గుంటూరులో మధునాపంతుల “శత జయంతి” సభ

చారిత్రక కావ్యాల చక్రవర్తి మధునాపంతుల సత్యనారాయణ – డా. రాధశ్రీ

చారిత్రక కావ్యాల చక్రవర్తి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి అని “పద్య మౌళి” ప్రముఖ పద్య కవితా ఉద్యమకారుడు డా. రాధశ్రీ (హైదరాబాదు) తెలియజేసారు. బుధవారం(4-03-20) ఉదయం గుంటూరు లో “అమరావతి సాహితీమిత్రులు”, “మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శత జయంతి సంఘం” సంయుక్త నిర్వహణలో జరిగిన “మధునాపంతుల శత జయంతి సభ”లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని “ఆంధ్ర కల్హణ”, “కళా ప్రపూర్ణ” మధునాపంతుల సాహిత్యంగురించి ప్రసంగించారు. శబ్ద, పద, సన్నివేశ చిత్రణలో మధునాపంతుల ప్రతిభ అద్భుతం అన్నారు. నన్నయ కవిత్వంలోని ప్రౌఢత్వం, తిక్కన కవిత్వంలోని నుడికారం సొంతం చేసుకొని రాసిన “ఆంధ్ర పురాణం” కావ్యంలో ఆంధ్రుల చరిత్రను అద్భుతంగా వ్రాశా రన్నారు. 19వ ఏటనే “ఆంధ్రి” పత్రికను స్థాపించి సాహిత్య సేవ చేశారన్నారు. “అమరావతి సాహితీమిత్రులు” సంస్థాపకులు డా. రావి రంగారావు అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ మధునాపంతుల పుస్తకాలను బ్లాగులలో, పేస్ బుక్ గ్రూపులలో కూడా నిక్షిప్తం చేయాలని శత జయంతి సంఘానికి సూచించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రాచార్యులు ప్రొ. టి. గౌరీ శంకర్ మాట్లాడుతూ మధునాపంతుల హాస్య ప్రియత్వాన్ని జనరంజకంగా విశ్లేషించారు. ప్రముఖ సాహితీవేత్త డా. రామడుగు వేంకటేశ్వర శర్మ మాట్లాడుతూ మధునాపంతుల ఖండ కావ్యాల విశిష్టతను, నవలలు, అనువాద గ్రంథాల విశిష్టతను సోదాహరణంగా వివరించారు. మరొక వక్త వై.వి. బాలాజీ తొలుత మధునాపంతుల జీవన విశేషాలు సభకు పరిచయం చేసారు. డా. రాధశ్రీని “అమరావతి సాహితీమిత్రులు” పక్షాన ఎస్వీయస్ లక్ష్మీనారాయణ, ప్రొ. టి. గౌరీశంకర్ ను డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు శాలువాలతో సత్కరించారు. “మధునాపంతుల శత జయంతి సంఘం” పక్షాన అతిథు లందరికీ సంఘం ఉపాధ్యక్షులు ప్రొ. టి. గౌరీ శంకర్ జ్ఞాపికలతో సత్కరించారు. సభలో పింగళి భాగ్యలక్ష్మి, డా. సూర్యదేవర రవికుమార్, ధనేకుల వెంకటేశ్వరరావు, చిటిప్రోలు వెంకటరత్నం, డా. నారాయణం శేషుబాబు, మైలవరపు లలితకుమారి, పిల్లుట్ల జయశ్రీ, ముప్పాళ్ళ ప్రసాదరావు, తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, కొణతం నాగేశ్వరరావు బండికల్లు జమదగ్ని, నందిపాటి శివరామకృష్ణయ్య మొదలైనవారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link