
రెప్లికా ఆర్టిస్టుగా 733 ప్రపంచ రికార్డులను అందుకున్న డా. దార్ల నాగేశ్వర రావు గారి సరికొత్త కాన్సెప్ట్ “మేరా భారత్ మహాన్” గురించి ఆయన మాటల్లో చదవండి…
రెప్లికా ఆర్టిస్టుగా 21 కాన్సెప్ట్ లకు గాను 733 ప్రపంచ రికార్డులను అందుకున్నాను. తర్వాత నా 22వ ప్రక్రియ “మేరా భారత్ మహాన్” ను 22 X 28 అంగుళాల సైజులో వాటర్ కలర్స్ మరియు జెల్ పెన్నులతో మొదటి ఆర్ట్ వర్క్ ను రూపొందించాను. సరిగ్గా అదే సమయంలో ‘టెన్త్ చదివి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా “పూర్వవిద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం” కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని తెనాలి నుండి ఆహ్వానం వచ్చింది. తెనాలి కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హైస్కూలు వేదికగా ఆత్మీయ సమ్మేళనంలో, నేను రూపొందించిన ఈ ఆర్ట్ వర్కును నేను చదివిన స్కూల్ కి ఇస్తే…. వెంటనే స్కూల్ పేరుతో పూర్తి చేసి, ఫ్రేమ్ ను 27-4-2025 ఆదివారం రోజున మా పాత మిత్రుల సమక్షంలో ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాబీ గారికి అందించాము. అందుబాటులో వున్న ఆనాటి గురువులను ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. అంతేకాకుండా, “ప్రతి ఇంట – జాతీయ జెండా” ఉండాలని ‘MERA BHARATH MAHAN’ ఆర్ట్ వర్క్ ను A4 సైజ్ పేపర్ పై డిజిటల్ ప్రింట్స్ తీసుకుని, లామినేషన్-పంచింగ్, ట్యాగ్ తో వచ్చిన 150 మందికి, ఇంటిలో తగిలించుకునే విధంగా అందజేసాను. ఈ సందర్భంగా నేను నా రెప్లికా కళా ప్రదర్శనను ఏర్పాటు చేశాను. అంతేకాదు, “టెన్త్ తర్వాత” అంటూ నా స్వయంకృషిని, నేను చేసిన 22 రకాల ప్రక్రియలు, సాధించిన రికార్డుల వివరాలతో మా మిత్రులకు తెలపాలన్న ఉద్ధేశ్యంతో, డిజిటల్ ప్రింట్ ద్వారా A4 సైజు పేపర్ లో, ల్యామినేషన్ చేసి అందరికీ అందించడం జరిగింది.
టెన్త్ తర్వాత నేను చేసిన పనులకు, సాధించిన విజయాలకు మా మిత్రులు అందరూ ఎంతగానో సంతోషించారు. కొనియాడారు.
అయితే, నా 22వ నూతన ప్రక్రియలోనే “MERA BHARAT MAHAN”ను రెండో ఆర్ట్ వర్క్ ను 22 X 28 అంగుళాల సైజులో ఈసారి కేవలం జెల్ పెన్నులుతోనే పూర్తి చేశాను. ఇప్పుడు ఈ ఆర్ట్ ను A4 సైజులో డిజిటల్ ప్రింటింగ్ చేయించి, వీటికి ల్యామినేషన్, మరియు ట్యాగ్ తో ఎంతమందికైనా ఇవ్వొచ్చు.
ఇకపోతే ఇలా చేయడం ఎందుకు? అవసరం ఏమిటి?
దేశం అంటే అందరికీ ఇష్టమే, గౌరవం, అభిమానం… కానీ, ప్రతి భారతీయుడు ఇంటిలో తమ తమ దేవతా ఫొటోలు మరియు కుటుంబ సభ్యుల ఫొటోలను పెట్టుకుంటారు. ఒక్కటైనా భారతదేశ త్రివర్ణ పతాకం ఫొటో కనబడదు. అలా పెట్టుకోవాలన్న ఆలోచన కూడా రాదు. నేను ఈ విషయం దృష్టిలో పెట్టుకుని “ప్రతి ఇంట – జాతీయ జెండా” నినాదంతో ఈ కార్యక్రమానికి పూనుకున్నాను. ఇందుకోసం అయ్యే ఖర్చును నాకు వస్తున్న పింఛనులో నెలకు 10% కేటాయించి, కనీసం కొంతమందికైనా ఉచితంగానే అందజేయాలనుకున్నాను. అందుకు కారణం…
జాతీయ పండుగలు జరుపుకున్న ప్రతీసారీ, దేశానికి నా వంతుగా ఏదైనా చేసి, దేశభక్తిని చాటి చెప్పాలనిపించేది. కానీ, మనకెంతో చేసిన దేశానికి ఏమి చేసినా అది తృణప్రాయమే. జాతీయ పతాకంలో త్రివర్ణాలకు, ప్రతి రంగు ఒక్కో మతానికి ప్రతీక కాబట్టీ, ప్రతి మతస్థుడు ఎంతో భక్తిగా పూజించుకొనే పండుగ పతాక వందనం. ప్రతి భారతీయ పౌరుడు “నా దేశం – నా జెండా” నినాదంతో, మూడు రంగుల చిన్నపాటి జాతీయ జెండాలను, ఆడ-మగ తేడా లేకుండా, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మతాలకు అతీతంగా దేశం కోసం చిన్నపాటి జెండాలను మన గుండెలపై తగిలించుకొని చేసుకునే పండుగ “జెండావందనం”. జనవరి 26, ప్రజాగణతంత్ర దినోత్సవం రోజున, మరియు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున. ప్రతి ఒక్కరూ బుక్ షాపులో ప్రింటయిన చిన్నపాటి జెండాలను తెచ్చుకొని మన డ్రెస్ కు పిన్ చేసుకొని “జెండా వందనం” లో పాల్గొన్నవారమే. అదే ఆ చిన్నపాటి జెండాను స్వయంగా “దేశభక్తి”తో ప్రతి భారతీయుడు ఎవరికి వారు స్వయంగా చిన్నపాటి జెండాను పేయింటింగ్ చేసుకొని, ఆ జెండాను ధరించి, “జెండా వందనము” లో పాల్గొంటే… మన భరతమాత పులకరించిపోతుంది కదా!
మన భారతదేశంలో, హిందూ సంప్రదాయంలో పూజలు, నోములు, వ్రతాలకు ఎంతో ప్రాముఖ్యత వుంది. పురాణాలు, శాస్త్రాలు చెబుతున్న మాట ఏమంటే, మనకు ముక్కోటి దేవతలున్నారని. ఆ యా దేవుళ్ళకు సంబంధించిన దేవుళ్ళ పేరిట ఎన్నో పండుగలు, సంబరాలు, పూజలు, పునస్కారాలు చేసుకుంటాము. అలాగే మన హిందూ దేవుళ్ళకు గుడులు, గోపురాలు కూడా చాలానే ఉన్నాయి. సందర్భాన్ని బట్టి మనం ఆయా దేవుళ్ళ పేరుతో పూజలు నిర్వహిస్తాము. అయితే, ఈ పూజల్లో అత్యంతగా ఆలోచింపజేసిన అంశం. పూజలో భాగంగా “ అష్టోత్తర శతనామావళి “ని పఠిస్తుంటాము. తన ఇష్టదేవత యొక్క నూట ఎనిమిది పేర్లను ఛంధోబద్దంగా కూర్చి కీర్తంచడం కారణంగా అష్టోత్తర శత నామ స్తోత్రాలు వెలువడినాయి. అయితే నాకొక సందేహం కలిగింది. ఏమిటంటే “దైవభక్తి” తో చేస్తున్నప్పుడు “దేశభక్తి” కోసం “అష్టోత్తర శతనామావళి” ని ఎందుకు రూపొందించకూడదు. అంటే, మన భారతదేశంలో స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన ఎందరో వున్నారు. దేశం కోసం కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహానుభావులు ఉన్నారు. అభివృద్ధికి ఎంతో కృషి చేసిన గొప్ప మహాపురుషులు ఎందరో ఉన్నారు. ఇండియా బోర్డర్ లో నిద్రాహారాలు లేకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ కాపలా కాస్తున్న సైనికులూ ఉన్నారు. పొరుగు దేశాలతో యుద్ధం చేస్తున్న కారణంగా ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కోల్పోతున్నారు. రాష్ట్రాలను, దేశాన్ని పరిపాలించిన నాయకులు ఉన్నారు. సమాజాన్ని మంచి దారిలో ముందుకు నడిపించిన వారు కూడా ఉన్నారు. అంతేకాదు మారు మూల ప్రాంతాల వారూ వున్నారు. అలాంటి వారి పేర్లు మాత్రం మనకు తెలియదు. ఎప్పుడూ వినని పేర్లు వున్నాయి. నిజానికి వీరిలో అతికొద్ది మంది పేర్లు తప్ప చాలామంది పేర్లు తెలియదు. ఈ కొద్దిమంది పేర్లను మాత్రం ప్రత్యేకత రోజున మాత్రమే గుర్తు చేసుకుంటాము.
ఈ నేపథ్యంలో నేను రూపొందించిన త్రివర్ణ పతాకంలో, “మేరా భారత్ మహాన్” హెడ్డింగును, పతాకం కింద భాగంలో అందరినీ స్మరించుకునే విధంగా “భారతదేశ చరిత్రకారులు, సమరయోధులు, మహనీయులు జయహో” చేర్చడం జరిగింది. ఈవిధంగా చేసిన ఆర్ట్ వర్క్ యొక్క నమూనాలను ప్రతి ఇంట ఉండాలనే నా ఈ సంకల్పం.
2025, జూన్ నెల 15 తారీఖు నుండి ఆగస్టు 15 తారీఖు వరకు సరూర్ నగర్ లో, డా. దార్ల నాగేశ్వరరావు, రెప్లికా ఆర్టిస్ట్, బృందావన్ కాలనీ, పతంజలి షాపు ఎదురుగా అడ్రస్ లో రోజుకు 108 చొప్పున, రెండు నెలలు పాటు ఇవ్వడం జరుగుతుంది. కేవలం మన భారతదేశ త్రివిధ దళాలకు మద్దతుగా, మనదేశం కోసం, దేశానికి సంఘీభావం తెలపడం కోసం నా ఈ చిన్నపాటి ప్రయత్నం.
“మేరా భారత్ మహాన్” జైహింద్