తెలుగు సాహిత్యంపై రూపకళాప్రభావం

సాహిత్య రంగపు ప్రతి మలుపులోను రూపకళారంగమే మార్గనిర్దేశం చేసింది.

ప్రకృతి పర్యవేక్షణలో సంభవించే ప్రత్యక్ష పరోక్ష సంఘటన లన్నింటికీ స్పందించేది బుద్ధిజీవి అయిన మానవుడు మాత్రమే. కళాకారునిలోను, శాస్త్రకారునిలోను ఆస్పందన సమగ్రంగా ఉంటుంది. అందులోనూ వేగంగా స్పందించేవాడు కళాకారుడు.

కళఅంటే ఇక్కడ లలిత కళవరకే పరిమితం. అందులో చిత్రకళ, శిల్పకళ అనేవి రూపకళలు. ఈ రూపకళాకారులు, కవులు జరిగిన సంఘటన వరకే గాక దాని పర్యవసానం, భవిష్యత్తుపై దాని ప్రభావం ఎలా ఉంటాయో ముందుగానే ఊహించగలుగుతారు. ఈ భవిష్యద్దర్శనం కవి కంటే కళారారునిలో స్పష్టంగాను, ముందుగాను కనిపిస్తుంది, అందుకు కారణం కవి తన మనోఫలకం మీద వ్యక్తమైన భావచిత్రాన్ని తెలియజేయటానికి పదాలకోసం పాకులాడాలి. అదే కళాకారుడైతే తాను దర్శించిన దాన్ని వెంటనే చిత్రించి కళ్ళముందుంచగలడు. కాబట్టి సాహిత్యానికంటె ముందు రూపకళ నూతనత్వంలో అడుగు పెట్టే అవకాశం ఉందన్నమాట!

సహజంగానే ముందుగా నవ్యత్వం సంతరించుకొనే రూపకళలు తమను అనుసరించే సాహిత్యం మీద తమ ప్రభావం కలిగి ఉంటాయి. తెలుగు సాహిత్యం మీద ఇటువంటి ప్రభావం ఎంతవరకు ఉందనే దాన్ని పరిశీలిద్దాం .
హాలుడి గాధాసప్తశతి, గుణాఢ్యునిబ్బ హత్కథ తెలుగువారి మొదటి రచనలుగా స్వీకరింవవచ్చు. అందులోని భాష ఈ నాటి తెలుగుకు రెండు వేల సంవత్సరాలనాటి మూలరూవం. ఆకథల్లో అన్నీ ఆనాటి సాంఘిక, రాజకీయ విషయాలే. అప్పటికే రూమదిద్దుకొన్న అజంతా సామాజిక చిత్రకళారీతులలో కనిపించే ప్రేమ, అసూయ, స్పర్థ, మోహం, కరుణ మొదలైన చిత్త వృత్తులన్నీ ఆగాధల్లో వ్యక్తమయ్యాయి.

తరువాత క్రమంగా శిల్పంలోను. చిత్రం లోను పౌరాణికాంశాలు చోటు చేసికొన్నాయి. పదవ శతాబ్దం నాటికి కంచి, మహాబలిపురం శిల్పకళా క్షేత్రాలు పల్లవుల చేతిలో రూపుదిద్దు కొన్నాయి. ఉండవల్లి బౌద్ధ గృహారామాలు మాధవ వర్మ చేతిలో పౌరాణికాలుగా మారిపోయాయి. ఆ ప్రభావంతోనే కుమార సంభవ రచన, ఆంధ్ర మహాభారతానువాదం జరిగాయి.
ఒకే తలలో దేనికదిగా కనిపించే ఎద్దు – ఏనుగు శిల్పం, ఒకే తలతో నాలుగు భంగిమల్లో కనిపించే లేడి బొమ్మ మొదలైన చిత్రమైన శిల్పకళా విన్యాసాలు మొదలైన తరువాతనే కవిత్వంలో చతుర్విధ కందం, కందగర్భ చంపకం వంటి చిత్రకవిత్వరీతులు రూపుదిద్దుకొన్నాయి.

ప్రాచీన రూపకళారీతిలో ప్రధాన పాత్రను ప్రముఖంగాను, మిగిలిన వాటిని చిన్న ఆకృతులలోను చూపించటం రివాజు, సరిగ్గా అదే పద్ధతిని స్వీకరించి ప్రబంధరచన జరిగింది. తిక్కన స్వీకరించిన హరిహరాద్వైత తత్వానికి నెల్లూరుకు దగ్గరలోని ప్రాచీన హరిహరనాథుని ఆలయమే. ఆకవి బ్రహ్మ వర్ణించిన ద్రౌపది పాత్రలో రామప్పగుడిలోని నాగినీ మూర్తి కనిపించదూ! అలాగే పల్లవుల నాటి వీరశిలల ప్రభావం శివకవుల మీద పడింది. దేశిపద్దతి కవిత్వంలో ప్రవేశించింది.
పాల్కురికి సోమనాథుని కాలానికి కాకతీయ, చాళుక్య నిర్మాణాల్లో కుడ్య శిల్పాలు ప్రవేశించాయి. ఒకే కొలమానంతో దేనికది తన ప్రత్యేక హావభావాలను ప్రదర్శిస్తూ ఒకే సామూహిక తత్వాన్ని కలిగి ఉండే ఆ రచనావిధానం కవిత్వంలో ప్రవేశించి శతకాలు -ప్రారంభమయ్యాయి.

అలాగే ఓరుగల్లు నుండి సింహాచలం వరకు రూపకళారంగంలో నాట్య శృంగార, తత్త్వశాస్త్రాలు రూపుదిద్దుకొన్న తరువాతనే పోతన శ్రీనాథుని వంటి మహాకవులు అత్యద్భుతమైన భక్తి, శృంగార కావ్యాలు వెలయించారు.
కోణార్కశృంగార శిల్పం నీడలో అష్టపదులు వ్రాసిన జయదేవుడు కూడా మన పేరూరు వాడే! అలంపురంలోని విశ్వకర్మాలయ కుడ్యం మీద ఒక శృంగారనాయిక నాయకుని పైకెగని అధరాన్ని ఆశించే శిల్పరాజమే అల్లసానివారి మనుచరిత్ర కావ్యానికి ప్రాణాధారం. అది ప్రబంధ యుగానికి ఆదికావ్య మైంది.
సృజనాత్మకమైన శృంగార శిల్పం ‘దేవాలయాల పై బూతుబొమ్మల’ స్థాయికి దిగిపోయాకనే సాహిత్యంలో పచ్చి శృంగారం ప్రవేశించింది. దిష్టిబొమ్మలుగా ప్రచారంలోకి వచ్చిన ఈ శిల్పం సాహిత్యరంగానికి అంధయుగాన్ని ప్రసాదించింది.

తిరుమల వెంకటేశ్వరుని దివ్య మంగళ మూర్తిని దర్శించిన అన్నమయ్య భక్తి పారవశ్యంతో వేలవదాలు రచించారు. త్యాగయ్య, రామదాసు, క్షేత్రయ్య వంటి సంకీర్తనా సాహిత్య కర్తలందరూ దేవతా మూర్తుల శిల్పలాలిత్యానికి భావావేశం పొందినవారే. తెలుగు సాహిత్యంలోని భావకవిత్వం మొత్తం ప్రత్యక్షంగానో, వరోక్షంగానో రూపకళా నేపధ్యంతో వెలువడిందే!

ఈ విధంగా సాహిత్య రంగపు ప్రతి మలుపులోను రూపకళారంగమే మార్గనిర్దేశం చేసింది. అంతెందుకు – సాహిత్య రంగ విమర్శలో ఉపయోగించే పదజాలమంతా చిత్ర శిల్పాల నుండి సంగ్రహించినవే! శైలి, శిల్పం, శయ్య, లిపి, రచన, వర్ణన, అలంకారం, అక్షరం… ఇలా అన్ని పదాలూ రూకళారంగానికి సంబంధించినవే. దీన్ని బట్టి ఏరంగానికి ఏరంగం ఆధారమైందో స్పష్ట మౌతోంది.

ప్రవంచ మనరుజ్జీవన దశలో పుట్టుకొచ్చిన ఆధునికరీతులను పరిశీలించి నప్పటికీ అవన్నీ ముందుగా ప్రవంచ చిత్రకళారంగంలో రూపొందినవే. ఆ మార్పులన్నీ ప్రపంచంలోని అన్నిబాషా సాహిత్యాలతో పాటు తెలుగు సాహిత్యానికి సంక్రమించాయి. వాటిలో అతి సవ్యధోరణు లైన అధివాస్తవికత, అహంభావ ప్రకటన, భీభత్స చిత్రణ, వస్తు భావవైచిత్రి, అరాచక వాదం, నిరాశా వాదం వంటి వింత పద్దతులేవీ తెలుగు సాహిత్యంలో ప్రవేశించి నప్పటికీ ఇమడలేక పోతున్నాయి. అందుకు కారణం ఇవేవీ తెలుగు చిత్రకళా రంగంలో సహజసిద్ధంగా రూపుదిద్దుకోకపోవటమే. తెచ్చి పెట్టుకొనే అలంకారాలకు అనుభూతులు, ప్రభావాలు ఎలా సిద్ధించగలవు చెప్పండి!

ఇక తెలుగు చిత్రకళారంగంలో గత శతాబ్దంలో సహజంగా చోటు చేసికొన్నది – దామెర్ల రామారావుగారి ద్వారా ప్రవేశించిన ప్రాచ్య పాశ్చాత్యధోరణుల సమన్వయ పద్ధతి 1922 నాటికే చిత్రకళలో ప్రవేశించిన ఈ విధానం క్రమంగా సాహిత్యంలో పరిణతి చెందిన విషయం మనందరికీ విదితమే! ఇలా ఒక సాహిత్యం మీద రూపకళల ప్రభావం అనేది ప్రకృతి సిద్ధమైన పరిణామమే తప్ప కావాలని చేసేది కాదు. సాహిత్యం ఆ భాషకే పరిమితం కాగా రూపకళలు భాషా నరిహద్దులు లేని ప్రవంచ భాషగా అభివర్ణించవచ్చు. ఒక భాషకు, ప్రదేశానికి పరిమితం కాని చిత్ర శిల్పాలు సర్వమానవ సౌభ్రాతృత్వానికి, వికాసానికి మూలభూతాలు వాటి ప్రభావం అన్ని రంగాల మీద ఉండక తప్పదు మరి!

-డా. చింతలపూడి వెంకటేశ్వర్లు

_________________________________________________________________________
ఫ్రెండ్స్ పత్రికలోని ఆర్టికల్స్ పై క్రింది కామెంట్ బాక్స్ లో స్పందించండి. మీ విలువైన సూచనలు, సలహాలు తెలియజేయండి.

1 thought on “తెలుగు సాహిత్యంపై రూపకళాప్రభావం

  1. విచిత్ర అక్షర శిల్పి LNSS THIRUNAGARI,MFA. ARTIST, DUAL LINE WRITING CREATOR (1968),WW.UNESCO,LIMCA etc. KARIMNAGAR. says:

    -డా. చింతలపూడి వెంకటేశ్వర్లు గారు రూప కళలు,సాహిత్యం ల సంబంధాన్ని చాలా చక్కగా వివరించారు. చిత్రం,శిల్పం ఇవి విష్వజననీయ మైనవి.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap