కృష్ణాతీరంలో మల్లెతీగ కార్టూన్లపోటీ ఫలితాల కరపత్రాలు ఆవిష్కరణ
శ్రీమతి ఘంటా ఇందిర స్మారకంగా మల్లెతీగ నిర్వహించిన కార్టూన్లపోటీ ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ కృష్ణానదీ తీరాన వెలువరించారు. ఫలితాల కరపత్రాలను వెలువరించి బహుమతులు గెల్చుకున్న కార్టూనిస్టుల పేర్లను ప్రకటించారు. 10 వేల రూపాయల అత్యుత్తమ బహుమతిని విజయవాడకు చెందిన బొమ్మన్ గెలుచుకోగా, 5 వేల రూపాయల ఉత్తమ బహుమతిని హైదరాబాద్ కు చెందిన మాధవ్ గెలుచుకున్నారు. 500 రూపాయల ప్రత్యేక బహుమతుల్ని వల్లూరి కృష్ణ (హైదరాబాద్) పి.చిదంబరం (విజయవాడ), జెన్నా (విశాఖపట్నం), ప్రసిద్ధ (హైదరాబాద్), భూపతి (కరీంనగర్), గోపాలకృష్ణ (పెనుగొండ), డి.శంకర్ (కోరుట్ల), ఆదినారాయణ(విజయవాడ), నాగిశెట్టి (విజయవాడ), ఎన్.శేషయ్య (తిరుపతి), పైడి శ్రీనివాస్ (వరంగల్), వినోద్ (సఖినేటిపల్లి), అరుణ్ (హైదరాబాద్), మురళీధర్ (విజయవాడ) గెల్చుకున్నారు.
ఈ సందర్భంగా బహుమతి ప్రదాత డా. ఘంటా విజయకుమార్ మాట్లాడుతూ- గుండెగాయమై రక్తమోడుతున్న పర్యావరణాన్ని, వివిధ రంగాల్ని ప్రభావితం చేస్తున్న రాజకీయరంగాన్ని, తన అభివృద్ధి కోసం వినియోగించుకోవాల్సిన సోషల్ మీడియాని మనిషి మరో కోణంలో ఉపయోగించుకుంటూ తన జీవితాన్ని, మనుగడని, భవిష్యత్తుని, చివరికి దేహాన్ని కూడా ఛిద్రం చేసుకుంటున్న విపరీత పోకడల్ని, మసిబారుతున్న మానవీయ విలువల్ని, మానవత్వాన్ని తమ కార్టూన్లలో కార్టూనిస్టులు ప్రతిఫలింపజేశారన్నారు.
మల్లెతీగ వ్యవస్థాపక అధ్యక్షులు కలిమిశ్రీ మాట్లాడుతూ – ఒక సినిమా, ఒక నవల, ఒక కథ, ఒక కవితలో చెప్పే గొప్ప సందేశాన్ని చిన్న కార్టూన్లో అందించగల నేర్పరులు.. మానసికశాస్త్ర నిపుణులు.. సమాజ పథనిర్దేశకులు కార్టూనిస్టులు అన్నారు. పోటీకి వచ్చిన కార్టూన్లలో నేటి సామాజిక, రాజకీయ అంశాల్ని, ఆ అంశాల్ని విజువలైజ్ చేసే విధానాల్ని, క్యాప్షన్స్ ని, ఆ క్యాప్షన్స్ లోని క్లుప్తతని, కాప్షన్ లెస్ ని , బొమ్మల్ని కూడా బహుమతుల ఎంపికలో పరిగణలోకి తీసుకున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వై.జె. టీవీ ఎండీ గంగాధర్ మాట్లాడుతూ- మల్లెతీగ కార్టూన్లపోటీలు పెట్టి కార్టూనిస్టుల్ని ప్రోత్సహించడం, ఒక్క కార్టూనిస్టు కి పదివేల రూపాయలు బహుమతిగా ఇవ్వడం తెలుగు పత్రికారంగంలో ఇదే ప్రధమమని అన్నారు. అందుకు సహకరించిన ఘంటా విజయ్ కుమార్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మల్లెతీగ అసోసియేట్ ఎడిటర్ కె. సంపత్, మల్లెతీగ బాధ్యులు చొప్పా రాఘవేంద్రశేఖర్, కుర్రా సురేష్బాబు, ఎ.జి.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు భాష, సాహిత్యాలకు తమ పత్రిక ద్వారా ఎనలేని కృషి చేస్తున్న మల్లెతీగ పత్రిక కార్టూన్ల పోటీ2023 లో నాకు అత్యుత్తమ బహుమతి రావడం ఎంతో సంతోషం. మల్లెతీగ పత్రిక వారికి, బహుమతి ప్రదాత డా. ఘంటా విజయ్ కుమార్ గార్కి నా కృతజ్ఞతలు!🙏🙏బొమ్మన్