సిద్ధార్థ ఆడిటోరియంలో కనువిందు చేసిన “మహాకాళి” కూచిపూడి నాట్యరూపకం
ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, విజయవాడ, ఆర్ట్ ఇండియా ఫౌండేషన్, హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో శుక్రవారం సెప్టెంబర్ 26, పి.బి. సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రదర్శితమైన “మహాకాళి” కూచిపూడి నాట్యరూపకం కనువిందు చేసింది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి ఏడవ అవతారంగా సర్వత్రా పూజలందుకుంటున్న కాళీమాతను ఈ నృత్యరూపకం మహాశక్తి స్వరూపిణిగా, అనంతమైన శక్తిరూపంగా ఆవిష్కరించింది. శుంభ, నిశుంభ రక్తబీజాది అసురులను అంతమొందించడానికి దేవి మహాకాళిగా అవతరించే ఘట్టాలను ఈ నృత్యరూపకం కళ్ళకు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించింది.

డాక్టర్ తడకమళ్ళ అనురాధ నృత్య దర్శకత్వం వహించగా సంగీతం, నట్టువాంగం, గాత్రం, వాద్య బృంద నిర్వహణ దండిభొట్ల శ్రీనివాస వేంకటశాస్త్రి నిర్వహించారు. అనూరాధ (జొన్నలగడ్డ) తడకమళ్ళ, కాత్యాయని కనక్, ధూళిపాళ్ళ అపర్ణ, పి.బి వైష్ణవి, అనూషా శ్రీనివాస్, ఒగ్గు ప్రవీణ్, బక్కి శీనయ్య, గౌతం తదితర నృత్యకళాకారులు పాల్గొన్నారు.
తొలుత సిద్ధార్థ కళాపీఠం అధ్యక్షులు పాలడుగు లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలిత ప్రసాద్, కార్యదర్శి బి.వి.యస్ ప్రకాశ్, ఆర్ట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ప్రముఖ నృత్యదర్శకురాలు ఆచార్య అనురాధ జె. తడకమళ్ళ జ్యోతిప్రకాశనం చేశారు.
ఆర్ట్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, నృత్యదర్శకురాలు ఆచార్య అనురాధ జె.తడకమళ్ళను సిద్ధార్థ కళాపీఠం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలితప్రసాద్, ఉపాధ్యక్షులు వెల్లంకి నాగభూషణరావు, కార్యదర్శి బి.వి.యస్ ప్రకాశ్ సత్కరించారు.
ప్రొఫెసర్ అనూరాధ జె. తడకమళ్ళ సంక్షిప్త పరిచయం
ప్రొఫెసర్ అనూరాధ ఒక కళాకారిణి, నృత్యదర్శకురాలు, విద్యావేత్త. వీరు పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం, శ్రీమతి శోభానాయుడు, శ్రీ వేదాంతం జగన్నాథ శర్మ, శ్రీ చింతా రాధాకృష్ణమూర్తి వంటి నాత్యకోవిదుల దగ్గర శిక్షణ పొందారు. ఐదు దశాబ్దాల నృత్య ప్రదర్శనలు మరియు మూడు దశాబ్దాల బోధన అనుభవం కలవారు. వీరు భారతీయ నృత్యరంగంలో పరిశోధనాత్మక దృష్టికోణంలో ప్రసిద్ధమైన విద్యావేత్తలలో ఒకరుగా నిలిచారు. వీరు ఖజురహోూ ఉత్సవం, సంగీత నాటక అకాడమి నిర్వహించు వివిధ నృత్యోత్సవాలు మరియు దేశంలోని వివిధ ప్రతిష్టాత్మకమైన వేదికలపై నృత్యప్రదర్శనలిచ్చారు. అలాగే చైనా, మారిషస్, అమెరికా వంటి దేశాలలో కూడా ప్రదర్శనలిచ్చారు. వీరి డాక్టరేట్ పరిశోధన గ్రంధం “ట్రెడిషన్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ కూచిపూడి డాన్స్” కూచిపూడి నృత్యంపై వ్రాసిన తొలి పీహెచ్గా పరిశోధన కావడం విశేషం. వీరి మార్గదర్శకత్వంలో పన్నెండు మందికి పైగా పిహెచ్ఎలు పూర్తి చేశారు. ఇరవైనాలుగేళ్ళ వయస్సులోనే వీరు హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నృత్యవిభాగంలో అధ్యాపకురాలిగా చేరి కూచిపూడి బోధనలో నూతనతను తీసుకువచ్చారు. ప్రస్తుతం అదే విశ్వవిద్యాలయంలో వీరు ప్రొఫెసర్గా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం అవార్డు, పద్మశ్రీ డా. శోభానాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారం, విశిష్ఠ పురస్కారం, ఆదిత్య విక్రం బిర్లా కళాకిరణ్ పురస్కారం మొదలయిన ఎన్నో పురస్కారాలను పొందారు.
పాల్గొను నృత్య కళాకారులు, సాంకేతిక నిపుణులు
అనూరాధ (జొన్నలగడ్డ) తడకమళ్ళ, కాత్యాయిని కనక్, అపర్ణ ధూళిపాళ్ళ, వైష్ణవి పి.బి., అనూషా శ్రీనివాస్, ఒగ్గు ప్రవీణ్, బక్కి శీనయ్య మరియు గౌతమ్.
భావన, పరిశోధన, నృత్య పరికల్పన అచార్య అనూరాధ (జొన్నలగడ్డ) తడకమళ్ళ, లైటింగ్ శ్రీ బసవరాజు సంగీతం, నట్టువాంగం, గాత్రం, వాద్య బృంద నిర్వహణ, రచన, జతికూర్పు – శ్రీ దండిభొట్ల శ్రీనివాస వేంకటశాస్త్రి.
-కళాసాగర్

