నమ్మండి నమ్మక పోండి… నాకు పెద్దగా కోరికలు ఉండవు. వెంపర్లాటలు ఉండవు. మా మిత్రుడొకడు అంటాడు పరిచయం చేస్తూ వీడిదంతా హారిజాంటలే గాని వర్టికల్ కాదని. సాహిత్యపరంగా ఏ గుర్తింపు వచ్చినా వెంటాడుతూ వచ్చినవే. ఉన్నదాంతో సంతృప్తి పొందడం ఒత్తిళ్ళను తేలికగా తీసుకోవడం కుటుంబ బాధ్యతలు తీరిపోవడం అభిరుచుల్ని పండించుకునే నేపథ్యంలో ఎక్కువగా చదువుకోవడం ఎప్పుడైనా రాయడం… ఇది నా సంగతి: 2003 సెప్టెంబరు 5వ తేదీన గుండెకు బైపాస్ శస్త్రచికిత్స చేయించుకుని గ్రీన్ పిరియడ్లో బతుకుతున్నవాడిని.. గడుస్తున్న ప్రతిరోజు అదనంగా లభించిందే..
ఇప్పుడు నా 6 వ కథాసంపుటి ‘మనిషి లోపలి నీడ’ పుస్తకాలు వచ్చేశాయ్. ఆ సంబరంలో ఉన్నాను. ఆవిష్కరణ జూలై 30 తేదీన జరిగే ‘రావిశాస్త్రి సాహిత్య పురస్కారం’ స్వీకరించే సభలో ఉంటుంది. అవార్డులు కొత్త కాదు, ఇది ప్రత్యేకం, రావిశాస్త్రి నా ఇష్ట కథారచయిత. చిన్నప్పట్నుంచీ ఆయన కథల్ని చదువుతూ కథల పట్ల ప్రేమ పెంచుకున్నవాడిని, ఆ శైలి ప్రవాహ వేగంతో ఉండేది. అవిష్కరణతో సంబంధం లేకుండా ఛాయ మోహన్బాబు గారి దగ్గర అందుబాటులో ఉంటాయి. ఎవరైనా మిత్రులు నా మీద అభిమానంతో తెప్పించుకోవచ్చు.
వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని ఆత్మసంతృప్తి జాడలు కనిపిస్తాయి. జీవన గచునాన్ని నిర్దిష్ట స్థలకాలాదుల్ని వర్తమానం వరకు అనేక ప్రత్యేకతల్ని కథలుగా ‘యానాం కథలు’ పేరుతో నమోదు చేయగలిగాను.
‘కథల గోదారి’ ఎవరైనా గోదావరి పదంతో కూడిన శీర్షిక ఇస్తే దాని చుట్టూ కథనాన్ని సంభాషణల్నీ కూర్చి కథలు రాశాను. గోదావరి పరివాహక ప్రాంతపు జీవన వాస్తవితను ప్రతిబింబించేలా కథలు రాశాను. ఇలా ప్రయోగం (కొందరు అన్నారు)గా రాయడం వల్ల కొన్ని కొత్త ఇతివృత్తాల్ని ఊహించికుని రాశాను. ముందుమాటలు రాసిన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, శ్రీరమణ గార్ల నుండి ప్రశంసలు అందుకున్నాను.
స్వాతి వీక్లీ వారు కుటుంబ సంబంధాల నేపథ్యంలో అంశం ఇచ్చినప్పుడు కథలు రాసి బహుమతులు పొందాను.
గౌరవనీయులు వేమూరి బలరామ్ గారి ప్రోత్సాహం ఇది. అంటే ఏదో ఒక పదమో ఒక వాక్యమో నన్ను కథ రాయడానికి పురిగొల్పిందన్నమాట. గత సంవత్సరం ‘లేళ్ళమెరక’ కథలు వెలువడ్డాయి. రైతు సమస్యల్ని చిత్రించే కథలుండటం వల్ల మా పొలం పేరు లేళ్ళమెరక అని పేరు పెట్టాను. రైతు పట్ల ఉండే ప్రేమతో పాపినేని శివశంకర్ ముందుమాట రాశారు.
సజీవ సాహిత్యానికి ప్రతీకల్కెన కథ, కవిత, విమర్శ ప్రక్రియలు ఇష్టం వారు. అనుభవాన్ని గుది గుచ్చే అవకాశం ఉండటం వల్ల కథలు ఎక్కువ రాస్తున్నాను. అంతమాత్రాన కవిత్వం విడిచిపెట్టలేదు.
‘మనిషి లోపలి నీడ లో సామాజిక అంశాలు, మానవ సంబంధాలు, చరిత్ర, విలువల విధ్వంసం నేపథ్యంలో జీవన పోరాటాల్ని చిత్రించిన కథలు ఇందులో ఉన్నాయి. అండమాన్ వెళ్ళొచ్చాక కాలాపానీ ముఖ్యంగా మ్యూజియంలో చూసిన ఛాయాచిత్రాల శిక్షల దృశ్యాలు నా చేత ‘ద్వీపాంతర వాసం’ కథ రాయించింది. ఆ కథ ముందుమాటకు పంపించిన కథల్లో లేదు. తర్వాత చేర్చాను. ‘విలువల సంఘర్షణ నుంచి…” పేరుతో ప్రముఖ విమర్శకులు డా.ఏ.కె. ప్రభాకర్ ముందుమాట రాశారు. ఆయనకు ఎంతయినా కృతజ్ఞతలు. ముఖచిత్ర రచన క్రాంతి గారికి అందంగా ముద్రింపచేసిన మోహన్బాబు గార్లకు కృతజ్ఞతలు.
-దాట్ల దేవదానం రాజు
పుస్తకం వెల: 180/- పేజీలు 168
పుస్తకం కోసం సంప్రదించాల్సిన నంబర్లు :
7093165151, 9848023384
