మాయాబజార్ కు అరవై నాలుగేళ్ళు…

పాండవులు లేని భారతాన్ని ఊహించలేం. అలాంటి పాండవుల ప్రస్తావన లేకుండా ప్రేక్షకులను లాహిరిలో ముంచెత్తిన విజయా వారి మాయాజాలం…అనన్య సామాన్యమైన కళాఖండం… ‘మాయాబజార్’ సినిమా. అభిమన్యుడి పెళ్లి చుట్టూ తిరిగే ఈ మూడుగంటల సినిమాలో అడుగడుగునా పాండవుల ప్రస్తావన వచ్చినా వాళ్ళెవరూ కనిపించకుండా దర్శకుడు కె.వి.రెడ్డి, పింగళి నాగేంద్రరావు అ(చ)ల్లిన మాయాజాలం. అరవైనాలుగేళ్ళయినా వన్నెతగ్గని ప్రాభావంతో అలరిస్తున్న అద్భుత దృశ్యకావ్యం ఈ సినిమా. కొన్ని దశాబ్దాల క్రితం గుబ్బి వీరన్న నాటక సమాజం వారు కర్నాటకలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ‘శశిరేఖా పరిణయం’ పేరుతో నాటకం, యక్షగానం నడిపేవారు. ఆ శశిరేఖా పరిణయ ఘట్టం ఆధారంగానే ‘మాయాబజార్ ‘చిత్రం నిర్మించబడింది. 1957 మార్చి 27 న ఆంధ్ర దేశమంతటా విడుదలై 24 కేంద్రాలలో శతదినోత్సవాలు, నాలుగు కేంద్రాలలో రజతోత్సవాలు జరుపుకున్న మాయాబజార్ సినిమా అరవై నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా విశేషాలు మీకోసం..

విజయా వారి మాయాబజార్:

మాయాబజార్ విజయావారి ఆరవ సినిమా. 1950లో ‘షావుకారు’ సినిమాతో ప్రారంభమైన విజయా వారి ప్రస్థానం ‘పాతాళభైరవి’(1951), ‘పెళ్ళిచేసి చూడు’ (1952), ‘చంద్రహారం’ (1953) ‘మిస్సమ్మ’(1955) సినిమాల విజయంతో నిర్మాతలు మాయాబజార్ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. పాతాళభైరవి తరవాత కె.వి.రెడ్డి విజయా వారి తదుపరి చిత్రానికి సినిమా చేయాల్సివున్నా, అన్నపూర్ణా వారి ‘దొంగరాముడు’ సినిమాకు పనిచేయాల్సి రావడంతో వీలుపడలేదు. 1955లో దొంగరాముడు సినిమా విడుదలయ్యాక కె.వి.రెడ్డి మాయాబజార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సంవత్సరం పాటు శ్రమించి స్క్రిప్టు పని పూర్తిచేశారు. ఈ సినిమా మీద నమ్మకం లేకపోవడం, అంతకుముందు భారీ ఎత్తున నిర్మించిన చంద్రహారం సినిమా పరాజయం పాలవడంతో నిర్మాతలు నాగిరెడ్డి-చక్రపాణి చిత్రనిర్మాణాన్ని వాయిదా వేశారు. కె.వి. రెడ్డిని విజయా వారి నిర్ణయం నిరాశ పరచింది. ఈ విషయం తెలుసుకున్న ఎ.వి.ఎం అధిపతి మెయ్యప్పచెట్టియార్ మాయాబజార్ సినిమా తీసేందుకు ముందుకు వచ్చి కె.వి.రెడ్డి యెంత పారితోషికం అడిగితే అంత ఇస్తానని కబురంపారు. అంతేకాదు సుందర్లాల్ నహతా తోబాటు మరో ఇద్దరు తమిళ నిర్మాతలు కూడా కె.వి. రెడ్డికి ఇదే ప్రతిపాదనను చేరవేశారు. కె.వి.రెడ్డి మాత్రం విజయా వారికి తప్ప వేరే సంస్థలకు ఈ సినిమా తీయనని చెప్పడంతో, నాగిరెడ్డి-చక్రపాణి పునరాలోచనలో పడ్డారు. సినిమా బడ్జట్ ను కె.వి. కి అప్పగించి నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. తెలుగు తోబాటు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని ఏకకాలంలో నిర్మించాలనే నిర్ణయం జరిగింది.

నటీనటుల ఎంపిక:

సినిమా స్క్రిప్టు రాసుకుంటున్నప్పుడే యేయే పాత్రలకు ఎవరెవరిని ఎంపిక చేయాలి అనే విషయాన్ని ముందుగానే కె.వి. రెడ్డి నిర్ణయించేశారు. ముఖ్యంగా కృష్ణుడు వేషానికి ఎన్టీఆర్ ను ఎంపిక చేసినప్పుడు, ఆ పాత్రను పోషించేందుకు రామారావు మొదట సంశయించారు. ఆరోజుల్లో కృష్ణుడు అంటే అందరూ కల్యాణం (ఈలపాట) రఘురామయ్యే అనుకునేవారు. ఘంటసాల నిర్మించిన ‘సొంతవూరు’ సినిమాలో ఒక నాటక సన్నివేశంలో వెండితెర మీద ఎన్టీఆర్ కృష్ణుడుగా కనిపించినప్పుడు ప్రేక్షకులు గోలచేసి అవమానించినంత పనిచేశారు. ఆవిషయం కె.వి. కి కూడా తెలుసు. అందుకే కళాదర్శకులు మాధవపెద్ది గోఖలే, కళాధర్ లతో రకరకాల స్కెచ్ లు గీయించి నిండుకిరీటం పెట్టించి, మేకప్ మెన్ పీతాంబరం, భక్తవత్సలం చేత ఆహార్యం మెరుగు పరచి, నడక, వాచకంలో మార్పులుచేసి “కృష్ణుడంటే ఇలా వుండేవాడా” అనేలా తీర్చిదిద్దారు. కృష్ణుడి ఫోటోతో నలభై వేల క్యాలండర్లు రంగుల్లో ముద్రించి ఇంటిల్లపాదీ పంపిణీచేశారు. ఆరోజుల్లో జనం ఈ ఫోటోలకు ఫ్రేములు కట్టించి తమ పూజాగదుల్లో, షాపుల్లో తగిలించి పూజాపునస్కారాలు కూడా నిర్వహించారు. అలా ఎన్టీఆర్ తెలుగింటి కృష్ణుడైపోయారు. ఇక ఘటోత్కచుని పాత్ర ఎస్వీ రంగారావుకు దక్కింది. విజయా సంస్థలో ఎస్వీఆర్ తొలుత కాంట్రాక్టులో వుండేవారు. అంతకు ముందు విజయావారు నిర్మించిన అన్ని సినిమాల్లోనూ ఎస్వీఆర్ వేషం కట్టారు. పైగా తమిళనాట కూడా ఎస్వీఆర్ కు మంచిపేరు ఉండడంతో రెండు భాషల్లోనూ ఆయనే ప్రధానపాత్రధారి అయ్యారు. అభిమన్యుని పాత్రకు తెలుగులో అక్కినేనిని, తమిళంలో జెమిని గణేశన్ ను నియమించారు. దుర్యోధనుని పాత్రను ముక్కామల కృష్ణమూర్తి పోషించారు. సావిత్రి శశిరేఖగా, సంధ్య రుక్మిణిగా ఎంపికయ్యారు. ఋష్యేంద్రమణికి రేవతి పాత్ర ఇవ్వజూపితే ఆ గర్విష్టి పాత్ర వద్దనిచెప్పి సుభద్ర పాత్రను కోరుకోవడతో, రేవతి పాత్ర ఛాయాదేవికి దక్కింది. దుర్యోధనుడి భార్య భానుమతి పాత్రకు రజనిని తీసుకున్నారు. లక్ష్మణకుమారుని పాత్రకు తెలుగులో రేలంగి, తమిళంలో తంగవేలు ఎంపికకాగా, లక్ష్మణుని పాత్ర వెకిలిగా ఉందనే విమర్శలు రావడంతో కె.వి. బలమైన వివరణ ఇచ్చారు. “రారాజు దుర్యోధనుడు పరాక్రమవంతుడైనంతమాత్రాన అతని కుమారుడు వీరుడు కానవసరం లేదు. అసలు భారతంలో లక్ష్మణకుమారునిది చాలా చిన్నపాత్ర. యుద్ధభూమిలో కాలిడుతూనే అభిమన్యుని చేతిలో మొదటి బాణానికే అశువులుబాసాడు. అందుకే ఆ పాత్రను వినోదానికి వాడుకున్నా” నని కె.వి. చెప్పారు. బలరాముని పాత్రకు తెలుగులో గుమ్మడి, తమిళంలో బాలసుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. అయితే బాలసుబ్రహ్మణ్యానికి గమ్ అలర్జీ ఉండడంతో ఆతను గెడ్డం లేకుండానే నటించాల్సి వచ్చింది. అలర్జీ విషయం తొలిరోజు షూటింగులో కానీ తెలియకపోవడంతో, చేసేదేమీలేక ఆ పాత్రను సినిమాలో గెడ్డం లేకుండానే చూపించారు. శకుని పాత్రకు పేటెంట్ రైట్ సియ్యస్సార్ దే. ఈ పాత్రను తమిళంలో నంబియార్ పోషించారు. హాస్యనటుడు బాలకృష్ణ చేత కె.వి. పాతాళభైరవి సినిమాలో రెండు పాత్రలు వేయించారు. మాయాబజార్ లో కూడా దానినే రిపీట్ చేశారు. ఇందులో సారథిగా నటించిన బాలకృష్ణ ఘటోత్కచుడు అర్ధరాత్రి ద్వారకలో ప్రవేశించినప్పుడు ద్వారపాలకుని వేషంలో కూడా కనిపిస్తాడు. మాయాబజార్ లో రమణారెడ్డిది ఒక అద్భుతమైన పాత్ర. ఘటోత్కచుని అరణ్యరాజ్యంలో అతని పటాలానికి గురువుగా చిన్నమయ (చిన్న తరహా మయుడు) పాత్రలో నటించగా అతని అనుంగు శిష్యులు లంబు, జంబులుగా చదలవాడ కుటుంబరావు, నల్లరామమూర్తి నటించారు. ఇక దుష్టచతుష్టయంలో కర్ణుడుగా మిక్కిలినేని, దుశ్శాసనుడుగా ఆర్. నాగేశ్వరరావు నటించారు. నాగభూషణం సాత్యకిగా, అల్లు రామలింగయ్య శర్మ, వంగర వెంకటసుబ్బయ్య శాస్త్రిగా నటించారు. గాయకుడు మాధవపెద్ది సత్యం సుభద్రాభిమన్యులను ద్వైతవనానికి చేరవేసే దారుకుడుగా వ్యవహరించారు. బాల అభిమన్యునిగా మాస్టర్ ఆనంద్, బాల శశిరేఖగా సచ్చు(సరస్వతి), బాలకృష్ణునిగా మాస్టర్ బాబ్జీ, యశోదగా కాకినాడ రాజరత్నం నటించారు. బాబ్జీ జెమిని గణేశన్-పుష్పవల్లి ల కుమారుడు. ఆ రోజుల్లో చలనచిత్ర రంగంలో వున్న పెద్ద నటులందరూ మాయాబజార్ లో నటించడంతో పాండవుల పాత్రలకు సరైన నటులు లేనందున సినిమాలో ఆద్యంతం వారిప్రస్తావన వస్తున్తుందే తప్ప, పాండవులు మాత్రం కనుపించరు.

చిత్ర కథ చిన్నదే!

రేవతీబలరామ దంపతులు తమ కుమార్తె శశిరేఖతో అభిమన్యునికి వివాహం జరిపిస్తామని చిన్నతనంలోనే వాగ్దానం చేస్తారు. జూదంలో సర్వస్వాన్ని ఓడిన పాండవులు వనవాసానికి వెళ్ళడంతో సుభద్ర సోదరుల పంచన చేరుతుంది. కపట జూదం ఆడించిన ప్రియశిష్యుడు డుర్యోధనుని మందలించి, పాండవులకు తిరిగి రాజ్యాన్ని అప్పగించి వస్తానని బలరాముడు హస్తిన చేరుకుంటాడు. విషయం తెలుసుకున్న మాయాజూదరి శకుని బలరాముని పొగడ్తలతో ముంచెత్తి, బలరామ తనయుడు లక్ష్మణకుమారునితో శశిరేఖ వివాహాన్ని జరిపించేలా వాగ్దానం చేయిస్తాడు. కృష్ణుడు సుభద్ర, అభిమన్యులను భీమసేన, హిడింబల కుమారుడైన ఘటోత్కచుని స్థావరానికి చేరుస్తాడు. ఘటోత్కచుడు మాయాబజార్ ను సృష్టించి, మాయాశశిరేఖ రూపం లో లక్ష్మణకుమారుని వివాహమాడేందుకు విడిదికి రప్పిస్తాడు. మాయాబజారులో భీభత్సం సృష్టించి, కౌరవులకు తగిన శాస్తిచేసి, కృష్ణుని ఆజ్ఞానుసారం అదే ముహూర్తానికి తన ఆశ్రమంలో అభిమన్యు, శశిరేఖలకు వివాహం జరిపిస్తాడు. “జై సత్యసంకల్ప జై దీనకల్పా” అంటూ శ్రీకృష్ణుని స్తుతించి విష్ణురూప దర్శనం ఇప్పిస్తాడు .

కె.వి, మార్కస్ బార్ట్ లే ల ప్రతిభ:

దర్శకుడు కె.వి. రెడ్డి సన్నివేశ చిత్రీకరణ అనుక్రమం నిర్దిష్టంగా వుంటుంది. ఉదాహరణకు, భానుమతీదేవి పంపిన ఆభరణాలను తృణీకరించి శశిరేఖ శయ్యామందిరానికి వెళ్లి అద్దం ముందు నిలబడిన తరుణంలో తల్లి రేవతి అక్కడకు వచ్చి శశిరేఖను మందలించి, చెంప చెళ్ళుమనిపించి వెళ్తుంది. ఈ సన్నివేశం మరలా అద్దం ముందే ముగుస్తుంది. అలాగే “అల్లి బిల్లి అమ్మాయికి” పాట జరుగుతుండగా చిన్ననాటి శశిరేఖ పెద్దదవుతుంది. నీటిఒడ్డున కూర్చున్న సచ్చు మొహమ్మీదనుంచి కెమెరా మెల్లగా పాన్ అయి ఒక తామర మొగ్గ మీదనుంచి వస్తూ గడచిపోతున్న కాలానికి గుర్తుగా కొలనులో అలలురేగి బాల శశిరేఖ ప్రతిబింబం చెదరుతుంది. ఆ మొగ్గ మెల్లిగా విచ్చుకొని సావిత్రి మీదకు ఫోకస్ అవగానే సచ్చు స్థానంలో అదే భంగిమలో కూర్చున్న సావిత్రి కనిపిస్తుంది. దీనిని ఒకే షాట్ లో చిత్రీకరింపజేసిన ప్రజ్ఞ దర్శకునిడైతే, ఆ షాట్ ను చిత్రీకరించిన ఘనత మార్కస్ బార్ట్ లే ది. వాహినీ వారి స్వర్గసీమ సినిమాతో విజయా సంస్థకు పరిచయమైన మార్కస్ బార్ట్ లే ఆ సంస్థ నిర్మించిన అన్ని చిత్రాలకూ పనిచేశారు. బార్ట్ లే ఆంగ్లో ఇండియన్. విజయా రికార్డింగ్ థియేటరులో మార్కస్ కు నాగిరెడ్డి ప్రత్యేకించి ఒక గది కూడా కేటాయించారు. ఆయనకు నాగిరెడ్డి తమ్ముడు కొండారెడ్డి ముఖ్య సహాయకుడిగా వుండగా, మరో నలుగురు ఆపరేటివ్ కెమెరామెన్లు, పదిమంది సహాయక సిబ్బంది ఆయనతో వుండేవారు. అంటే సినిమాటోగ్రాఫిక్ విభాగానికి విజయా సంస్థలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేవారని గ్రహించాలి. ఇక మార్కస్ ప్రతిభ చూడాలంటే, సాంకేతికత లేనిరోజుల్లో ఆయన తీసిన ట్రిక్ షాట్లు గమనించాలి. మార్కస్ కూడా కె.వి లాగే, ఒక సినిమా పూర్తయితేగాని మరొక సినిమా చేపట్టేవారు కాదు. బలరామకృష్ణులను అన్నదమ్ములని తెలిపేందుకు సింబాలిక్ గా పక్కపక్కనే కూర్చోబెట్టి ఒక షాట్ తీశారు. ఎన్టీఆర్, గుమ్మడి ఇద్దరిదీ కోటేరేసిన ముక్కుకావడంతో ఆ సారూప్యం కనిపించింది. కె.వి. నిశిత పరిశీలనకు ఇదో ఉదాహరణ మాత్రమే!. ప్రియదర్శిని అనే మందసంలో తనకిష్టమైనది కనిపిస్తుంది వెళ్లి చూడమని కృష్ణుడు శశిరేఖకు చెప్పినప్పుడు, శశి తన మందిరంలోకి వెళ్లి ఆ మందసాన్ని తెరుస్తుంది. అభిమన్యుడు “నీవేనా నను తలచినది” అంటూ ఆమెకు కనిపించడం, పాటపాడటం పూర్తవుతుండగా శశి ఆ మందసాన్ని మూసి వెంటనే తెరుస్తుంది. ఆ పేటికలోంచి నిష్క్రమిస్తున్న అభిమన్యుడు కూడా వెనక్కి తిరిగి శశితో గొంతు కలపడం కె.వి చేసిన ఒక అద్భుత ప్రక్రియ. “వివాహ భోజనంబు” పాట సందర్భంలో వచ్చే ట్రిక్ షాట్లు, మాయామహల్లో గింబళి తనంత తనే లోపలికి చుట్టుకోవడం, గిల్పం గిరగిరా తిరిగి బాలకృష్ణను కింద పడదోయడం వంటి ట్రిక్ షాట్ల చిత్రీకరణలో బార్ట్ లే కు హర్బన్స్ సింగ్ సహకరించారు. ఇలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో కోకొల్లలు.

పింగళి రచనా కౌశలం:

పింగళి నాగేంద్రరావు వెదజల్లిన సాహితీ సౌరభాలను మాటల్లో వర్ణించలేం. ఘటోత్కచుని స్థావరంలో సుభద్ర హిడింబతో “పాండవులు, పాండవుల ప్రతాపాలు కౌరవుల గోటికి సరిరావు” అని బలరాముడు అన్నట్లు చెబుతుండగా వినిన ఘటోత్కచుడు, ఆవేశపడి, ద్వారకపై యుద్ధానికి సన్నద్ద మౌతాడు. “విన్నాను మాతా విన్నాను. ఇచ్చిన మాట తప్పుటయేగాక, తుచ్చ కౌరవుల పొత్తు కలుపుకొని జగద్విదిత పరాక్రమ వంతులైన మా జనకులనే తూలనాడిరిగా యాదవులు! ఎంత మదమెంత కావరమెంత పొగరు. అంతకంత ప్రతీకారమాచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టుబెట్టకున్న నా మహిమ ఏల” అంటూ సుదీర్ఘ సమాసం చెప్పిన వెంటనే “దురహంకార మదాంధులై” అనే పద్యాన్ని పింగళి ఆ సన్నివేశంలో జోడించారు. మాటల టెంపోలోనే మాధవపెద్ది అ పద్యాన్ని ఆలపించిన తీరు అద్భుతం. ఆవెంటనే ఘటోత్కచుని నివారించేందుకు పింగళి సుభద్ర చేత “అది నాకు అప్రతిష్ట కాదా” అనిపిస్తారు. “పోనీ హస్తినాపురికి పోయి కౌరవహతకులనైనా హతమార్చి వచ్చెదను” అంటాడు ఘటోత్కచుడు. అందుకు హిడింబ చేత “వారిని నీవు చంపరాదురా సుపుత్రా. మీ జనకులు ప్రతిజ్ఞలు చేశారు. వారి చేతుల్లో చచ్చేదాకా వారు బ్రతికే వుండాలి” అనిచెప్పిస్తారు. అతని ఆవేశం చల్లార్చడానికి “ద్వారకకు పోయి శశిరేఖను ఎత్తుకురా. అభిమాన్యునికిచ్చి పెళ్లిచేద్దాం” అంటుంది హిడింబ. పనిదొరికిందన్న ఆనందంలో “ప్రశస్తం, సుప్రశస్తం” అంటాడు ఘటోత్కచుడు. ఇది పింగళి చమత్కారం. ఈ సినిమాలో సత్యపీఠం, ప్రియదర్శిని, తస్మదీయులు, దుష్టచతుష్టయము, జియ్యా, వీరతాళ్ళు, రత్నగింబళి, గిల్పం, శాకంబరీ దేవి ప్రసాదం వంటి కొత్త పదాలను పింగళి ప్రవేశపెట్టారు. పైగా “ఎవరూ కనిపెట్టకుండా మాటలెలా పుడతాయి” అని సమర్ధించుకున్నారు కూడా. రసపట్టులో తర్కం కూడదు, భలే మామా భలే, ఇదే మన తక్షణ కర్తవ్యము వంటి మాటల్ని కూడా ప్రయోగాత్మకంగా వాడారు. నేటికీ ఇవి వాడుకలో వుండటం విశేషం. ఈ సినిమాలో పింగళి హాస్యానికి పెద్దపీట వేయడం మరో పార్శ్వం. ఈ సినిమా చివర ఘటోత్కచుడు శ్రీకృష్ణుని “జై సత్య సంకల్ప జై శేషతల్పా” అని కీర్తిస్తూ ఈ చిత్రకథను చూసినవారు, వినినవారు శుభసంపదలు గలిగి వర్దిల్లుతారని, సుఖశాంతులను గలిగి శోభిల్లుతారని ఆశీర్వదించడం పింగళి చమత్కారమే.

సంగీతం సమపాళ్ళలో:

ఈ సినిమాకు కథ, మాటలు, పాటలు సమకూర్చింది పింగళి నాగేంద్రరావు. ఘంటసాల సంగీత దర్శకత్వం నిర్వహించగా విజయా సంస్థకు చెందిన ఎ. కృష్ణమూర్తి ఆర్కెష్ట్రా సహకారం అందించారు. విజయా వారి చిత్రాల్లో తొలిపాట ‘శ్రీ’ అక్షరంతో మొదలవడం ఆనవాయితీ. “శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా” పాట అలాంటిదే. దేశ్, తిలక్ కామోద్ హిందూస్తానీ రాగఛాయల్లో బాణీ కట్టగా ఎం.ఎల్. వసంతకుమారి బృందం ఆలపించిన ఈ పాట ద్వారా ముఖ్య పాత్రల్ని పరిచయం చేశారు. సుశీల, జిక్కి పాడిన “అల్లిబిల్లి ఆటలే లల్లిలలా పాటలే” పాటలో చిన్ననాటి శశిరేఖ తన చెలికత్తెలతో ఆడుతూ పెద్దదై సావిత్రిగా మారటం చూపించారు. ఈ పాట తిలంగ్ రాగ ప్రధానంగా స్వరపరచారు. భీంపలాస్ రాగంలో అమరిన ఘంటసాల, లీలల యుగళగీతం “నీవేనా నను తలచినది, నీవేనా నను పిలచినది” నేటి ల్యాప్ టాప్ లో అంతర్జాల సాయంతో వచ్చిన పాటలంటిది. ఈ సినిమాలోని ఒక అంతర్నాతకంలో వచ్చే “విన్నావ యశోదమ్మా” అనే యశోదాకృష్ణుల ప్రదర్శన పాటను తిలంగ్ రాగంలో లీల, సుశీల, స్వర్ణలత ఆలపించగా, అందులో కాకినాడ రాజరత్నం, మాస్టర్ బాబ్జీ బృందం నటించారు. ప్రేక్షకులను ఒక మధురమైన మైకంలోకి తీసుకెళ్ళిన యుగళగీతం మొహనరాగంలో స్వరపరచిన “లాహిరి లాహిరి లాహిరిలో”. ఘంటసాల, లీల ఆలపించిన ¬ఈ నౌకావిహారపు పాటలో అభిమన్యుడు-శశిరేఖ; కృష్ణుడు-రుక్మిణి; బలరాముడు-రేవతి జంటలు కనిపిస్తారు. అసలు సిసలైన విజయా మార్కు వెన్నెల పాట ఇది. శశిరేఖా అభిమాన్యుల మరొక ప్రేమగీతం “చూపులు కలిసిన శుభవేళా ఎందుకు నీకీ కలవరము” ను ఘంటసాల, లీల ఆలపించగా బృందావన సారంగ రాగంలో ఈ పాటను స్వరపరచారు. మాధవపెద్ది ట్రేడ్ మార్కు పాట “వివాహ భోజనంబు” మెక్సికన్ గాయకుడు చార్లెస్ పెన్రోస్ ఇంగ్లీషులో పాడిన ’ది లాఫింగ్ పోలిస్ మ్యాన్’కు అనుకరణ. లీలా మానుష వేషదారి శ్రీకృష్ణుని లీలలను అర్ధవంతంగా, వేదాంతపరంగా గుర్తుచేసుకుంటూ దారుకుడు సుభద్ర, అభిమన్యులను ద్వైతవనం చేర్చే సందర్భంగా మాధవపెద్ది నటిస్తూ పాడే పాట “భళిభళి భళిభళి దేవా బాగున్నదయా నీ మాయ”ను చారుకేసి రాగంలో స్వరపరచారు.

మరిన్ని విశేషాలు:

మాయాబజార్ చిత్రానికి మొదట నిర్ణయించిన పేరు ‘శశిరేఖా పరిణయం’. విడుదలకు ముందు వరకూ అదేపేరుతో ప్రచారం జరిగింది. అయితే, మాయాబజార్ అనే మాట జనప్రియం కావడంతో విడుదలకు కొద్దిరోజుల ముందు మాత్రమే ‘మాయాబజార్’ పేరును కరారు చేశారు. నిజానికి ‘బజార్’ అనేది పర్షియన్ భాషా పదం. ఈ పదం అరబిక్, ఉర్దూ భాషల్లో కూడా ఉండడంతో తెలుగులో కూడా అదే అర్థంతో వాడుకలోకి వచ్చింది. అందుకే ఈ పదప్రస్తావన సినిమాలో ఎక్కడా రాకుండా జాగ్రత్త పడ్డారు.

భారతీయ సినిమా స్వర్ణోత్సవం సందర్భంగా 2013లో CNN-IBN సంస్థ నిర్వహించిన సర్వేలో వంద ఆల్ టైం గ్రేట్ భారతీయ సినిమాలలో మాయాబజార్ సినిమా ప్రధమ స్థానంలో నిలిచింది. 26 లక్షల వ్యయంతో నిర్మించిన మాయాబజార్ 27 కేంద్రాల్లో శతదినోత్సవం, నాలుగు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకుంది. రెండు వర్షన్ల శతదినోత్సవ వేడుకలు జూలై 21, 1957న మద్రాసు చందమామ బిల్డింగ్స్ ఆవరణలో జరిపారు. జెమినీ అధినేత ఎస్.ఎస్. వాసన్ అందరికీ మెమెంటోలు పంచారు. విజయా సంస్థ తన సిబ్బందికి నాలుగు నెలల బోనస్ ప్రకటించింది.

ఈ సినిమాకోసం కళాదర్శకులు మాధవపెద్ది గోఖలే, కళాధర్ లు వాహినీ స్టూడియోలోని పన్నెండు ఫ్లోర్లలో ఏకంగా 30 సెట్టింగులు వేశారు. 400 మంది కార్మికులు ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నారు. షూటింగ్ షెడ్యూలుకు ఒకరోజు ముందే సెట్టింగును బార్ట్లే తన ఆధీనంలోకి తీసుకొని లైటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసుకునేవారు. దానితో అనుకున్న సమయానికి సన్నివేశ చిత్రీకరణ పూర్తయ్యేది.

మాయాబజార్ కు ముందు విజయా సంస్థ నిర్మించిన ‘మిస్సమ్మ’(1955) సినిమాకు సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. మాయాబజార్ సినిమాకు కూడా సాలూరు రాజేశ్వరరావునే సంగీత దర్శకునిగా నియమించారు. “నీవేనా నను తలచినది”, “చూపులు కలసిన శుభవేళా”, “లాహిరి లాహిరి లాహిరిలో”, “నీకోసమే నే జీవించునది” అనే నాలుగు యుగళగీతాలకు రాజేశ్వర రావు బాణీలు కట్టారు. అయితే నిర్మాతల సరళి నచ్చక రాజేశ్వరరావు ఆ పాటలను రికార్దింగు చేయకుండానే తప్పుకున్నారు. తరవాత నిర్మాతలు ఘంటసాలకు సంగీత దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. బాణీలు కట్టడమే కానీ ఆర్కెస్టరైజేషన్ చేయలేదనే కారణంచేత టైటిల్స్ లో రాజేశ్వర రావు పేరును వేయలేదు. రాజేశ్వరరావు బాణీలు కట్టిన నాలుగు పాటల్లో మూడుపాటల పల్లవుల పేరుతో సినిమాలు రావడం విశేషం.

“లాహిరి లాహిరి” పాటలో కొంత భాగాన్ని మద్రాసు సమీపంలోని ఎన్నూరు వద్ద వున్న సరస్సులో మద్యాహ్న సమయంలో చిత్రీకరించారు. ఆ పాట మిగులు భాగాన్ని బ్యాక్ ప్రొజెక్షన్ షాట్లతో సహా వాహినీ స్టూడియోలో సెట్ వేసి తీశారు. పెద్దపెద్ద రెల్లు పూల మొక్కలతో సెట్టింగు నింపి, పంఖాల సాయంతో వాటికి కదలిక కలిపించి వెన్నెలలలో అవి మెరుస్తున్నట్లు భ్రమ కలిపించేలా మ్యాచింగ్ షాట్లను చాయాగ్రాహకుడు మార్కస్ చిత్రీకరించిన విధానం నేటికీ ఒక వింతే. ఒకటి అవుట్ డోర్లో, రెండవది ఇండోర్ లో తీసినట్లు ప్రేక్షకుడు గుర్తించలేని విధంగా చిత్రీకరించడమే మార్కస్ బార్ట్లే ప్రతిభ. తెలుగు సినిమా చరిత్రలోనే వెన్నెలంటే విజయా వారిదే అంటుంటారు జనం ఇప్పటికీ.

మాధవపెద్ది కీర్తి కిరీటంలో కలికి తురాయిగా, ఎస్వీఆర్ నటనా పటిమకు మారుపేరుగా నిలిచిన పాట “వివాహ భోజనంబు”. ఈ పాటకోసం మాధవపెద్ది వారం రోజులపాటు సాధన చేసి గంభీరంగాను, అద్భుతంగాను పాడారు. ఇదే పాటను తమిళంలో పాడిన తిరుచ్చి లోకనాథన్ మాధవపెద్దితో పోటీపడాలని ప్రయత్నించగా అతని గొంతు పచ్చి పుండుగా మారి ముద్ద దిగటమే కష్టమైంది. ఈ పాట 1922లో మెక్సికన్ గాయకుడు చార్లెస్ పెన్రోస్ ఇంగ్లీషు లో పాడిన ’ది లాఫింగ్ పోలిస్ మ్యాన్’కు అనుకరణ. ఈ ట్యూనును మొదట నానూభాయ్ వాకిల్ 1932లో నిర్మించిన ‘మాయాబజార్-సురేఖాహరణ్’ సినిమాలో వాడారు. 1936లో వేల్ పిక్చర్స్ వారి మాయాబజార్ సినిమాలో గాలి పెంచల నరసింహారావు కూడా ఇదే ట్యూనును అనుకరించి “వివాహ భోజనంబు వింతైన పాయసంబు, ఘనమైన ధప్పళంబు కడుమంచి అప్పళంబు” అనే పాటకు ప్రాణం పోశారు. విజయా వారి చిత్రంలో కూడా ఇదే ట్యూనును అనుకరించి సురభి నాటక సమాజం వారు పాడే పాటను ఇందులో చేర్చారు.

2010లో ఈ సినిమాను గోల్డ్ స్టోన్ కంపెనీ రంగుల్లోకి మార్చి జనవరి 30 న విడుదలచేశారు. ముఖ్యమైన సన్నివేశాలను, పాటలను ఇందులో తొలగించడంతో ప్రేక్షకులు రంగుల మాయాబజార్ ను గొప్పగా ఆదరించలేదు. అయితే నలుపు తెలుపులో వచ్చిన మాయాబజార్ చిత్రం నేటికీ ఒక మణిపూసే!
-ఆచారం షణ్ముఖాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap