
మెజీషియన్, రచయిత, సంపాదకులు, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత చొక్కాపు వెంకటరమణ
100 నిముషాల్లో 100 కథలు : ‘పిల్లలే నా ప్రపంచం’ అని భావించే చొక్కాపు వెంకటరమణ పిల్లల కోసం వివిధ అంశాలపై 100 పుస్తకాలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ బాలల అకాడమీలో ‘బాల చంద్రిక’ పిల్లల పత్రికకు 18 ఏళ్లు సంపాదకులుగా పనిచేశారు. బాల సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా బాలలకు కధా రచన, గేయ రచన. కథలు చెప్పడంలో అనేక కార్య శాలలు నడిపారు. భారత దేశంలో తొలి సారిగా తెలుగులో కథలు చెప్పే పండుగ ‘కథాకేళి’ని ఏడు రోజుల పాటు నిర్వహించారు. 100 నిముషాల్లో 100 కథలు చెప్పి ప్రపంచ రికార్డు సృష్టించారు. ‘స్టోరీ పోటర్’, ‘కథాతపస్వి’ బిరుదులు పొందారు. ‘ఉపాధ్యాయులు తరగతి గదిలో పాఠాలను కథలలా చెప్పాలి’అనే అంశం మీద అనేక పాఠశాలల్లో కార్యశాలలు నడిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) జరిగిన ‘బాలోత్సవాలు’ – పిల్లల పండుగలలో ప్రధాన భూమికను పోషించారు.
పురస్కారాలు: బాల సాహిత్య రంగానికి చొక్కాపు వెంకటరమణ అందించిన సేవలకు గుర్తింపుగా 2015 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో గౌరవించింది. 2018 లో డా. రామినేని ఫౌండేషన్ భారత ఉప రాష్ట్రపతి గౌరవనీయులు ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా విశేష పురస్కారం ఇచ్చి సత్కరించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తీ పురస్కారంతోనూ, బాలసాహితీ పురస్కారంతోనూ ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా బాల సాహితీ వేత్తగాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘తెలుగు భాషా సేవ విశిష్ట పురస్కారం’తోను గౌరవించాయి.
అరుదైన రికార్డులు ఆయన సొంతం: చొక్కాపు ‘మేజిక్ ఫన్ స్కూల్’ స్థాపించి 5000 మంది బాలలకు ఇంద్రజాలంలో ఉచిత శిక్షణ ఇచ్చారు. తెలుగులో తొలి వ్యక్తిత్వ వికాస మాస పత్రిక ‘ఊయల’ నడిపారు. ఇంద్రజాలంలో దేశవిదేశాలలో 7000 పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ముగ్గురు జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ‘కవి సామ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ, డా. సి. నారాయణ రెడ్డి. డా. రావూరి భరద్వాజల డిక్టేషన్లు రాసే అవకాశం చొక్కాపు వెంకటరమణ కు దక్కింది.
ఇంపాక్ట్ (IMPACT) వ్యక్తిత్వ వికాస శిక్షణా సంస్థను 1995 లో స్థాపించి వేలాది మందికి వ్యక్తిత్వ వికాసంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. తానా- తెలుగు పరివ్యాప్తి బృందం 2022 లో అంతర్జాలం ద్వారా నిర్వహించిన ‘తెలుగు తేజం’ భాషా పటిమ పోటీల కోసం మూడు పాఠ్య ప్రణాళికా గ్రంథాలు రాసి, సంపాదకత్వ బాధ్యతలు వహించారు. పోటీల నిర్వహణకర్తగా వ్యవహరించారు.

చొక్కాపు వెంకటరమణ రాసిన రచనలు హిందీ, కన్నడ భాషలలో కి అనువాదం అయ్యాయి. గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు చొక్కాపు రచనలు కొన్ని పాఠ్యాంశాలుగా పెట్టాయి. 60 ఏళ్ల కళా, సాహితీ రంగాల సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వ తపాలా శాఖ, తెలంగాణ సర్కిల్ చొక్కాపు వెంకటరమణ 73 వ పుట్టిన రోజు 2022 ఏప్రిల్ 1న ప్రతిష్ఠాత్మకమైన ‘తపాలా చంద్రిక’ స్పెషల్ కవర్’ ను విడుదల చేసి గౌరవించింది.
నేటికి హైదరాబాద్ లో జరిగే అనేక కార్యక్రామాలలో ఉత్సాహంగా పాల్గొంటూ కళా, సాహితీ రాంగాలకు సేవ చేస్తున్నారు.
– కళాసాగర్ యల్లపు