నాటక రచనా విశారదుడు కణ్వశ్రీ

“ఏయ్ మహంకాళీ! అఖండ జ్వాలా ప్రజ్వల కరాళదంష్ట్రినీ… మర్త్య మస్తిష్క భక్షిణీ… ధ్వాంతో ధ్వాంత ప్రళయాంతక, ధూమ ధూమకర ఝంఝా మారుత ప్రయాణీ… శిలోచ్ఛయ భిన్న దంభోళి… సదృశ్య నఖశ్రేణి… నిరుపకారిణీ… రోదసీ కృహర వక్రిణీ… మాంత్రిక సామ్రాజ్యర్చానంద స్వరూపిణీ… రక్షమాం… రక్ష. ఏయ్! కాపాలీ మాయి సెలవిచ్చిన ప్రకారం గండభేరుండ పక్షులను చంపి ఆ నెత్తుర్లో వేయిసార్లు స్నానం చేశాను. నాకు ఇక చావులేదు కదూ… నా ప్రాణాలున్న చిలుకను ఏడు సముద్రాల కటువైపున్న జీవిగడ్డలో భయంకర ఘాతుక మృగాలు గంతులు వేసే కీకారణ్యంలోని మాయా మందిరంలో రహస్యంగా… భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదూ… అహ్హహ్హ… లేదు… ఈ మాయల ఫకీరుకిక చావులేదు. ఫకీర్ అమరుడు… పంచభూతాలు సైతం ఫకీరు చేతుల్లోని మంత్రాల ఎముకకు లోబడి చెప్పినట్లు నాట్యం చెయ్యాలి. ముక్కోటి దేవతలు స్వర్గం నుండి దిగివచ్చినా ఫకీరుకు పదిమైళ్ల దూరంలో ఆగిపోయి జోహార్ చేయాలి” అని తెరలు తెరలుగా దొర్లి వచ్చే భీకర వికటాట్ట హాసాలతో రంగశాల దద్దరిల్లిపోతుంది. ప్రేక్షకులు భయానక రసాస్వాదనలో భయకంపితులై పోతారు. తెలుగు నాటక రంగంలో ఇంత భయానక రస ప్రధానమైన పాత్ర మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు. తెలుగునాట వేలాది ప్రదర్శనలకు నోచుకొన్న ఏకైక జానపద నాటకమైన బాలనాగమ్మ రచయితగా కణ్వశ్రీ స్థానం పదిలం.

కణ్వశ్రీ అసలుపేరు మైసూరు చంద్రశేఖరం. చంద్రశేఖర కణ్వశ్రీ, కణ్వశ్రీ, విద్వాన్ కణ్వశ్రీ పేర్లతో ఆయన నాటకాలతో పాటు ఇతర రచనలు చేశారు. నెల్లూరు జిల్లా కోట గ్రామంలో జన్మించారు. దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ కాళహస్తిలో ఆయన విద్యాభ్యాసం, బాల్యం గడిచింది. తండ్రి శేషయ్యనాయుడు, తల్లి అన్నపూర్ణమ్మ. తల్లి మంచి కవయిత్రి. ఆంధ్ర జనని పద్యకావ్యాలను రచించారు.

కాశీ విశ్వవిద్యాలయంలో సాహిత్యరత్న పట్టాపొందారు. కణ్వశ్రీ తొలిరచన సత్యాగ్రహి అనే పద్యకావ్యం. 1940 నుండి 55 వరకు నెల్లూరులో ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆ కాలంలో జమీన్ రైతు పత్రికలో పనిచేస్తున్న ఆచార్య ఆత్రేయ, రావూరి భరద్వాజతో అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. మజ్జిగ విశ్వనాథరెడ్డి అధ్యక్షులుగా, కణ్వశ్రీ కార్యదర్శిగా నెల్లూరులో లలిత కళాసమితి సంస్థను నెలకొల్పి అనేక నాటకాలను ప్రదర్శించారు. బాలనాగమ్మ (1935) అజాతశత్రు (1948), ఆనాడు (1948) ఇదా ప్రపంచం (1950) నాటకాలతో పాటు ఇదా శాంతి, మనమేనంటోయ్ మానవులం, అగ్నిజ్వాల, టిప్పుసుల్తాన్, వీరశివాజీ, రుక్మిణీ కళ్యాణం, సమ్రాట్ అశోక్ వంటి నాటకాలను రచించారు. జానపదంతోపాటు పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటక రచన చేసిన ప్రసిద్ధ నాటక రచయితలలో కణ్వశ్రీ ప్రథమశ్రేణికి చెందినవారు. 1970లో లవ్ ఈజ్ బ్లైండ్ అనే నాటికను వ్రాసి స్వీయ దర్శకత్వంలో మద్రాసులో ప్రదర్శించారు.

విశేష ప్రజాదరణ పొందిన పద్యనాటకాలలో బాలనాగమ్మ ఒక్కటే జానపద ఇతివృత్త నాటకం. బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం నాటకాలను జానపద పాటలు, కళారూపాల ఆధారంగా వ్రాయబడినా ఆ కథ చారిత్రకం. అందులో ఉన్న పాత్రలన్నీ చారిత్రకాలే. బాలనాగమ్మ నాటకాన్ని తన 15వ యేట (బాలనాగమ్మ రచనా కాలం 1935. కణ్వశ్రీ జనన, మరణాల తేదీలు ఎంత ప్రయత్నించినా లభించలేదు. బాలనాగమ్మ రచనా కాలం ఆధారంగా కణ్వశ్రీ 1920 ప్రాంతంలో జన్మించినట్లుగా భావించవచ్చు.) వ్రాసినట్లు కణ్వశ్రీ స్వయంగా పేర్కొన్నారు. ఆ కాలానికి జంగం కథల్లో బాలనాగమ్మ ఇతివృత్తం సామాన్య ప్రజానీకంలో విశేష ప్రచారంలో ఉంది. అద్భుత, భయానక, కరుణ, హాస్యరస సమ్మిళితమైన ఈ కథను రంగస్థలంపై ప్రదర్శనానుకూలంగా తీర్చిదిద్దడంలో కణ్వశ్రీ తన ప్రతిభను ప్రదర్శించారు. ఈ నాటకం ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడుస్తుంది. “భవిష్యత్ ప్రపంచంలో మానవుడు మానవాతీతమైన విజ్ఞానాన్నీ, శక్తినీ సంపాదించి ఆ మహత్తర సాధనాలను మానవ కళ్యాణానికీ, విశ్వశాంతికీ వినియోగించకుండా నాలా స్వార్ధానికో, విశ్వనాశనానికో వినియోగిస్తారు. అలాంటి దుర్మార్గులకు నాలాగే అథః పతనమూ, సర్వనాశనము తప్పదనే” గొప్ప సందేశాన్ని మాయలఫకీరు పాత్ర ద్వారా వ్యక్తీకరించారు.
కథా సూత్రానికి జానపద సహజమైన అద్భుత కల్పనలు, అతిశయోక్తి ప్రధానమైన పాత్రచిత్రణ, రామాయణ కథ నుండి పుణికి పుచ్చుకొన్న పోలికలతో ఈ నాటకం అద్భుతంగా రూపుదిద్దుకొంది. ఈ నాటకాన్ని మొదట యన్.వి. సుబ్బారావు దర్శకత్వంలో విస్తృతంగా ప్రదర్శించారు.

నెల్లూరు ఆర్ట్ థియేటర్స్ (మద్రాసు) సమాజం పక్షాన నెల్లూరి సుబ్బారావు దర్శకత్వంలో పలువురు సినీ నటులు విస్తృతంగా ప్రదర్శించారు. ఈ సమాజంలో మాయలఫకీరు పాత్రను కె.వి.యస్. శర్మ, కార్యవర్ధిరాజు పాత్రను పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, బసవేశ్వరుడు పాత్రను నెల్లూరు మహంకాళి, వంగర, తలారి రాముడు పాత్రను రామకోటి, సంగు పాత్రను వాణిశ్రీ ధరించారు. సురభి నాటక సమాజానికి మల్లాది వెంకటకృష్ణ శర్మ, హరిపురుషోత్తం, నాగశ్రీ వంటివారు బాలనాగమ్మ నాటకాన్ని విడివిడిగా వ్రాసి ఇచ్చారు. కణ్వశ్రీ బాలనాగమ్మ నాటకం ప్రాచుర్యం పొందాక అందులోని మాయలఫకీరు, సంగు పాత్రల ప్రవేశం ఉన్న మొదటి రంగాన్ని చేర్చి ప్రదర్శించేవారు. కణ్వశ్రీ కొంతకాలం సురభి సమాజానికి రచయితగా పనిచేశారు. సురభి సమాజంలో ఫకీరు పాత్ర పోషణలో ఆవేటి ప్రకాశరావు, రేకందార్ శంభులింగం, ఆవేటి నాగేశ్వరరావు, రేకందార్ పుల్లయ్య, రేకందార్ భోజరాజు, వనారస పూర్ణచంద్రశేఖర్, ఆవేటి శ్యామసుందర్, ఆవేటి మనోహర్, రేకందార్ నరసింహారావు , బాలనాగమ్మ పాత్రలో వనారస ఆదిలక్ష్మి, ఆవేటి నాగలక్ష్మి, వనారస కమలాదేవి, సంగు పాత్రలో ఆవేటి వసంత పేరు ప్రతిష్టలు పొందారు. ఆవేటి నాగేశ్వరరావు మద్రాసుకు చెందిన శ్రీనివాస్, గణేశ్ అనే సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో నాటకాన్ని మరిన్ని హంగులతో ప్రదర్శించారు.

