తెలుగు నేలపై విరాజిల్లిన రమ్య చిత్రశాల

శతాధిక గ్రంథకర్త అయినటువంటి మాకినీడి సూర్యభాస్కర్ కవిగా, సాహిత్య, కళ విమర్శకుడిగా, కథకునిగా, చిత్రకారునిగా, బాల సాహిత్య స్రష్టగా, విద్యావేత్తగా-వక్తగా… ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అనేకులుగా వ్యాపించిన ఒకే ఒక్కడు! మాకినీడి. ఈ మధ్యనే షష్టిపూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి… అక్షర చైతన్య దీప్తి! ఓ సృజన ఘని!!
మాకినీడి సూర్య భాస్కర్ కలాన్ని మెచ్చిన సాహిత్యకారులు కోరి రాయించుకుంటారు. అగ్రశ్రేణి కళాకారులు అనదగ్గవారు కూడా వీరి వ్యాసం కొరకు పరితపించడం సర్వసాధారణం! వీరు ఏ కళ ప్రక్రియను ప్రారంభించినా… చక్కగా చిలకడం, మధనం నుండి మథురాన్ని దొరకపుచ్చుకోవడం… వీరికి వెన్నతో పెట్టిన విద్య. మాకినీడి అచ్చయిన పుస్తకాల కంటే అచ్చవ్వాల్సిన పుస్తకాల సంఖ్య ఎక్కువ. స్వయంగా వారిపైనే వచ్చిన పుస్తకాల సంఖ్య – 9.

Makineedi Suryabhaskar

64కళలు.కాం వెబ్ మ్యాగజైన్ అంతర్జాల పత్రికా రంగంలో 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2023 మార్చి 5వ తేదీన విజయవాడ బాలోత్సవ్ భవనంలో జరుపుకున్న పుష్కరోత్సవ సభలో మాకినీడి సూర్య భాస్కర్ రచించిన “రమ్య చిత్రశాల తెలుగు నేల” అన్న పుస్తకం శ్రీమాన్ మండలి బుద్ధప్రసాద్ గారి చేతులమీదుగా ఆవిష్కరించుకున్నది. వీరిది ఇది 104వ పుస్తకం. నాటి సాహిత్య, కళా ప్రముఖుల మధ్య జరిగిన ఈ సంఘటన రచయితకు అరుదుగా లభించే నిండు గౌరవం. అందుకు నేను ప్రత్యక్ష సాక్షిని.
ఈ పుస్తకాన్ని “తెలుగు నేలను రమ్య చిత్రశాలగా కూర్చిన చిత్రకళాకారులందరికీ…” అంటూ అంకిత మిచ్చారు – రచయిత శ్రీ మాకినీడి.

‘ఆరంభ శూరులు కారు…’ అంటూ తన తొలిపలుకుల్లో… ఎవడు తన గురించి తాను పొరుగువారు నవ్వుకునేలా మాట్లాడడు, అటువంటి మాట ఏదైనా వచ్చిందీ అంటే ఆ మాట ఎవడో అని ఉండాలి. ఇలా వచ్చిందే ఈ మాట అనుకుంటాను… అంటారు. ఆంధ్రులు ఆరంభ శూరులు అన్నది ప్రారంభించడంలోనే కానీ ఫలితాన్ని రాబట్టుకోవడంలో శూరత్వం ఆవంతయు లేని జాతి ఆంధ్రజాతి అనుకున్నట్లయితే… గొప్ప ఆధ్యాత్మిక ప్రగతికి మనం మొదటి వరుసలో నిలిచిన వాళ్ళమవుతాము. “నిస్వార్థ కృషి మోక్షపదసోపానం” అన్నది ఆర్యోక్తి.
పైమాట నుండి తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది. అదేమిటంటే… ఊరకే అలా అని తృప్తిపడ్డాడు అవతలివాడు. ఆరంభించటమే కాదు అత్యున్నత శిఖరాలకు చేర్చి పొరుగువారికి అప్పనంగా అప్పగించి పక్కకు తప్పుకని… నిత్యాన్వేషణ, నూతనాన్వేషణలో ముందుకు సాగిపోయేవాడు ఆంధ్రుడు. నాట్యం, సంగీతం, చిత్రం, శిల్పం, సాహిత్యం చరిత్రలను పరిశీలించినట్లయితే మనకున్నన్ని ఆవిష్కరణలు, చరత్రలో స్థానమేమిటో అవగతమవుతుంది.
ఆ అవతలివాడు శ్రీ చక్రవర్తుల రాజగోపాలాచారి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఆంధ్రులు ఉంటూ, తమ సొంత అస్తిత్వం కోసం ఉద్యమాలు చేస్తున్న సమయ, సందర్భాల్లో, నాటి దేశ ప్రధానమంత్రి నెహ్రూతో తనకున్న చనువుతో ఇలాంటి అవాకులూ, చెవాకులూ పేలుతూ, ఆయనను సమస్యను పట్టించుకోకుండా చేసి, ఆంధ్రుల ఆరాటాన్ని, పోరాటాన్ని నిర్వీర్యం చేస్తూండడం ఆయన ఎజెండా. ఆంధ్రులు ఆరంభశూరులనే విషయం వట్టిమాటని పొట్టి శ్రీరాములుగారి ఆత్మార్పణతో నెహ్రూగారికి పూర్తిగా తెలిసొచ్చింది.

ఆంధ్రుడు ఆరంభశూరుడే అయితే, దేశంలోనే మొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా తన సీమను నిలుపుకునే వాడా? ఆంధ్రుడు నిజంగానే ఆరంభశూరుడే అయితే, ఒకే భాషకు రెండు ప్రత్యేక రాష్ట్రాలను సాధించగలిగి ఉండేవాడా?!
చిత్రకళ రంగంలో ఆంధ్రుడే ఆంధ్యుడు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అజంత, ఎల్లోరా గుహల రూపశిల్పి, వాటిల్లోని చిత్రాల, శిల్పాల సృష్టికర్త మన ఆంధ్రుడే. ఆంధ్రుల చిత్రకళాభినివేశం అత్యుత్తమంగా ఆనాడే మొదలైంది. ఆ తరువాత నుండి ఆ స్ఫూర్తి ఎక్కడా కొరవడకుండా అలానే కొనసాగింది… అంటూ సుధీర్ఘమైన వ్యాసాన్ని తెలుగు వెలుగు మాస పత్రిక కొరకు చిత్రకళ మీద సమగ్రమైన వ్యాసం వ్రాసారు మాకినీడి. కాని, ప్రచురించే నేపథ్యంలో తెలుగు వెలుగు యాజమాన్యం కొన్ని మార్పులు చేర్పులతో ప్రచురించటం జరిగింది. అది రచయితను అసంతృప్తికి గురిచేసింది. ఆ తరువాత కాలంలో వ్యాసాన్ని సమగ్రంగా ఒక పరిపూర్ణ పుస్తక రూపంలో తీసుకురావాలన్న తలంపుతో 56 పేజీల మల్టీ కలర్డ్ బుక్ గా ఇప్పటికి తీసుకు రావటం జరిగింది. ఇందులో నాటి రాతి గుహల కుడ్య చిత్రాల మొదలు, నేటి లెలేత యువ చిత్రకారుడు తెలుగునేలపై జరిపిన చిత్రకళ ప్రస్థానాన్ని ప్రస్తావించడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ చిత్రకారులు చేసిన జీవన, కళాయాత్రను; చిత్రకళ చేరుకున్న శిఖరాలను ఉటంకిస్తూ ఈ పుస్తక రచయిత సూర్య భాస్కర్ రచించడం జరిగింది. గతంలో వీరు రాసినటువంటి రామారావు నుండి రామారావు దాకా తెలుగుకళా జగతికి రంగులద్ది అపూర్వ చిత్రాలను పూయించిన తొలి తరం చిత్రకారుని నుండి నేటి తరం చిత్రకారుని వరకు ప్రస్థావించంటం జరిగింది.
హనుమంతుని తోక ఎంత చుట్టినా వస్తుంది, ద్రౌపది కోక ఎంత లాగినా వస్తూనే ఉంటాయి. అలాగే ఆంధ్రుల కళా చరిత్రలోని ప్రముఖులను అందర్ని ప్రస్థావించినప్పటికీ కొందరు ప్రముఖులు మిగిలిపోతూనే ఉంటారు. సంపూర్ణతను సాధించటం అన్నది ఎప్పటికీ ఎవ్వరికీ సాధ్యం కాని విషయం. ఈ అసంపూర్ణతను చరిత్ర రచనా పక్రియకున్న శాపంగా భావించాలి.
“ఈ పుస్తకాన్ని ఒక విహంగ వీక్షణం చేస్తే చిత్రకళను ఆరాధిస్తూ జన్మలను ధన్యం చేసుకున్న, చేసుకుంటున్న కళాకారులు వేలమంది కళ్ళముందు కదులుతారు. అలా కదిలినవారి గురించి ఒక్క మాట! అంటూ వ్రాసిన ఆ ఒక్కో మాటను గుదిగుచ్చినదే ఈ పుస్తకం. ”అంటారు చివరిమాటగా రచయిత మాకినీడి.

  • ఆత్మకూరు రామకృష్ణ
    9493 40 5152

1 thought on “తెలుగు నేలపై విరాజిల్లిన రమ్య చిత్రశాల

  1. మా రచనలను ప్రోత్సాహిస్తూ… పాఠకులకు గొప్ప రచనలను చేరువ చేస్తున్న ఎడిటర్ గారికి ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap