‘జీవితమే ఒక నాటక రంగం’ అన్నాడు ప్రఖ్యాత ఆంగ్ల నాటక రచయిత షేక్స్పియర్. చరిత్రలో విఫలమైన ప్రేమకథలు యెన్నో! వాటిలో కొన్ని చారిత్రాత్మక ప్రేమకథలు వెండితెరమీద కూడా దర్శనమిచ్చాయి. 1960లో హిందీలో వచ్చిన ప్రేమకథా కావ్యం ‘మొఘల్-ఏ-ఆజం’ సినిమా. మొగలాయీ యువ చక్రవర్తి సలీం (జహంగీర్), ఆస్థాన నాట్యకళాకారిణి నాదిరా(అనార్కలి)ల మధ్య చిగురించిన ప్రేమను అనుమతించని అక్బర్ చక్రవర్తి ఆజ్ఞకు బలియైన ఆ ప్రేయసి లాగే, తన జీవితాన్ని గడిపిన బాలీవుడ్ అందాల సుమమాల ‘మధుబాల’. “నీలీ ఆంఖే, సాచే బెతాలా చెహరా, లంబీ ఖడీ నాఖ్, బిల్కష్ ముస్కాన్, తరాషా హువా సంగ్, బర్మరీ పదక్” అంటూ మధుబాల అందాన్ని దర్శకుడు ఆసిఫ్ అద్భుతంగా వర్ణించినా, ఆ వర్ణన ఆమె అందానికి సాటిరాదన్నది నిజం. మధుబాల సినిమాలు సూపర్ హిట్లైనప్పుడు ఆమెను అందరూ ‘వీనస్ క్వీన్’ గా కీర్తించారు. ఆడని సినిమాల దురదృష్టాన్ని కేవలం ఆమెకే ఆపాదిస్తూ అదే ప్రేక్షకులు ‘బాక్సాఫీస్ పాయిజన్’ అని దూషించిన సందర్భాలూ లేకపోలేదు. ఈ అందాల రాశి తక్కువ సినిమాల్లో నటించి, అతి తక్కువ కాలం జీవించినా, ఆమె సినిమాలను ప్రేక్షకులు మరచిపోలేదు…మరచిపోలేరు కూడా. ఫిబ్రవరి 23 న ఈ భగ్న ప్రేమికురాలి 53వవర్ధంతి. ఆ సందర్భంగా ఈ బాలీవుడ్ మార్లిన్ మన్రో మధుబాలను గురించి కొన్ని విషయాలు మీకోసం…
మధు‘బాల్య’ కథ
ఫిబ్రవరి 14, 1933న దిల్లీలో పుట్టిన మధుబాల తల్లిదండ్రులు అత్తావుల్లాఖాన్, ఆయేషాబేగం. పష్తున్ ముస్లిం వంశానికి చెందిన వీరికి పదముగ్గురు భారీ సంతానం. అందులో మధుబాల ఐదవ బిడ్డ. మధుబాల కు తల్లిదండ్రులు పెట్టిన పేరు ముంతాజ్ జెహాన్ బేగం దేహ్లవి. తండ్రి పెషావర్ ఇంపీరియల్ టొబాకో కంపెనీ లో పనిచేస్తూ, వుద్యోగం వూడడంతో దిల్లీ నగరానికి వలస వచ్చాడు. మధుబాల అక్కడే పుట్టింది. ఆర్ధిక ఇక్కట్లకు తలవంచి బొంబాయికి మకాం మార్చాడు. సరైన పోషణ లేక అయిదారేళ్ళ ప్రాయంలోనే ముగ్గురు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు కాలంచేశారు. ఆ రోజుల్లో బొంబాయి ఓడరేవు వద్ద పెను అగ్నిప్రమాదం జరిగింది. అక్కడే కాపురంవుంటున్న అత్తావుల్లాఖాన్ పూరిల్లు తగలబడిపోయింది. కుటుంబ సభ్యులందరూ సినిమాహాలులో వుండడంతో బతికిపోయారు. ఉన్న ఒక్క ఇల్లూ వూడడంతో తొమ్మిదేళ్ళ వయసున్న మధుబాలను వెంటపెట్టుకొని చిన్నచిన్న పనులకోసం సినిమా స్టూడియోల వెంటపడ్డాడు తండ్రి అత్తావుల్లా ఖాన్. 1942లో బాంబే టాకీస్ బాధ్యతలను ప్రఖ్యాత నటీమణి దేవికారాణి నిర్వహిస్తున్నప్పుడు అమియా చక్రవర్తి దర్శకత్వంలో ‘బసంత్’ అనే సినిమాను ఆమె నిర్మించారు. అందులో ముంతాజ్ శాంతి, ఉల్హాస్ నటించగా వారి కూతురుగా బాలనటిగా మధుబాల తెరంగేట్రం చేసింది. ఇందులో మధుబాల “మేరే చోటే సే మన్ మే చోటి సి దునియా రే” అనే పాటకూడా పాడింది. ఈ సినిమాలో ఆమె పేరు బేబీ ముంతాజ్. ఆమె నటనకు, అందానికి ముచ్చటపడిన దేవికారాణి ఆమె పేరును ‘మధుబాల’గా మార్చింది. ఈ సినిమా బాగా ఆడడంతో బాలనటిగా మధుబాలకు మంచి అవకాశాలు వెదుక్కుంటూ వచ్చాయి. 1944-47 మధ్యకాలంలో ‘ముంతాజ్ మహల్’, ‘ధన్నా భగత్’, ‘పూజారి’, ‘ఫూల్వారి’, ‘రాజపుటాణి’ సినిమాల్లో బాలనటిగా నటించి మధుబాల మంచి పేరు తెచ్చుకుంది.
హీరోయిన్ గా మధుబాల
పద్నాలుగేళ్ళ వయసులో 1947లో మధుబాల బాంబే టాకీస్ తరఫున కేదార్ నాథ్ శర్మ నిర్మించిన ‘నీల్ కమల్’ సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంతోనే ఆమెతోబాటు ‘గ్రేటెస్ట్ షో మ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా కీర్తింపబడే రాజకపూర్ కూడా పరిచయమయ్యారు. అయితే సినిమా ఆశించినంత సక్సెస్ కాలేదు. తరవాత నటించిన ‘చిత్తర్ విజయ్’, ‘మేరే భగవాన్’, ‘ఖూబ్ సూరత్ దునియా’, ‘లాల్ దుపట్టా’, ‘అమర్ ప్రేమ్’, ‘సింగార్’ సినిమాలు గొప్పగా ఆడలేదు. 1949లో బాంబే టాకీస్ వారి సూపర్ డూపర్ హిట్ సినిమా ‘మహల్’ మధుబాలను బాలీవుడ్ అందలమెక్కించింది. ఇది కమల్ అమ్రోహికి మొదటి చిత్రం కాగా అశోక్ కుమార్ హీరోగా నటించాడు. మధుబాల పోషించిన పాత్రకోసం తొలుత సురయ్యా ను అనుకున్నా స్క్రీన్ టెస్టు ద్వారా మధుబాల వైపే నిర్మాతలు మొగ్గారు. ఖేంచంద్ ప్రకాష్ సంగీత దర్శకత్వంలో లతామంగేష్కర్ పాడిన “ఆయేగా ఆనేవాలా ఆయేగా” పాట చాలా పాపులరై లతాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆరోజుల్లో పాటల రికార్డులమీద ఆ పాటలు యే పాత్రకు పాడిందో ముద్రించేవారు కానీ యెవరు పాడింది రాసేవారుకాదు. ఈ పాటవున్న రికార్డు మీద మధుబాల పోషించిన “కామిని” పాత్రపేరు మాత్రమే తొలుత ముద్రించారు. ఆకాశవాణి ఈ పాటను ప్రసారం చేసినప్పుడు ఆ పాటపాడిన గాయని ఎవరో తెలుపవలసిందని బండెడు ఉత్తరాలు రావడంతో, వారు రికార్డింగు కంపెనీవాళ్ళను సంప్రదించి గాయని లతా పేరును తొలిసారి ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. లతా పాడిన “దిల్ నే ఫిర్ యాద్ కియా”, ‘’ముష్కిల్ హై బహుత్ ముష్కిల్” పాటలుకూడా ప్రాచుర్యం పొందాయి. అదే సంవత్సరం అబ్దుల్ రషీద్ కర్దార్ నిర్మించిన ‘దులారి’ సినిమా అత్యధిక వసూళ్లు చేసిన 8వ భారతీయ సినిమాగా రికార్డులకెక్కింది. మధుబాలకు ఇక వెనుకకుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. నౌషాద్ సంగీతం సమకూర్చిన “ఆంఖో మే ఆజా దిల్ మే సంజ్హా”, “దో దిన్ కీ బహార్ ప్యారే” “సుహానీ రాత్ ఢల్ చుకీ.. న జానే తుం కబ్ ఆవోగే” పాటలు బాగా పాపులర్ అయ్యాయి. 1950లో అమర్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘బేఖసూర్’ కూడా కలక్షన్లలో ఏడవ స్థానంలో నిలిచింది. అనిల్ బిస్వాస్ పాటలు జనాన్ని అలరించాయి. 1951లో రామ్ దర్యాని ‘తరానా’ సినిమా నిర్మిస్తే అందులో మధుబాల సరసన తొలిసారి దిలీప్ కుమార్ హీరోగా నటించాడు. ఒక ప్రేక్షకుడు ఈ సినిమాను 131సార్లు చూశాడంటే అది యెంతటి హిట్టో చెప్పాల్సిన పనిలేదు. 1951లో ప్రేమనాథ్ హీరోగా ‘బాదల్’ సినిమా వచ్చింది. ‘రాబిన్హుడ్-షేర్వుడ్ ఫారెస్ట్’ కథ ఆధారంగా తీసిన ఈ సినిమాకు అమియా చక్రవర్తి దర్శకత్వం వహించగా శంకర్-జైకిషన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా కూడా బాగా ఆడింది. “అయ్ దిల్ న ముఝ్ సే ఛుపా, సచ్ బతా క్యా హువా”,“ఉన్సే ప్యార్ హోగయా దిల్ మేరా హోగయా”, “రోతా మేరా దిల్ కిస్కో పుకారూ క్యాకరూ” పాటలు మంచి హిట్స్ గా గుర్తింపు పొందాయి. హీరోయిన్ గా వచ్చిన రెండేళ్ళలోనే మధుబాలకు యెంత పేరొచ్చిందంటే అమెరికన్ మాగజైన్ ‘థియేటర్ ఆర్ట్స్’ 1952 ఆగస్టు సంచికలో మధుబాల ఫుల్ పేజీ ఫోటో ముద్రించి దానికింద “ది బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ది వరల్డ్-అండ్- షి ఈజ్ నాట్ ఇన్ బెవెర్లీ హిల్స్“ (హాలీవుడ్) అని రాస్తూ ఆమెకున్న క్రేజ్ గురించి వ్యాసం ప్రచురించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, హాలీవుడ్ దర్శకుడు ఫ్రాక్ కాప్రా భారత అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు విచ్చేసినప్పుడు మధుబాలను హాలీవుడ్ కు పరిచయం చేస్తానని ముందుకొస్తే, మధుబాల తండ్రి అడ్డుకున్నాడు. అశోక్ కుమార్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్ తోబాటు ప్రదీప్ కుమార్, షమ్మికపూర్, దేవానంద్, సునీల్ దత్ వంటి సెలెబ్రిటీల సరసన; గీతాబాలి, కామిని కౌశల్, నళిని జయవంత్, నిమ్మి, శ్యామా వంటి ప్రధాన నటీమణులతో కలిసి కూడా మధుబాల నటించింది. 1950-60 దశకం మధుబాలదే అని ఘంటాపదంగా చెప్పవచ్చు. 1954లో వచ్చిన బిమల్ రాయ్ సినిమా ‘బిరాజ్ బహు’లో నటించి తన నటనా పటిమను ప్రదర్శించాలని మధుబాల ఆశించింది. అప్పటికే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఆమెను భరించే ఆర్ధికస్థోమత తనకు లేదని ఆ పాత్రను కామినీకౌశల్ కు ఇచ్చినప్పుడు మధుబాల బాధపడింది. ఏ పారితోషికం లేకుండానైనా నటించేదానిని అని తరవాత బిమల్ రాయ్ తో చెప్పుకొని బాధపడిన సున్నిత మనస్కురాలు మధుబాల. గురుదత్ సినిమా ‘మిస్టర్ & మిసెస్ 55’, ఎన్.డి. నారంగ్ ‘యాహుది కి లడ్కి’, రాజ్ ఖోస్లా ‘కాలాపానీ’, శక్తి సామంత ‘హౌరా బ్రిడ్జి’, ‘ఇన్సాన్ జాగ్ ఉఠా’, సత్యన్ బోస్ ‘చల్తీకా నామ్ గాడీ’, కె. ఆసిఫ్ ‘మొఘల్-ఈ-ఆజం’ సినిమాలు మధుబాల కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాయి. మధుబాల నటించిన ఆన్ని సినిమాల్లో ‘మొఘల్-ఏ-ఆజం’ సినిమా గొప్ప పేరుతెచ్చుకుంది. అందులో మధుబాల నటన పరాకాష్టకు చేరింది. ఈ సినిమా పూర్తవడానికి తొమ్మిదేళ్ళు పట్టింది. సినిమాకు యెక్కువ షూటింగులు అవసరం కావడంతో మధుబాల ఆరోగ్యం క్షీణించింది. శిల్పి మలిచిన విగ్రహంలా నిలబడే సన్నివేశంకోసం ఆసిఫ్ మధుబాలను చాలా శ్రమకు గురిచేశాడు. 1960 ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి, కలక్షన్ల రికార్డును 15 సంవత్సరాల పాటు ‘షోలే’(1975) సినిమా వచ్చేదాకా నిలుపుకుందంటే దాని ఘనత చెప్పాల్సిన అవసరంలేదు. మధుబాల అనారోగ్య కారణాలవలన ఆమె నటించిన కొన్ని సినిమాలు పూర్తికావడానికి చాలాకాలం పట్టేది. ఆ రోజుల్లో మధుబాల సినిమాలకు బర్మా, మలేషియా, ఇండోనేషియా, తూర్పుఆఫ్రికా దేశాల్లో మంచి మార్కెట్ వుండేది. మధుబాల సంవత్సరానికి నాలుగు సినిమాలకు పైగా నటించేది. 1952లో ఏకంగా తొమ్మిది సినిమాల్లో నటించిన సందర్భం కూడా వుంది. హీరోయిన్ గా నటించడం మొదలెట్టిన తొలి నాలుగేళ్ళలోనే మధుబాల 24 సినిమాల్లో నటించి రికార్డు నెలకొల్పింది. ఆమె పబ్లిక్ ఫంక్షన్లలో కనపడేదికాదు. అంచేత మధుబాలను చూడాలనే క్రేజ్ అభిమానులకు వుండేది. ప్రేక్షకులు ఆమె నటనకన్నా ఆమె అందాన్ని యెక్కువగా ఆరాధించేవారు.
విఫల ప్రేమాయణం
పదహారేళ్ళ వయసులోనే స్టార్ స్థాయికి ఎదిగిన మధుబాల ‘తరానా’ సినిమా సెట్స్ మీద దిలీప్ కుమార్ తో ప్రేమలో పడింది. దిలీప్ కుమార్ డ్రెస్సింగ్ రూమ్ కు ఒక రోజా పువ్వును పంపి తనతో ప్రేమకు “సరే”నంటే ఆ పువ్వును తీసుకోవాలని కోరింది. దిలీప్ అంగీకరించాడు. ‘బాదల్’ సినిమాలో నటిస్తున్నప్పుడు హీరో ప్రేమనాథ్ కు కూడా ఇదేవిధంగా పువ్వును పంపి ప్రేమను వ్యక్తం చేసింది. ఈ విషయం దిలీప్ కుమార్ కు తెలియదు. దిలీప్ కు మిత్రుడైన ప్రేమనాథ్ మధుబాల ప్రేమకు “నో” చెప్పాడు. ‘మహల్’ సినిమాలో నటిస్తున్నప్పుడు ఆమె దర్శకుడు కమల్ అమ్రోహిని కూడా ప్రేమించింది. దీనికి కారణం…ఆమె ఆ లేత వయసులో ప్రేమకు, వ్యామోహానికి తేడా తెలుసుకోలేక పోవడమే. చివరకు దిలీప్ కుమార్ ప్రేమకే ఆమె కట్టుబడింది. ఇద్దరూ ఏడు సంవత్సరాలు ప్రేమబంధాన్ని కొనసాగించారు. ‘నయా దౌర్’ సినిమా విషయంలో దిలీప్ కుమార్ మధుబాలకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పినా వారిద్దరి మధ్య అనుబంధం కొనసాగింది. సినిమాలకు స్వస్తిచెప్పి తనను పెళ్లి చేసుకోమని దిలీప్ చెప్పాడు. కానీ, ఆమె తన తండ్రికి క్షమాపణ చెప్పమని