“మహాప్రస్థానం” కాఫీ టేబుల్ బుక్

తెలుగు సాహిత్య చరిత్రలోని అనేక జానపద గాథలు చరిత్రకెక్కలేదు గాని శ్రీశ్రీ తన మహాప్రస్థాన గీతాలన్నిటినీ నిలువుటద్దం సైజులో అచ్చువేయించాలని కోరుకున్నాడనేది స్వయంగా ఆయన నోట, ఇతరుల నోట చాల ప్రచారం లోకి వచ్చిన సుప్రసిద్ధ జానపదగాథ. అంత పెద్ద సైజులో కాదు గాని అప్పటి ముద్రణా ప్రమాణాలను బట్టి అపురూపంగానే వెలువడడానికే చాల ఆలస్యమయింది.

ఆ కవితలు రాశాక పదిహేను – పద్దెనిమిది సంవత్సరాలు, చలం ముందుమాట తర్వాత పది సంవత్సరాలు పట్టింది.
రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు ఆ తర్వాత ఎన్ని ముద్రణలు వెలువడ్డాయో, ఎందరు ప్రచురణకర్తలు ప్రచురించారో, ఎన్ని గీతాలు ఎన్ని వందల మంది ఎన్ని వేల సార్లు బహిరంగవేదికల మీద చదివారో, ఎన్ని లక్షల హృదయాల్లో శ్రీశ్రీ చిరస్థాయిగా నిలిచిపోయాడో లెక్కలేదు.

శ్రీశ్రీ కోరికను నెరవేర్చడం సాధ్యమో కాదో, అలా అచ్చయినా దానికి ఎంత ఉపయోగం ఉంటుందో తెలియదు గాని, ఒక పెద్ద సైజు కాఫీ టేబుల్ బుక్ గా మహాప్రస్థానం ను అచ్చువేయాలని శ్రీశ్రీ విశ్వేశ్వరరావు తలపెట్టారు. ఆయన ఏదన్నా తలచుకున్నారంటే ప్రపంచం తలకిందులైనా అది జరగవలసిందే. ఎమర్జెన్సీ అనంతర ప్రజాస్వామిక వెల్లువలో బెజవాడ నుంచి ఒక ప్రత్యామ్నాయ పత్రిక వెలువరించడానికి ప్రయత్నిస్తూ, ఆ విషయాలు వరవరరావు గారితో మాట్లాడడానికి 1977 చివరిలోనో, 1978 మొదట్లోనో ఆయన హనుమకొండలో మా ఇంటికి వచ్చారు. అప్పటి నుంచీ ఈ నలబై మూడు సంవత్సరాల్లో ఆయనను అనేక చోట్ల, అనేక రూపాల్లో, అనేక భావోద్వేగాల్లో చూశాను. ఎప్పుడూ మారని ఒకేఒక్క లక్షణం పట్టుదల.
ఆ పట్టుదలతోనే ఇప్పుడు ఈ అద్భుతమైన, ఉజ్వలమైన, అజరామరమైన కానుక పట్టుకొచ్చారు. ఆ కవిత్వం ఎంత ఉజ్వలమైనదో, ఎంత ప్రభావశీలమైనదో ఈ పుస్తకమూ అంతే ఉజ్వలంగా, ప్రభావశీలంగా, ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్నది.
విశ్వేశ్వరరావు గారూ, హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రేమపూర్వక గాఢాలింగనం.

ఎన్. వేణుగోపాల్

(పైన చిత్రంలో మహాప్రస్థానంతో ఎన్. వేణుగోపాల్, విశ్వంగారితో సాక్షి శంకర్, గిరిధర్)
ప్రతులకు:
శ్రీ శ్రీ ప్రింటర్స్
పుస్తకం వెల: రూ. 900/-
మొబైల్: 94906 34849

SA:

View Comments (1)

  • మహాప్రస్థానం ఎప్పుడూ కాఫీ టేబుల్స్ కే పరిమితం కదా. ఏ కర్షకకార్మికుల కోసం శ్రీశ్రీ అలమటించాడో ఆ తాడితపీడిత కర్షక కార్మికులు శ్రీశ్రీ సినిమా పాటలే పాడుకున్నారు, ఆనందించారు తప్పితే జగన్నదరధచక్రాల హోరుతో, గోలతో వారికేం పని. సాహితీ ప్రియులు పలవరించడానికి, వేదికమీద చర్చించడానికి మాత్రమే మహాప్రస్థానం వినియోగించబడింది అన్నది సత్యం. 900పెట్టి మహాప్రస్థానం కొని, మురిసిపోవడం శ్రీశ్రీకి నివాళి అవుతుందా, ఏమో మరి..... అవుతుందేమో మరి.