‘మానసార వాస్తుశాస్త్రం’ ఏం చెప్పింది?

శిల్పం విజ్ఞానానికి నాంది. ఈ సమస్త ప్రపంచమూ శిల్పం వల్లనే సృష్టింపబడింది. శిల్పం వల్లనే వృద్ధి చెందుతున్నది. నేడు మనం విజ్ఞానమని దేన్ని పిలుస్తున్నామో దాన్ని శిల్పం అంటారని ఋగ్వేదం చెప్పింది. అనాదిగా మౌఖిక సంప్రదాయంగా వస్తున్న అనేక విద్యలలో శిల్పం ఒకటి. వేదకాలం నాటికే 14 రకాల శిల్పశాఖలు అత్యున్నత స్థితిలో ఉన్నవని వేదమంత్రాల ద్వారా తెలుస్తున్నది. శిల్పం కేవలం లౌకికమైన ఫలాన్నిస్తుందని చాలామంది అభిప్రాయం.
వేదకాలం నుండి శిల్పశాస్త్రానికి గల ఆచార్య పరంపరను చూస్తే శిల్పం యొక్క మహత్తు అవగతమవుతుంది. యజ్ఞశిల్పం మొదలుకుని రథశిల్పం, విమాన శిల్పం, వాస్తుశిల్పం, ఆయుధ శిల్పం, ప్రాకారశిల్పం మొదలైన శిల్ప విశేషాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.

నేడు మనం చూస్తున్న శిల్పాలు, ఆలయాలు అఖండ భారతమంతా విస్తరించి ఉన్న ఒక సనాతన సంప్రదాయ స్థాపత్యవేద మూలాలు. ప్రాచీన మహర్షులు ఈ శిల్పశాస్త్రాల్ని రచించి మనకందించారు. మయముని రచించిన మయమతం, కాశ్యపమహర్షి ప్రణీత కాశ్యపశిల్పశాస్త్రం, అగస్త్యుని సకలాధికార శిల్పశాస్త్రం, అనేక శిల్పశాస్త్ర గ్రంథాలు మొదలైనవాటిలో ఎన్నో గ్రంథాలు నేడు అలభ్యం. మరి ఇలాంటి శాస్ర్తాల గురించి మనం తెలుసుకోవాలంటే నేడు అందుబాటులో వున్న తెలుగు పుస్తకాలు బహుతక్కువ. అటువంటి ప్రాచీన గ్రంథాలను తెలుగులో అనువదించి జనసామాన్యానికి అందించాలనే సదుద్దేశంతో ‘శిల్పకళాభారతి’ ఆవిర్భవించింది. ఈ దిశగా కందుకూరి వెంకట సత్యబ్రహ్మాచార్య ‘శిల్పకళాభారతి’ ద్వారా గత ఎనిమిదేళ్ళుగా 30 పుస్తకాలకు పైగా ప్రచురించారు.

సంప్రదాయ శిల్పానికి ఆలవాలమైన తెలుగు ప్రాంతంలో శిల్ప ప్రాముఖ్యతను, వాస్తుకు గల మూల ఉద్దేశ్యాన్ని వివరించాలని దానికి పునాదిగా ప్రాచీన వాజ్మయాన్ని ప్రచురించి ఆ కళామతల్లి ఋణం తీర్చుకునేదిశగా అడుగులు వేస్తోన్న శిల్పకళాభారతి మహామహోపాధ్యాయ – రాష్ట్రపతి సన్మాన విభూషిత డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావుగారు అనువదించిన గ్రంథమే ‘మానసార వాస్తుశాస్త్రం’.

తెలుగులో శిల్పశాస్త్రగ్రంథాలను ముద్రించాలని నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ ప్రధానస్థపతి పద్మశ్రీ ఎస్.ఎం. గణపతి స్థపతిగారి అధ్యక్షతన ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిల్పశాస్త్ర అనువాదపథకంలో సభ్యులుగా ఉండి రూపధ్యానరత్నావళి, కాశ్యపశిల్పశాస్త్రం ఉత్తరభాగం గ్రంథాల ప్రచురణకు కీలకపాత్ర పోషించిన డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావుగారు 2014 లో సంస్కృతం నుండి అనువదించి ప్రచురించిన ‘మానసార వాస్తుశాస్త్రం’ ప్రతులన్నీ ఆ ఏడాదే అయిపోయాయి. ఒక చారిత్రక అవసరంగా భావించి పదేళ్ల తర్వాత ఈ మలిముద్రణ బాధ్యతలు శిల్పకళాభారతి పక్షాన కందుకూరి వెంకట సత్యబ్రహ్మాచార్య తీసుకొని, ఈ మహాద్భుత గ్రంథాన్ని మనముందుకు తెచ్చారు.

ఈ గ్రంథంలో చర్చించిన విషయాలు:

 • ప్రాచీన వాస్తు-శిల్పగ్రంథాలలో కాశ్యపం, మయమతం, మానసార గ్రంథాలను రత్నత్రయాలంటారు.
 • ఆసేతు హిమాచలం బృహత్తర ఆలయాలు, రాజహర్మ్యాలు, సేతువులు, ఉద్యానాలేన్నో ఈ గ్రంథం ఆధారంగా నిర్మించినవే.
 • మానం అంటే కొలత. సారం అంటే సమస్త నిర్మాణాలకు సంబంధించిన కొలతల సారమే ఈ గ్రంథం.
 • ఈ గ్రంథంలో శిల్పాచార్యలక్షణంతో మొదలై మానోపకరణం వంటి 70 అధ్యాయాలున్నాయి.
 • విశ్వకర్మ, విశ్వేశుడు, విశ్వసారుడు మొదలైన 32 మంది శిల్పరులున్నారని చెప్పింది.
 • సమస్త శుభనిర్మాణాలకు ప్రశస్తమైన భూమిని ఎంచి, పరీక్షించి స్వీకరించే విధానం చెప్పింది.
 • శంకుస్థాపన చేసి, పదవిన్యాసంతో ఆ భూమిని విభజించి వాస్తుదేవతాపూజ, బలికర్మ చెప్పింది.
 • 8 రకాల గ్రామాల నిర్మాణవిధానం. గ్రామంలోని ముఖ్య నిర్మాణాలను ఎక్కడ, ఎలా చేయాలో చెప్పింది.
 • భూపతి, మండలేశుడు, పట్టధరుడు మొదలైన అధికారులకు తగిన నగరాలు, కోటల నిర్మాణం చెప్పింది.
 • ఎవరెవరికి ఎన్ని అంతస్థుల నిర్మాణం చేయాలి? భూమిలో చేయాల్సిన గర్భవిన్యాసవిధి చెప్పింది.
 • ఆలయ నిర్మాణానికి ముందు చేసే 8 రకాల ఉపపీఠాలు, 36 రకాల అధిష్టానాలను గురించి చెప్పింది.
 • ఆలయం, మండపాలకు కావాల్సిన స్తంభాల లక్షణం, ప్రస్తరలక్షణం, సంధికర్మవిధానం గురించి చెప్పింది.
 • దేవతలకు నిర్మించే ఆలయాల విమానం కొలతలు, 1 నుంచి 12 అంతస్తుల విమానలక్షణాలు గురించి చెప్పింది.
 • ఆలయం చుట్టూ రక్షణకై నిర్మించే పంచప్రాకారాలను, ఆ ప్రాకారంలో ఉండాల్సిన నిర్మాణాలను గురించి చెప్పింది. ప్రాకారాల లోపల శివ, విష్ణు ఆలయాలలో ఉండాల్సిన పరివారదేవతా లక్షణాలు, స్థానాన్ని గురించి చెప్పింది.
 • ప్రాకారానికి నలుదిక్కులా ఎత్తుగా నిర్మించే గోపురాలను అంతస్తులను బట్టి 15 రకాల గోపురాల గురించి చెప్పింది.
 • దేవతలకు, ద్విజులకు వాసయోగ్యమైన మండపాలను గురించి, వాటి ఉపయోగాన్ని గురించి చెప్పింది.
 • దేవతలు, అన్ని వర్ణాలవారు నివసించడానికి అనువైన శాలా (గృహములు) నిర్మాణం గురించి చెప్పింది.
 • గృహంలో వంటిల్లు, భోజనగది, పడకగది మొదలైనవి ఏవేవి ఎక్కడ ఉండాలి? అనే గృహవాస్తు గురించి చెప్పింది.
 • సలక్షణంగా నిర్మించిన గృహంలో గృహప్రవేశం ఎలా చేయాలో అందులోని విధులను గురించి చెప్పింది.
 • ద్వారాలను ఎక్కడ ఉంచాలి? కిటికీలు ఎక్కడ ఉండాలి? ద్వారానికి ఉండాల్సిన స్తంభాల గురించి చెప్పింది.
 • రాజాంతఃపుర లక్షణం, రాణీవాసం, ఆయుధాగారం, కోశాగారం మంత్రి-సామంతుల నివాసాల గురించి చెప్పింది.
 • రాజుకుండాల్సిన లక్షణాలు, రాజుకు, రాజ్యానికి ఉండాల్సిన రక్షణ వ్యవస్థ, సైన్యం మొదలైన విషయాలను చెప్పింది.
 • రాజులు బలాన్ని బలగాన్ని బట్టి కొరకాలనీ, వారి వస్త్రాలంకరణ తీసుకోవాల్సిన పన్ను గురించి చెప్పింది.
 • దేవతలు, బ్రాహ్మణులు, రాజులు మొదలైనవారు ఎక్కి తిరిగే రథాలు వాటి లక్షణం గురించి చెప్పింది.
 • అన్ని వర్ణాలవారు ఉపయోగించే శయనం గురించి, రాజు అధిరోహించే సింహాసనం గురించి చెప్పింది.
 • దేవతలు, రాజుల గృహాలకు అలంకారమైన తోరణాలు, ముత్యాల పందిళ్లు, కల్పవృక్షం గురించి చెప్పింది.
 • దేవతలకు రాజులకు తగిన శిరోఆభరణాలైన కిరీటాలు, శరీరంపై ధరించే ఆభరణాలు గురించి చెప్పింది.
 • త్రిమూర్తుల లక్షణం, శివలింగ లక్షణం, పీఠలక్షణం, శక్తిదేవతా లక్షణం, జైన, బౌద్ధ దేవతా లక్షణం గురించి చెప్పింది.
 • ముని, యక్షవిద్యాధర, భక్తమూర్తుల విగ్రహలక్షణాలూ, హంస, గరుడ, వృషభ, సింహవాహన లక్షణం గురించి చెప్పింది.
 • దేవతా విగ్రహ నిర్మాణంలో అనుసరించే ఉత్తమ, మధ్యమ దశతాల కొలతలను, ప్రలంబ లక్షణం గురించి చెప్పింది.
 • లోహవిగ్రహాలను తయారుచేయడానికి మధూచిృష్ట విధానం, విగ్రహాలు అలక్షణంగా ఉంటే కలిగే నష్టాలను చెప్పింది.
 • దేవతా విగ్రహాలకు కళ్లు తెరిచే నయనోన్మీలన విధానాన్ని అందులో శిల్పాచార్యుడు చేయవలసిన విధులను చెప్పింది.
 • శిల్పాచార్యులు, ఆగమీకులు, పండితులు, పురోహితులు, జ్యోతిష్కులు, నిర్మాణ, వ్యాపార రంగాల వారికి ఈ గ్రంథం వరం.

ఈ గ్రంథాన్ని ఇటీవల విజయవాడలో ‘శిల్ప కళాభారతి’ ఆధ్వర్యంలో జరిగిన ‘శిల్ప ఆగమ వాస్తు సదస్సు’ లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మదాయ శాఖ కమీషనర్ శ్రీరామ సత్యనారాయణ గారి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సభలో పుస్తక రచయిత డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావుగారు, శ్రీశైల దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ గారు, శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామారావుగారు, పబ్లిషర్ కందుకూరి వెంకట సత్యబ్రహ్మాచార్య గారు తదితరులు పాల్గొన్నారు.

సమీక్ష: కళాసాగర్ యల్లపు
పుస్తకం సైజ్:: 1/4 th డెమ్మీ, పేజీలు:: 464, వెల:: రూ. 1,116/-
ప్రతులకు: కందుకూరి వెంకట సత్యబ్రహ్మాచార్య (శిల్పకళాభారతి), విజయవాడ
ఫోన్ నంబర్:: 9491411090

3 thoughts on “‘మానసార వాస్తుశాస్త్రం’ ఏం చెప్పింది?

 1. I feel proud whenever I read your books that I met you personally
  I enjoyed your three books. I must thank Sailaja for providing your books.
  Dr. Satya vani
  Sailaja’s colleague

 2. Interview mottam chadivanu. Excellent mee Amma ga naaku aunty teliyatam, kalisi kolkatta anni tiragadam telitani yenni Vishaal Amma dwara telusukovatam naa purva janma adrushtam.

  Lakshmi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap