“మెలకువ చెట్టుకి పాళీలు పూయించిన కవిత్వం”

నేనిప్పుడు ధారగా కురుస్తున్న వర్షంలో ఇష్టపడి తడుస్తున్నాను. అయినా నా వొంటిమీద తడి ఎంతవెతికినా కనిపించని స్థితి. అద్దంముందు నిలబడితే తడిచి, ముద్దయిన నా మనసు కనిపిస్తోంది. నిజమే నేను తడిచింది కవితా వర్షంలో. కుండపోతగా ఆ వర్షాన్ని కురిపించింది మల్లారెడ్డి మురళీ మోహన్ అందించిన ‘నిశాచరుడి దివాస్వప్నం’ కవితా సంపుటి.

అస్పష్ట దృశ్యాలను చెరిపేసి కాంతి గనుల కళ్లతో ‘నింగి’ నేరుగా ఈ సంపుటిలో పలకరింపుకు నేలమీదికి దిగివచ్చింది. ఎదురెదురు అద్దాలమధ్య, అనంతమైన ప్రతిబింబాలను చూస్తూ ఈ లోకంలో పలకరించే నీడలకోసం కాంతులీనే గాజుతెరపై శోధనలు మొదలుపెట్టి తనతో నన్ను రమ్మని ఆహ్వానించింది. నాలుక మడతల్లో నిద్రిస్తున్న రాతి దేహం, నిశ్శబ్దాన్ని వదిలి అడవి రుచిని తెలిపే తేనె పూచిన కళ్లతో పచ్చని దృశ్యాలను పద్యంలా చదువుతోంది. ఇంతలో దూరంగా ‘మనిషితనం గుభాళించాలంటే, తాను ప్రయాణించే దారిపొడుగునా ప్రతీ చేష్టా, ప్రతీ స్పర్శా ప్రకృతికి పర్యాయపదమై వుండాలని కొన్ని పాఠాలు వినిపిస్తున్నాయి. గుంపులు, గుంపులుగా వింటున్న వాళ్లంతా మానవజాతి సంతతే. పాఠాలను వినిపిస్తున్న కంఠాలన్నీ అక్షరలకు సంబంధించిన అవయవాలే. నదులు మనుషుల నరాల్లో ప్రహించాలంటే దేహాన్ని పడవను చేసి, జల చర్మంపై ఇంకిపోవాలని, ఆకాశాన్ని తలపై ధరించాలంటే శిఖరాల్ని మచ్చిక చేసుకుని మబ్బుల భాష నేర్చుకోవాలని, శ్రమని ధ్యానించాలంటే మట్టి రుచి తెలిసి వుండాలని…ఇలా మనుషుల్ని మహనీయులుగా మార్చే పాఠాల ప్రవాహం చాలా ఆసక్తిగా కొనసాగుతూనే వుంది.

అక్కడ నడుస్తున్న నీడలు ఈ సంపుటి కవిని పరిచయం చేస్తున్నాయి. ఎదురుపడ్డ కొందర్ని అతడు మీటుతూ వెళ్తున్నాడు. వీణా నాదాన్ని మోస్తున్న సంగీతం కవి వొంట్లోకి వొలకటం గమనిస్తున్నాను. మరికొందరితో కరచాలనం చేయగానే కవి దేహం మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. ‘పల్లకీ’ అయినా, ‘పాడె’ అయినా కవి తన భుజాన్ని అందిస్తున్నాడు. ఫలితంగా తనను వెంటాడే వేలాది ప్రశ్నలకు సరైన సమాధానాలు అస్త్రాలుగా తన ఖాతాలో చేరుతున్నాయి. అంతే, పాదాలు తెగిన చోట తిరిగి పునః ప్రయాణానికి ప్రాణం పోస్తున్నాడు. ఊపిరి ఉష్ణంతో దిక్కుల్ని వేడిక్కించాలని, అభీష్టాలు భగ్నమైన చోటనే సంకల్ప విత్తనాలు చల్లుతున్నాడు. మొలకెత్తిన ఆ విత్తనాల శరీరాలనుంచి కవితా మహావృక్షాల ఆవిష్కరణకు తూర్పున ఉదయించే అరుణకాంతుల సమూహం ఆహ్వానాలు పలుకుతోంది. సరిగ్గా ఆ క్షణాలలో తాను మెరుస్తూ, జీవిస్తూ, గతంలోంచి చిట్లిపోతూ, చెరిగిపోతూ, గతించిన జ్ఞాపకాల బరువును త్యజించుకుంటూ, రేపు అన్న మిథ్యని వెలివేస్తూ, నిన్న, రేపన్నవి లేనట్టు, ఈ క్షణాన పుడుతూ, మరో క్షణాన అంతమవుతూ, కాలరేఖపై గతిశీల యాత్రికుడై, దుఃఖరహిత వ్యవస్థకై తపిస్తూ, ఎడారి పలకరింపులతో మెలకువకి పట్టిన చెదలను చీల్చి చెండాడుతూ, చీమల పుట్టమీద పీడకలలా పరచుకున్న పాము కుబుసానికి చెల్లు చీటీలు రాస్తూ, అస్తిత్వరహిత రహస్యాలను మోస్తున్న సముద్రాల ఒరిపిడి లోపలి నిశ్శబ్దాన్ని శబ్దంగా మార్చిన ధ్వని తరంగాలను తన కవితల కంఠాలకు అదనపు శక్తిగా అందిస్తూ, అతడు నడిచే పాదముద్రలనిండా శాశ్వతంగా నిలిచే గుర్తులకు శాసనాలు రాయటం స్పష్టంగా నేను ఈ సంపుటిలో వీక్షిస్తున్న ఓ అపురూప సత్యం.

వీధి చివర ముసలి మర్రిచెట్టు. దాని నీడలో సకల జీవుల సమావేశం. మర్రిచెట్టు నిలబడ్డ చోట నేల, మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టింది. తన అనుభూతుల పర్వాల నుంచి ఒక అధ్యాయాన్ని తెరచి మనిషిని పరిచయం చేసే వాక్యాలను ఒక వ్యాఖ్యాతగా వినిపిస్తోంది. ‘మట్టి దుప్పటి కప్పుకుని, విశ్వరూపాన్ని దాచుకున్న విత్తనం నుండి జీవ భాష నేర్చుకుంటున్న సేద్యకారుడు – మనిషంటే.., జనన, మరణాల జాతరలో తప్పిపోయి, మిథ్యాలోలకాన్ని అన్వేషిస్తున్న మాయావంచితుడు – మనిషంటే.., వర్ణ పంజరంలో చిక్కుకుని రెక్కలు కుట్టుకుంటున్న క్షణ భంగురం – మనిషంటే.., ప్రకృతి పాడే మర్మగీతం- మనిషి, చెట్టు చిమ్మిన ఆకుపచ్చని దివిటీ – మనిషి…’ అంటూ నేల తన సుదీర్ఘ ఉపన్యాసానికి భరతవాక్యం పలికాక, మామూలు మనిషి అమాంతం ఆకాశం ఎత్తుకు తన రూపాన్ని విస్తరించుకోవటానికి తన భుజాలను ఆసరాగా అందించిన మల్లారెడ్డి మురళీ మోహన్ కవిత్వ సాధనకు జీవులన్నీ ఒక్కసారిగా లేచి నమస్కారం చేస్తున్నాయి.

తనని చూడలేని వారికోసం ఆపేక్షతో నీటి విత్తులు పంపిన కడలి తరంగాల చేతివ్రాతల్ని చిత్రపటాలుగా ఈ కవితా సంపుటి అందిస్తోంది. ఇంతలో ఆకాశంలో మేఘాలు ఉరిమిన శబ్దం. మట్టి దుప్పటిపై నెర్రల పగుళ్లను కుట్టేందుకు పోటిపడి చినుకు సూదుల సైన్యం నేలను చేరి, కొన్ని అపరిష్కృత ఖాళీలను పూరిస్తోంది. వాన ఇపుడు మరుగునపడ్డ జ్ఞాపకాలని పునశ్చరణ చేయించే గురువుగా మారింది. అలసిన తనువు తరువుని లాలించే తోటమాలిగా మారిన వాన, చిన్నప్పట్నించీ వింటూ వస్తున్న ఒక పూర్తికాని కథలా తడితో ఈ సంపుటి నిండా కురుస్తోంది. అగ్నికీలల అంచున నడిచే లాఘవాన్ని అలవాటు చేసుకుంటున్న కవి కలం నుండి వెలువడే అక్షరాలు, దహించే ఆలోచనల క్రతువు జరిపించుకుని అగ్నిపునీత అక్షరాలుగా కవితల సృజనకు సిద్ధమవుతున్నాయి. ఎక్కడ్నుంచి వాలిపోయిందో కానీ ‘ఉక్కపోత’ మైనపు పూతలా దేహమంతా పూసుకుంటూ, ఆమ్లవర్షంలో ఆత్మ తడిచిపోయేలా చేస్తోంది. రాతిపొడిని గాలినిండా చల్లిన ‘ఉక్కపోత’ ఆనందంగా నవ్వుతూ వినోదిస్తోంది. వేగంగా వీస్తున్న గాలి, నేరుగావచ్చి వొంటిని తాకుతూ ‘మెదడులో పెరిగిన బ్రహ్మజెముడు పొదల్ని ఇప్పుడే తగలబెట్టేమంటోంది. ప్రకృతితోబాటే మనిషిని ప్రయాణించమంటోంది. పంచభూతాలను దాటిపోవద్దని హితువు పలుకుతోంది. అరచేతుల్లో ‘ఆరి’ దాగి ఉందేమో దోసిళ్లతో నదుల్ని జల్లెడ పట్టమంటోంది. ఈ సంపుటిలో గాలి, జ్ఞానాన్ని బోధించే ఒక గురువు రూపంలోకనిపిస్తోంది. అందుకే వొద్దికగా వినయపూర్వకంగా గాలికి నమస్కరిస్తున్నాను.

సంఘర్షణలతో నిత్యం అంతర్యుద్ధం చేస్తూ, చుట్టుముట్టే సమస్యలను గురువులుగా భావించే ఈ కవి, మన చేతిలోని సంపుటి నిండా రాజుగాను, సైన్యంగాను అంతా తానై కనిపిస్తున్నాడు. రాత్రి కప్పుకున్న దుప్పటి క్రింద తన కళ్లు పొదిగిన కలల గుడ్లను జాగ్రత్తగా దాచుకుంటున్నాడు. దుప్పటి లోని ధూళి నిండా తన కలల వాసనను ఆస్వాదిస్తున్నాడు. సంపుటిలోని కవితల్ని చదివాక, వచన మైదానాల్లో నిరంతరం సంచరిస్తూ, కవిత్వ శిఖరమెక్కి గురి చూసి పట్టుకోవాలన్న ఆరాటం తనని బాగా వెంటాడుతున్నట్లు స్పష్టమవుతోంది. భౌతిక స్థితిలోని అనేక శబ్దాలను, కవితా చిత్రాలుగా మార్చడంలో కవి నేర్పరితనం ఒక మొనాలిసా చిత్రపటంలా మారిపోతోంది. కొత్త పదాలను సరికొత్త పట్టుచీరల్లో పరిచయం చేస్తూ, కవిత్వానికి ఒక కళాత్మక తత్వాన్ని శాశ్వతం చేసే దిశగా ఆయన కలం పరుగులు తీస్తూ ఇలా పలకరించటం, పాఠకుల జ్ఞాపకాలలో నిత్యం కదిలి, కదిలించే ఓ కమనీయ దృశ్యరూపం.

ఈ సంపుటిలోని ప్రతి కవిత సముద్రమంత గంభీరతను, ఆకాశమంత నవ్యతను మన అభిరుచి గడపల దగ్గరకు మోసుకొస్తోంది. కవి ప్రయోగించిన సూక్ష్మమైన భావాలన్నీ, అనంతమైన అర్థాలను ఆవిష్కరించే దృశ్యాలుగా పలకరిస్తున్నాయి. మనందరి నీడలు చిత్రంగా ఎక్కడో ఒకచోట వాటి ఉనికికి సంతకాలు పెడుతున్నాయి. ఎంతో విలువైన సాహిత్య సంపదగా ఈ సంపుటి నిలవడానికి కారణం, కవి తనలో తాను నిరంతరం అనంతానంత అంతర్ధహనాన్వేషణ గావించడానికి సిద్ధపడటమే. సంపుటిలోని కవిత్వం సరికొత్త రూపాలలో, నూతన అభివ్యక్తీకరణలతో, కవిలో ఒక అంతర్వాహినిలా ప్రవహించడం వలన, ఫలప్రదమైన సాహిత్య సృజన నడిచే రహదారుల నిర్మాణాలకు రాచమార్గాలను కేటాయించడం సులభతరంగా మారింది. ఈ సంపుటిలోని కవిత్వాన్ని చదివిన ప్రతి మనసు, తిరుగులేని ఒక గొప్ప సంతృప్తి సామ్రాజ్యాలకు అధిపతి కావడం అతిశయోక్తి కాదు కాని, నిజాయితి స్వేచ్ఛగా నిక్కచ్చిగా రాసిచ్చే తిరుగులేని శ్వేతపత్రమిది. లెక్కలేనంతగా చిప్పిల్లిన కవి కన్నీళ్లకు, లెక్కలేనన్ని రాత్రుల స్వభాషణ ఫలితమే ఈ కవిత్వమని నింగి, నేల, నీరు, నిప్పు, గాలి… సమూహికంగా బృందగానాల కచేరీకి సిద్ధమవుతున్నాయి. ‘నిశాచరుడి దివాస్వప్నం’ కవి ఖాతాలో ఇది మొదటి సంపుటి. కాని, అతని దస్తూరి, చిరునామాలు మాత్రం ఎప్పటికీ తడి ఆరని మెరుపులతో పాఠకులతో కరచాలనం చేస్తూనే వుంటాయి. ‘ఈ పుస్తకం తనకు మరో పుట్టుక’ అంటూ ప్రకటించుకున్న కవి మల్లారెడ్డి మురళీ మోహన్ కు మరొక్కసారి సాహిత్య అభినందనలతో సెలవ్….

సాహిత్య ప్రపూర్ణ డాక్టర్ కె.జి. వేణు,

(హైదరాబాదు నుండి వెలువడే “సృజన క్రాంతి” దినపత్రికలో సౌజన్యం)

(ప్రచురణ: జులై, 2024, వెల: 130/-, ప్రతులకు: 45-54-5/10, శివా అపార్టుమెంట్, అబిద్ నగర్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం – 530 016. సెల్: 88611 84899)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap