ప్రతినాయక పాత్రలో మేటి – మద్దాల రామారావు

ప్రతినాయక పాత్రలో మేటి… రాక్షస పాత్రలో ఘనపాటి!
వికటాట్టహాసాల్లో లేరెవరు ఆయనకు సాటి!
నేడే ఆ నట దిగ్గజం మద్దాల రామారావు గారి జయంతి…
ఆ మహానటునికివే నా అక్షర ప్రణతులు!

తెలుగు పౌరాణిక నాటకరంగంలో సుప్రసిద్ధులైన నటులు శ్రీ మద్దాల రామారావు గారు. పౌరాణిక నాటకాలలో ప్రతినాయకుడి పాత్రకు ఎంతో గౌరవం తీసుకువచ్చి, వాటినే నాయక పాత్రల స్థాయికి మలిచి ప్రేక్షకులచేత బ్రహ్మరథం పట్టించుకున్న గొప్ప నటులాయన. భీకరాకృతి, కంచును మైమరపించే కంఠం, గంభీరమైన వాచకం, గుండెల్ని అదిరేలా చేసే వికటాట్టహాసాలు ఆయన సొంతం. అనితరసాధ్యమైన సుదీర్ఘ సమాసాలను అవలీలగా ఉచ్చరిస్తూ, భయోత్పాతాన్ని కలిగించే గర్జనలతో, అద్భుతమైన హావభావాలతో సాగే ఆయన ప్రతినాయక పాత్రల నటన చూసి తీరాల్సిందే కానీ వర్ణించడానికి పదాలు చాలవు. మద్దాల రామారావు గారు కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా… పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో వందలాది ప్రదర్శనలిచ్చి ప్రేక్షకులను మెప్పించిన ఘనత సాధించారు.

పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం మండలం, జల్లికొమ్మర గ్రామంలో 1933 సెప్టెంబర్ 6న కీర్తిశేషులు మద్దాల వెంకన్న, మహంకాళి దంపతుల జ్యేష్ఠ పుత్రుడిగా ఆయన జన్మించారు. రామారావు గారు పెద్ద చదువులు చదవకపోయినా, స్వయంప్రతిభతో నాటక ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగించారు. చాలా చిన్న వయసులోనే కీర్తిశేషులు టేకు సుబ్బారావు గారు నిర్వహించిన “లవకుశ” నాటకంలో లవుడి పాత్రలో తళుక్కున మెరిశారు. నాటకరంగంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఏర్పడటానికి అదే నాంది పలికింది.

కాలక్రమంలో బాలుడు యువకుడయ్యాడు. ‘పల్నాటి యుద్ధం’ నాటకంలో అనుకోకుండా నరసింగరాజు వేషం వేయడం, అందరి దృష్టి ఆయనపై పడటంతో మద్దాల వారి అడుగులు ప్రతినాయక పాత్రల వైపు స్థిరంగా పడ్డాయి. ఆ తర్వాత సుప్రసిద్ధ నాటకకర్త, ప్రయోక్త అయిన ప్రగడ భద్రం గారి ‘తులసి జలంధర’ నాటకంలో జలంధరుడిగా నటించడం ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. అదొక ప్రసిద్ధ నాటకంగా నిలిచిపోయింది. అనంతరం ‘భూకైలాస్’, ‘భస్మాసుర’ నాటకాలు ఆయనకు విశేష కీర్తిని తెచ్చిపెట్టాయి. ఇక ‘కురుక్షేత్రం’ నాటకం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ నాటకంలో మద్దాల వారి దుర్యోధన పాత్ర, కీర్తిశేషులు షణ్ముఖి ఆంజనేయరాజు గారి శ్రీకృష్ణ పాత్రలకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ ఇద్దరు మహానుభావులను ఒకే వేదికపై చూడటం అప్పటి ప్రేక్షకుల అదృష్టం. ఆయన నటనా కౌశలానికి మెచ్చి పండితులు ఆయనకు ‘రంగ మార్తాండ’ బిరుదును ప్రదానం చేశారు.

తెలుగు పౌరాణిక నాటక రంగాన్ని దేదీప్యమానంగా వెలిగించిన మహానుభావుడు మద్దాల. సినీ రంగంలో ప్రతినాయక పాత్రలకు ఎన్టీఆర్, ఎస్వీఆర్ ఎలాగో… తెలుగు రంగస్థలంపై మద్దాల రామారావు గారు, ఆచంట వెంకటరత్నం నాయుడు గారు అలా రారాజుల్లా వెలుగొందారు. తెలుగు ప్రేక్షకులు వారికి అడుగడుగునా నీరాజనాలు పట్టారంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వారి కుమారుడు శ్రీ మద్దాల ఉదయభాను తండ్రిగారి నటనా వారసత్వాన్ని ఘనంగా కొనసాగిస్తున్నారు. మద్దాల రామారావు గారి కళాసేవకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనను ‘కళారత్న’ బిరుదుతో ఘనంగా సత్కరించారు.

నాటక రంగానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన తన 85వ ఏట ఫిబ్రవరి 6, 2017న శివైక్యం పొందారు. తెలుగు నాటకరంగంపై చెరగని ముద్ర వేసిన ఆ మహనీయునికివే నా ఘన నివాళులు!

–నూలు సాంబశివరావు

Share via
Copy link
Powered by Social Snap