*కలిమిశ్రీకి ‘ఆదిత్య – పిఠాపురం మహారాజా’ సాహితీ సేవా పురస్కారం
*పిఠాపురం మహారాజా పేరుతో ఇస్తున్న తొలి పురస్కారం
*అక్టోబరు 5న పిఠాపురంలో జరిగే పిఠాపురం మహారాజా గారి 141వ జయంతి వేడుకల్లో పురస్కార ప్రదానం
ఆదిత్వ విద్యాసంస్థలు అక్టోబరు 5న పిఠాపురంలో నిర్వహించనున్న పిఠాపురం మహారాజా గారి 141వ జయంతి వేడుకల్లో తొలిసారిగా అందజేస్తున్న ఆదిత్య – పిఠాపురం మహారాజా సాహితీ సేవా పురస్కారానికి ‘మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ‘నవమల్లెతీగ’ మాసపత్రిక సంపాదకులు కలిమిశ్రీని ఎంపిక చేసినట్టు ఆదిత్య విద్యాసంస్థల యాజమాన్యం తెలియజేసింది. మూడు దశాబ్దాలుగా పత్రికారంగంలోనూ, రెండు దశాబ్దాలుగా మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ద్వారా, నవమల్లెతీగ సాహిత్య మాసపత్రిక ద్వారా సాహితీరంగానికి చేస్తున్న సేవల్ని పరిగణలోకి తీసుకుని ఈ పురస్కారానికి ఆయన్ని ఎంపిక చేసినట్టు విద్యాసంస్థల యాజమాన్యం తెలియజేసింది. ‘ప్రణామం’, ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు’, ‘కృష్ణాతీరం కవితాహారం’, ‘సృజనోత్సవం’ వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో కవుల్ని ప్రోత్సహిస్తూ, సముచిత రీతిన వారిని గౌరవిస్తూ సత్కరిస్తూ ఒక కొత్త సాహితీ సమాజాన్ని నిర్మించడంలో కలిమిశ్రీ కీలకపాత్ర పోషిస్తున్నారని ఆదిత్య యాజమాన్యం తెలియజేసింది. కలిమిశ్రీ ఇటీవల నవమల్లెతీగ మాసపత్రిక 100వ సంచికను ప్రత్యేక సంచికగా వెలువరించి తొలి కాపీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడి గారికి అందజేశారు.
