భాషకు అందని మహానటి… సావిత్రి

(సావిత్రి జయంతి సందర్భంగా షణ్ముఖాచారి గారి వ్యాసం)

సినీ వినీలాశంలో వెలిసిన ఓ ధృవతార మహానటి సావిత్రి. నిండైన నటనకు ఆమె మారుపేరు. ఆమె నవ్వుమల్లెల జల్లు. ఆమె నడకే ఒక నాట్యం. ఆమె హావభావాల వెనుక సప్తస్వరాలు గోచరిస్తాయి. నటిగా సావిత్రి సాధించలేనిది ఏదీ మిగలలేదు. ఒక వ్యక్తిగా ఆమె సాధించి మిగుల్చుకున్నది కూడా లేదు. ఆమె అందుకోలేని ఆస్తులే లేవు. కానీ వాటిని పదిలపరచుకోలేని అశక్తురాలు. తరగని దరహాసం ఆమెకు దేవుడిచ్చిన వరం. ప్రేక్షకజనం ఆమెను మహానటిగా గుర్తించి మంగళహారతులు పట్టారు. కానీ ఆమెకు దగ్గరి బంధువులమని, స్నేహితులమని చెప్పుకునే వాళ్ళు మాత్రం ఆమె ఆస్తులమీద కన్నువేశారు. కబళించుకున్నారు. ఆమెను నైరాశ్యంలోకి నెట్టివేశారు. నిజజీవితంలో నటన అంటే తెలియని అమాయకురాలు సావిత్రి. పందొమ్మిది నెలలు కోమాలో వుండి చనిపోయిన సావిత్రిని చూసి దర్శకుడు దాసరి నారాయణరావు ‘ఏనాడో చచ్చిపోయిందా తల్లి. ఇప్పుడు సాగనంపుతున్నాం’ అంటూ రోదించారు. ‘బతికినంతకాలం చస్తూ బతికింది. ఇప్పుడిక నిజంగా బతుకుతుంది’ అని నిట్టూర్చారు ఆచార్య ఆత్రేయ. ఎలా బతకాలో చెప్పడానికీ, ఎలా మరణించకూడదో తెలియజేయడానికీ సావిత్రి జీవితం ఒక నిదర్శనం. ఒక ఆదర్శవంతమైన నటిగా, దర్శకురాలిగా అభిమానులచేత మహానటిగా కీర్తింపబడిన సావిత్రి జయంతి సందర్భంగా ఆమె వెలుగు నీడలు తెలుసుకుందాం…

నృత్య కళాకారిణిగా…

సావిత్రి పుట్టింది 1937 డిసెంబర్ 6 న గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో. ఆమె తల్లిదండ్రులు నిశ్శంకర సుభద్రమ్మ, గురవయ్య. వారు సావిత్రికి పెట్టిన అసలుపేరు ‘సరసవాణిదేవి’. ఆమెకు మారుతి అనే అక్క వుంది. సావిత్రి పుట్టిన ఆరు నెలలకే తండ్రి టైఫాయిడ్ వ్యాధితో మరణించాడు. అప్పుడు వరసకు పెదనాన అయిన కొమ్మారెడ్డి వెంకటరామయ్య, పెదతల్లి దుర్గాంబ ఆమెను, ఆమె అక్క మారుతిని చేరదీసి పెంచారు. సావిత్రి విజయవాడ కస్తూరిబాయి మెమోరియల్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు చదివింది. పరికిస్తే ఆమెకు అక్షరాభ్యాసంతోటే నృత్యం మీద ప్రవేశం కలిగిందేమో అనిపిస్తుంది. ఆరవయేటనుంచే ఆమె పాఠశాలకు వెళుతూనే నృత్యం నేర్చుకోవడం ఆరంభించింది. ఆరోజుల్లో శిష్ట్లా పూర్ణయ్యశాస్త్రి హరికథలు చెప్పటంలోను, కూచిపూడి సంప్రదాయ నృత్యం చేయటంలోను నిష్ణాతుడు. కొంతమంది పిల్లల్ని ఆయన చేరదీసి, వారికి నృత్యం నేర్పి ప్రదర్శనలు ఇస్తుండేవారు. మొదట్లో ఆయన సావిత్రిని డ్యాన్సుకు పనికిరాదని తేల్చారు. అప్పుడు సావిత్రి పూర్ణయ్యశాస్త్రి కుమారుడు కృష్ణమూర్తిశాస్త్రి వద్దకు వెళ్ళింది. ఆయన కొత్తగా డ్యాన్సు స్కూలు పెట్టారు. అందులో ఎక్కువమంది విద్యార్థులు చేరలేదు. అప్పుడు సావిత్రికి ఉచితంగా ప్రవేశందొరికింది. అక్కడ పులిపాక నరసింహారావు వద్ద సావిత్రి శిష్యరికం చేసింది. కొన్నాళ్ళకు పూర్ణయ్యశాస్త్రి ఆ స్కూలుకు వచ్చినప్పుడు సావిత్రి చేస్తున్న నాట్యభంగిమలను పరిశీలించే అవకాశం దొరికింది. సావిత్రి నాట్యపటిమకు ఆయన ముగ్దుడైపోయి తన శిష్యురాలిగా చేర్చుకొని నాట్యంలోని మెలకువలు నేర్పారు. ‘రాధాకృష్ణ’ నృత్యనాటికను ఆయనే స్వయంగా రాసి ప్రదర్శనలు ఇచ్చినప్పుడు అందులో సావిత్రి చేత కృష్ణుడి పాత్రను పోషింపజేశారు. అలా వీరి తొలిప్రదర్శన విజయవాడ లోని రామమోహన్ గ్రంధాలయంలో మొదలై, వరసగా రాజమండ్రి, కొత్తగూడెం, పాలకొల్లు వంటి పట్టణాల్లోకి విస్తరించింది. ప్రదర్శనలు జరిగిన ప్రతిచోటా సావిత్రికి ప్రశంసలు లభించేవి. నృత్యంతోబాటు సావిత్రి సంగీతం మీద కూడా దృష్టిపెట్టింది. వీణ నేర్చుకుంది. పదేళ్ళ వయసులో అరుణోదయ నాట్యమండలిలో చేరి దాదాపు ఒక సంవత్సరంపాటు నృత్యప్రదర్శనలలో పాల్గొంది. ఈ నాట్యమండలిలోనే నటులు ఎన్.టి.రామారావు, జగ్గయ్య, కె.వి.ఎస్.శర్మ కూడా నటిస్తుండేవారు. తరవాత కొంతకాలానికి సావిత్రి పెదనాన్న ‘నవభారత నాట్యమండలి’ అనే సంస్థను స్థాపించారు. నృత్య దర్శకుడుగా కోట సుబ్రహ్మణ్యశాస్త్రి వ్యవహరిస్తూ ఆయనే ఈ సమాజానికి ఒక సంగీత ఆర్కెస్ట్రా బృందాన్ని సమకూర్చారు. ఈ సంస్థ ద్వారా సావిత్రి అనేకచోట్ల ప్రదర్శనలు విజయవంతంగా ప్రదర్శించింది. 1950లో కాకినాడ పట్టణంలో నాట్యకళాపరిషత్తు ఉత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ప్రఖ్యాత హిందీ నటులు, పృథ్వి థియేటర్స్ నాటక సమాజ అధిపతి పృద్విరాజ్ కపూర్ బొంబాయి నగరం నుండి విచ్చేశారు. ఆ ప్రదర్శనల్లో అట్లూరి పుండరీకాక్షయ్య నిర్వహణలో నేషనల్ ఆర్ట్ థియేటర్ తరఫున బుచ్చిబాబు నాటకం ‘ఆత్మవంచన’ ప్రదర్శించారు. అందులో సావిత్రి ఒక బెంగాలీ బాలిక పాత్ర పోషించి, నాట్యంచేస్తూ సభికులను ఆకట్టుకుంది. అప్పుడు సావిత్రి వయసు పదమూడేళ్ళు. ఉత్సవాల చివరిరోజున మరలా సావిత్రి చేత నిర్వాహకులు ప్రత్యేక నృత్యప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ చిన్నారి సావిత్రి నటనకు, నాట్యానికి పృద్విరాజ్ కపూర్ ముగ్దుడైపోయి రెండు బహుమతులను అందజేశారు. ఆమె అందెల కదలికలు, ముఖారవిందం పృద్విరాజ్ కపూర్ నే కాదు ఆ వేడుకలలో పాల్గొన్న సభికులను కూడా అబ్బురపరచాయి.

హంసపాదుతో సినిమా అవకాశం…

కాకినాడ పరిషత్ నాటకాలు ముగిసిన నెలరోజులలోపే గోకులకృష్ణా డిస్ట్రిబ్యూషన్ సంస్థకు చెందిన సి.వి.కృష్ణమూర్తి విజయవాడలో సావిత్రిని కలిసి రంగనాథదాసు, కె.సి.కృష్ణ నిర్మించబోయే ‘సంసారం’(1950) చిత్రంలో రెండవ హీరోయిన్ గా నటించేందుకు ప్రతిపాదించారు. యోగానంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, నాగేశ్వరరావు, రేలంగి, లక్ష్మీరాజ్యం, సూర్యకాంతం, పుష్పలత, బాలసరస్వతి ముఖ్య తారాగణం. సినిమాలో నటించేందుకు సావిత్రి మద్రాసు చేరుకొని అగ్రిమెంటు మీద సంతకాలు చేసింది. మే నెలలో షూటింగు మొదలై సావిత్రి ధరించే ‘కమల’ పాత్ర మీద తొలి షెడ్యూలు పక్షం రోజులు జరిగింది. రెండవ షెడ్యూలు ఒకరోజు జరిగాక సావిత్రి సరిగ్గా నటించలేకపోతోందని, భయపడుతోందని నిర్మాతలు నిర్ధారించి ఆమెను తొలగించి ఆ పాత్రను పుష్పవల్లికి బదలాయించారు. సావిత్రి నిరాశకు లోనయింది. నిర్మాతలు ఆమెను అనునయించి కారులో తిరిగే అమ్మాయిలలో ఒకర్తె గా నటింపజేశారు. సావిత్రి అందులో నాగేశ్వరరావును చూసి ‘నువ్వు హీరో నాగేశ్వరరావులా ఉన్నావే’ అంటుంది. అదొక్కటే సావిత్రి డైలాగు. సావిత్రి బెరుకు తనానికి కారణముంది. ‘సంసారం’ చిత్రంలో కమల పాత్ర ధనం, దర్పంగల పెద్దహోదా వున్న పాత్ర. ఆమెకు జోడీ నాగేశ్వరరావుది పల్లెటూరి బైతు పాత్ర. అతడు కమలను చూసి వెనక్కు తగ్గుతూ ఉంటే, కమల మాత్రం అతని మీదమీదకు వస్తూ వుంటుంది. అందుచేత సావిత్రి నాగేశ్వరరావుతో నటించటానికి కాస్త జంకింది. అయితే దీనికి ముందు నిర్మాత కోవెలమూడి భాస్కరరావు సారథి ఫిలిమ్స్ బ్యానర్ మీద మాణిక్యం దర్శకత్వంలో ‘అగ్నిపరీక్ష’ (1951) చిత్రాన్ని నిర్మిస్తూ అందులో ‘కళావతి’ అనే వేశ్యపాత్రను సావిత్రి చేత వేయిద్దామని మేకప్ టెస్ట్ చేశారు. సావిత్రి వయసు అప్పుడు కేవలం పదమూడేళ్ళు కావడంతో యెంత మేకప్ చేసినా ఆమెను ఇరవయ్యేళ్ళ వయసుగల వనితగా చూపలేక పోయారు. దాంతో సావిత్రికి దక్కాల్సిన ఆ పాత్రను ‘లక్ష్మీకాంత’ పోషించింది.

