మల్లాది గారికి రాని భాషలేదు ..!

అచ్చులో తమ పేరు చూసు కోవాలని, వెండితెర మీద తన పేరు కనిపించాలని కోరుకోని రచయిత ఉండరు. వాళ్ళకి వచ్చినదానికన్నా ఎక్కువ ప్రచారం కోరుకునేవారికి భిన్నంగా తానెంత పండితుడయినా, ఎన్నెన్నో కథలు అల్లినా, అద్భుతమైన పాటలు రాసినా తనదని చెప్పుకోవాలని తాపత్రయపడని వ్యక్తి, తన సాహిత్యంతో డబ్బు చేసు కోవాలన్న యత్నం ఏ మాత్రం చెయ్యని మహాను భావుడు మల్లాది రామకృష్ణశాస్త్రి.
1905 జూన్ 17న మచిలీపట్నంలో పుట్టిన శాస్త్రి గారిది పండిత కుటుంబం. పాతికేళ్ళ వయసుకే చక్కని కథకుడిగా పేరు సంపాదించారు. చదువంతా బందరులోనే. నోబుల్ కాలేజీలో డిగ్రీ ఆ పైన తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతాల్లో మద్రాసు విశ్వ విద్యాలయం నుండి ఎమ్.ఎ. పట్టాలు పొందినా ఆయన తన పేరుపక్కన ఆ పొడి అక్షరాలు వేసుకున్నదిలేదు. ఆయనకు విద్యాభూషణ బిరుదు ఉన్న విషయం కూడా ఎవరికీ తెలియనివ్వలేదు. పదిహేను సంవత్స రాల వయసులో మల్లాదివారు ఒక కథ పంపితే అది చదివి, ఆ కథ రాసినవారెవరో బాగా వయసున్నవారై వుంటారని భావించారు ఆంధ్రపత్రిక సంపాదకులు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు.
ఆ కథ రాసింది పదిహేనేళ్ళ కుర్రాడని తెలుసుకుని ఆ కథని ‘భారతి’లో ప్రచురించటమేకాక మల్లాది వారిని దీవిస్తూ పారితోషికం పంపించారంటారు. నాటినుండి మల్లాదివారి కథలు, కథానికలు ప్రచు రించని పత్రిక లేదు.మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కథలు వేసుకోవటమంటే తమ పత్రిక హోదాని పెంచుకోవట మన్న భావం సంపాదకులకుండేది. హంసవింశతి, రాధికా సాంత్వనంవంటి అముద్రిత కావ్యాలకు పీఠికలు వ్రాసి ముద్రణ జరిపించి వెలుగు లోకి తీసుకువచ్చింది మల్లాదివారే.
బందరునుండి వెలువడే కృష్ణా పత్రిక ఆఫీసులో ముట్నూరి కృష్ణారావుగారి దర్బారులో మల్లాదివారు పాల్గొన్నారు. తెలుగు సాహితీ ప్రక్రియలలో అన్నిరకాలు ఆంధ్ర పాఠకలోకానికి చవిచూపించింది శాస్త్రిగారే.
కథ, కథానిక, నాటిక, నవల, యక్షగానం, భావ గీతాలు, నృత్యనాటికలు, లలిత, శాస్త్రీయ సంగీత బాణీ లకు పాటలు, పద్యాలు అనేకం ఆయన కలంనుండి జాలువారాయి. నాట్యం, సంగీతశాస్త్రాలలో సశాస్త్రీయ సాధికారికత మల్లాదివారికుంది.
దేశ విదేశీ భాషా సాహిత్యాలలో సమగ్ర పరిచయం రామకృష్ణశాస్త్రిగారి సొంతం. మల్లాదిగారికి రాని భాష లేదు. ఫ్రెంచ్, లాటిన్, ఉర్దూ, పర్షియన్-ఇలా పదిహేను, ఇరవై భాషలు ఆయనకు వచ్చు. కనిపించిన పుస్తకమల్లా చదవటం, తాను చదివిన పుస్తకాలను ఇతరులకు ఇచ్చి చదివించేవారు. మల్లాది వారికి విజ్ఞానం, పరిజ్ఞానం పంచటమేగాని దాచుకునే అలవాటు ఉండేది కాదు..
ఆయన సాహిత్యంలో ఒక మహా సముద్రం. అందులో నుండి ఎవరు ఎంతటి పాత్ర తెచ్చుకుంటే ఆ పాత్రను నింపుకుని వెళ్ళేవారు.. ఎవరికి ఎటువంటి సందేహం కలిగినా మల్లాది రామకృష్ణశాస్త్రిగారిని అడిగితే ఇట్టే తీరిపోయేది. ఎవరి ప్రశ్నలకూ విసుక్కున్న సందర్భంలేదు. మల్లాది రామ కృష్ణశాస్త్రి కుటుంబం అగ్రహారీకుల కుటుంబం.
ఆయన వివాహం చేసుకున్న పురాణం వారింటి అమ్మాయిది కలిగిన కుటుంబమే. బందరులో నాడున్న అనేక కుటుంబాలలో లక్ష్మీసరస్వతీల కటాక్షం కలిగిన కుటుంబాలు వారివి. అందుకే ఆయన భుక్తికోసం ఎటువంటి వ్యాపకం చేపట్టలేదు. నిత్యవిద్యార్థిగా చదువుకోవటం, తనకు తోచినది రాయటం ఇతర సాహితీమూర్తులతో చర్చలు. ఇదే మల్లాది రామకృష్ణశాస్త్రిగారి దినచర్య. అటువంటి మల్లాదివారు వ్యక్తిగత కారణాలవల్ల మచిలీపట్నంకి గుడ్ బై చెప్పాల్సివచ్చిందంటారు.

మరోవైపు మల్లాదివారి మిత్రుడు, సుప్రసిద్ధ నిర్మాత, దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం తన ‘పల్నాటి యుద్ధం’ సినిమా రచన సలహా సంప్రదింపులకు మద్రాసుకి ఆహ్వానించారంటారు. 1945లో సినీరంగంలో పనిచేయటం మొదలు పెట్టినా మల్లాదివారు తన పేరును ఎక్కడా వేసుకోలేదు.ఇక ఆయన చెయ్యని ప్రయోగం లేదు. పాట రాయటం ఒకసారి. తిరిగి రాయటాలు, అక్షరం మార్చటాలు ఆయనకు నచ్చవు. నచ్చలేదంటే అవకాశం వదులుకునేవారు.

మల్లాదివారిది ఒంటరి జీవితం. చేతిలో ఒక సంచీ, మరో చేతివేళ్ళ మధ్య సిగరెట్. ప్రతి సాయంత్రం పాన గల్ పార్క్ లో సాహిత్య సమావేశం. మల్లాదివారిది సాంప్రదాయ కుటుంబం. వారిది నారసింహ ఉపాసక కుటుంబం. ఉదయాన్నే లేచి సూర్యోపాసన చేసి, ఇలవేల్పు నరసింహస్వామికి దేవ తార్చన చేసిగాని బయటకు వచ్చేవారుకాదు. ‘నారసింహ’ అనే పదం మల్లాదివారి నోటి వెంట పలుమార్లు వస్తుండేది. చివరి రోజుల్లో వారి హృదయంలో దాగివున్న భక్తి బయటకు కనిపించటం మొదలయింది.

‘లవకుశ’ సినిమా తర్వాత నిర్మాత శంకరరెడ్డి ‘రహస్యం’ చిత్రం నిర్మించతల పెట్టి రచనాబాధ్య తలు మల్లాదివారికి అప్పగించారు. ఆ సినిమా అంగీకరించినప్పటినుండీ మల్లాది వారిలో మార్పు కనిపించిందనేవారు. మల్లాదివారు అమ్మవారి ఉపాసన మొదలు పెట్టారు. జుట్టు కత్తిరించుకోవటం మానేశారు.

క్రాఫ్ కత్తెర పడక జడలుగా మారి మెడ జారే వరకు వచ్చింది. ఆ తర్వాత ఆ జడను ముడివేయ టం మొదలు పెట్టారు. ఏమిటీ మార్పు అని అడిగితే చిరునవ్వే తప్పించి మరోమాట వచ్చేది కాదు.

ఆ సమయంలో మల్లాదివారు మంత్రశాస్త్ర గ్రంథా లను తిరగవేయటం గమనించిన సముద్రాల సీనియర్ ఆయనలో ఉపాసన మొదలైందని గుర్తించారు. . ఆ సమయంలో ‘రహస్యం’ చిత్రకథకు వన్నెలు దిద్దడం మొదలు పెట్టారు. తలలో ముడి, ఆ ముడిలో పూవు, సినిమా కార్యాలయంలోని పటాలకు పూలు పెట్టటం చేసేవారు. ఉపాసన అంత సులభం కాదు.

మనసునంతా లగ్నం చెయ్యటం, ఆహారం విష యంలో నియమాలు మల్లాదివారి ఆరోగ్యాన్ని దెబ్బ తీశాయి. అప్పటికాయన పనిచేస్తున్న ‘రహస్యం’, ‘వీరాంజ నేయ’, ‘పల్నాటి యుద్ధం’ చిత్రాలు పూర్తికావొచ్చాయి.

ఆ సమయంలో మల్లాది రామకృష్ణశాస్త్రిని ఆసు పత్రిలో చేర్చాల్సివచ్చింది. ఆయన కోమాలోకి వెళ్ళారు. అభిమానులది ఆదుర్దా, తమ గురువుకు ఏమవుతుందో నన్న భయం సినిమా శిష్యులది. రెండు రోజుల తర్వాత మల్లాదికి స్పృహ వచ్చింది.ముందుకొచ్చిన మృత్యువుతో ముచ్చట్లాడివచ్చారా? అన్నారు తోటి సాహితీవేత్తలు.

“నేను ముఖం కడుక్కుని, కాఫీ తాగి రెండ్రోజు లైందటకదా” అంటూ చుట్టూ ఉన్నవారిని నవ్వుతూ పలకరిస్తూ మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన కోమాలోంచి బయటకు రాలేదు. మళ్ళీ మెదడులో రక్తనాళాలు చిట్లాయి అన్నారు. అది సెప్టెంబరు 12, ఆదివారం ఉదయం 11.12 గంటల మధ్య మల్లాది రామకృష్ణశాస్త్రి తన షష్టిపూర్తి వయసు లోనే ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు.

-స్వాతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap