ప్రముఖ ‘రూపశిల్పి’ అడివి శంకరరావు

తెలుగు నాటకరంగంలో ‘అడివి శంకర్’ గా అందరికీ సుపరిచితుడైన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ ‘కళామిత్ర’అడివి శంకరరావు 1948 ఆగస్ట్ 7వ తేదీన విజయవాడలో జన్మించారు.

1965లో SSLC, 1966-68లో గవర్నమెంట్ ITI లో మెషినిస్ట్ గా పాసయ్యికూడా, చిన్నతనం నుంచి ఉన్న నాటకాభిలాషతో 1968 ఆగస్ట్ లో నాటకరంగంలోకి ప్రవేశించి రంగాలంకరణ, లైటింగ్ శాఖలలో అభినివేశాన్ని ప్రావీణ్యతను ప్రదర్శిస్తూనే, నటుడుగా తన వయస్సుకి, శరీ‌రానికి తగ్గ పాత్రల్న్ని పాత్రోచితంగా పోషించి మెప్పుల్ని కప్పుల్ని పొందారు.

కె.యస్. శాస్త్రి గారి దగ్గర మేకప్ నేర్చుకుని 1985 నుంచి నాటకరంగంలో మేకప్ ఆర్టిస్ట్ గా లైటింగ్ కి తగ్గట్టుగా నాటకీయతను మేళవించి సహజత్వానికి దగ్గరగా తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకుని రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లోని అన్ని నాటక పరిషత్తులలోనూ అనేక నాటక సమాజాల్లోని వందలాదిమంది కళాకారులకి మేకప్ చేసి ‘నంది’ అవార్డును, ఇంకా అనేక ఉత్తమ ఆహర్య బహుమతులను కైవసం చేసుకుని కళాకారుల చేత, ప్రేక్షకులచేత, పత్రికారంగం చేత ‘శభాష్’ అనిపించుకున్నారు.

తను ఆహర్యం నిర్వహించడమే కాకుండా నాటకరంగంలోని వేలాదిమంది నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతికవర్గం, నాటక సమాజాలు, నాటకపరిషత్తులు, న్యాయనిర్ణేతలు, అందరి అడ్రసులు, ఫోన్ నంబర్లు సేకరించి అందరికీ అందించి సహకరించారు. నాటకరంగ పత్రికలకు పరిషత్తుల ఫలితాలు పంపించి పాత్రికేయుడుగా, ఫొటోగ్రఫర్ గా పనిచేశారు.

ఎన్నోవందల సన్మానపత్రాలు రచించి, చిత్రించి అందచేశారు. పరిషత్తుల నిర్వహణకు ఎంతో సహకరించారు. అనేక సభాకార్యక్రమాలకి చక్కని ‘వ్యాఖ్యాత’గా వ్యవహరించారు.

నాటకరంగంలో అందరి ‘తలలో నాల్క’లాగా ఆత్మీయతతో, స్నేహపూర్వకంగా,
వినయపూర్వకంగా ప్రవర్తించి ‘Encyclopedia of Social Theatre’, ‘నాటకరంగానికి నిలువుటద్దం’, ‘నాటకరంగానికి దిక్సూచి’, ‘నడుస్తున్న నాటకరంగం’ అని నాటకరంగ పెద్దలచేత ఆశీస్సులని, గుర్తింపుని పొంది, ఎన్నోవందల సన్మానాలు, సత్కారాలు, అభినందనలు, గౌరవాల్ని పొందిన అడివి శంకరరావుగారిని 1991వ సంవత్సరంలో విజయవాడలో కె.యస్. మూర్తి మెమోరియల్ పరిషత్ ‘కళామిత్ర’ బిరుదుతో ఘనంగా సన్మానించింది.

విజయవాడ దూరదర్శన్ సప్తగిరిలో దాదాపు 10 సంవత్సరాలు మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. ప్రత్యేకించి ‘కళాదీపిక’-మాసపత్రికకు, 64కళలు.కాం అంతర్జాల పత్రికకు ఒక దశాబ్దకాలంపాటు వీరు అందించిన సేవలు అమూల్యమైనవి,అభినందించదగినవి.

Award receiving

నాటకమే ధ్యాసగా, శ్వాసగా 54 సంవత్సరాలకు పైగా నాటకరంగ అనుభవంతోనూ, 47 సంవత్సరాలకు పైగా మేకప్ ఆర్టిస్ట్ గా అనుభవం గడించి నాటకరంగం పట్ల, నాటకరంగంలో అందరిపట్ల కృతజ్ఞతాభావం కలిగి, ఈరోజు 74వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న ‘కళామిత్ర’ అడివి శంకరరావుగారికి కుటుంబపరంగా ‘జన్మదిన వేడుకలు’ జరుపుకుంటున్నారు. వృత్తిపరంగా నటరాజస్వామి, ఇష్టదైవంగా షిరిడి సాయిబాబా వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగజేయాలని కోరుకుంటున్నాను.
-రాఘవాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap