
జ్యోతిర్మయి మళ్ళ ‘చూపు ఎంత అలిసిందో…!’ గజళ్ళు పుస్తక సమీక్ష.
సాధారణంగా లోకంలో చక్కగా పాడగలిగి, లయజ్ఞానం తెలిసి, కచేరీలు ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి గజళ్ళు రాస్తే ఆ గజళ్ళకున్న అందమే వేరుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు మొదటే రాస్తున్నపుడే, గజళ్ళలోని ఆ పదాలన్నీ కూడా రసాన్ని అద్దుకొని రాగాలనద్దుకుని ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణతో ముందుకు వస్తాయి అని నా నమ్మకం. జ్యోతిర్మయి మళ్ళ గారి కొత్త గజల్ సంపుటి ‘చూపు ఎంత అలిసిందో…!’ కూడా అంత అద్భుతమైనదిగా భావిస్తున్నాను. అదీ కాక జ్యోతిర్మయి గారికి గజల్ కొత్త ప్రక్రియ కాదు. వీరు ఎన్నో గజళ్ళు పాడారు, ఎన్నో కచేరీలు ఇచ్చారు. నా గజళ్ళను కూడా వారి కచేరీలలో పాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే జ్యోతిర్మయి గజలు రాయాలి అనుకోవటం అనేది ఒక రచయిత్రిగా, కవయిత్రిగా నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే రచయిత్రిగా జ్యోతిర్మయి ఎంత గొప్ప మంచి మంచి కథలు రాస్తారో నాకు తెలుసు. వారు రాసిన “తవ్వకాలు” చిత్ర కవితలు బాల్యంలోకి మమ్మల్నందర్నీ తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్క చదువరినీ కూడా వారి బాల్యపు స్మృతి పథంలోకి తీసుకెళ్ళే విధంగా రాసినటువంటి ఒక మంచి కవితలవి. అంతర్జాల వేదికగా ముఖ పుస్తకంలో అనేక మందికి గజల్ రచనా విధానాన్ని కూడా నేర్పించారు. మరి అలాంటి జ్యోతిర్మయి గజలు రాస్తే ఎంత అందంగా ఉంటుందో నేను చెప్పటం చర్విత చరణంగా ఉంటుంది. అయినా కూడా ఈ పుస్తకంలో ఆవిడ రాసినటువంటి కొన్ని గజళ్ళలోని అద్భుతమైనటువంటి పంక్తులు కొన్నిటిని ప్రస్తావిస్తాను.
మౌనానికి మాటలను నేర్పిద్దాం కాస్త మనం
చీకటికి చిరుకాంతిని అరువిద్దాం కాస్తనం
అనే ఈ పుస్తకంలోని మొదటి గజలే ఎంతో అద్భుతంగా ఉన్నది.
మేడలలో ప్రగతి జ్యోతి పూరిగుడిసె గతి చీకటి
మనుషులంత ఒకటే కాదా యోచిద్దాం కాస్త మనం
అని అందరి యొక్క భుజాలను ఒకసారి తట్టి ఒక సామాజికమైనటువంటి ముందడుగు వేసే విధంగా ఉన్నటువంటి ఒక మంచి గజల్ అది.
అట్లాగే హాయి కలిగించే గజల్.. అమ్మ గజల్
అందమంటె అమ్మదే ఎవరు లేరు లోకంలో
అమ్మతోటి ఈ మాటను చెబుతుంటే ఎంత హాయి
అంటూ రాసిన గజల్ కూడా చాలా చాలా మంచి గజల్ అది. అలాగే..
మెరుపుతీగలంటు నన్ను మురిపెముగా పిలిచితే
మురిసిపోతు చెంత చేరి నిలవాలని ఉండదా
తమలపాకులంటు కళ్ళకద్దుకుంటే పదములు
ధన్యములై చేతులెత్తి కొలవాలని ఉండదా
అంటూ రాసినటువంటి ఈ గజల్ ఎంతగానో నచ్చింది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో నాకు చాలా నచ్చినవి చాలా ఉన్నాయి. అన్నిటినీ ప్రస్తావించలేకపోయినా కొన్నైనా ప్రస్తావించాలనే ఒక లౌల్యత కొద్దీ చెప్తున్నాను.
చిన్న గెలుపులు పెద్ద ఓటమి రెండు ఒకటిగ చూడగలడు
సాధనముతో గురిని చూపే మార్గమేలే నాన్న అంటే
అంటూ నాన్న గురించి ఒక కొత్త రకమైన నిర్వచనాన్ని తెలియజేశారు.
చెమట చుక్కల స్నానమాడుకు నగవు ముఖముతొ నిలువగలడు
గూడు కూర్చుతు శ్రమను మరిచే బంధమేలే నాన్న అంటే
అంటూ నాన్నతో ఆమెకున్నటువంటి బంధాన్ని గురించి నాన్న అనే గజల్లో అద్భుతంగా రాశారు. అట్లాగే వలపు గురించి రాయని గజల్ కవి ఎవరూ ఉండరు.
పోతున్న ప్రాణాన్ని నీ వెంబడి
చూస్తుంటే బ్రతుకెంత బాగున్నది
అనేది ఒక కొత్త ఎక్స్ప్రెషన్ అని నాకనిపించింది.
కన్నుల్లో నీరల్లే తుడిచేసినా
బరువైన గురుతెంత బాగున్నది.
అంటూ దుఃఖాల్లో కూడా ఒక రకమైన ఆనందాన్ని కలిగించే స్థితిని ఎంతో చక్కగా వర్ణించారు. అద్భుతమైనటువంటి ఒక వాయులీనంలో సాయంత్రం పూట సేద తీరుతూ ఆనందంగా హాయిగా ఆప్యాయంగా వింటూ తరించాల్సినటువంటి ఒక అద్భుతమైన గజళ్ళుగా నాకు అనిపించాయి. ఇలా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే ఎన్నో గజళ్ళు ఉన్నాయి మరి అందులో నాకు ఇష్టమైనటువంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గురించి రాసిన ఒక గజల్ ఎంత బాగుందో చెప్పలేను!
జ్యోతిర్మయి మళ్ళ ‘చూపు ఎంత అలిసిందో…!‘ గజళ్ళు పుస్తకంలో మరో ప్రత్యేకత కూడా వుంది, అదేమిటంటే… ఈవిడ రాసిన గజళ్ళకు అందమైన బొమ్మలు గీయడమే కాకుండా, పుస్తక ముఖచిత్రం కూడా ఆవిడే గీశారు. గజళ్ళు పాడేవారు, గజళ్ళు ఇష్టపడేవారితో పాటుగా… సాహిత్యాభిమానుల దగ్గరా వుండవలసిన పుస్తకం ఇది.
–ఎం.బి.డి. శ్యామల
ప్రముఖ గజల్ కవయిత్రి, గాయని
ప్రతులకు:
పుస్తకం వెల: రూ. 150/-
జ్యోతిర్మయి మళ్ళ (92963 56220)