ఒక ఐ.పి.ఎస్. ఆఫీసర్ అంతరంగం …
తాను చూసింది, తాననుభవించింది, తానుకలగన్నదీ, కవికి మాత్రుకయితే ఆ మాత్రుక నుండి పుట్టిందే కవిత్వం. గతంలో చూచి, వర్తమానంలో అనుభవించి, భవిష్యత్తును ఆశించడం కవికే సొంతం. నేను, నువ్వు రెండుగా వున్నాయి. నేనూ, నువ్వూ ఒక్కటైతే అది బ్రహ్మ పదార్థం. ఒకటి లౌకికం, రెండోది అలౌకికం. రెండూ ఒకటే అయితే అహం బ్రహ్మాస్మి అనడం అతిశయోక్తి కానేరదు. నువ్వు అబద్ధం, నీ ఆత్మీయత అబద్ధం, నీమైత్రి అబద్దం, నిన్నూ నీమాటలను నమ్మి నేను మోసపోయాను. – నమ్మవలసింది నిన్నుగాదు. నన్ను నేనే నమ్ముకోవాలి.
“బ్రహ్మాండాలను జయించే బలం నాకుంది
విశ్వాసం నా ఊపిరి,
నేనే విశ్వాసం,
విశ్వాసమే నేను” అంటూ – (అహం బ్రహ్మాస్మి) అచంచల విశ్వాసానికి మనిషి ప్రతీక కావాలని కవి కాంక్షించేడు.
నేను పువ్వుని
నేను మేఘాన్ని
నేను చినుకుని
నేను కెరటాన్ని అంటూ… తానే ప్రకృతినని, గతికదా జీవితంలో రీతి, ప్రగతికదా ప్రయాణంలో నీతి, సాహసం పురుషలక్షణం, – శోధించడం మనిషి లక్షణం, “గతిని రెమ్మలలో దాచుకున్న పువ్వుని నేనని, నింగిని తాకేందుకు ఎగిసిపడుతున్న కెరటాన్ని నేనని, జలపాతం నా గమనం, హిమగిరి మీద ఎగురుతోన్న సాహసం నా జీవితం” అని ఎలుగెత్తి చాటిన కిల్లాడ సత్యనారాయణ తన భావాలను ఒక చోట చేర్చి ప్రచురించిన పుస్తకమే ‘మనిషి నాభాష ‘ పుస్తకం.
“భావాల బానిసత్వం వదిలించుకొని కదా మానవజాతి పురోగమించింది సంకెళ్ళను తెంచుకొనికదా మానవజాతి పురోగమించిందని” కవి గుర్తు చేస్తాడు “స్వేచ్ఛ… కవితలో గడిచిన జ్ఞాపకాల పై కాక గడుస్తున్న క్షణాలపై నడవడం ఆనందం అనడంలో వర్తమానంలో బతకమనే సంకేతం వుంది. గతం కల. వర్తమానం నిజం. నిజంగా నిజంలో బ్రతకండనే సందేశం ఎంత గొప్పది. అక్షరమెంత శక్తి వంతమైన తెలుసుగాబట్టే కిల్లాడ సత్యనారాయణ అక్షర వ్యవసాయం చేసి అక్షరాలను పండిస్తున్నాడు. “నాకూ అక్షరానికీ మధ్య ఎప్పుడూ పోరాటమే. అక్షరం నన్నాడిస్తుందా? నేను అక్షరాన్ని ఆడిస్తున్నానా? అక్షరం నానుంచి జారిపోయిందా కన్నీళ్ళే. అది పారిపోయిందా ఉప్పెనలే, నా అధీనంలో నడచుకుందా సౌబ్రాతృత్వం, సౌహార్దం” అంటూ అక్షరాన్ని ఒడిసిపట్టుకున్నాడు కాబట్టి కిల్లాడ సత్యనారాయణ కవి అయ్యాడు. మనిషి పవిత్రుడు కావాలనుకుంటాడు. ఆ సగటు మనిషి ఆరాటం చూడండి (పవిత్ర మానవుడు) ప్రవచనాలు, ఉపదేశాలు, నీతులు, సూక్తులు ఎన్నివున్నా, గంగా, గోదావరి, కాశీ, ప్రయాగలో ఎంత మునిగినా, ఎన్ని తిరిగినా పవిత్రం కాలేకపోతున్నానే” అని ఆరాటపడే మనిషి. “మునక వేయాల్సింది తనలోనేనని” ఆ హృదయం వైపు దారి చూపిస్తాడు కవి. మనిషి జీవితం సంఘర్షణమయం. అతడు అప్పుడప్పుడు ద్వయంలో ఇరుక్కుపోతుంటాడు. అలాంటప్పుడు కవి సందేశం చూడండి… “ఈ ద్వయాల్ని ఒకే ఒక్క నీడలో ఐక్యం చేయాలి. ఆ నీడతోనే ఆ ఏకంతోనే చివరిదాకా జీవితంతో మమేకమైపోవాలి”. అదే కదండీ జీవమున్నబతుకు. జీవిక లేని బతుకు వ్యర్ధం కదా! అక్షరాలని పండించడమే కాదు, మనిషి బతుకునుకూడా పండించాలనే కవి ఆతృత అభినందనీయం.
కిల్లాడ సత్యనారాయణకి ప్రజలనాడి తెలుసు. సమాజపునాడీ తెలుసు. మంచి నాడీ ప్రవీణుడు. పోలీస్ శాఖలో అత్యున్నత పీఠమెక్కి కూచున్నా, మూలాలను మరచిపోని, మూలాలను స్పృశించకుండా వుండలేని మనిషి. ఎదిగే కొద్దీ ఒదిగి వుండాలనే మర్మం తెలిసినవారు గాబట్టి మనిషిగా, మనీషిగా మనగలుగుతున్నారు. సమాజానికి కిల్లాడ సత్యనారాయణ ఒక ఐ.పి.ఎస్. అధికారిగా (డైరెక్టర్ జనరల్) తెలుసు. కవిగా కొద్దిమందికే తెలుసు. మంచి అధికారిగా ఆయన సిబ్బంది అందరికీ తెలుసు.
“తేనె పట్టునుంచి తేనె పుడుతుందని మరచిపోయి కత్తి పైపూసిన తేనెను నాలుకతో చప్పరిస్తున్నారు. జీవితం రంగస్థలమైంది. అన్నీ నటించే పాత్రలే. ప్రపంచం మార్కెట్ పరమైంది. అన్నీ విలువకోసమే” అంటూ హిపోక్రసీని వ్యంగ్యంగా మనముందుంచిన కవి సమాజాన్ని ఎంతచక్కగా చదివాడోగదా! సత్యనారాయణా… నువ్వు పుట్టగనే పరిమళించలేదు కాదు కాదు నీపరిమళం వ్యాపించలేదు. ఎటువెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలుసుకొని రాళ్ళూ, ముళ్ళూ తొలగించుకొని ముందుకెళ్ళావు. మొక్కవోని ధైర్యం నీది; అలుపెరుగని పోరాటం నీది. పడ్డవాడు చెడ్డవాడుకాదని నిరూపించావు. ఎంత ఎదిగినా ఒదిగివుండడంలో ఔఔన్నత్యం వుందని నిరూపించావు. అందుకే సమాజహిత సాహిత్యాన్ని సృష్టిస్తూ, నిజమైన కవిగా, సాహిత్యకారునిగా, అడుగులు ముందుకేస్తూ నడుస్తున్నావు. ‘ భావానికి భాషకి జరుగుతున్న యుద్ధంలో నేనెప్పుడూ ఓడిపోతూనే ఉన్నాను ‘ అంటున్నావ్ గాని ధర్మానికి అధర్మాని జరిగే పోరాటంలో ఎప్పుడూ నీదే విజయం. అక్షరబ్రహ్మవైనావు, సాహిత్యరంగంలో త్రివిక్రముడవై సమాజ అహితాన్ని లయంచేసే శివునివై, సాహితీరంగంలో విజయుడవు కావాలని కోరుకుంటూ…
-విశ్వేశ్వరవర్మ భూపతిరాజు