తెలుగు చిత్ర శిల్పులపై మహాత్మగాంధీ ప్రభావం

మన జాతిపిత మహాత్మ గాంధీ స్వాతంత్ర్య పోరాట ప్రభావం వివిధ రంగాలపై పడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కళను విప్లవాత్మకంగా మన కళాకారుల్ని తయారు చేయాల్సి వచ్చింది. స్వాతంత్ర్యోద్యమంతో పాటు, పునరుజ్జీవనతే ధ్యేయం కూడా. సమకాలికంగా కళతో కూడా కొనసాగింది. ఆ ప్రభావం తెలుగు చిత్రకారులపై పడింది. అడవి బాపిరాజు, మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే వంటి నాటి చిత్రకారులు గాంధీ పిలుపుపై ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారు. అల్లూరి సత్యనారాయణరాజు, వరదా వెంకటరత్నం, వరహగిరి వేంకట భగీరథ, వడ్డాది పాపయ్య, బిట్ర శ్రీనివాసరావు, పుల్లేటికుర్తి వీరభద్రరావు, బాలి పైడిరాజు వంటి సుప్రసిద్ధ చిత్రకారులు జీవితాంతం ఖాదీ వస్త్రాలను ధరించారు. స్వాతంత్ర్యోద్యమం కారణంగా ప్రముఖ చిత్రకారులు, దామెర్ల రామారావు అడవి బాపిరాజు వంటి వారితో పరపాలనలో కళామతల్లికి విధించిన సంకెళ్లుకు విముక్తి కల్గించాలనే కోరిక ప్రభలింది. వీరి చిత్రాల్లో స్వతంత్రత స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వీరిరువురు కూడా స్వతంత్ర కళాయోధులుగానే అభివర్శించవచ్చు. అప్పుడున్న కొద్ది చిత్రకారుల్లో గాంధీ వెలిగించిన స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ప్రభావం అసాధారణమైనదిగా అభివర్ణించవచ్చు. గాంధీకి మన చిత్రకారులతో ఎంతో అనుబంధం వుందనడంలో సందేహం లేదు.

After death of Gandhi – artist Satyanarayana Raju

1929 సం.లో మహాత్మ గాంధీ రాజమహేంద్రవరం సమీపంలో గల సీతానగరంలోని గౌతమీ సత్యాగ్రహాశ్రమానికి వచ్చారు. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రముఖులు కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు, న్యాపతి సుబ్బారావు పంతులు, బులుసు సాంబమూర్తి, దామెర్ల వెంకట్రావు గాంధీని కలిసి చిన్న వయస్సులో కన్ను మూసిన దామెర్ల రామారావు చిత్రాలను చూడాలని కోరారు. గాంధీ ఆ కోర్కెను మన్నించి వంకాయల వీధిలో గల దామెర్ల వారి ఇంట్లో ఏర్పాటు చేసిన ఆర్డు గ్యాలరీని ప్రారంభించి ఆ చిత్రాలను చూసి ఆనంద పరవసులయ్యారు. ఈ కార్యక్రమం ఉదయం 5 గంటలకు జరిగింది.

జాతిపిత మహాత్మ గాంధీ ప్రశంసలందుకొన్న చిత్రకారుల్లో చంద్రుపట్ల రామారావు ఒకరు. వీరు తూర్పు గోదావరి జిల్లా మేడపాడుకు చెందినవారు. ప్రముఖ వంగ చిత్రకారుడు ప్రమోద్ కుమార్ చటర్జీ వద్ద చిత్ర కళ నేర్చుకొన్నారు. వీరు ఏలూరులో “ఆంధ్ర చిత్రకళా పరిషత్” అనే సంస్థను స్థాపించి చిత్రకళలో విశేష కృషి చేశారు. గాంధీ వీరి చిత్రాలు తిలకించి “ఇవి స్వచ్ఛమైన బంగారం” లాంటివని ప్రశంసించారు. గాంధీ పిలుపుపై వీరు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని కారాగార శిక్ష అనుభవించారు. వీరు చిత్రించిన మహాత్మ గాంధీ చిత్రం ఎన్నో ప్రశంసలు అందుకొంది. వీరి కవల సోదరులు బాపిరాజు కూడా చిత్రకారులే కరీంనగర్ జిల్లాలో 1926లో ఒక హరిజన కుటుంబంలో పుట్టిన ఇరుకుల కుమారిల స్వామి, ప్రముఖ రాజకీయ నాయకులు రావి నారాయణరెడ్డి సూచనపై ఢిల్లీకి చెందిన ధక్కర్ బాబు ఆశ్రయం పొందారు. బాబా దగ్గర వుండటమంటే గాంధీ కనుసన్నల్లో మెలగటమే. స్వామి పగలు చదువుకొని రాత్రులు చిత్రాలు గీసేవారు.

artist Atmakuri Ramakrishna

ఒకనాడు ఆశ్రమవాసుల యోగక్షేమాలు తెలుసుకొనడానికి గాంధీ వచ్చారు. ఈ సమయంలో స్వామివేసిన చిత్రాలు చూశారు. వాటిలా బరువు మోస్తున్న శ్రామికులు చిత్రాలు చూశారు. వాటిలో “బరువు మోస్తున్న శ్రామికులు” చిత్రం ఆయనకు కన్నీరు తెప్పించింది. ఆ బరువులు నా నెత్తిన పెట్టక పోయావా అన్నారు. ఆవేదనతో అనంతరం స్వామిని శాంతినికేతను పంపించారు. తనకళను మెరుగుపర్చుకోవడానికి తూర్పుగోదావరి జిల్లా వానపల్లికి చెందిన ప్రముఖ చిత్రకారుడు వడ్లమాని మధుసూధనరావు (1921-1986). వీరు హైద్రాబాదులోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ లో పెయింటింగ్ లో డిప్లమో చేసి, అదే కళాశాలలో రీటైర్ అయ్యే వరకు పనిచేశారు. ఆయన తన జీవిత కాలంలో 125 పైగా ఉత్తమ వర్ణ చిత్రాలు గీచారు. వీరు చించిన ‘చీరాల సమరం’ అత్యంత ఆదరణ పొందింది. స్వాతంత్రోద్యమకాలం నాటి పరిస్థితుల్ని ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.

మాధవపెద్ది గోపాల కృష్ణ గోఖలే ప్రముఖ చిత్రకారులు, కళాదర్శకులు, రచయిత. వీరు గుంటూరు జిల్లా బ్రాహ్మణ కోడూరుకు చెందినవారు.(1917-1981) బందరు, మద్రాసు కళాశాలలో చిత్ర కళలో శిక్షణ పొందారు. కృష్ణా జిల్లా యలమర్రు, కాటూరు గ్రామాల్లో పోలీసులు జరిపిన దారుణ మారణ కాండపై 1941 ఆగష్టు 1 న విశాలాంధ్ర పక్ష పత్రికలో వీరు వేసిన రేఖా చిత్రం నాటి పాలకులకు ఆక్రోశం కల్గించింది. పోలీసులు గ్రామ ప్రజలను దిగంబరుల్ని చేసి గాంధీ విగ్రహ ప్రదక్షణ దృశ్యాన్ని ఆ చిత్రంలో గోఖలే చిత్రించారు. దీన్నో ‘విశాలాంద్ర’ పత్రిక ప్రభుత్వ దమనకాండకు గురైయింది. 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వీరు జైలు శిక్షను అనుభవించారు. బిట్ర శ్రీనివాసరావు 1924 గుంటూరు జిల్లా భట్టిప్రోలులో జన్మించారు.

సినీ ఆర్డు డైరెక్టర్ గొట్టిముక్కలు కోటీశ్వరరావు వద్ద చిత్రకళ అభ్యసించారు. వీరు గాంధీ తత్వవాది ఎల్లప్పుడు ఖద్దరునే ధరించే ఆజానుబాహువు. వీరు గీచిన గాంధీ చిత్రం గుంటూరు హిందూ కళాశాలలో అలరించబడివుంది. 1970లో విజయవాడ గాంధీ పర్వతంపై నున్న గ్వాలరీ వీరి జాతిపిత తైలవర్ణ చిత్రాన్ని నాటి రాష్ట్రపతి వి.వి.గిరి ఆవిష్కరించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన చామకూర సత్యనారాయణలో (19041981) బొంబాయికి చెందిన జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్డులో చిత్రకళలో డిప్లమో చేశారు. రాష్ట్ర లలిత కళా, సాహిత్య అకాడమీలో సభ్యులుగా పనిచేశారు. 150 మంది సుప్రసిద్ధుల రూపచిత్రాలు వేశారు. రూప చిత్రాలు గీయడంలో ఎవ్వరైనా వీరితర్వాతే. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోను వీరు గీచిన ‘ గాంధీ’ చిత్రాల్ని అలంకరించారు. వీరు గీచిన “నమస్తే బాపు” ఎందరో ప్రముఖుల ప్రశంసలు పొందింది.

తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం తాలూకా కొత్తలంక గ్రామానికి చెందిన కశీచైనుల వెంకట సుబ్బయ్య 1900 సం.లో జన్మించారు. 1923లో స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా కాకినాడలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సమావేశానికి వీరు ఆరు గాంధీ విగ్రహాల్ని మట్టితో చేసి ఇచ్చి ఆహుతుల్ని విశేషంగా అలరించారు. తర్వాత జైపూర్‌లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభకు మూడు వేల పైగా గాంధీ చిత్రాలు గీసి తీసుకెళ్లారు. 1948లో గాంధీని గాడ్సే కాల్చి చంపినప్పుడు గాంధీ గుండె నుండి రక్తం కారుతున్న దృశ్యాన్ని పుష్పక విమానంలో స్వర్గానికి వెళ్తున్నట్లు చిత్రాలు గీచారు.

రాజమండ్రికి చెందిన మరో చిత్రకారుడు బాలిపైడిరాజు 1927 ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. చిత్రకళలో స్వయంకృషితో అనేక ప్రయోగాలు చేశారు. 1944లో వీరు భారత స్వాతంత్ర్య సమర సన్నాహం” అనే నూనె రంగుల చిత్రం గీచారు. ఇందులా సింహాల రధం నడుపుతున్న మహాత్ముడు, రధికుడుగా నెహ్రు నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు
మౌలానా ఆజాదీ ఏనుగు అంబారీ పైన, ఆజాద్ హిందు ఫౌజ్ సైన్యాన్ని తీసుకోని సుభాష్ చంద్రబోస్ భారతమాత అనుజ్ఞ కోసం ఎదరుచూస్తున్నట్టు చిత్రించారు. ఈ చిత్రం జీవకారుణ్య సంఘం కార్యాలయంలో అలంకరించారు. ఆ రోజుల్లో నెహ్రూ, నేతాజీల రూప చిత్రాల్ని అసంఖ్యాకంగా గీచారు.

స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో రెండవ బార్డోలిగా ప్రఖ్యాతి గాంచిన భీమవరం పట్టణ శివారు ప్రాంతం రాయలంలో 1910లో జన్మించిన అల్లూరి సత్యనారాయణరాజు గొప్ప చిత్రకారుడే కాదు అంతకుమించిన గొప్పదేశ భక్తులు కూడా. ప్రఖ్యాతి పొందిన ఎందరో జాతీయ నాయకుల మాన్యరూపల్ని చక్కని సజీవ చిత్రాలు గా రూపొందించారు. జీవితాంతం ఖద్దరు వస్త్రాలను ధరించిన నిరాడంబరులు కూడా.
సత్యనారాయణ రాజుకి జాతీయ కీర్తి నార్జించి పెట్టిన చిత్రం ‘గాంధీ నిర్యాణం’ చిత్రం. భారతదేశ నాటి విషాద పరిస్థితిని ఊహ చిత్రంగా గీచారు. పరుండపెట్టిన గాంధీ పార్థివ శరీరం వద్ద సంకెళ్ళు తెగిన భారతమాత దు:ఖితులై విలపిస్తున్న దృశ్యాన్ని చూపరులకు ఆర్తి కలిగేలా చిత్రించారు.

గాంధీ చితాభస్మాన్ని కృష్ణానదిలో నిమజ్జనం చేయడానికి తెచ్చిన సందర్భంలో సత్యనారాయణ రాజు తన చిత్రాన్ని తీసుకెళ్లి ఆ చితాభస్మపేటిక వద్ద వుంచారు. ఆ చిత్రాన్ని చూసిన నాటి పెద్దలు కళా వెంకట్రావు ఎన్.జి. రంగా, తిమ్మారెడ్డి తదితరులు విలవిల విలపించారు. విశాఖ నౌకా నిర్మాణ కేంద్రంలో తయారైన మొదటి నౌక ‘జల ఉష’ జలప్రవేశం చేయడానికి వచ్చిన నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అప్పుడు విశాఖలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ చిత్రాన్ని నెహ్రూకు చూపించగా, తీవ్ర విషాదంతో టోపీ తీసి నమస్కరించి గాంధీకి నివాళులర్పించారు. అంతేకాక చిత్రకారుడ్ని పూలమాలతో సత్కరించి వెయ్యి రూపాయల నగదును బహూకరించారు.

Artist Jinka Ramarao

కృష్ణా జిల్లా పామర్రులో గాంధీ 72వ జయంతి అంటే 1941 సం.లో అక్టోబరు 2న గాంధీ రూప చిత్రాన్ని పెద్ద సైజులో చిత్రింపచేసి ఎడ్ల బండ్లపై పెట్టి గ్రామంలో పెద్ద ఊరేగింజు నిర్వహించారు. ప్రజల్లో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తి రగిలించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇవి అన్నీ చరిత్ర కెక్కిన సంఘటనలుకాగా, చరిత్రకెక్కని సంఘటనలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో జరిగి వుంటాయనడంలో సందేహం లేదు.
జాతీయ ఉద్యమానిక పట్టుకొమ్ము అయిన విజయవాడ నగరంలో ఎక్కడా లేని విధంగా కృష్ణానదీ తీరంలో నిర్మించబడ్డ ప్రీడమ్ స్ట్రగుల్డ్ గ్యాలరీలో ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్టు, రచయిత టీ వెంకట్రావు స్వాతంత్ర్య పోరాట గాధను 54 దృశ్యాల్లో చిత్రించిన వర్ణ చిత్రాల్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యయ స్వర్ణోత్సవం సందర్భంగా 1997లో ఏర్పాటు గ్యాలరీ నిర్మాణం ప్రారంభించి 2007 సం. లో పూర్తి చేశారు. గ్యాలరీలో పది చిత్రాలు గాంధీకి సంబంధించినవే కావడం గమనార్హం. కాగా 2015లో కృష్ణా పుష్కరాల సందర్భంగా గ్యాలరీని కూల్చివేశారు. అదే విధంగా గాంధీజీ 125వ జయంతి సందర్భంగా హైద్రాబాద్ కు చెందిన యంగ్ ఇన్వాయిస్ ఇంటర్ నేషనల్ సంస్థ జాతీయ స్థాయిలో విద్యార్థులకు పోటీలు నిర్వహించగా దేశం నలుమూలల నుండి 2426 వర్ణ చిత్రాలు వచ్చాయి.

Gandhi statue at Telangana asembly-CSN Patnayak

ఇందులో గాంధీ జీవిత ముఖ్య ఘట్టాలకు సంబంధించిన 150 చిత్రాల్ని ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీలకు చెందిన 107 ప్రాంతాల్లో ప్రదర్శించారు. ఈ చిత్రాలన్నిటినీ గాంధీ 150వ జయంతి సందర్భంగా “చిట్టి చేతులు – పెద్ద నివాళులు” పేరుతో గ్రంధ రూపంలో తెచ్చారు.
స్వాతంత్ర్యం అనంతరం గాంధీ చిత్రం గీయని చిత్రకారులు కాని, గాంధీ శిల్పం చెయ్యని శిలికాని తెలుగు రాష్ట్రాల్లో లేరంటే అతిశయోక్తి కాదు. తెలుగు చిత్రకళారంగంలో సూర్యచంద్రులుగా పేరు పొందిన వడ్డాది పాపయ్య,
బాపులు గాంధీపై ఎన్నో చిత్రాలు గీచారు. వపా గాంధీ పై పదివరకు వర్ణ చిత్రాలు గీచారు. అందరూ గాంధీని సోలోగా చిత్రిస్తే వపా అందుకు భిన్నంగా అమరాశీర్వాదం, అవతారమూర్తి, ఆదర్శమూర్తులు, అహింసామూర్తులు శీర్షికలతో పలు చిత్రాలు వివిధ సందర్భాల్లో గీచారు. బాపు సైతం ఎన్నో రేఖా చిత్రాలు గీచారు.
ప్రముఖ శిల్పులు సి.ఎస్.ఎన్. పట్నాయక్, దేవగుప్తపు శ్రీనాథ వుడయారు, కాటూరి కృష్ణమూర్తి, దివిలి అప్పారావు, రాజకుమార్ వుడయార్ వంటి సుప్రసిద్ధ శిల్పులు వందల సంఖ్యలో గాంధీ విగ్రహాల్ని తయారు చేశారు. ఇవి పల్లె పట్టణం తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ముఖ్య కూడళ్ల వద్ద ఏర్పాటు చేయబడ్డాయి.

-సుంకర చలపతిరావు
9154688223

1 thought on “తెలుగు చిత్ర శిల్పులపై మహాత్మగాంధీ ప్రభావం

  1. శ్రీమాన్ సుంకర చలపతిరావు గారి పరిశోధనాత్మకతకు ఈ వ్యాసం అద్దం పడుతుంది. అందులో నా చిత్రాన్ని జోడించి నందుకు ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap