బ్రహ్మ మనుషులను అనేక రూపాలను సృష్టిస్తే, మేకప్ మేన్ ఒకే మనిషిలో వివిధ రూపాలలో సృష్టిస్తాడు. అందుకే మేకప్ ఆర్టిస్ట్ ని రూపశిల్పి అంటారు. “సృష్టికి ప్రతిసృష్టి చేయగలం మేము. బ్రహ్మ ఇచ్చిన రూపాన్ని మార్చగల శక్తి మాకుంది”. అంటారు… నవ్వుతూ విజయవాడకు చెందిన మేకప్ ఆర్టిస్ట్ అడివిశంకరావు. అసలు మేకప్ అంటే ఏమిటనే దానికి, ముఖంలో లోపాన్ని సరిదిద్ది అందంగా చూపడమేనంటారు.
చతర్విధాభినయాల్లో తృతీయస్థానాన్ని అలంకరించిన ఆహార్యభినయానికి నటుని సహజసిద్ధమైన శారీరక నిర్మాణం, అంగసౌష్టవం, రూపలావణ్యాదులతోపాటు ‘రూపశిల్పి’ చతురత-నిపుణత తోడైతే పాత్ర ఆహార్యపరంగా పరిపూర్ణత సిద్దించుకోగలదు-ప్రేక్షక జనాదరణకు నోచరుకోగలదు. నటుడు రంగస్థలంపై ప్రత్యక్షంగా నటిస్తుంటే ‘రూపశిల్పి’ నటుని ఆహార్యంతో అంతర్భాగమై అభినందనలకు పాత్రడవుతుంటాడు. ఆంగిక వాచిక, సాత్వికాభినయాలకు ధీటుగా సమాన ప్రతిపత్తిని, సముచిత స్థానాన్ని పదిలపరచుకున్న ఈ మేకప్ ను పాత్రోచితంగా సమకూర్చడంలో మేటి రూపశిల్పిగా పేరొందిన వారు అడివిశంకరరావు. ఆగస్ట్ 7 న శంకర్ గారి 73 వ జన్మదిన సందర్భంగా … వారి పరిచయం …
శంకరరావు నటుడిగా నాటకరంగంలో కాలిడినా, వీరి మనస్సు ఎందుకో మేకప్ పట్ల ఆకర్షితమైంది. రూపశిల్పిగా ఉన్నత స్థానాన్ని అందుకోవాలని ఉవ్విళ్లూరింది. అంతే తన మనసుకి నచ్చిన- మెచ్చిన మేకప్ కళలో కె.ఎస్. శాస్త్రి వద్ద సునిశిత శిక్షణ పొందారు. మరెంతో మంది సుప్రసిద్ధ మేకప్ కళాకారుల వద్ద మేకప్ లోని మెళకువలను ఔపోసణ పట్టారు. గురువుల చెంత అభ్యసించినదానికి తన సృజనను జోడించి, నాటకీయతను సహజత్వాన్ని పాత్ర ఔచిత్యాన్ని మేళవించి చక్కని మేకప్ సమకూరుస్తూ మేకప్ కళలో మేటి కళాకారుడుగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
కళాప్రస్థానం: రూపశిల్పిగానే కాక నటుడిగా, నాటక నిర్వహకుడిగా, వ్యాఖ్యాతగా, రంగాలంకరణకుడిగా, పరిషత్ నాటకాల పరిశీలకుడిగా, రచయితగా, పాత్రికేయుడిగా పరిమళిస్తున్న అడివి శంకరరావు, అడివి వెంకటచలపతిరావు, శ్రీమతి కాశీ విశాలాక్ష్మి అన్నపూర్ణమ్మ దంపతులకు 1948 ఆగస్ట్ 7వ తేదీన కృష్ణాజిల్లా, విజయవాడలో జన్మించారు. 1965లో ఎస్.ఎస్.ఎల్.సి., 1968లో ఐ.టి.ఐ. లో ఉత్తీర్ణత. చిన్నప్పటినుండీ నాటకాభిలాష, 1968 లో ‘చేతివ్రాత బావుందని నాటకసమాజంలో ప్రదర్శించే నాటకం స్క్రిప్ట్ ఫెయిర్ చెయ్యటంతో కళారంగ ప్రారంభం. రంగాలంకరణ, లైటింగ్, నటనల్లో శిక్షణ పొదుతూ, వయసుకి, సైజుకి తగ్గ హాస్యపాత్రల్ని పోషించి, ప్రేక్షకుల ప్రశంసల్ని, బహుమతుల్ని పొందారు. మేకప్ లో గురువైన శ్రీ కె.ఎస్. శాస్త్రి గారి వద్ద శిక్షణ పొందుతూ మేకప్ మెళువలను గ్రహించి ‘మంచి’మేకప్ ఆర్టిస్ట్ గా, రాష్ట్రంలో ప్రఖ్యాతపొందారు. వందలాది ‘సన్మాన పత్రాలు ‘ రచించి, చిత్రించారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి శ్రవ్యనాటకాల్లో పాల్గొన్నారు. విజయవాడ దూరదర్శన్ (సప్తగిరి) కేంద్రంలో మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసారు. నాటకరంగంలో నాటక పరిషత్తు, సమాజాలు, రచయితలు, దర్శకులు, నటీమణులు, నటులు, సాంకేతిక వర్గమైన కళాకారుల చిరునామాలు, ఫోన్ నెంబర్లు సేకరించి అడిగినవారికి అందజేసేవారు. ఏ పరిషత్ ఏ తేదీలలో ఎప్పుడు ఎక్కడ నాటక ప్రదర్శన జరిగింది ఆ పరిషత్ జడ్జీల వివరాలు, నాటికలు, బహుమతుల వివరాలు సేకరించి పత్రికలకి అందజేసేవారు. అనేక కళా, సాంకృతిక పత్రికలకు విలేకరిగా పనిచేసారు. నాటక పరిషత్ ల్లో మేకప్ శాఖలో “ఉత్తమ ఆహార్యం”కు అనేక బహుమతులు అందుకున్నారు. అసంఖ్యాకంగా సన్మానాలు అందుకొన్నారు. 2005 నంది నాటకోత్సవాలు తిరుపతిలో జరిగినప్పుడు “పరమాత్మావ్యవస్థిత:” సాంఘిక నాటకానికి 36 మందికి వైవిధ్యభరితంగా మేకప్ వేసి ‘బెస్ట్ మేకప్ ‘ చేసి నంది అవార్డు అందుకున్నారు. నాటకమే జీవితం – జీవితమే నాటకం అన్నట్లుగా నాటకమే శ్వాసగా జీవిస్తూ తన 53 సం.ల నాటకరంగ కళాసేవలో 73 సం.ల వయస్సులో కూడా 64కళలు.కాం వెబ్ పత్రికకు వివిధ నాటకరంగ కళాకారులను పరిచయం చేస్తూ అనేక వ్యాసాలు రాస్తున్నారు.
అవార్డులు-సత్కారాలు:
- 1991 సం. మార్చి లో విజయవాడ వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం హాలులో కె.ఎస్. మూర్తి మెమోరియల్ పరిషత్ వారిచే ‘కళామిత్ర ‘ బిరుదుతో సన్మానించబడ్డారు.
- అభినయ కళాపరిషత్ పునుగుపాడు (గుంటూరు జిల్లా) వారిచే సన్మానం.
- ఆడివి శంకరరావు ‘కళా జీవిత రజతోత్సవం-2002’ సందర్భంగా దంపతులకు సన్మానం.
- భారతీయ నాటక కళాపరిషత్, వర్దన్నపేట వారిచే సన్మానం.
- నరసరావుపేట రంగస్థలి, నరసరావుపేటలో సన్మానం.
- ఆంధ్ర లలితకళా పరిషత్, సికింద్రాబాద్ వారిచే సన్మానం.
- 2013 లో విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్ళే సమయంలో ‘ఆత్మీయ వీడ్కోలు ‘ సన్మానం.
- 2018 లో ఏ.పి. రాష్ట్ర ప్రభుత్వ ‘కందుకూరి విశిష్ట పురస్కారం ‘ అందుకున్నారు.
- 2019 లో ప్రగతి కళామండలి, సత్తెనపల్లి వారిచే సన్మానం.
- 2012 లో పి.ఎన్.కె.ఎం. ఫైన్ ఆర్ట్స్, ఒంగోలు వారిచే ఢిల్లీ లో సన్మానం.
- వై. కామేశ్వరరావు నాటక పరిషత్, నెల్లూరు వారిచే ఎస్.పి. బాలసుబ్రమణ్యం గారిచే సన్మానం.
- రాయలసీమ రంగస్థలి, తిరుపతి వారిచే 2009 లో దంపతులకు సన్మానం.
- డా. కాసరనేని సదాశివరావు నాటక పరిషత్, గుంటూరు వారిచే సన్మానం.
- నాటక రంగానికి నిలువుటద్దం, నడుస్తున్న నాటకరంగం, ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ థియేటర్ అని నాటకరంగ పెద్దల ఆశీస్సులు అందుకున్నారు.
- 2020 వరంగల్ సహృదయ వారిచే మహాశివరాత్రి నాడు తనికెళ్ళ భరణి గారిచే సన్మానం, సహృదయ అవార్డ్ ప్రదానం..
– కళాసాగర్
శంకరరావు నాకు మంచి మిత్రుడు… సంతోషం…
నీకు జన్మదిన శుభాకాంక్షలు తమ్ముడు.
కె.యెస్.టి.శాయి
బాపట్ల
నా సోదరుడు ఇంకా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుతూ
64 కళలు డాట్ కామ్ లో
కళా మిత్ర అడివి శంకర్రావు గురించిన వ్యాసం చక్కని మేకప్ మెన్ గా ఆయన వ్యక్తిగత జీవితాన్ని నిబద్ధతను చక్కగా తెలియపరిచింది.
కళా రంగం మీద ఉన్న ఆసక్తి కొద్దీ స్వచ్ఛందంగా పలు పాత్రలలో ఆయన రంగస్థలానికి చేసిన సేవలు అభినందనీయం
నా 73 వ పుట్టిన రోజున…నేను ఆరోగ్యంగా ఉండాలని ప్రేమతో నన్ను “ఆశీర్వదించిన” పెద్దలకి, అభిమానంతో అసంఖ్యాకంగా నాకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలిపిన వారందరికి నా వినయాంజలి….
“కళామిత్ర” అడివి శంకరరావు,
నాటకరంగంలో నలుబదియేండ్లకు పైగా పేరుగాంచిన నాటి నటీనటుల మొదలు నేటి యువ నటీనటులకు సైతం మేముపై రంగులద్ధి అందరిచే ఆదరాభిమానాలు పొంది పేరుగాంచిన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ గా వాసికెక్కి జర్నలిస్టుగా, కాలమిస్టుగా, సమయానుకూల సందర్బోచిత గొప్ప ఫోటోగ్రాఫర్ గా సేవలందిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు.వయస్సులో పెద్దవారనే తారతమ్యబేధాలు లేకుండా చిన్నవారమైన మాతో కలిసిపోతూ తమ చమత్కారమాటలతో మముత్సాహ పరుస్తూ పనిలో మాకు తమ అమూల్యమైన సలహాలు ఇస్తూ అందరిని ఆప్యాతగా పలకరించి, అందరి మనస్సుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న మా అన్నయ్య శ్రీ అడివి శంకర్ రావు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్యర్యలతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…అన్నయ్యగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు….
బాపన్ పల్లి వెంకటస్వామి
కళామిత్రుడు అడివి శంకరరావు నా తమ్ముడు. గొప్ప మేకప్ ఆర్టిస్టు. ప్రేక్షకులు నటీనటుల అభినయానికి ఆకర్షితులై, నాటక ప్రదర్శన రక్తి కట్టాలంటే, ఆ నాటిక లేదా నాటకం లోని సన్నివేశం ఇతివృత్తము, పాత్రల మధ్య నడిచే రసవత్తరమైన డైలాగులు ఎంత ముఖ్యమో, ఆ ప్రదర్శన కి తగ్గట్టుగా ఉండే రంగాలంకరణ కూడా అంతం ముఖ్యం. అయితే పాత్రలు పోషించే నటీనటులకు తగ్గ మేకప్ ముఖ్య భూమిక వహిస్తుంది. అది నటులను తమ తమ పాత్రల్లోకి ఇమిడిపోయేట్టుగా (తాదాత్మ్యం చెందేలా ), దోహదం చేస్తూ ఒక catalyst లా పనిచేస్తుంది. ఇక ప్రేక్షకులు ఆ ప్రదర్శన లో పూర్తిగా లీనమైపోతారు. అటువంటి మేకప్ డిపార్ట్మెంట్ లో ఎంతో నిబద్ధతతో, తలలో నాలుక లా, ఎంత ఎదిగినా ఒదిగి వుండగలిగే సత్గుణసంపన్నుడు మా శంకరరావు. దశాబ్దాలుగా నాటకరంగంలో క్రమశిక్షణతో పనిచేస్తూ వస్తున్నాడు. అతడు మేకప్ ఆర్టిస్ట్ కాకమునుపే చక్కని నటుడు. ఒక నాటకం లేదా నాటిక ప్రదర్శనానంతరం అదెలా ఉంటుందో, దానికి పోటీల్లో ప్రైజ్ వస్తుందో అని వేచివుండాల్సిన పనిలేదు. మన శంకర రావు తన ఫీడ్ బాక్ ఇచ్చేస్తాడు. ముఖమాటం లేకుండా మన ముఖం మీదే “ఈ సారి మన ప్రదర్శన బాగోలేదు. ప్రైజెస్ రావన్నాయ్” అని అనేయగలడు. అంత నిర్మొహమాటంగా, కాస్త కటువుగా వున్నా, అసలు విషయం చెప్పెయ్యగలడు. అందుకు కారణం అతడికి నాటక ప్రదర్శనలోని అన్ని డిపర్ట్మెంట్ల తీరుతెన్నులు బాగా తెలుసు కాబట్టి. ఏ ప్రైజ్ రానప్పుడు, బెస్ట్ మేకప్ ప్రైజ్ తీసుకున్న సందర్భాలున్నాయి. అతడికి ఆనాటి నాలాంటి కళాకారులే కాకుండా, నేటి వర్ధమాన నటీనటులు, సాంకేతిక బృంద నిపుణులతో కూడా మంచి పరిచయాలున్నాయ్. ఇంతితై వటుడింతై… అన్నట్లు ఎదిగిపోయిన మా అడివి శంకరరావు 53 సంవత్సరాలు గా నాటకరంగంలో నిరుపమాన సేవతో బాటు, రూపశిల్పి గా 46 ఏళ్ళ అనుభవం అతడి కమిట్మెంట్ చెప్పకనేచెబుతోంది.
KST Sai.
“కళా మిత్ర” అడివి శంకర రావు గారికి అభినందనలు. ఆయన గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పిన ఈ విషయాలన్నీ వాస్తవమే కానీ నాకు ఆయన మొట్టమొదట సన్మానపత్రం రాసిన వ్యక్తిగా పరిచయం. ఈనాటి ఫోటోషాప్ లు డి టి పి లు లేని సమయంలో 1997 జూన్ 30న తన అందమైన దస్తూరి తో నాకు అయిన సన్మానపత్రం రాశారు అద్భుతంగా డిజైన్ చేశారు కూడా. తర్వాత ఎన్ని సన్మానాలు జరిగినా ఆ సన్మాన పత్రం నా జీవితంలో ప్రత్యేకం. ఆయన మేకప్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు సాహితీవేత్త, మంచి కాలమిస్ట్ కూడా, ఎన్నో వ్యాసాలు రాసిన ఘనత ఆయనది. ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ శుభాకాంక్షలు.
డాక్టర్ పి వి ఎన్ కృష్ణ.