విద్యా సేవలో ‘మండవ సాంబశివరావు’

విద్యార్థులకు ఉత్తమమైన విద్యతో పాటు ఆర్థికసాయంతో వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న సేవామూర్తి పర్వతనేని బ్రహ్మయ్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మండవ సాంబశివరావు. వీరు మోపిదేవి మండలం, పెదప్రోలు గ్రామ వాస్తవ్యులైన మండవ. రామకోటయ్య, వెంగమ్మలకు ఐదవ సంతానం. రైతు కుటుంబంలో జన్మించిన సాంబశివరావు మోపిదేవిలోని జడ్పీహెచ్ పాఠశాలలో 1972లో పదవతరగతి, అనంతరం 1972 -1974 విద్యాసంవత్సరంలో ఎస్.ఆర్.వై.ఎస్.పి. జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. 1974-1977 విద్యాసంవత్సరంలో విజయవాడ. ఆంధ్ర లయోలా కళాశాలలో బి.ఎస్.సీ. లో గ్రాడ్యుయేషన్ చదివారు. 1977-1979 విద్యాసంవత్సరంలో నాగార్జున యూనివర్సిటీలో కెమిస్ట్రీ సబ్జెక్టు తో ఎమ్మెస్సీ పూర్తిచేశారు. విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యాభ్యాసం అనంతరం 1979వ సంవత్సరంలో నవంబర్ మాసం నుండి పార్ట్ టైం కెమిస్ట్రీ అధ్యాపకుడిగా 31-7-2010 వరకు పి.బీ. సిద్ధార్థ జూనియర్ కళాశాలలో పనిచేశారు. కళాశాలకు మీరు అందించిన సత్ఫలితాలు, క్రమశిక్షణ మరీ ముఖ్యంగా ఎందరో పేద విద్యార్థులకు పరీక్ష ఫీజుల అవసరార్థం, కళాశాల ఫీజుల అవసరార్థం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేవలం వారి జీతంలో విద్యార్థులకు చేయూతను అందించడం గర్హనీయం. ఆ విద్యాసంవత్సరాల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు తరచూ ప్రిన్సిపాల్ గారిని కలుస్తూ ఉంటారు. ఆ విద్యార్థులు బాలాజీ చైతన్య, విన్నీ తేజ, భరత్ కుమార్, శివ కుమార్ మొదలగు ఎందరో పూర్వ విద్యార్థులు వారికి ప్రిన్సిపాల్ అందించిన ఆర్థిక సహాయం గురించి వారి మాటల్లో మాస్టారు మాకు పాఠాలతో పాటు జీవిత సత్యాలు బోధించడం వలన మరియు ఆర్థిక క సహాయం చేయడం వలన మేమందరం ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నామని చెప్పినప్పుడు వారి సేవా దృక్పద భావనకు నమస్సులు తెలియజేశాము . కళాశాల అభివృద్ధికి గురువుగారి సేవను అభినందిస్తూ కళాశాల యాజమాన్యం వారు సాంబశివరావు ని 1- 8 -2010వ సంవత్సరంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు అప్పగించారు. ప్రిన్సిపాల్ గా వీరి సేవలు అనన్యసామాన్యం ముఖ్యంగా కళాశాల పనివేళల్లో మార్పులు తీసుకొని వచ్చి, వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి క్రమశిక్షణతో పాటు ఉత్తమ ఫలితాలను అందించడంలో వారితో పాటు కళాశాల అధ్యాపకుల నిర్విరామ కృషి అద్వితీయం అని వారు చెప్పిన మాటల్లో ఎంతో స్పష్టత నిజాయితీ అకుంఠిత దీక్ష కనిపిస్తుంది.

నిరాడంబరమైన సేవతో స్వచ్ఛమైన మనసుతో నిర్విరామంగా చేస్తున్న వారి కృషిని అభినందిస్తూ కళాశాల యాజమాన్యం 2017-2022 విద్యా సంవత్సరానికి కళాశాల డైరెక్టర్గా ప్రత్యేక బాధ్యతలను అప్పగించింది. డైరెక్టర్ గా సాంబశివరావు సేవలు అనిర్వచనీయం. ఆదర్శవంతమైన వారి జీవితం ఎందరో అధ్యాపకులకు మరెందరో విద్యార్థులకు దర్పణం వంటిదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు రిటైర్మెంట్ అనంతరం కళాశాల యాజమాన్యం వారి సూచనలతో తిరిగి మరలా 2022 విద్యా సంవత్సరం నుండి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టారు . దాదాపుగా 43 సంవత్సరాల సిద్ధార్థ సంస్థతో వారికున్నటువంటి బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడంలో వారి సతీమణి మండవ లక్ష్మి సహాయ సహకారాలు అనిర్వచనీయం అన్నారు, అలాగే కుమారుడు సందీప్ బీటెక్. చదువుకొని అమెరికాలో చార్లెట్లో ఇంజనీర్ గా పని చేస్తున్నారు. కుమార్తె కూడా బీ.టెక్.
విద్యను అభ్యసించారు.

ఆదర్శనీయ వ్యక్తిత్వం :

ఈ విధంగా 2021- 2022 విద్యాసంవత్సరంలో ప్రిన్సిపాల్ గా తిరిగి మరల బాధ్యతలు చేపట్టిన అనంతరం, 2021 నవంబర్ మాసంలో సిద్ధార్థ ఆడిటోరియం వేదికగా జరిగిన జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో జూనియర్ ఇంటర్ ఎం.పీ.సీ. చదువుతున్న విజయ కుమార్ తల్లి వారి ఆర్థిక పరిస్థితిని ఆమె మాటల్లో విని స్పందించిన ప్రిన్సిపాల్ వెంటనే ఆ సభలో విద్యార్థికి విద్య నిమిత్తం 10,000 రూపాయలను ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పడం అమలుపరచడం చాలా గర్వించదగిన విషయం అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరంలో జాతీయస్థాయిలో క్రీడల్లో స్విమ్మింగ్ పోటీలలో అత్యంత ప్రతిభ కనబరుస్తూ స్వర్ణ, రజత పతకాలు సాధించిన జూనియర్ ఇంటర్ విద్యార్థి ఎస్ జగదీష్ ని ప్రోత్సహిస్తూ ఆ విద్యార్థికి 1000 రూపాయల నగదును మరియు 1000 రూపాయల విలువగల స్విమ్మింగ్ సూట్ ను ప్రోత్సాహక బహుమతిగా ఇచ్చారు. అలాగే పి.రవి కుమార్ సీనియర్ ఇంటర్ విద్యార్థికి దాదాపుగా 7000 రూపాయల ఆర్థిక సహాయాన్ని విద్య నిమిత్తం అందించారు. అలాగే ఇంటర్ విద్యను పూర్తి చేసుకుని డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఎం.డి. యూసఫ్ కి ఎన్.సి.సి. క్యాంప్ నిమిత్తం 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు, అలాగే జూనియర్ ఇంటర్ విద్యార్థి ఆర్. సాహిత్ కు 4000 రూపాయలు బి. కృష్ణమోహన్ జూనియర్ ఇంటర్ విద్యార్థి కి 2000 రూపాయలు, అల్సర్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న సీనియర్ ఇంటర్ విద్యార్థి కర్ర రవి కి 4000 రూపాయలను ఆర్థిక సహాయం చేశారు. వీరు చేసిన ఆర్థిక సహాయాలను అన్ని వారి స్వయం సంపాదనతో కష్టపడి ఆర్జించిన జీతంలోనివి కావడం మిక్కిలి అభినందనీయం. గుప్పెడు బియ్యం పథకం పేరుతో సేకరించిన ధాన్యమును విజయవాడ నగర పరిధిలో అనేక అనాథ ఆశ్రమాలకు వీధి బాలల సంక్షేమ వసతి గృహాలకు, వృద్ధాశ్రమాలకు మరియు కళాశాలలో పనిచేస్తున్న నాల్గవ తరగతి అధ్యాపకేతర సిబ్బందికి పంచిపెట్టడం వారి సేవ భావనకు చిరస్మరణీయం . అనుసరణీయం. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధ్యాపకులను కూడా వారితో కార్యోన్ముఖులను చేయడం ఆదర్శనీయం. ఒక వ్యక్తి శక్తిగా పనిచేయడంలో క్రమశిక్షణకు నిర్వచనం సాంబశివరావు. మన పెద్దలు చెప్పినట్లు పరోపకారాయ ఫలంతి వృక్షాః, అన్నట్లుగా కళాశాలకు గత 43 సంవత్సరాలుగా నిర్విరామంగా సేవలందిస్తున్న ఆదర్శ సేవామూర్తి, నైతికతకు దర్పణం విద్యా లక్ష్యాలతో పాటు అంచెలంచెలుగా విద్యా ప్రమాణాలు అభివృద్ధి పరుస్తూ తద్వారా నిర్ణీత గమ్యస్థానాన్ని చేరడంలో విద్యార్థులను, అధ్యాపకులను అనుక్షణం ప్రోత్సహిస్తున్న సాంబశివరావు ఆదర్శవంతమైన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షిస్తూ ..

పంచాగ్నుల కృష్ణవేణి
విజయవాడ

SA:

View Comments (5)