షరతు విధించింది. దిలీప్ “నో” చెప్పడంతో వారిద్దరి పెళ్లి జరగలేదు. సుదీర్ఘ కాలం నడిచిన ‘మొఘల్-ఏ-ఆజం’ షూటింగుకోసం ఇద్దరూ పనిచేయాల్సి రావడంతో ఎడముఖం పెడముఖంగానే వారు వ్యవహరించారు. షూటింగులో దిలీప్ మధుబాల చెంపమీద నిజంగా కొట్టడంతో మధుబాల ముఖం కందిపోయి షూటింగు వారం రోజులు ఆగిపోయింది కూడా! నర్గిస్ ఆమెకు మంచి మిత్రురాలు. భరత్ భూషణ్, ప్రదీప్ కుమార్ లలో యెవరో ఒకరిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది. కానీ మధుబాల ‘చల్తీకా నామ్ గాడీ’ సినిమా షూటింగు సమయంలో కిషోర్ కుమార్ తో ప్రేమలో పడి అతనినే వివాహం చేసుకుంది. కిషోర్ డబ్బు మనిషి. ఈ జబ్బు మనిషిని కేవలం డబ్బు కోసమే పెళ్ళాడాడు.
కలసిరాని కాలం
1957లో బి.ఆర్. చోప్రా దిలీప్ కుమార్ హీరోగా ‘నయా దౌర్’ సినిమా ప్రారంభించినప్పుడు నాయికగా మధుబాలను ఎంపిక చేసి 15 రోజులు షూటింగు కూడా జరిపారు. అవుట్ డోర్ షూటింగు కోసం గ్వాలియర్ వెళ్ళవలసివచ్చింది. అవుట్ డోర్ షూటింగు విడిదిలో దిలీప్ మధుబాలతో ప్రేమాయణం కొనసాగించే అవకాశముంటుందని మధుబాల తండ్రి ఒప్పుకోలేదు. అందుకు కినుక వహించిన చోప్రా మధుబాలకు ఇచ్చిన ముప్పైవేల రూపాయల అడ్వాన్స్ రికవరీ కోసం కోర్టును ఆశ్రయించాడు. మధుబాల మాత్రం తండ్రినే సపోర్టు చేసింది. దిలీప్ కుమార్ కోర్టులో చోప్రాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాడు. మధుబాలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో ఆమె కీర్తి దెబ్బతింది. వైజయంతిమాలను హీరోయిన్ గా పెట్టి సినిమా పూర్తిచేసి విడుదలచేస్తే ‘నయాదౌర్’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదు సంవత్సరాలు సాగిన దిలీప్ కుమార్, మధుబాల ప్రేమాయణానికి ఈ కోర్టుకేసుతో తెరపడింది. 1950 ప్రాంతంలోనే మధుబాలకు గుండెసంబంధ వ్యాధి బయటపడింది. ఈ విషయాన్ని ఆమె యెక్కడా బయట పెట్టలేదు. అది ప్రాణాంతకమని తెలిసి కూడా రిస్కుతో కూడిన సన్నివేశాల్లో నటించింది. లండన్ లో ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆపరేషను చేస్తే చనిపోయే అవకాశాలు యెక్కువని, యేడాదికి మించి ఆమె బతకదని చెప్పడంతో మధుబాల కేవలం మందులమీదే నెట్టుకొచ్చింది. దిలీప్ కుమార్ మీద ప్రేమ చావక, చివరిక్షణాల్లో అతనిని చూడాలని కబురంపితే దిలీప్ రాలేదు. చివరకు ఆమె అంత్యక్రియలకు కూడా దిలీప్ హాజరు కాలేదు. ఆవిధంగా తన 36వ యేట మధుబాల అందమైన శరీరాన్ని వదలి పరలోకం చేరుకుంది. ఈ వీనస్ క్వీన్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించడమే ఇప్పుడు ఆమెకు మనం ఇవ్వగలిగిన నివాళి!
–ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)