బాలనాగమ్మ నాటకాన్ని వేలాది ప్రదర్శనలిచ్చి ఆ నాటకానికి మరింత ప్రాచుర్యాన్ని కలిగించిన ఘనత వల్లూరు వెంకట్రామయ్య చౌదరికి దక్కుతుంది.
శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి పక్షాన రామకుమారి దర్శకత్వంలో ఈ నాటకాన్ని సురభి వారికి దీటుగా సాంకేతిక హంగులతో వల్లూరు ప్రదర్శించారు. వల్లూరు ఫకీరు పాత్ర, రామకుమారి సంగు, రాజకుమారి బాలనాగమ్మ, ఎ.వి.సుబ్బారావు, డి.వి. సుబ్బారావు (వేటపాలెం) కార్యవర్థిరాజు, ఆరాధ్యుల వెంకటేశ్వరరావు బాలవర్థిరాజు, కాళిదాసు కోటేశ్వరరావు తిప్పడు పాత్రలను పోషించారు. ఆచంట వెంకటరత్నం నాయుడు కూడా ఫకీరు పాత్రను ధరించి పలు ప్రదర్శనలిచ్చారు. నాయుడు గోపి దర్శకత్వంలో పెండెం కోటేశ్వరరావు ఫకీరుగా వందకు పైగా ప్రదర్శనలిచ్చారు. తిప్పడు పాత్రను గోపి ధరించారు. కణ్వశ్రీకి రచయితగా పేరు ప్రతిష్టలు తెచ్చిన సాంఘిక నాటకం ఇదా ప్రపంచం. స్వాతంత్య్రం సిద్ధించాక కూడా పేదరైతులపై భూస్వాముల దౌర్జన్యాలు ఏమాత్రం తగ్గలేదు. నిరుపేదల బ్రతుకులో చీకటి తొలగిపోలేదు. బడుగు జీవులను ఉద్ధరించడంలో పాలకవర్గాలు విఫలమౌతున్నాయనే సందేశం ఈ నాటకంలోని వస్తువు. పూర్తిస్థాయి నెల్లూరు మాండలికంలో వెలువడిన తొలి సాంఘిక నాటకం ఇది. నెల్లూరు లలిత కళాసమితి మజ్జిగ విశ్వనాథరెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించిన ఈ నాటకంలో సినీనటులు సి. నాగభూషణం, రాజనాల, రమణారెడ్డితో పాటు విశ్వనాథరెడ్డి, పొన్నాల రామసుబ్బారెడ్డి నటించారు.
ఈ నాటకంలో పేదరైతు రాజయ్య పాత్రను కణ్వశ్రీ పోషించారు.

సింహాసనం కోసం తండ్రినే కారాగారంలో బంధించి చివరకు పశ్చాత్తాపంతో పునీతుడై ప్రేమ, వాత్సల్యం మనిషి అత్యంత ఆవశ్యకమనే సందేశాన్ని ఇస్తూ కణ్వశ్రీ వ్రాసిన నాటకం అజాతశత్రు.”మరణం శాంతి రాక్షసి… జననం సంపెంగ పువ్వు, కష్టసుఖాలు ఉషస్సంధ్యలు, ఆత్మ అబద్ధమాడదు. మురికైపోయిన మనస్సు నుండి పవిత్రమైన ఆత్మ వేరుపడిపోతుంది. ఆ ఆత్మ ప్రాణిలోకానికి మానవుడు పడిన అప్పునూ, వడ్డీనీ గుణిస్తున్నది. ఆత్మ దానిని మోసగించలేదు. బానిసత్వపు నరకాన్ని స్వతంత్ర స్వర్గంగా మార్చగలిగిన వీరుడు ఒక దేశంలో ఒకడే జన్మిస్తాడు. నిన్ను నిందించే దేశద్రోహులు కూడా నువ్వు సాధించే శాంతిలో రేపు భాగం పంచుకొంటారు. జీవిత నృత్యం. చెల్లిపోయిన తరువాత ప్రకృతి సూత్రధారి ప్రపంచ రంగం మీద ఎవరినీ ఉండనివ్వదు. ఆ ఘటనలో హింసాభూమిక తియ్య తియ్యని ప్రేమ గీతాలను పాడు కొంటుంది.” వంటి భావాలను ఈ నాటకంలో వ్యక్తం చేశారు. కణ్వశ్రీకి ఆశయంకంటే ఆవేదన, ఆవేదన కంటే సంక్షుభిత హృదయాక్రందన ఎక్కువ. హృదయం లోతులు చూడగల వ్యక్తి. రక్తికీ ముక్తికీ మధ్య ఉన్న యుక్తికి, తనకూ అతీతమైన శక్తికీ ఏదో లంగరు ఉంది అనడానికి కణ్వశ్రీ ఉదాహరణ అని ఆచార్య ఆత్రేయ ఈ నాటకం ముందుమాటలో పేర్కొన్నారు. మహమ్మద్ ఘోరి, పృథ్వీరాజ్ మధ్య జరిగిన సమరగాధను కణ్వశ్రీ ఆనాడు అనే చారిత్రక నాటకంగా మలిచారు. ఈ నాటకాన్ని మజ్జిగ విశ్వనాథరెడ్డి, పొన్నాల రామసుబ్బారెడ్డి, యన్.వి.సుబ్బారావు నెల్లూరు లలిత కళాసమితి పక్షాన విస్తృతంగా ప్రదర్శించారు, కణ్వశ్రీ రచించిన మాయాబజార్, రుక్మిణీ కళ్యాణం నాటకాలను కూడా విశ్వనాథరెడ్డి దర్శకత్వంలో నెల్లూరు లలిత కళాసమితి ప్రదర్శించింది.

చిత్తూరు నాగయ్య ప్రోద్బలంతో అదృష్టదీపుడు చిత్రానికి సంగీత దర్శకుడైన సౌందర్య రాజయ్యంగార్ వద్ద సహాయకులుగా పనిచేశారు. అనంతరం నవ్వితే నవరత్నాలు వంటి చిత్రాలకు కూడా సహాయ సంగీత దర్శకులుగా వ్యవహరించారు. సోదరుడైన యం.యస్. గోపీనాథ్ నిర్మించిన జీవిత బంధం చిత్రానికి మాటల రచయితగా చిత్రసీమకు పరిచయమయ్యారు. బాంధవ్యాలు, చదరంగం, జీవితచక్రం, రెండు కుటుంబాల కథ, నీడలేని ఆడది, అమ్మాయిలూ జాగ్రత్త వంటి 40 చిత్రాలకు మాటల రచయితగా, శ్రీకృష్ణ పాండవ యుద్ధం, జగన్మాత, భోగభాగ్యాలు వంటి చిత్రాలకు పాటల రచయితగా వ్యవహరించారు. కణ్వశ్రీ రచించిన “జోహారు మహాంధ్ర జననీ జయ జయ త్రిలింగ జననీ జోహారు” అనే ప్రార్థనా గీతం పరాబ్రహ్మ అనే ప్రార్థనాగీతం తరువాత అంత ప్రజాదరణ పొందింది.

“కణ్వశ్రీ స్వయంగా నటుడు కావడంతో రంగౌచిత్యాన్ని పరిపూర్ణంగా జీర్ణించుకొని నాటక రచనలు చేశారు. సాంఘిక నాటకాలు రాజ్యమేలుతున్న కాలంలో బాలనాగమ్మ వంటి జానపద నాటకాన్ని వ్రాసి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. నాటకకర్తకు ప్రతిబంధకాలు ఎక్కువ. బాధ్యత కూడా ఎక్కువే. సన్నివేశ సమన్వయం, దేశకాల విచక్షణ, రంగౌచిత్యము, మానవ మనస్తత్వ పరిశీలన, రసపోషణ, భాషా స్వారస్యము, కథాకాల సంఘ జీవన ప్రతి బింబనము వంటివి ముఖ్యంగా నాటక రచయితను ఇబ్బంది పెట్టే అంశాలు. నిత్య జీవితంలో అడుగడుగునా మానవుణ్ణి ఎదిరించే వివిధ పరిణామాలను కళ్లకు కట్టేలా చూపిస్తూ ప్రేక్షకునికి ఏదో ఒక అమూల్య సత్యాన్ని బోధించవలసిన అతిలోక విజ్ఞాని నాటక రచయిత. చరిత్రలోని సత్యాసత్యాలను కూడా నిర్ణయించవలసిన న్యాయమూర్తి కూడా నాటక రచయితే, నాటకశాలలో వేషాలగది ఏవైపున ఉంటుందో కూడా తెలియకుండానే నాటక రచనకు పూనుకొనే సాహసి కాదు కణ్వశ్రీ. రెండు మూడు భాషల్లోని ఉత్తమ నాటకాలను చదివి, చూసి, స్వయంగా నటించి రచనలో ప్రజ్ఞను పొందిన జ్ఞాని కణ్వశ్రీ” అన్న ఆత్రేయ కితాబు అక్షరసత్యం.

కందిమళ్ల సాంబశివరావు

Share via
Copy link
Powered by Social Snap