అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘మాతృభాషా సేవాశిరోమణి’ పురస్కారాలు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం తెలుగు భాషాభివృద్ధికోసం కృషి చేసిన కళాకారులను, భాషోకోవిదులను, సాహితీవేత్తలను, జర్నలిస్టులను ఒక వేదికపైకి తీసుకొచ్చి ‘మాతృభాషా సేవాశిరోమణి’ పురస్కారాలతో సత్కరించింది. విజయవాడ గవర్నరుపేటలోని హోటల్ పార్క్ ఐరిస్ ప్రైమ్ లో మంగళవారం(21-02-2023) ఉదయం జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ సభకు ముఖ్యఅతిధిగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖామాత్యులు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు పి. విజయ్ బాబు సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ- గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డిగారు తెలుగుకు ప్రాధాన్యత నిస్తూనే అన్ని భాషలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం గుర్తించారన్నారు. ఆంగ్లం నేర్చుకున్నంత మాత్రాన తెలుగును విస్మరించే అభిప్రాయం ముఖ్యమంత్రిగారికి లేనేలేదని, అలాంటి ఆలోచనలతో ఉన్న వారు తమ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకోవలసి ఉందని స్పష్టం చేశారు. తెలుగు వారు ప్రంపంచంలో ఏ మూలకు వెళ్లినా తలెత్తి తిరిగే దిశగా విద్యావిధానంలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఏనాడో చెప్పిన విషయాలనే యునెస్కో కూడా ఇప్పుడు పునరుద్ఘాటించిన విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉండన్నారు. తమ ప్రభుత్వం తెలుగుభాష పట్ల చూపిస్తున్న గౌరవాదరాలకు ఇలాంటి కార్యక్రమాలే నిదర్శనమని చెప్పారు. వివిధ భాషలకు చెందిన కళాకారులను, భాషా కోవిదులను ఒక వేదికపైకి తెచ్చి సత్కరించడం వెనుక పి.విజయబాబు కృషి ఎంతో వుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే తరాలకు ఎంతో స్ఫూర్తినిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు క్విజ్ పోటీలు పెట్టి బహుమతుల్ని అందజేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 30 మంది భాషా సేవకులను కవులను, రచయితలను, జర్నలిస్టులను మంత్రి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. వారిలో విజయవాడకు చెందిన సీనియర్ జర్నలిస్టు అన్నవరపు బ్రహ్మయ్య, నవ మల్లెతీగ సంపాదకుడు, నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ.. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత ..కథకుడు వేంపల్లి షరీఫ్ వున్నారు. గత మూడు దశాబ్దాలుగా వారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ఇస్తున్నట్లు అధికార భాషాసంఘం అధ్యక్షులు పి. విజయ్ బాబు వారిని పరిచయం చేస్తూ సభికులకు తెలియజేశారు. ఏ.పీ. ఎడిటర్స్ అసోసియేషన్ సహకార సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు విజయా బాబు తెలిపారు. కార్యక్రమాన్ని పూర్తిగా ఏ.పీ. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి.ఆర్.కృష్ణంరాజు సమర్థవంతగా నిర్వహించారు.