చిత్రకళాసేవలో మామిడిపూడి కృష్ణమూర్తి

ప్రసిద్ధ చిత్రకారులు, తెలుగునాట లలితకళారంగ వ్యాప్తికై ఎనలేని కృషి చేసిన మామిడిపూడి కృష్ణమూర్తి గారికి సిరికోన సాహిత్య అకాడమీ “కళాశ్రీ పురస్కారం” ఇవ్వడం సిరికోనకు, తెలుగువారందరికీ గర్వకారణం, గౌరవం.
మామిడిపూడి కృష్ణమూర్తి గారు ప్రముఖ న్యాయవాది, విద్వాంసుడు, అభ్యుదయవాది, స్వర్గీయ రామకృష్ణయ్య గారి కుమారులు. రామకృష్ణయ్య గారు ప్రముఖ ఆచార్యులు మామిడిపూడి వెంకటరంగయ్య గారికి స్వయానా సోదరులు.
1935 లో నెల్లూరులో జన్మించిన కృష్ణమూర్తి గారు, 1956 లో చరిత్రలో పట్టా పుచ్చుకున్న అనంతరం మద్రాస్ కాలేజ్ ఫైన్ ఆర్ట్స్ లో ఆరు సంవత్సరాల కోర్సులో ప్రవేశించి, ఒక సంవత్సరం మినహాయింపు పొంది ఐదేండ్లలోనే కోర్సు పూర్తి చేసుకున్నారు.

రాజారవివర్మ ఆధునిక భారతీయ చిత్రకళకు ఆద్యుడని చెప్పదగినప్పటికీ, ఆయన చిత్రరచన పాశ్చాత్య రియలిజం పద్ధతుల్లోనే కొనసాగింది. ఆధునిక భారతీయ చిత్రకళలో ప్రాచ్య, లేదా, జాతీయ పద్ధతులను ప్రవేశపెట్టిన వారిలో అబనీంద్రనిథ్, గగనేంద్రనాథ్ టాగూర్ సోదరులనే ప్రముఖంగా పేర్కొనవలసి వుంది. న్యూ బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటూ పిలువబడే ఈ సంప్రదాయానికి చెందినవారే, జామినీ రాయ్, దేవీ ప్రసాద్ రాయ్ చౌదరి. దేవీ ప్రసాద్ రాయ్ చౌదరి ప్రముఖ చిత్రకారుడే కాక ప్రసిద్ధ శిల్పికూడా. చైన్నై మెరినా బీచ్ ఇసుకతిన్నెలపై చూపరులకు కనువిందు చేసే triumph of labour అనే కాంశ్యశిల్పం దేవీ ప్రసాద్ రాయ్ చౌదరి తయారు చేసినదే. ఆ రోజుల్లో చైన్నై కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కు దేవీ ప్రసాద్ రాయ్ చౌదరి యే ప్రిన్సిపల్. సాక్షాత్తు దేవీప్రసాద్ రాయ్ చౌదరి, హెచ్ వి రామగోపాల్ వంటి ప్రసిద్ధ చిత్రకారుల వద్ద శుశ్రూష చేసి, పాశ్చాత్య కళాపద్ధతులతో బాటు జాతీయత ఉట్టిపడే భారతీయ పద్ధతుల్లోనూ తరిఫీదు పొంది కృతార్థత గడించినవారు కృష్ణమూర్తిగారు.
కృష్ణమూర్తిగారి చిత్రాలు సాలార్ జంగ్ మ్యూజియమ్ లో, లలిత కళా అకాడమీ ప్రాంగణంలో, హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో అర్జియలాజికల్ శాఖ వారి అధ్వర్యంలో నడపబడే contemporary art gallery లోనూ శాశ్వతంగా ప్రదర్శింపబడుతున్నాయి. దేశవిదేశాల్లో పలు చోట్ల వారి చిత్రకళా ప్రదర్శనలు జరిగినాయి.

Landscape

కృష్ణమూర్తి గారు స్వయంగా ప్రతిభ గల చిత్రకారులు కావడమే గాక, తెలుగునాట లలితకళారంగానికి ప్రాణవాయువులు పోసినవారు కూడా. దేశంలో కళలను ప్రోత్సహించడం కోసం నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కనుసన్నల్లో అప్పటి కేంద్రప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోనూ “లలిత కళా అకాడమీ”లు ఏర్పాటు చేసి గ్రాంటులు మంజూరు చేసింది. ఇట్లా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ ప్రత్యేక ఆఫీసరుగా మామిడిపూడి కృష్ణమూర్తి గారు 1964 లో నియమింపబడినారు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా ఏర్పాటైన ఈ అకాడమీల పనితీరును పరిశీలించడానికై కేంద్రప్రభుత్వం మాజీ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ జిడి ఖోస్లా అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల అకాడమీలను తనిఖీ చేసిన తర్వాత ఆ కమిటీ ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీపై ప్రత్యేక ప్రశంసలు కురిపించింది. మామిడిపూడి కృష్ణమూర్తి గారు తెలుగునాట లలితకళారంగం అభివృద్ధికై చేసిన నిర్విరామ కృషికి జస్టిస్ ఖోస్లా కమిటీ పేర్కొన్న విషయాలే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయి.

ఆ రోజుల్లో చిత్రకళారంగం ఆంధ్రదేశంలో ఎంతో వెనకబడి వుంది. ఎక్కడా ప్రైవేటు గాలులు లేవు. రాష్ట్ర లలితకళా ప్రాంగణంలోని కళాభవన్ గాలరీయే అందరికీ కేంద్రం. ఇట్టి వాతావరణంలో కృష్ణమూర్తిగారు స్పెషల్ ఆఫీసర్ గా కళాభవన్ 40 అంతర్జాతీయ చిత్రకళా ప్రదర్శనలను, 30 జాతీయ ప్రదర్శనలను, 21 వార్షిక ప్రదర్శనలను, ఏర్పాటు చేసింది. ఇవిగాక వందలాది మంది ప్రసిద్ధ, వర్ధమాన, అపరిచిత, శిల్ప, చిత్రకారులచే ప్రదర్శనలు జరిపించింది. దాదాపు వేయి చిత్రకళాఖండాలను సేకరించి, వాటిని శాశ్వత పద్ధతిని ప్రదర్శించే ఏర్పాటు చేసింది. ఎందరో పేద కళాకారులను ఆదుకున్నది. ఎందరో వర్తమాన కళాకారులకు గ్రాంటులు మంజూరు చేసింది.

Artist Monograph printed by Telugu University

ప్రాచీన దేవాలయాల్లో ఉన్న లేపాక్షి చిత్రాలకు, రామాయణ చిత్రాలకు, భాగవత చిత్రాలకు, నకళ్ళు తీయించి భద్రపరచింది. వాటిపై పుస్తకాలు ప్రచురించింది. ఆలయాల్లో నృత్యభంగిమలు గల శిల్పాల వివరాలు సేకరించి, గ్రంధాలు ప్రచురించింది. ఆనాటి అనేకమంది చిత్రకారుల చిత్రాలు గల మోనొలాగ్స్ ప్రచురించింది. అప్పటి ప్రముఖ చిత్రకారులైన మధుసూదన్ రావు, పిటి రెడ్డి, కొండపల్లి శేషగిరిరావు, లక్ష్మా గౌడ్, సయ్యద్ బీన్ అహమ్మద్ వంటి వారికి కళాభవన్ ఆనాడొక వేదిక, ఒక దేవాలయం.
1988 లో తెలుగు యూనివర్సిటీ అధ్వర్యాన కృష్ణమూర్తి గారు తెలుగునాటి తొలితరం చిత్రకారులు చిత్రాలు సేకరించడం, వాటిని ప్రదర్శించడం ఒక భగీరథ యత్నం. తొలినాటి చిత్రకారులు దామెర్ల రామారావు, అడవి బాపిరాజు, మాధవపెద్ది గోఖలే, చేమ్కూర్, ఓవి భగీరథి, కౌతా రామ్మోహన్ శాస్త్రి వంటి గతించిన చిత్రకారుల వారసుల నుండి, ఆలనాపాలనా లేకుండా పడివున్న చిత్రాలను వర్తమాన తరానికి అందజేయడంలో మామిడిపూడి కృష్ణమూర్తిగారు చూపిన చొరవ, పడిన శ్రమ, తరతరాలకు స్ఫూర్తిదాయకం.
కృష్ణమూర్తి గారితో నాకు దాదాపు 51 ఏళ్ళ పరిచయం వున్నది. నేను, కృష్ణమూర్తి గారి తమ్ముడు శ్రీరామ్ గారు సహాధ్యాయులం, ఆప్తమిత్రులం కావడమే ఈ పరిచయానికి నాంది.

మామిడిపూడి కృష్ణమూర్తిగారు సౌమ్యుడు, నిగర్వి, మితభాషి, నిరాడంబరుడు, స్వాభిమానం గలవాడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తన గొప్పను మరొకరి వద్ద చాటుకునే అలవాటు లేనివాడు, నిశ్శబ్దంగా విధికృతమైన కర్తవ్యాన్ని నెరవేర్చడమే ధ్యేయంగా జీవనయాత్ర సాగించే నిష్కామయోగి.

ఎన్. మోహన్ కుమార్
(Courtesy: Visaalaakshi)

SA: