ఆగస్టు 23న విజయవాడలో ‘సృజనోత్సవం’

‘సృజనోత్సవం’లో మల్లెతీగ గిడుగు సేవా పురస్కార గ్రహీతలకు అభినందనలు

పైనేని తులసీనాథం నాయుడు :చిత్తూరుజిల్లా పలమనేరులో లక్షలాది రూపాయల విలువ చేసే తన సొంత స్థలంలో దాదాపు 30 లక్షల సొంత నిధులతో ‘కళామందిరం’ నిర్మించి – తెలుగుభాషపై వున్న మమకారంతో ఆ కళామందిరాన్ని తెలుగుభాషా సేవకే ఉపయోగిస్తున్న ఉపాధ్యాయుడు. తన అర్థాంగి శ్రీమతి పుష్పగారితో కలిసి ‘తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితిని స్థాపించి, తెలుగు భాష మన ఆత్మ అంటూ భాషా సేవలో తరిస్తున్న ఆలూమగలు. ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో, ఒకరి జీతాన్ని సాహిత్యానికి, భాషా సేవకే ఖర్చు చేస్తున్న సేవామూర్తులు. సమాజం ఎంత యిచ్చినా యింకా కావాలనే తపన తప్ప, తిరిగి సమాజానికి యిచ్చే మహనీయులు ఎందరుంటారు… తులసీనాథం నాయుడు-శ్రీమతి పుష్ప గారి లాంటి వాళ్ళు తప్ప.

షేక్ కరీముల్లా : ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రగతి శీల ప్రజాకవి ‘షేక్ కరీముల్లా’. ముస్లిం రచయితల సంఘం వ్యవస్థాపకులు. ‘నేనెప్పుడూ పీడిత ప్రజల పక్షపాతినే.. ఎక్కడ దుఃఖం వుంటే అది నా దుఃఖమే అవుతుంది’ అంటూ దుఃఖితుల పక్షాన కవిత్వమై నిలబడుతున్న అభ్యుదయ కవి షేక్ కరీముల్లా. వినుకొండలో ఏ తాయిలాలకూ, ఏ రాజకీయ పక్షాలకూ లొంగని నిఖార్సయిన గుండె… నిటారుగా నిలబడ్డ సాహితీ జాతీయ జెండా కరీముల్లా గారు. ‘అబాబీలు’ అనే కొత్త సాహితీ ప్రక్రియకు రూపకల్పన చేసి వందలాది కవులను ఆ ప్రక్రియ వైపు నడిపించిన సాహితీ ధీరుడు ఆయన. మూడున్నర దశాబ్దాల నిరంతర సాహితీ సేవకు గుర్తింపుగా పాఠశాలల్లోని ప్రభుత్వ ‘సిలబస్’లో కరీముల్లా కవిత్వాన్ని పాఠ్యాంశాలుగా పెట్టడం, ఆయన సాహిత్యం పై విద్యార్థులు పరిశోధనలు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ ప్రభుత్వపరంగా రావాల్సిన అవార్డులు అందుకోలేకపోవడం ఆయన నిస్సహాయతే అని చెప్పాలి. ఎందుకంటే కరీముల్లా గారు సాహితీసృజనలో ముందున్నప్పటికీ ‘మేనేజ్’ చేయడంలో వెనుక బెంచీ విద్యార్థి. ‘మేనేజ్’ చేయడం ఆయన వ్యక్తిత్వానికి పూర్తి విరుద్ధం.

తూములూరి రాజేంద్రప్రసాద్ : తిన్న యింటి వాసాలు లెక్కపెట్టే సంస్కృతి స్వేచ్ఛగా సంచరిస్తున్న నేటి సమాజంలో ‘తనకు అన్నం పెట్టిన వారి పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు డా. పట్టాభి సీతారామయ్య గారి జ్ఞాపకంగా ‘డా. పట్టాభి కళాపీఠము’ స్థాపించి, పదహారేళ్ళుగా నిరంతర సాహితీ సేవ చేస్తున్న సేవాసొగసరి డా. తూములూరి రాజేంద్రప్రసాద్ గారు. పూర్వ ఆంధ్రాబ్యాంక్లో ఉన్నతమైన ఉద్యోగం చేసి వాలెంటరీగా పదవీ విరమణ పొందిన ఉద్యోగ మిత్ర, ఖాతాతారుల ప్రియనేస్తం ఆయన. పర్యావరణంపై పుస్తకాలు రాసి రచయితగా, కవిగా, న్యూస్ రీడర్ గా, వక్తగా, వ్యాఖ్యాతగా, మోడరేటర్ విభిన్న పాత్రల్ని అలవోకగా నిర్వహించే ప్రతిభాధురీణుడు డా. రాజేంద్రప్రసాద్ గారు. తన సొంత నిధులతో పదహారేళ్ళుగా పట్టాభి కళాపీఠం ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రతిభామూర్తులను గుర్తించి వందలాదిమందికి పురస్కార భాగ్యాన్ని ప్రసాదిస్తున్న సామాజిక, సాహితీ సేవాసంస్కారి డా. రాజేంద్రప్రసాద్ గారు.

విల్సన్ రావు కొమ్మవరపు : నాగలిని కూడా ఆయుధంగా ఎక్కుపెట్టగల సాహస కవి విల్సన్ రావు గారు. వృత్తిరీత్యా జీవిత బీమా సంస్థలో అంచలంచలుగా ఎదిగిన ఉన్నతాధికారి. ప్రవృత్తిరీత్యా ఆయన సహజ కవి. తాను బతుకుతూ పక్కవారిని బతికించాలనుకొనే నిస్వార్థ వ్యక్తిత్వం కలిగిన విల్సన్రావు గారు సృజన క్రాంతి దినపత్రికలో సాహిత్య పేజీ సంపాదకులుగా ఎందరో కవులకు, రచయితలకు, వ్యాసకర్తలకు ఆయన ఇస్తున్న చేయూత ఎవ్వరూ మర్చిపోలేనిది. విలువైన 10 గ్రంథాలను సమాజానికి అంకితం చేసిన విల్సన్ రావు గారి ఖాతాలోకి లెక్కలేనని పురస్కారాలు నడిచి వచ్చాయి. వీటికితోడు వివిధ సాహితీ సంస్థల నుంచి సాహిత్య పురస్కారాలు, వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కవితల పోటీలలో విజేతగా బహుమతులు ఆయన జీవితంలో అతి సాధారణ విషయాలుగా సంచరిస్తుంటాయి. కవిగా, రచయితగా, కాలమిస్టుగా, సాహితీ సంపాదకుడిగా వివిధ ప్రావీణ్యతలకి నెలవైన విల్సన్ రావు గారు ఏమాత్రం ‘అహం’ లేని సాహితీవేత్త, సౌమ్యానికి, సహృదయతకు చిత్రపటం. సామాజిక రచనలతో సమాజాన్ని చైతన్యపరిచే ప్రగతిశీలి… పురస్కారాల కోసం పరుగులెత్తని ప్రతిభాశాలి. కవికుండాల్సిన అత్యుత్తమ అర్హత మంచి మనిషిగా బతకడమైతే, మంచి ‘మనిషి కవి’ కొమ్మవరపు విల్సన్ రావు గారు.

రేపాక రఘునందన్ : కృష్ణాజిల్లా అభ్యుదయ రచయితల సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా, తిరువూరు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా అనేక కార్యక్రమాల ద్వారా నిరంతర సాహిత్యసేవ చేస్తున్న కవి, రచయిత రేపాక రఘునందన్ గారు. ప్రతిజ్ఞ రూపకర్త ‘పైడిమర్రి’ పుస్తకంతో దేశభక్తిని, జాతీయ భావాలను యువతలో నింపిన ఆదర్శనీయ ఉపాధ్యాయుడు, విద్యావేత్త ఆయన. భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు” అంటూ జాతీయ ప్రతిజ్ఞను రచించి భారతీయులకు వారసత్వ సంపదగా ఇచ్చిన శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను పరిశోధన చేసి పుస్తక రూపంలో వెలుగులోకి తీసుకువచ్చిన రచయిత రఘునందన్. అంతేకాదు భారతదేశంలోనే మొట్టమొదటిగా పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి శిలా విగ్రహాన్ని తిరువూరు మండలంలోని మల్లేల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పైడిమర్రి వెంకట సుబ్బారావు కుటుంబ సభ్యులతో ఆవిష్కరింప జేసిన కృషీవలుడు రేపాక రఘునందన్ గారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా దాదాపు 50 వేల రూపాయల సొంత నిధులతో పైడిమర్రి వెంకట సుబ్బారావు ముఖచిత్రంతో తపాలా కవరును విడుదల చేయించిన సేవామూర్తి. పరీక్ష ఫీజు కట్టలేని నిరుపేద విద్యార్థులకు ఫీజులు కట్టడమే కాకుండా పుస్తకాలు కూడా కొనిచ్చే సహృదయశీలి, సేవానిరతుడు రఘునందన్ గారు.

జ్యోతి మువ్వల : ఈ మధ్య సాహితీలోకంలోకి చాలా వేగంగా దూసుకొచ్చిన పేరిది. సాఫ్ట్వేర్ రంగంలో తలమునకలవుతూనే సాహిత్యంలోకి ఓ చూపు విసిరిన కవయిత్రి, రచయిత్రి. కవిత్వం రాస్తూనే కథలపై కూడా పట్టు సాధించడం కోసం తపన పడుతున్న కథకురాలు. ఆన్లైన్ పత్రికల్లోనూ, అచ్చవుతున్న పత్రికల్లోనూ మువ్వల జ్యోతి రచనలు చాలా వేగంగా దూసుకొస్తున్నాయని ‘అప్ డేట్’ అవుతున్న వారందరికీ తెలుసు. సోషల్ మీడియాను ఉపయోగించుకోవడంలో మెళకువలు తెలిసిన జ్ఞానిగా, కవిత్వాభిమానులకు, కథా ప్రేమికులకు అభిమానిగా మువ్వల జ్యోతి గారి ప్రస్థానం నేటితరం సాహితీవేత్తలకు స్ఫూర్తిదాయకం.అభినందనలు మేడమ్.

ఎం. వరలక్ష్మీ కళ్యాణి : తన అమృతగళంతో శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేయగల వరలక్ష్మీ కళ్యాణి గారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వాస్తవ్యులు. విజ్ఞాన వివేక్ యూనివర్శిటీలో సంగీత ఉపాధ్యాయినిగా పని చేస్తూ, దశాబ్దాల అనుభవాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసి సమాజం రుణం తీర్చుకుంటున్న సేవాగుణం ఆమెది. సంగీతాన్ని నమ్ముకోవడం తప్ప అమ్ముకోవడం ఎరుగని సరళకంఠి, సహజకంఠి, సహృదయ సేవాగాయనీమణి శ్రీమతి ఎం. వరలక్ష్మీ గారు.

డా. వి. రఘుపతి : చిత్తూరుజిల్లా వి. కోట పట్టణాన్ని కళల రాజధానిగా చేసిన కళామతల్లి ముద్దుబిడ్డ డా. వి. రఘుపతి. ‘కళాలయ’ సాహిత్య సాంస్కృతిక సంస్థను స్థాపించి దశాబ్దాలుగా ఎందరో వర్థమాన కవుల్ని ప్రోత్సహించి వారిని ప్రవర్థమాన కవులుగా తీర్చిదిద్దిన సాహితీమూర్తి. చిరుప్రాయంలోనే రుద్రవీణ కావ్యం రచించి, ప్రభుత్వం నుండి బాలకవి అవార్డును, ఉత్తమ గ్రంథ అవార్డును పొందిన కవి. అసంఖ్యాకమైన కళా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన కార్యశీలి రఘుపతి గారు. ‘కుప్పం వైభవం’, ‘కోటి లింగాల క్షేత్రం’ వంటి చారిత్రక, ఆధ్యాత్మిక గ్రంథకర్త. వి.కోట పట్టణానికి సమీపంలో గల కృష్ణమ్మ కొండకు లక్షలాది రూపాయల ఖర్చుతో రహదారిని నిర్మించి వేణుగోపాలస్వామి ఆలయాన్ని భక్తులకు దగ్గర చేసిన ఆధ్యాత్మిక సేవకుడు. అలాగే షిర్డీ సాయి, ఆంజనేయస్వామి ఆలయాన్ని పునర్మిర్మాణం చేసిన ధార్మికోత్తముడు రఘుపతి గారు. రాగశ్రీ దివ్యజ్ఞాన విద్యాలయం (ఎల్ కె. జీ నుండి పి. జి. వరకు) స్థాపించి వేలాదిమంది విద్యార్థులకు జ్ఞానభిక్షను పెట్టి వారికి మంచి జీవితాన్ని ప్రసాదించిన విద్యావేత్త. దానధర్మాలు, అన్నదానాలు చేయడంలో ముందువరుసలో వుంటారు డా.రఘుపతి గారు.

డా. తేలి పార్థసారధి : పోలవరంలో గిరిజన సంక్షేమశాఖ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసి ట్రైబల్ సంక్షేమ అధికారిగా పదోన్నతి పొంది, విద్యాశాఖ అధికారిగారిగా పదవీ విరమణ చేసిన కార్యశూరుడు డా. టి. పార్ధసారధి గారు. పార్థసారధి గారు రాసిన పది గ్రంథాలు అచ్చయి, మరో పది గ్రంథాలు అచ్చుకోసం నిరీక్షిస్తున్నాయి. డిగ్రీ, పీజీ. ఉపాధ్యాయులకు ఉచిత శిక్షణనిస్తూ విద్యాదానం, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సంస్థలో ప్రణాళికా అధికారిగా సేవలందిస్తూ సాహితీ సేవ చేస్తున్న ‘సాహితీరత్న’ శ్రీ పార్థసారధి గారు. పద్యకవిత్వంలో మంచి పట్టు సాధించిన కవిగా, విద్యావేత్తగా, సాహితీ సేవకుడిగా అనేక పురస్కారాలు పొందారు.

వసుధ బసవేశ్వరరావు : ‘వసుధ’ పేరుతో 22 పుస్తకాలు రాసిన వసుధ బసవేశ్వరరావు గారు ఆంధ్రా బ్యాంక్లో పని చేసి పదవీ విరమణ పొందారు. మినీ కవిత్వం, హైకూలు, వచన కవిత్వంలో తన ప్రతిభని చాటుకున్నారు. ‘కొల్లేటి తీరాన’ పేరుతో కొల్లేటి ప్రాంత కవుల కవిత్వాన్ని అచ్చేశారు. సునామీ, కరోనా కల్లోలం, తెలుగు వ్యధ వంటి సమకాలీన సమస్యల్ని ఎప్పటికప్పుడు కవిత్వం చేసే సాహితీతేజం వసుధ గారు.

Share via
Copy link
Powered by Social Snap