ఆగస్టు 4న మండలి వెంకట కృష్ణారావు జయంతి

ఆగస్టు 4న రాష్ట్ర ఉత్సవంగా శ్రీ మండలి వెంకట కృష్ణారావు జయంతి

తెలుగు భాషా–సంస్కృతుల పరిరక్షణ, పరివ్యాప్తుల కోసం, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు ప్రజలందరినీ ఒకే భావబంధంతో ఏకం చేయాలనే మహత్తర సంకల్పంతో జీవితాంతం పాటుబడిన “తెలుగు భాషోద్యమ దీప్తి” శ్రీ మండలి వెంకట కృష్ణారావు జయంతిని ప్రతి సంవత్సరం ఆగస్టు 4న రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించటం హర్షణీయమని ప్రపంచతెలుగు రచయితల సంఘం పేర్కొంది.

ఈ నిర్ణయం మహనీయుడైన మండలి వెంకట కృష్ణారావుగారికి ప్రభుత్వం అర్పిస్తున్న గౌరవనివాళి మాత్రమే కాక, తెలుగు భాషాభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధతలకు నిదర్శనమని సంఘం అభిప్రాయపడింది.

రాష్ట్రవ్యాప్తంగా ఆ రోజున తెలుగు అనే మాట ప్రజల నోట మారుమోగేలా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భాష పట్ల ప్రజల్లో మరింత మమకారం, గౌరవం, బాధ్యతాభావం పెంపొందుతాయి. అందువల్ల ఈ ఉత్సవాన్ని కేవలం అధికారిక కార్యక్రమంగా కాకుండా తెలుగు భాషా–సంస్కృతుల మహోత్సవంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రభుత్వాన్ని కోరుతోంది.

శ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు విద్యామంత్రిగా పనిచేసిన కాలంలో తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేశారు. అనంతర కాలంలో విద్యావ్యవస్థలో తెలుగు మాధ్యమానికి, తెలుగు భాషకు క్రమంగా ప్రాధాన్యం తగ్గుతూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలుగు భాషకు పునర్వైభవాన్ని తీసుకువచ్చే దిశగా ఒక చారిత్రక అడుగుగా నిలుస్తుందని సంఘం విశ్వసిస్తోంది. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలోనూ, పరిపాలనలోనూ, ప్రజాజీవితంలోనూ తెలుగుకు మరింత గౌరవస్థానం కల్పించే చర్యలను ప్రభుత్వం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యా–సాంస్కృతిక శాఖలకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రపంచతెలుగు రచయితల సంఘం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

గుత్తికొండ సుబ్బారావు
అధ్యక్షుడు

డా. జి. వి. పూర్ణచందు
ప్రధాన కార్యదర్శి
ప్రపంచతెలుగు రచయితల సంఘం

Share via
Copy link
Powered by Social Snap