలు కల్పించాడు.

రష్యాలో 1917లో జరిగిన బోల్షవిక్ విప్లవం వల్ల స్ఫూర్తి పొందిన మొదటి తెలుగు కవి ఉన్నవ. కూలీల పక్షం వహించి కవులు రచనలు చేయడానికి ప్రేరణ నిచ్చింది రష్యా విప్లవమే. కూలీల ఆర్థికాభివృద్ధిని కాంక్షించి, వారి పక్షం వహించి, వారి దుస్థితిని తెలియ జేసిన మొదటి వైతాళికుడు ఉన్నవ.

మాలపల్లి నవల: సామాన్య ప్రజల అభ్యుదయాన్ని కోరే కవిత్వం ప్రజలకు సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో ఉండాలన్నది ఉన్నవ అభిలాష. సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించి సమతాధర్మాన్ని స్థాపించడమే ఆయన ఆశయం. కులవ్యవస్థను నిరసించి, సహపంక్తి భోజనాలు ఏర్పాటుచేశాడు. అగ్రవర్ణాలు, హరిజనులు అందరూ కలసి మెలసి ఉండాలని భావించాడు . అందుకు నిరూపణగా ” మాలపల్లి అనే విప్లవాత్మకమైన నవలా రచన చేశాడు. ఈ నవలకే రచయిత సంగ విజయం అనే పేరు కూడా పెట్టాడు.

మాలపల్లి నవల నిషేధం: 1922 లో ఈ నవలను బెల్లంకొండ రాఘవరావు రెండు భాగాలుగా ముద్రించాడు. కానీ మద్రాసు ప్రభుత్వం మాలపల్లి నవలా భాగాలపై నిషేధం విధించింది. 1926 లో మద్రాసు శాసనమండలిలో కాళేశ్వరరావుచే మాలపల్లి నిషేధంపై చర్చలు జరిగాయి. 1928 లో కొన్ని మార్పులతో మాలపల్లి ప్రచురణకు తిరిగి అనుమతి లభించింది. మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర విశ్వవిద్యాలయంచే మాలపల్లిని ప్రచురింప చేసి, ఆ నవలను పాఠ్యగ్రంథంగా కూడ ఎంపిక చేసింది. 1936 లో మద్రాసు ప్రభుత్వం మాలపల్లి నవలపై రెండోసారి నిషేధం తెలిపి ఆ నవలను పాఠ్యగ్రంథంగా తొలగించింది. 1937 లో సి.రాజగోపాలాచారి మద్రాసు ప్రధానిగా ఎన్నికైనప్పుడు తొలి కాంగ్రెసు మంత్రి వర్గంచే మాలపల్లి నవల పై నిషేధపు ఉత్తర్వుల రద్దు జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap