‘వేటూరి కన్నుమూసిన సందర్భంలో వారితో తనకున్న జ్ఞాపజాలు పంచుకున్న’… రచన సాయి గారి రాతలు మరోసారి మీకోసం.
కొందరు వ్యక్తులతో అయిన తొలి పరిచయాలు అలా మనో ఫలకంలో ముద్రించుకుపోతాయి. ఎన్నేళ్లు గడిచినా వారు తలపుకు రాగానే ఆ నాటి వారి రూపమే, సాహచర్యమే గుర్తుకొస్తుంటాయి. దానికి ‘రీజనింగ్’ అంటూ ఉండదు. అదంతే! అలాంటి వారిలో వేటూరి సుందరరామమూర్తిగారొకరు.
1963లోనో, 1964లోనో మిత్రుడు చంద్ర ద్వారా ఆయన పరిచయం కలిగింది. అప్పుడాయాన ‘ఆంధ్రజనత’ దినపత్రికలో పనిచేసేవారు. ఎప్పుడూ బుష్ షర్టుతో, సౌమ్యవదనంతో వేటూరిగారు – వయస్సులో ఎనిమిదేళ్లు చిన్నయినా – మమ్మల్ని ఆప్యాయంగా పలరిస్తూ చాలా విషయాలు చెబుతుండేవారు, దానికి వేదిక ‘ఆంధ్రజనత’ ఆఫీసు కెదురుగా ఉన్న ‘బసంత్’ టాకీస్ క్యాంటీన్. అందులో ఎన్నోసార్లు టుబైత్రీ చాయ్ లు తాగుతూ గడపడం ఇప్పటికీ ఓ మరపురాని గుర్తు! ఆ తర్వాతి కాలంలో ఆయన తలపుకు వస్తే ఆ సమావేశాల్లోని అప్పటి ఆయన రూపమే మనసులో మెదులు తూంటుంది ఎల్లప్పుడూ!
ఆయన పూర్తిస్థాయి సంపాదకుడయింతర్వాత ‘ఆంధ్రజనత’ ప్లవంగ ఉగాది (1967) సంచికను భారీ ఎత్తున తేవాలని సంకల్పించేరు. 64… 48… పేజీలు అనుకుని చివరికి 24 పేజీలతో (వెల: 50 పైసలు) వెలువరించేరు. ఇప్పట్లా పేజీలను ఎక్కువగా చూపడానికి టాబ్లాయిడ్స్ వేసే సంస్కృతి లేదప్పుడు. అప్పుడు హేండ్ కంపోజింగ్, క్రెడిల్ మిషిన్లతో రంగుల్లో ఆ సంచిక రావడం నిజంగా ఆ రోజుల్లో సంచలనమే! మంచి వ్యాసాలు, కవితలు, కథలతో ఒక సాహిత్య సంచికగా వెలువడింది. అది తయారులో ఉన్నప్పుడోరోజు అన్నీ భారీ కథలే ఉన్నాయి – చిన్న సరదా కథలుంటే బావుణ్ణన్నారు ఆయన, ఆ రోజుల్లో టుమ్రీ కథలు విరివిగా రాసేవాడ్ని. ఓ చిన్న ప్రేమ కథను ఇస్తే బావుందంటూ ప్రచురించేరు. అప్పుడు మహా గొప్పగా అన్పించింది. ఈ ప్రస్తావన తేవడానికి కారణం ఉంది.
ఆ కథాక్రమం….
ఉద్యోగరీత్యా హైదరాబాద్ వదిలి వెళ్లడం, వేటూరివారు పత్రికారంగం విడిచి సినిమా రంగానికి వెళ్లిపోవడంతో చాలా చాలా ఏళ్లు మళ్లీ ఆయనతో సంబంధం ఏర్పడలేదు.
అలాంటిది ఓ రోజు ఆయన ఫోన్ చేసేరు ‘పత్రికను బాగా తెస్తున్నారు, నాకు ‘రచన’ ప్రతీనెలా కావాలంటూ.
ఆశ్చర్యం! ఆనందం!!
అంత గొప్ప మహాపండితుడికి, పాత్రికేయునికి – మీదు మిక్కిలి గొప్ప సినీ రచయితకి ‘రచన’ నచ్చడం….
నేను ఫలానా అంటూ ‘ఆంధ్రజనత’ రోజులు గుర్తు చేస్తే ‘అం … నువ్వా’ అన్నారు. అదీ ఆయన జ్ఞాపకశక్తి! ‘మరి మీరంటారేంటి సార్’ అంటే, ‘ఇప్పుడు మీరు ఒక మంచి పత్రికకు సంపాదకులు – మీరు తప్పనిసరి’ అన్నారు. అదీ ఆయన వ్యక్తిత్వం, సంస్కారం!
ఈ సంగతి చెప్తే చంద్ర చాలా సంతోషించేడు.
ఆ తర్వాత వేటూరిగారి ‘కిమ్? అస్తిమాలా!’ (‘తరుణ’ మాస పత్రిక – మార్చి, 1974) నా దగ్గరున్నదనీ, అది మళ్లీ ప్రచురించాలనుకుంటున్నాననీ అనుమతి అడిగితే ఆయన చాలా సంతోషించి, “ఓసారి దాన్ని పంపండి – అప్పుడు అచ్చుతప్పులేమైనా దొర్లిఉంటే సవరిస్తాను’ అన్నారు. అలాగే కొన్ని ముద్రారాక్షసాల్ని సవరించి పంపేరు. అక్టోబరు, 2002 ‘రచన’లో ఆ కథ ప్రచురింపబడింది. తర్వాత ఓ నెల గడవక ముందే వేటూరివారు ఫోన్ చేసి, ‘నా పాత కథ మళ్లీ చదువుకున్న తర్వాత మళ్లీ సరదా పుట్టి ఓ కొత్త కథ రాశాను – ఇన్నాళ్లకి… ఇన్నేళ్లకి. ‘రచన లో వేస్తారుగా’ అన్నారు. మహాప్రసాదం అంటూ 2003 సంక్రాంతి ప్రత్యేక సంచికలో ప్రచురించేను – చంద్ర విలక్షణంగా, సలక్షణంగా వేసిన బొమ్మతో. ప్రచురణ తర్వాత ఆ కథను తప్పుల్లేకుండా వేసినందుకు అభినందిం చేరు కూడా!
వేటూరిగారి సంపాదకత్వంలో ‘ఆంధ్రజనతలో నా కథ ప్రచురింపబడడమూ, నా సంపాదకత్వంలోని ‘రచన’లో ఆయన కథ ప్రచురింపబడడమూ యాదృచ్చికమే కాదు ఓ గొప్ప మధురా సుభూతి కూడాను!
ఆ తర్వాతోసారి ఆయన ‘జీవనరాగం’ నవల ప్రస్తావన వచ్చినప్పుడు, ‘అదికూడా ప్రచురించకూడదా – అప్పుడు మరో కొత్త నవల రాస్తానేమో’ అన్నారు. ‘తప్పకుండా’ అని అన్నానేగానీ చాలా తాత్సారంచేస్తూ వచ్చేను. ఎందుకంటే ఆ నవల ఆంధ్ర సచిత్ర వారపత్రికలో (11-11-59 నుంచి 23-12-59) ప్రచురింపబడి నప్పుడు బాపుగారు అద్భుతమైన బొమ్మలు వేసేరు. వాటిని సంపాదించే వేటలో జరిగిన జాప్యం అది. అవి దొరికే అవకాశం రెండుచోట్ల ఉందని తెలిసి మొన్న జనవరిలో ఆయనతో చెప్తే చాలా సంతోషించేరు. ‘మీకా బొమ్మలంటే అంతిష్టమా! అనీ అన్నారు.
నిజానికి జీవనరాగం’ పుస్తకం నా దగ్గిర ఉంది. ఆ విషయం ఆయన కెప్పుడో చెప్పేను కూడా! దాన్నాయన సొంత ప్రచురణ సంస్థ సుందర ప్రచురణలు’ తరఫున 1970లో ప్రచురించేరు. దానికి ముందు ‘చందవోలు రాణి’ (విశ్వనాథ సత్యనారాయణ) ప్రచురించి గురుభక్తిని చాటుకున్నారు. ‘జీవనరాగం’ ఈ నెలో వచ్చే నెలో ప్రారంభిద్దామనుకున్నాను. కాని ఇంతలో… ఇదో అసంతృప్తి!
మరోటి – ‘ఆంధ్రజనత’ ఉగాది సంచిక (1964) ఇస్తే జిరాక్స్ తీయించుకుంటానన్నారు. ఆ సంచికంటే ఆయనకంత యిష్టం అని అప్పుడు తెలిసింది. తొలిచూలు బిడ్డ తల్లికి మరీ మక్కువ అని అంటారందుకనేనేమో! నా దగ్గిర ఆ సంచిక దొరక్క ఆయన ఆ చిన్న కోర్కెని తీర్చలేకపోయేను. అది మరో అసంతృప్తి!
నాలుగు నెలల క్రితం ‘రచన’ తన విశిష్ట చందాదారులలో ఒకరైన దాసరి సుబ్రహ్మణ్యంగారిని కోల్పోయింది. ఇప్పుడు మరొకర్ని పోగొట్టుకుంది.
వేటూరిగారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను.
–రచన సాయి
(రచన పత్రిక సౌజన్యంతో…)