విజయా సంస్థలో తొలి అడుగులు…

విజయా వారు అప్పుడు కె.వి.రెడ్డి దర్శకత్వంలో ‘పాతాళభైరవి’ (1951) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందులోని ఒక మాయామహల్ సెట్టింగ్ లో చిన్నపాటి నృత్య సన్నివేశం వుంది. కె.వి. రెడ్డి అంతకుముందే సావిత్రి నృత్యప్రదర్శన చూసి వున్నారు. సావిత్రికి కబురు వెళ్ళింది. పసుమర్తి కృష్ణమూర్తి ఆ సినిమాకు నృత్య దర్శకుడు. ఆ సినిమాలోని ఒక్కో పాటకు దాదాపు పదిహేను రోజులపాటు పసుమర్తి ఆయా కాళాకారులతో రిహార్సల్స్ చేయించేవారు. అందుకోసం కళాదర్శకుడు గోఖలే స్కెచ్ వేసి చూపించేవారు. అందువలన చిత్రీకరణ సమయంలో ఎక్కువ టేకులు లేకుండా నిర్మాణం జరిగేది. సావిత్రి చేత ఒక పల్లెటూరిపిల్లగా ‘రమ్మంటే రానే రాను…నేను రమ్మంటే రానేరాను’ అనే పాటకు నాట్యం చేయించారు. సావిత్రితో కలిసి ఆ పాటలో పసుమర్తి కూడా నర్తించారు. అలా వాహినీ స్టూడియోలో సావిత్రి అడుగుపెట్టడం జరిగింది. తన నటజీవితంలో పెద్ద పరివర్తనకు అక్కడే పునాది పడిందని సావిత్రి యెన్నోసార్లు చెప్పుకుంది. ‘పాతాళభైరవి’ బాక్సాఫీస్ హిట్ కావడంతో విజయా వారు మూడవ ప్రయత్నంగా ‘పెళ్ళిచేసిచూడు’ (1952) అనే సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. సావిత్రికి వున్న కళానైపుణ్యాన్ని నిశితంగా గమనించిన నిర్మాత చక్రపాణి ఇందులో రెండవ హీరోయిన్ గా నటించే అవకాశం కల్పించారు. ఆ సినిమాలో సావిత్రికి జోడు హాస్యనటుడు జోగారావు. అందులో ఊర్వశి, అర్జునుడు, బాలమన్మధుడు లతో ఒక అంతర్నాటకం వుంది. ఆ నాటకంలో ‘యుగయుగాలుగా జగజగాలను వూగించిన…వుర్రూగించిన మీ ఊర్వశిని’ అనే పాటలో సావిత్రి ఊర్వశిగా నృత్యం చేసి మెప్పించింది. తనకు జోడీ జోగారావు కనుక బెరుకుతనం లేకుండా స్వేచ్చగా నటించి, తన పాత్రకు న్యాయం చేకూర్చింది. విజయా వారి చిత్రంలో నటిస్తుండగానే సావిత్రికి నాలుగు ఆఫర్లు వచ్చాయి. వినోదా వారు వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘శాంతి’ (1952) సినిమా ప్రారంభిస్తూ సావిత్రిని హీరోయిన్ పాత్రకు ఎంపిక చేశారు. రామచంద్ర కశ్యప సరసన సావిత్రి నటించింది. దోనేపూడి కృష్ణమూర్తి త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో నిర్మించిన ‘ప్రియురాలు’ (1952) చిత్రంలో రెండవ హీరోయిన్ ‘సరోజ’ గా చంద్రశేఖర్ సరసన నటించింది. ఈ రెండు సినిమాలు ‘పెళ్ళిచేసిచూడు’ చిత్రం కన్నా వారం రోజులు ముందే విడుదలయ్యాయి. శుభోదయా పిక్చర్స్ బ్యానర్ మీద నారపరాజు లక్ష్మీనరసింహరావు హెచ్.వి. బాబు దర్శకత్వంలో ‘ఆదర్శం’ (1952) చిత్రాన్ని నిర్మించారు. అందులో జగ్గయ్య హీరోగా సావిత్రి హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 25 న విడుదలైంది. ఈ మూడు సినిమాలకన్నా ముందే (అంటే 11-07-1951) సావిత్రి స్వాతి బ్యానర్ మీద కె. ప్రభాకర్ దర్శకత్వం వహించిన ‘రూపవతి’ సినిమాలో ‘కోకిల’ అనే చిన్న పాత్రను పోషించింది. విజయా వారు ‘పెళ్ళిచేసిచూడు’ చిత్రం తరవాత నిర్మించిన ‘చంద్రహారం’ (1954) చిత్రంలో సావిత్రి హీరోను వరించి తీసుకొనివెళ్ళే వ్యాంప్ లక్షణాలుగల దేవకన్య వేషం వేసింది. ఆ మరుసటి సంవత్సరమే సావిత్రి దశ తిరిగింది. చక్రపాణి గతంలో రవీంద్రనాథ్ మిత్రా రచించిన హాస్య నవల ‘మన్మయీ గరల్స్ స్కూల్’ ను, శరబిందు బెనర్జీ రచించిన ‘డిటెక్టివ్’ నవలను వరసగా ‘ఉదరనిమిత్తం’, ‘డిటెక్టివ్’ పేర్లతో తెలుగులోకి అనువదించారు. ఈ రెండు నవలల నేపథ్యం తీసుకొని ‘మిస్సమ్మ’(1955) అనే ఆణిముత్యం లాంటి సినిమా కథకు రూపమిచ్చారు. ఎన్టిఆర్, అక్కినేని వంటి ఇద్దరు టాప్ హీరోలు నటిస్తుండగా హీరోయిన్ ‘మిస్సమ్మ’ పేరుతో సినిమా నిర్మించడం చక్రపాణి సూక్ష్మదృష్టికి నిదర్శనం. భానుమతిని దృష్టిలో వుంచుకొనే చక్రపాణి మిస్సమ్మ పాత్రను రూపొందించారు. ఆ పాత్రకోసం చక్రపాణి ఆత్మాభిమానం, పెంకితనం, తలబిరుసు తనంతో కూడిన సంభాషణలు రచించారు. దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ భానుమతితో నాలుగు రీళ్ల సినిమా కూడా షూట్ చేశారు. ఒకరోజు వరలక్ష్మి వ్రతం కోసమని ఉదయం షెడ్యూలుకు హాజరు కాలేనని, మద్యాహ్నం వచ్చి షూటింగ్ పూర్తిచేస్తానని భానుమతి నిర్మాతలను, దర్శకుని ఉద్దేశిస్తూ వుత్తరం పంపింది. ఆ ఉత్తరాన్ని అటెండరు చక్రపాణి టేబులుమీద పెట్టాడు. దురదృష్ట వశాత్తు ఆ వుత్తరం చక్రపాణి దృష్టికి రాలేదు. వ్రతం ముగించుకుని యధాలాపంగా షూటింగుకు వచ్చిన భానుమతిని క్రమశిక్షణకు అగ్రతాంబూలమిచ్చే చక్రపాణి మందలించారు. తన తప్పేమీలేదని, అంచేత క్షమాపణ కూడా చెప్పనని భానుమతి భీష్మించుకుంది. చక్కన్న కోపం తారాస్థాయికి చేరి, అంతవరకూ తీసిన నాలుగు రీళ్ల నెగటివ్ ను తెప్పించి ఆమె ఎదుటే కాల్చిపారేశారు. ఆమెకు రావాల్సిన పారితోషికాన్ని సెటిల్ చేసి పంపేశారు. అలా మిస్సమ్మ సినిమాను భానుమతి మిస్సయింది. తొలుత మేరీ పాత్రకు భానుమతిని, జమున పోషించిన సీత పాత్రకు సావిత్రిని ఎంపిక చేశారు. భానుమతి ‘మిస్’ అవడంతో అదృష్టం కొద్దీ ఆ పాత్ర సావిత్రిని వరించింది. ‘పాతాళభైరవి’ లాగే ‘మిస్సమ్మ’ చిత్రం అఖండ విజయాన్నిసాధించి పదమూడు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. ఈచిత్రంతోనే సావిత్రి స్టార్ హీరోయిన్ స్థానానికి చేరుకుంది. సినిమా చూస్తుంటే సావిత్రి కోసమే ఈ చిత్రాన్ని నిర్మించారా అనిపించకమానదు. అప్పటివరకు వేషాలకోసం అలమటించిన సావిత్రి వెంట సినీ పరిశ్రమ వెంటపడేలా చేసిందీ సినిమా. తరవాత 1957లో ‘మాయాబజార్’ సినిమా విడుదలై సావిత్రినిని శిఖరాగ్రం మీద కూర్చోబెట్టింది. శశిరేఖ పాత్రలో సావిత్రి జీవించి నటించింది. అంతకు ముందు అన్నపూర్ణా సంస్థ తొలిచిత్రం ‘దొంగరాముడు’ (1955) చిత్రంలో సావిత్రికి హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో భానుమతి కథానాయికగా వుండాలన్నది దుక్కిపాటి అభిప్రాయం కాగా, ఆ పాత్రకి అంతటి టాప్ స్టార్ అవసరం లేదని, ఒక వర్ధమాన నటి చాలని దర్శకుడు కె.వి.రెడ్డి సమాధానపరచి సావిత్రిని ఎంపిక చేశారు. ఆ పల్లెటూరి పాత్రలో సావిత్రి అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ తరవాత అన్నపూర్ణావారి సినిమాలకు సావిత్రి ఆస్థాన హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే.

with ANR

దేవదాసులో పార్వతిగా…

డి.ఎల్. నారాయణ భరణీ సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తున్నప్పుడు వేదాంతం రాఘవయ్య, సముద్రాల, సుబ్బురామన్ లతో మంచి స్నేహం కలిగి వుండేవారు. వారు కలిసి ‘వినోదా పిక్చర్స్’ అనే సినీనిర్మాణ సంస్థను ప్రారంభించి తొలుత ‘స్త్రీ సాహసం’ (1951) చిత్రాన్ని నిర్మించారు. తరవాత శరత్ నవల ‘దేవదాసు’ (1953) ను తెరకెక్కించాలని నిర్ణయించారు. అక్కినేని దేవదాసు పాత్రకు ఎంపిక కాగా, హీరోయిన్ పార్వతిగా భానుమతిని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ దొరకలేదు. దాంతో దర్శకుడు వేదాంతం రాఘవయ్య జానకిని పార్వతి పాత్రకోసం ఎంపికచేశారు. ఒకవారంపాటు షూటింగ్ కూడా జరిపారు. అయితే ఆమె వ్యక్తిగత కార్యదర్శి కొమ్మూరి సాంబశివరావు నిర్మాత డిఎల్. నారాయణతో జానకి కాల్షీట్ల విషయంలో వ్యవహరించిన తీరు ఆయనకు ఆగ్రహం తెప్పించింది. దానితో జానకిని ఈ చిత్రం నుంచి తప్పించారు. సంగీత దర్శకుడు సుబ్బురామన్ అకాల మరణంతో సినిమా నిర్మాణం కాస్త వెనుకపడడంతో, ఆ గ్యాప్ లో ‘శాంతి’ అనే చిన్న బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రంలో చిన్న పాత్ర పోషించిన సావిత్రిని ‘దేవదాసు’ చిత్రంలో జానకి స్థానంలో హీరోయిన్ గా ఎంపికచేశారు. ఆ పాత్రకు సావిత్రిని ఎంపిక చేయడంపై చాలా విమర్శలు వచ్చాయి. అలాగే దర్శకుడు వేదాంతం రాఘవయ్య మీద, హీరో నాగేశ్వరరావు మీదకూడా విమర్శలు రావడంతో డి.ఎల్. నారాయణ వెరవలేదు. అక్కినేని కూడా ఆ పాత్రను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. తొలుత అల్లరి పిల్లగా, తరవాత భగ్న ప్రేమికురాలిగా, ఆ తరవాత ఒక వృద్ధ జమీందారుకు పరిణితి చెందిన గృహిణిగా. ఆ జమీందారు ఇంటిని సరిదిద్దిన దేవతగా సావిత్రి నటన ఎల్లలు దాటింది. నేటికీ దేవదాసు విషయం చర్చకువస్తే పార్వతి పాత్ర గురించి గుర్తుచేసుకోకుండా వుండలేం.

దుక్కిపాటికి సినీ అన్నపూర్ణ …

1953లో దుక్కిపాటి మధుసూదనరావు అక్కినేని నాగేశ్వరరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టి.వి.ఎ. సూర్యారావు భాగస్వాములుగా తన సవతి తల్లి పేరిట ‘అన్నపూర్ణా పిక్చర్స్’ సంస్థను నెలకొల్పారు. కె.వి.రెడ్డి దర్శకత్వం లో తొలిప్రయత్నంగా అన్నా చెల్లెళ్ళ సెంటిమెంటుతో ‘దొంగరాముడు’ (1955) అనే కుటుంబ కథాచిత్రాన్ని నిర్మించారు. అందులో కూరగాయలు అమ్ముకొనే సీతగా సావిత్రి అద్భుత నటన ప్రదర్శించింది. తరవాత అన్నపూర్ణా వారు ‘తోడికోడళ్ళు’ (తమిళంలో ఎంగవీట్టు మహాలక్ష్మి), ’మాంగల్యబలం’ (తమిళంలో మంజల్ మహిమై), ‘వెలుగునీడలు’ (తమిళంలో తూయ్ ఉళ్ళం), ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి సినిమాలను ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించి విజయం సాధించడంతో ఆదుర్తి, సావిత్రి అన్నపూర్ణా సంస్థకు ఆస్థాన కళాకారులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆదుర్తి వరసగా తొమ్మిది అన్నపూర్ణావారి చిత్రాలకు దర్శకత్వం వహించి వాటిని హిట్ చేశారు. ఈ విజయాలతోటే బాబూ మూవీస్ సంస్థ నిర్మించిన ‘మంచిమనసులు’, ‘మూగమనసులు’ వంటి సందేశాత్మక చిత్రాల్లో సావిత్రి నటించి తన సత్తా చాటింది.

with ANR

అలరించిన మరికొన్ని సినిమాలు…

సావిత్రి నూట యాభైకి పైగా తెలుగు చిత్రాల్లోనూ, వందకు పైగా తమిళ చిత్రాల్లోనూ నటించింది. కొన్నికన్నడ (6), హిందీ (5), మలయాళం (3) చిత్రాలు కూడా ఆ జాబితాలో వున్నాయి. మొత్తం ముప్పై ఏళ్ళ సినిమా నటజీవితంలో సావిత్రి రెండువందల యాభై చిత్రాలకు పైగా నటించింది. వాటిలో తెలుగు సినిమాలుగా చెప్పుకోతగినవి బ్రతుకుతెరువు, సంతానం, అర్థాంగి, కన్యాశుల్కం, భలేరాముడు, చరణదాసి, అప్పుచేసి పప్పుకూడు, చివరకు మిగేలేది, కుంకుమరేఖ, నమ్మినబంటు, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం, మాబాబు, దీపావళి, కలసివుంటే కలదు సుఖం, ఆరాధన, రక్తసంబంధం, ఆత్మబంధువు, నర్తనశాల, నవరాత్రి, మనుషులు మమతలు, పూజాఫలము, సుమంగళి, నాదీ ఆడజన్మే, పాండవ వనవాసము, దేవత, మనసే మందిరం, ఉమ్మడి కుటుంబం, కంచుకోట, బాంధవ్యాలు, కోడలు దిద్దిన కాపురం మచ్చుకి కొన్ని మాత్రమే. ముఖ్యంగా సుమంగళి, చివరకు మిగిలేది, నర్తనశాల వంటి చిత్రాల్లో సావిత్రి నటన అపూర్వం. సావిత్రికి తెలుగులో యెంత పేరుందో తమిళంలో అంతటి పేరుంది. నటిగా మహోన్నత స్థాయికి చేరాక సావిత్రి దర్శకత్వం చేపట్టింది. ఆమె దర్శకత్వంలో ‘చిన్నారిపాపలు’, ‘మాతృదేవత’, ‘చిరంజీవి’, ‘వింతసంసారం’, ‘ప్రాప్తం’(తమిళ మూగ మనసులు), ‘కులందైవుళ్ళం’ (తమిళంలో చిన్నారిపాపలు) సినిమాలకు దర్శకత్వం వహించింది. అయితే ‘మాతృదేవత’ చిత్రం మాత్రమే వాటిలో శతదినోత్సవం చేసుకోగలిగింది. ‘ప్రాప్తం’ తమిళ సినిమాతో సావిత్రి పతన దశ ప్రారంభమైంది. ఆమె ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించడంతోబాటు, నిర్మాణ సారధ్యం కూడా వహించింది. ఆ చిత్ర నిర్మాణానికి ఐదేళ్ళు పట్టింది. నిర్మాణ వ్యయం పెరగడం, పెట్టుబడి మీద వడ్డీలు మోపెడంత కావడం, ఆదాయపన్ను శాఖల దాడులు ఆమెను మానసికంగా క్రుంగదీశాయి. తనవాళ్ళు అని సావిత్రి నమ్ముకున్నవారంతా ఆమెను మోసం చేశారు. క్రమంగా ఆమెకు హీరోయిన్ చాన్సులు తగ్గసాగాయి. దాంతో జెమిని గణేశన్ మెల్లిగా ఆమె జీవితం నుంచి తప్పుకోసాగాడు. ఆదుకోవడం మాట అటుంచి సావిత్రిని విడిచి వెళ్ళాడు. 1971 తరవాత ఆమె తల్లి పాత్రలు, చిన్న పాత్రలు ధరించాల్సి వచ్చింది. చిత్ర నిర్మాణంలో ఒత్తిడులవలన ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. సావిత్రి నటించిన చిట్టచివరి చిత్రం ‘రామాయణంలో పిడకల వేట’ (1981).

జెమిని తో వివాహం…కష్టాలు…కడగళ్ళు…

జెమిని గణేశన్ తో సావిత్రి ‘మిస్సియమ్మ’, ‘యార్ పయ్యా’, ‘మాయాబజార్’, ‘పావమనిప్పు’, ‘పాత కాణిక్కాయ్’ వంటి 44 సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అతణ్ణి ప్రేమించింది. ఫలితంగా వ్యక్తిగత జీవితంలో ఓడిపోయింది. అప్పటికే జెమిని గణేశన్ వివాహితుడు. అతనికి బాబ్జీ (అలిమేలు) స్వంత భార్య కాగా, పుష్పవల్లి (బాలీవుడ్ నటి రేఖ తల్లి) అనధికార భార్య. ఎందుకో జెమిని గణేశన్ ను సావిత్రి గుడ్డిగా, వెర్రిగా ప్రేమించింది. ఒక స్త్రీ పురుషుణ్ణి ఎంతగా ఆరాధించ గలదో అంతగా జెమిని గణేశన్ ని సావిత్రి ఆరాధించింది. ఎందఱో శ్రేయోభిలాషులు వారిస్తున్నా పిచ్చిగా అతణ్ణి రహస్యంగా పెళ్లిచేసుకుంది. లక్స్ సౌందర్య సబ్బు ప్రచార పత్రంలో యధాలాపంగా సావిత్రి గణేశన్ అని సంతకం చెయ్యడంతో అందరికీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిసింది. వారికి విజయ చాముండేశ్వరి, సతీష్ పుట్టారు. జెమిని గణేశన్ ను వివాహమాడాకే సావిత్రికి బాధలు ప్రారంభమయ్యాయి. జెమినీ గనేశన్ తోబాటు బంధువర్గం కూడా ఆమెకు దూరంకావడంతో ఆ బాధలను మర్చిపోవడానికి సావిత్రి మద్యానికి, మత్తు ఇంజెక్షన్లకు, నిద్ర మాత్రలకు బానిసయింది. మద్రాసు, కొడైకెనాల్ వంటి ఖరీదైన ప్రదేశాలలో పెద్దపెద్ద మేడలు, మిద్దెలు త్యజించి, చివరకు ఒక చిన్న డాబా ఇంటిలో అద్దెకు వుండాల్సివచ్చింది. దర్శక నిర్మాత దాసరి నారాయణరావు సావిత్రికి ఆర్ధిక సహకారం అందిస్తూ అండగా నిలిచారు. 1980 మే నెలలో ఒక కన్నడ సినిమా షూటింగు నిమిత్తం బెంగుళూరుకు వెళ్లి హోటల్ చాణక్య లో బసచేసింది. అక్కడ విపరీతంగా మద్యం సేవించి, స్పృహ కోల్పోయి కోమాలోకి జారుకుంది. ఆమెను బేరింగ్ ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్ హండీ ఆమెకు మెరుగైన వైద్యం అందించారు. అలా పందొమ్మిది నెలలు సావిత్రి కోమాలోనే వుంది. శరీరం చిక్కి శల్యమై ఎముకల గూడులా తయారయింది. 1980 మే నెల 27 న సావిత్రిని బెంగుళూరు నుండి మద్రాసుకు తీసుకొచ్చి వెల్లింగ్టన్ ఆసుపత్రిలో చేర్చారు. మద్రాసులో సంవత్సరం మీద పది రోజులు సావిత్రి కోమాలోనే వుంది. చివరకు డిసెంబర్ 26, 1981 న 45 ఏళ్ళకే ఆ మహానటి మహాభినిష్క్రమణ చేసింది.

సత్కారాలు, పురస్కారాలు….

1968లో విడుదలైన ‘చివరకు మిగిలేది’ చిత్రంలో నర్స్ పాత్రను అద్వితీయంగా పోషించినందుకు సావిత్రికి ఉత్తమ నటిగా రాష్ట్రపతి బహుమతి లభించింది. సావిత్రి నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ‘చిన్నారి పాపలు’ చిత్రానికి ఉత్తమ చిత్రంగా నంది బహుమతి లభించింది. ముప్పయ్యవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో సావిత్రికి ‘ఎ మూన్ అమాంగ్ స్టార్స్’ అనే బిరుదునిచ్చి సత్కరించారు. తమిళనాడు ప్రభుత్వం సావిత్రికి ‘నడిగరై తిలకం’ బిరుదు ప్రదానం చేసింది. 2011లో సావిత్రి స్మారక పోస్టల్ స్టాంపును భారత తపాలా శాఖ విడుదల చేసింది.

ఇతర విశేషాలు…

1948లో ఘంటసాల బలరామయ్య నిర్మించిన ‘బాలరాజు’ చిత్ర శతదినోత్సవం విజయవాడ జైహింద్ టాకీస్ లో జరిగింది. అప్పుడు సావిత్రికి 11 ఏళ్ళు. హీరో నాగేశ్వరరావు అంటే ఆమెకు యెంతో అభిమానం. ఎలాగైనా తన హీరో ని దగ్గరనుంచి చూడాలని వెళ్ళింది. జనం విపరీతంగా రావడంతో అక్కడ పెద్దగా తోపులాట జరిగింది. పోలీసులు కూడా జనాన్ని అదుపు చేయలేకపోయారు. ఆ తోపులాటలో చిన్నారి సావిత్రి రోడ్డు పక్కనే వున్న కాలవలో పడిపోయింది. బట్టలు బురదమయమయ్యాయి. పాపం ఆ బట్టలతో ముందుకు వెళ్ళలేక ఇంటిదారి పట్టింది. అటువంటి అక్కినేని సరసన ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటిస్తానని సావిత్రి కలలో కూడా ఊహించి వుండదు.

సావిత్రి ఇంటిముందు పదికార్లుండేవి. కారు నడపటం, కారు రేసుల్లో పాల్గొనడమంటే సావిత్రికి చాలా ఇష్టం. అటువంటిది చివరిరోజుల్లో తన కుమారుడు సతీష్ ని కారులో కొంచెం సేపు తిప్పండి అని ఆమె అభిమానులను అడగటం కన్నీళ్లు తెప్పించే అంశమే. 1960లోనే సావిత్రి ఆస్తులు వందకోట్ల విలువ చేస్తాయని అంచనా. అయితే ఆమె ఆస్తులన్నీ బినామీ పేర్లతో చలామణి అవడంతో ఎక్కువభాగం అన్యాక్రాంతమైపోయాయి. కొన్నింటిని ఆదాయపన్ను శాఖ జప్తుచేసింది. హైదరాబాద్ యూసఫ్ గూడాలో ‘సావిత్రి బంగాళా’ పేరుతో ఆమెకు పెద్ద స్థిరాస్తి వుండేది. ఆమె సోదరికి సావిత్రి ఆ ఆస్తిని బదలాయింపు చేసింది.

‘మూగమనసులు’ సినిమా షూటింగ్ రాజమండ్రి దగ్గరలోని ధవళేశ్వరం వద్ద జరుగుతున్నప్పుడు సావిత్రి ఆపదలో చిక్కుకుంది. ‘ఈనాటి ఈబంధమేనాటిదో’ పాటను దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు చిత్రీకరిస్తున్నాడు. మరబోటులో నాగేశ్వరరావు, సావిత్రి వున్నారు. ప్రమాదవశాత్తు సావిత్రి నీటిలోకి జారిపోయింది. పడవ హోరులో సరంగుకు ఆమె ఆక్రందన వినిపించలేదు. పూర్తిగా మునిగిపోతూ వుండగా ఆమెకు ఆ పడవ కొక్కెమొకటి దొరకడంతో దాన్ని అందిపుచ్చుకుంది. తేరుకొన్న చిత్రబృందం వెంటనే ఆమెను కాపాడారు. తరవాత సావిత్రి అదే చిత్రాన్ని ‘ప్రాప్తం’ పేరుతో తమిళంలో నిర్మిస్తూ అమలాపురం, కాకినాడ మధ్య వున్న గోదావరి లంకల్లో చిత్రీకరణ జరిపింది. అంతలోనే మేఘావృతమై తుఫానుగా మారి గోదావరినది అల్లకల్లోలమైంది. పడవ సరంగులు వారిస్తున్నా సావిత్రి మొండిగా వారిని ప్రయాణింపజేసి చిత్ర బృందాన్ని ఒడ్డుకు చేర్చింది. ఆమె సాహసానికి హీరో శివాజీ గణేశన్ సావిత్రిని మందలించారు.

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap