హైదరాబాద్ లో సందడి గా మెగా ఐకాన్ ఉగాది అవార్డుల వేడుక
రాబోయే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెగా రికార్డ్స్ క్రియేషన్స్ కళా సంస్థ ఆధ్వర్యంలో మెగా ఐకాన్ ఉగాది అవార్డుల కార్యక్రమం హైదరాబాద్ లో సందడిగా సంప్రదాయ బద్ధంగా జరిగింది . హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల ఫీనిక్స్ ఆడిటోరియం లో గురువారం రాత్రి (మార్చి 25 న) పలువురు ప్రముఖుల సమక్షంలో ప్రేక్షకుల ఆనందోత్సాల మధ్య ఈ కార్యక్రమం కొనసాగింది . వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి మెగా ఐకాన్ ఉగాది ప్రతిభా పురస్కారాలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు,సినీ నటులు పి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రముఖులు అందజేసారు. జ్ఞాపిక, ప్రశంసా పత్రం, శాలువా తో ప్రతిభా మూర్తులకు పురస్కారాలను అందించి ఘనంగా సత్కరించారు.
లయన్స్ క్లబ్ గాంధీ నగర్ ఆర్య వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు జనపల్లి విట్టల్ రెడ్డి, జివిఅర్ వెంకట్ రెడ్డి, కృష్ణమాచార్యులు, ఎల్లా సుబ్బారెడ్డి, డాక్టర్ రాం తిలక్, బావండ్ల వెంకటేష్ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ అవార్డులు ప్రతిభ ఉన్నవారికి భుజం తట్టి ప్రోత్సహించే విధంగా వున్నాయని, ఇలా గత రెండేళ్ళుగా క్రమం తప్పకుండా ఇస్తోన్న సంస్థ అధ్యక్షుడు శ్రీనివాసరావుని పలువురు ప్రముఖులు అభినందించారు .
సామజిక సందేశంతో నేను రాను బిడ్డా అనే లఘు చిత్రాన్ని రూపొందించి అందరి ప్రశంసలు అందుకున్న రచయిత దర్శకుడు కేయస్సార్ కొత్తపల్లి శేషుకు మెగా ఐకాన్ అవార్డు తొలుత అందజేసారు. లాభదాయక పద్ధతులతో వ్యవసాయం చేస్తూ ఆదర్శ రైతుగా పేరు సంపాదించిన ఖమ్మం జిల్లా చిమ్మపూడి రైతు గుత్తా వెంకటేశ్వర్లు కి ఉత్తమ రైతు పురస్కారాన్ని అందజేసి గజమాలతో ఘనంగా సత్కరించారు. అలాగే ఈ మెగా ఐకాన్ అవార్డు అందుకున్నవారిలో ఉత్తమ సామజిక సేవ అధికారి కొప్పిశెట్టి లతారాణి, గల్లా సత్యనారాయణ, ఉత్తమ నాట్య కారిణి చోళ సముద్రం దివ్య, చిత్రకారిణి అనురాధ గాడ్జిల్, ఉత్తమనటుడు వెంకటేష్, కూచిపూడి నర్తకి హిమశ్రీ, ఉత్తమ సేవా సంస్థ స్కై ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ సంజీవ్ కుమార్, ఉత్తమ పోలిస్ అధికారి లక్ష్మి , పెర్ఫెక్ట్ స్ట్రోక్స్ పవన్ రస్తోగి , సుధా రస్తోగి, ఉత్తమ చిత్రకారిణి ధూళిపాళ సౌజన్య , సోషల్ యక్టివిస్ట్ శివకుమార్, రాజు మహారాజు, సంధ్య గుప్త , కిరణ్మయి, రవికుమార్, ఉష నాగ లక్ష్మి , తోట పద్మ , మౌత్ ఆర్గాన్ వాయిద్య కారుడు తారక రామారావు, గాయని వైష్ణవి వున్నారు.
ఈ కార్యక్రమంలో నాట్య గురువు దివ్య పర్యవేక్షణ లో చిన్నారులు చేసిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
ఈ ఉగాది పురస్కారాలు అందుకున్న వారిని పలువురు అభినందించారు . ఈ కార్యక్రమంలో సీనియర్ నటులు జమా, బాల నటులు ఆదిత్య, అద్వైత , హీరో రోహిత్ తదితరులు పాల్గొన్నారు. మెగా శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు.
-కళాసాగర్