మహానటి సావిత్రి

కొన్ని కథలు ఎన్నిసార్లు చదివినా బావుంటాయి, కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా బావుంటాయి, కొన్ని సంఘటనలు ఎన్నిసార్లు తలచుకున్నా బావుంటాయి, కొంతమందిని ఎన్నిసార్లు కలుసుకున్నా బావుంటుంది, కొంతమంది గురించి ఎంతమంది , ఎన్నిసార్లు వ్రాసినా చదవబుద్ధి ఔతుంది. అలాంటి వాళ్ళలో ఒకరు మహానటి సావిత్రి. ఎందరో మనసులను, హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న మహా నటి.. కేవలం ముఖ కవళికల ఆధారంగా మంత్రముగ్ధుల్ని చేసిన గొప్ప నటి. జీవించింది కొద్దికాలమే ఐనా, నటించిన సినిమాలతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో ఇంకా చిరంజీవిగానే ఉన్న మహానటి సావిత్రి గురించి ఇప్పటికే అనేక పుస్తకాలు వచ్చాయి. ముఖ్యంగా ఆమె జీవితచరిత్ర ఆధారంగా క్రిందటి సంవత్సరం నిర్మింపబడి ఘనవిజయం సాధించిన మహానటి చిత్రం తరువాత సావిత్రి గురించి, ఆమె వ్యక్తిగత జీవితం గురించిన విమర్శనలు, విశ్లేషణలు కోకొల్లలుగా వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. డా.వెల్చాల కొండలరావుగారి సంకలనంలో వెలువడిన ఈ మహానటి సావిత్రి పుస్తకం మిగతా పుస్తకాలకంటే కొంచెం విభిన్నంగా ఉంది. ఈ పుస్తకం అంతా వ్యాసాల సంకలనం. చాలావరకూ లోగడ అక్కడక్కడా వచ్చినవి, మరికొన్ని ఈ పుస్తకం కోసం ప్రత్యేకంగా వ్రాసినవి. ఆరు అధ్యాయాల్లో సావిత్రిగారి గురించిన వ్యాసాలను వివిధవర్గాలుగా ఇందులో కూర్చారు. ఆత్మకథాత్మక చిత్రాల గురించిన అధ్యాయంతో ప్రారంభించి, సావిత్రిగురించిన వ్యాసాలు మహానటి సినిమా గురించిన వ్యాసాలు, సావిత్రిగారి గురించి సినీ ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు, వివిధ పత్రికలో వచ్చిన వ్యాసాలు, సావిత్రిగారి గురించి వచ్చిన అభిప్రాయాలు, వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, సావిత్రిగారి గురించి వచ్చిన పుస్తకాల గురించిన సమీక్షలు – ఇలా వివిధ కోణాల్లో సావిత్రిగారి గురించిన సమాచార విశ్లేషణ ఉంది. వీటిల్లో అధికశాతం, విశ్లేషణలే. ఆయా విశ్లేషణల్లో సావిత్రిగారి వ్యక్తిగత జీవితం గురించిన, నటజీవితం గురించిన సంఘటనల ఉదాహరణలు చాలానే ఉన్నాయి. చక్కటి ముద్రణ, చివరలో సావిత్రిగారు నటించిన సినిమాల జాబితా (విడుదల తేదీలతో సహా) – సావిత్రిగారి అభిమానులకు ఈ పుస్తకం కమ్మటి విందులాంటిది. ఈ బృహత్తర కార్యక్రమానికి అందమైన రూపం ఇచ్చిన డా.వెల్చాల కొండలరావుగారు, సిస్టర్ నివేదితా పబ్లికేషన్ వారు అభినందనీయులు.

-పద్మ

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link