సుప్రసిద్ధ కవి డా౹౹ బోయి భీమన్న జయంతి

బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్ తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. సహజంగానే ఆయన వీటిని నిరసించారు. అంబేద్కర్ వ్రాసిన కులనిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేశారు.

భీమన్న 1911 సెప్టెంబరు 19 న తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు గ్రామంలో ఓ హరిజన కుటుంబంలో పుట్టారు. నాగమ్మ, పుల్లయ్య వీరి తల్లిదండ్రులు.

ఈయన దాదాపుగా 70 పుస్తకాలు రాశారు. పద్య, గేయ, వచన రచనలతో పాటు, నాటకాలను కూడా వ్రాశారు. వివిధ పుస్తకాలకు వ్రాసుకున్న పీఠికల్లో పరిశోధనాత్మక దృష్టి కనిపిస్తుంది. వాటిలో కొన్నేవో కొత్తప్రతిపాదనల్ని, కొత్త సిద్ధాంతాల్నీ చెప్తున్నట్లుంటుంది.

ఆకాశవాణిలో ప్రసారం కోసం అనేక భావగీతాల్ని వ్రాశారు. వీటన్నింటితో పాటు అంబేడ్కర్‌ వ్రాసిన కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించడంతో పాటు, ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ రాశారు. వీరు వ్రాసిన ‘జయ జయ జయ అంబేడ్కర!’ దళితులకు జాతీయగేయమై నేటికీ ఊరూరా ప్రార్థనా గీతంగా మార్మోగుతోంది.

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు డా. బోయి భీమన్న పేరుతో ఒక సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేసి, వీరి రచనలన్నింటినీ ప్రచురిస్తున్నారు.

ఇప్పటికే అనేకమంది భీమన్న రచనలపై పరిశోధనలు చేశారు. రాష్ర్టవ్యాప్తంగా జాతీయ సదస్సులు జరుగు తున్నాయి. వీటన్నింటికీ ఒక మార్గదర్శనాన్ని కల్గించిన గ్రంథం ఒకటి ఉంది. అది హైమావతి చక్కని కథనాత్మక శైలిలో వ్రాసిన “పాలేరు నుండి పద్మశ్రీ వరకు బోయిభీమన్న” గ్రంథం. ఇది వీరి సాహిత్య దృక్పథాన్ని తెలిపే చుక్కానిలాంటిది. దానిలోని సూచనల్ని గమనిస్తే, ఆయన వ్రాసిన రచనల్లో పరిశోధకులకు, విమర్శకులకు తమదైన విశ్లేషణకు ప్రేరణ దొరుకుతుంది.

భారతదేశంలోని ‘భిన్నత్వంలోని ఏకత్వం’ లాగే, భీమన్న రచనల్లోనూ ఆ లక్షణం కనిపిస్తుందనీ,
ఆయన కుల, మతాల కంటే మానవత్వాన్నే ఆశించిన జాతీయవాది అనీ ఆ గ్రంథం ప్రతిపాదిస్తుంది. భారత జాతీయదృక్పథంలో అంతర్భాగంగా ప్రవహించే హిందూమతంలో కులాన్ని ప్రత్యేకంగా విశ్లేషించు కోవాలి. అంబేడ్కర్‌ విశ్లేషించిందీ, భీమన్న వ్రాసిందీ అదే! తన జీవితాంతం ఆయన జాతీయవాదిగానే ఉన్నాడు. జాతీయతలో తాను పుట్టి పెరిగిన దేశీయ వాస్తవికతకు అనుగుణంగా ఉంటూనే, ఆత్మగౌరవంతో జీవించాలనే ఆకాంక్ష ఉంటుంది.

కులనిర్మూలనను బలంగా వ్యతిరేకించిన నాటకం “పాలేరు”. 1988 నాటికి పాలేరు నాటకానికి ఏభై యేళ్ళైందని రచయితే చెప్పుకున్నాడు. అంటే, ఆ నాటకం 1938లో వ్రాసినట్లు స్పష్టమవుతుంది.

‘గుడిసెలు కాలిపోతున్నై’ (1973) కావ్యంలో ఏడాది కోసారి దళితుల గుడిసెలెందుకు కాలిపోతున్నాయో, మరలా కొత్తగుడిసెలు మాత్రమే ఎందుకు వస్తున్నాయో ఓట్లకోసం వచ్చేవారిని నిలదీసే చైతన్యం దళితుల్లో కలగాలనే ఆశయం కనిపిస్తుంది.

“కూలిరాజు”(1946) నాటకంలో కులంతో పాటు ఆర్థికాంశాల్ని కూడా స్పర్శించారు.‘ధర్మం కోసం పోరాటం’లో బహుజనులంతా రాజ్యాధికారదిశగా పయనించడానికి సూచనలు చేశారు.

తన అవిశ్రాంత సాహితీ సేవ‌లకు గుర్తింపుగా ఆయన ఎన్నో పురస్కారాలు, మరెన్నో గౌరవ సత్కారాలు, ఇంకన్నో అవార్డులు అందుకొన్నారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్ వారిచేత కళా ప్రపూర్ణ-1971పద్మశ్రీ పురస్కారం – 1973, కాశీవిద్యాపీఠం గౌరవ డాక్టరేట్ – 1976, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 1991లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యరంగంలో విశిష్ట పురస్కారం ప్రముఖంగా పేర్కొనదగినవి. వీటన్నింటినిమించి తలమానికంగా 2001 లో భారత ప్రభుత్వం వారిచే “పద్మభూషణ్” అవార్డును కూడా అందుకొన్నారు.

సామాజిక చైతన్యంమే లక్ష్యంగా-ధ్యేయంగా రచనలు చేసిన బోయి భీమన్న గారు 2005 డిసెంబరు 16న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap