ప్రవాసాంధ్రగాయని శ్రీమతి మణిశాస్త్రి, ప్రముఖ సీనియర్ గాయనీగాయకులు చంద్రతేజ, వినోద్ బాబు, శ్రీమతి శేషుకుమారి అరుదైన కలయికలో 9న, సోమవారం సాయంత్రం, విజయవాడ ఎం.బి.కే విజ్ఞాన కేంద్రంలోని చుక్కపల్లి పిచ్చయ్య సాంస్కృతిక వేదికపై ప్రత్యేక సంగీత సినీ సంగీత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జాషువా సాంస్కృతిక వేదిక, సుమధుర కళానికేతన్, పోలవరపు సాంస్కృతిక సమితి, గంగాధర్ ఫైన్ ఆర్ట్స్ సంస్థ సంస్థలు సంయుక్తంగా సమర్పించాయి. నాలుగు గంటల పాటు అనేక పాత కొత్త సినిమా పాటలతో ఆహుతులను తమ గాన మాధుర్యంతో ఓలలాడించారు.
ప్రవాసాంధ్ర(అమెరికా-కెనడా)లో తెలుగు పాటకు, సినీ, శాస్త్రీయ సంగీతానికి విశేష ప్రాచుర్యాన్ని కల్పిస్తున్న శ్రీమతి మణిశాస్త్రి భారతీయ పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పలు సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విజయవాడలో అమరగాయకుడు ఘంటసాల, గంధర్వగాయకుడు బాలసుబ్రహ్మణం గారి స్మారకంగా ప్రత్యేక సంగీత విభావరిని సమర్పిస్తున్నారు. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో సినీ సంగీతరంగంలో పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి స్టేజ్, టీవి రియాల్టీ షోల ద్వారా ప్రాచుర్యం పొందిన సీనియర్ గాయకులు చంద్రతేజ, వినోద్ బాబు ధ్వయం, శ్రీమతి మణిశాస్త్రి కలిసి తొలిసారిగా విజయవాడలో పూర్తిస్థాయి కచేరీలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా గాయని శ్రీమతి మణిశాస్త్రిని ‘ఘంటసాల-ఎస్పీబాలు స్మారక లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్’ పురస్కారంతో సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనారిటీ సంక్షేమశాఖ, కార్యదర్శి, ఎ.ఎండి. ఇంతియాజ్ ఐఏఎస్, శ్రీమతి పుణ్యశీల, ఛైర్ పర్సన్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెలప్ మెంట్ కార్పొరేషన్, సంగీత, సాహిత్య విశ్లేషకులు శ్రీమతి బాలాంత్రపు ప్రసూన తదితరులు పాల్గొన్నారు.
గాయనీ, గాయకుల గురించి క్లుప్తంగా:
శ్రీమతి మణి శాస్త్రి గురించి: ప్రవాసాంధ్రలో (అమెరికా, కెనడా) స్థిరపడ్డ శ్రీమతి మణిశాస్త్రి శాస్త్రీయ, సినీ, లలిత సంగీతంలో ప్రావీణ్యులు. నాదవినోద మ్యూజిక్ అకాడమీ(యు.ఎస్.ఏ) అనే స్వీయ సంస్థ ద్వారా నేటి తరాన్ని సంగీత రంగంలో తీర్చిదిద్దుతూనే మరోపక్క గాయనిగా ప్రవాస వేదికలపై భారతీయ సినీ సంగీతానికి తగని ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ప్లేబ్యాక్ సింగర్ గా పలు సంగీత ఆల్బమ్ రూపొందించడంతోపాటు హాలీవుడ్ తెరపైనా గాయనిగా, రచయితగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ‘ల్యాండ్ ఆఫ్ గాడ్’ అనే హాలీవుడ్ ఫిలింలో పాడారు. ‘మా కా ఇంతిజార్..’ అనే పల్లవితో సాగే ఈ పాటను మణిశాస్త్రినే రచన చేయడం విశేషం. ఈ హాలీవుడ్ చిత్రం ఏటి అండ్ టి టిబేకా ఫిలిం ఫెస్టివల్ -2022 లో ప్రదర్శితమైంది.
సంగీత ప్రయాణం: 1994వ సంవత్సరం నుంచి ప్రొఫెషనల్ సింగర్ గా, సంగీత గురువుగా సంగీతరంగాన సుధీర్ఘ కాలంగా కొనసాగుతున్న గాయని మణిశాస్త్రి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వంటి సుమారు అయిదు భారతీయ భాషల్లో పాటలు పాడారు. యుఎస్ఏ, కెనాడా, ఇండియాలలో 1000 కిపైగా సంగీత కచేరీల్లో తన గానంతో అలరించారు. సినిమా, టీవీ రంగంలోనూ తన గళమాధుర్యంతో పలు వీనులవిందైన పాటలు పాడారు. గాయనిగానే కాకుండా సంగీత దర్శకురాలిగా, మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా, అమెరికా ఆధారిత రేడియోల్లో ఆర్జేగా.. ఇలా బహుముఖీన రంగాల్లో రాణిస్తున్నారు. భక్తి, లలిత గీతాలు, అన్నమాచార్య కీర్తనలు, సందేశాత్మక, ప్రభోద గీతాల కూర్పుతో వివిధ భాషల్లో పలు సంగీత ఆల్బమ్స్ రూపొందించారు.
పలువురు ప్రసిద్ధ గాయకులతో..కేజె ఏసుదాస్, పి. సుశీల, మనో, చిత్ర, వి.రామకృష్ణ, కోటి, జీ.ఆనంద్ ఇలా ఎందరో నాటి, మేటి గాయకులతో ప్రతిష్టాత్మక వేదికలపై తన గళాన్ని పంచుకున్నారు.
గాయనిగా, సంగీత గురువుగా, స్వరకర్తగా, రేడియో జాకీగా ఇలా పలు రంగాల్లో రాణిస్తూనే ‘మనం-యూఎస్’ అనే ఛారిటీ సంస్థను నెలకొల్పి, అటు ప్రవాసాంధ్ర, ఇటు ఇండియాలోనూ తెలుగు సంగీతాభివృద్ధికి తన వంతు సేవలు అందిస్తున్నారు.
చంద్రతేజ:
అభినవ ఘంటసాలగా ప్రాచుర్యం పొందిన చంద్రతేజ నాలుగు దశాబ్దాలకుపైగా తనదైన సంగీత ప్రతిభతో తెలుగు రాష్ట్రాలకు చెందిన సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటున్నారు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ వంటి కేంద్రప్రభుత్వ రంగాల్లో అత్యున్నతమైన హ హోదాల్లో విధులు నిర్వహించి, వర్ధ, ప్రవర్ధమాన కళాకారులెందరికో ప్రోత్సాహాన్ని అందించిన చంద్రతేజ, ఉద్యోగ విధులతోపాటు సమాంతరంగా సినీ, లలిత సంగీతంలోనూ విశేష ప్రతిభతో రాణించారు. సినీ, టీవీ రంగంలో ప్లేబాక్ సింగర్ గా పలు సినిమా, టీవీ సీరియళ్ళలో పాటలు పాడారు. శాస్త్రీయ, జానపద సంగీతంలో సమాన ప్రతిభగల చంద్రతేజ ఘంటసాల పాటలు పాడటంలో అగ్రగామి. అచ్చం ఘంటసాల గొంతును పుణికిపుచ్చుకున్న చంద్రతేజ అభినవ ఘంటసాల పేరు తెచ్చుకున్నారు. అచ్చమైన పల్లె గుండెచప్పుడైన జానపద గీతాలు పాడ్డంలోనూ చంద్రతేజ ఆరితేరినవారే. అటు సినిమా ఇటు శాస్త్రీయం, మరోవైపు జానపదం ఇలా వైవిద్యమైన హుషారైన గళమాధుర్యంతో రంజింపచేయడం చంద్రతేజ ప్రత్యేకం.
వినోద్ బాబు:
సినీ. లలిత సంగీతంలో సుధీర్ఘకాలంగా గాయకుడిగా రాణిస్తున్న వినోద్ బాబు భారతీయ రైల్వే రంగంలో ఉన్నతోద్యోగి. ఒక పక్క రైల్వే శాఖలో విధులు నిర్వహిస్తూనే సమాంతరంగా సంగీతరంగంలో తనదైన గానంతో సంగీత ప్రియులకు బాగా సుపరిచితమయ్యారు వినోద్ బాబు. కీబీర్డ్, గీటార్, మాండిలిన్, ఫ్లూట్, జాజ్ ఇలా సుమారు పది, పదిహేను సంగీత వాయ్యిద్యాల్లో ప్రవేశం ఉన్న వినోద్ బాబు ఎస్పీ పాటలు పాడ్డంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. సినిమా, టీవీ రంగంలోనూ గాయకునిగా, స్వరకర్తగానూ తన ప్రతిభను చాటుకున్నారు. సంగీత కారునిగా ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్న వినోద్ బాబు దేశ, విదేశాల్లో లెక్కుమించి సంగీత విభావరుల్లో పాల్గొన్నారు. అనేక ప్రతిభా పురస్కారాలు, సత్కరాలు అందుకున్నారు.
శేషకుమారి:
ఒకప్పటి పాటలు వింటుంటే.. మళ్ళీ నాటి జ్ఞాపకాలు మన గుండెల్ని తచ్చాడుతుంటాయి. నాటి సంగీత పరిమళాలు పదే పదే వెంటాడుతుంటాయి. అలా సుశీలమ్మ, జానక్మ, నేటి చిత్రమ్మ ఇలా వైవిధ్యమైన గళమాధుర్యంతో ఆకట్టుకోవడం గాయని శ్రీమతి శేషు కుమారి ప్రత్యేకత. ఉపాధ్యాయ రంగంలో ఉంటూనే సినీ, లలిత, శాస్త్రీయ రంగంలోనూ రాణిస్తున్నారు శేషుకుమారి. సంగీత అధ్యాపకురాలిగా ఎందరో విధ్యార్ధుల్ని తీర్చిదిద్దుతూ, సంగీత విభావరిల్లోనూ మేటి గాయనిగా ప్రతిభను చాటుకుంటున్న శ్రీమతి శేషుకుమారి గళం పరిపుష్టి గాత్రానికి ఓ చక్కటి ఉదాహరణ.
-కళాసాగర్