కోటి గొంతుల ‘తోట’ సిల్వర్‌స్టార్

కవులు వేనవేలు కాళిదాసొక్కడు
బుధులు వేనవేలు బుద్ధుడొక్కడు
ఘనులు వేనవేలు గాంధీజీ ఒక్కడు
అన్నట్లు వేనవేల ధ్వన్యనుకరణ కళాకారులలో మేటి సిల్వెస్టర్. తెలుగుజాతి గర్వించదగ్గ తెలుగుబిడ్డ. గుంటూరు జిల్లా, ముట్లూరు గడ్డపై ది. 5-12-1949న తోట జాకబ్, తామాసమ్మ పుణ్యదంపతులకు జన్మించటం కళలకే కళ వచ్చినట్లైంది.

ధ్వని కంటే ప్రతిధ్వని ఎంతో వినసొంపుగా ఉంటుంది. నాదం చరాచర జగత్తుకు జీవవేదం. శబ్దానికి భావాన్ని జోడించి పలికించగల ప్రత్యేకమైన లక్షణం మనిషికి వరమైంది. ఆ వరం ఓ కళాకారునికి స్వరమైతే, ఆ స్వరాల్లో సరిగమలు పలికితే అది అద్భుతం. శబ్దాన్ని పరిపరివిధాల మార్చి, కూర్చి, ప్రకృతిలోని పశుపక్ష్యాదులు సైతం అబ్బురపడేటట్లు చేయటం అత్యద్భుతం. ఇది ఏ కళాకారుడికైనా అంత సులువైన పనికాదు.

సృష్టికి మూలం స్వరం. స్వరం ప్రకృతినుండి జనిస్తుంది. స్వరాన్ని నేర్చిన మనిషి తన అవసరాలను తీర్చుకోవడానికి, భావాలను పంచుకోవడానికి భాషగా మార్చాడు. పదాలుగా కూర్చాడు. ప్రకృతిలో పుట్టి, ప్రకృతిలో పెరిగి, ప్రకృతిలో లీనమయ్యే కళా ప్రక్రియ మిమిక్రీ. దీనినే ధ్వన్యనుకరణ, స్వరానుకరణ, స్వరవంచన, స్వర భ్రమరీకరణ, గళ సాధన – అని పిలుచుకోవచ్చు. ఆంగ్లంలో మిమిక్రీ అని పిలుస్తున్నాం. మిమిక్రీ కళ అన్ని కళలకంటే భిన్నమైనది. ఉతృష్టమైనది కూడా. జంతువులు, పక్షులు, సినిమా నటుల గొంతులను అనుకరించి నవ్వించడమే అనే అపవాదు వుంది. ‘మిమిక్రీ అంటే హ్యూమర్’-అనే మాట ‘రూమర్’ అంటారు సిల్వెస్టర్. సామాజిక చైతన్యం కోసం ఈ కళ ఉపయోగపడుతుందనే సత్యాన్ని మనం గుర్తించాలి.

మిమిక్రీ అంటే సిల్వెస్టర్ అని, సిల్వెస్టర్ అనగానే మిమిక్రీ గుర్తొచ్చే స్థాయికి ఎదిగిన కళాకారుడు సిల్వెస్టర్. కోడి కూత, రైలు కూత, బాంబుల మోత, పిల్లి అరుపు, పులి గాండ్రింపు, వికటాట్టహాసం – ఏదైనా సిల్వెస్టర్ గొంతులో సునాయాసంగా పలుకుతుంది. అంతటి సాధన చేశారాయన. ‘కృషి వుంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు’ – అన్నట్లు, ‘సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా’-అన్నట్లు మనిషి తలుచుకుంటే అసాధ్యమైంది ఏదీ లేదు. మిమిక్రీ కళాకారుడు అంటే శబ్దాల సృష్టికర్త. కళాకారుడికి వాక్సుద్ధి, చిత్తశుద్ధి ఉండాలి. వీటిని అనుకూలంగా మలచుకునే నేర్పరితనం ఉండాలి. ఈ ధ్వన్యనుకరణ ఈనాటిది కాదు. రామాయణ కాలంలో మారీచుడు అనే రాక్షసుడు రాముని గొంతుతో ‘హా… లక్ష్మణా…’ అని అరిచి సీతాపహరణ విషయంలో మూలకారకుడయ్యాడు. భారతంలో కీచకవధ ఘట్టంలో లోకకళ్యాణార్ధం వలనుడు (భీముడు) వలపన్ని ద్రౌపతి హావభావాలతోను, స్వరమార్పిడితోను కీచకుణ్ణి హతమార్చాడు. మిమిక్రీ కళాకారునికి భాషా పరిజ్ఞానం చాలా అవసరం. యాస, మాండలికాలు, అన్య భాషలపై పట్టు, ప్రజల సంభాషణా రీతులపై అవగాహన ఉండాలి. ఈ కళకు సిలబస్ లేదు. పుస్తకాలు లేవు. గురువులు లేరు. సృష్టి, లయకు సిలబస్ లేదు కదా. మిమిక్రీ నేర్చుకోవాలంటే కేవలం సాధన ద్వారానే వీలవుతుందంటారు సిల్వెస్టర్. ‘గురువు లేని విద్య గుభాళించని పూవులాంటిది’ – అంటారు. మరి అలాంటప్పుడు ఈ మిమిక్రీ కళకు గురువు ఉండడు. కానీ గుభాళిస్తుంది. ఎలా? సాధన ద్వారానే అంటారు సిల్వెస్టర్. వీరి అసలు పేరు సిల్వెస్టర్. 1972లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మహాసభలో వీరి ప్రదర్శన చూసిన అప్పటి ఆర్ధిక శాఖామాత్యులు శ్రీ కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రముగ్ధుడై సిల్వెస్టర్ పేరును ‘సిల్వర్ స్టార్’ గా మార్చడంతో ఆనాటి నుండి సిల్వర్ స్టార్ గా బహుళ ప్రాచూర్యం పొందారు. మేరీ మాత ఒడిలో, గుణదల గుడిలో, బోర్డింగ్ బడిలో అక్షరాలతో పాటు స్వరాక్షరాలను కూడా దిద్దుకుని ఆంధ్ర లొయోలా కళాశాలలో బి.కాం. వరకు విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. సిల్వర్ స్టార్ గా పరిఢవిల్లిన సూపర్ స్టార్ మిమిక్రీ ప్రక్రియలో గోల్డెన్ స్టార్ అనడంతో అతిశయోక్తి లేదు.

‘కూలీ – నాలీ’తో, అర్ధాకలితో గడిపిన బాల్యం పాఠశాల విద్యార్ధిగా ఉన్నప్పుడు నెత్తిమీద గంప పెట్టుకుని విజయవాడ వీధులవెంట తిరుగుతూ కూరగాయలు అమ్మారు. ఆయన పేదరికం గురించి దాపరికం లేకుండా చెపుతున్న మాట ఇది. ఉదర పోషణకు ఎన్నో కార్యాలు చేయాల్సి వుంటుంది. అందులో విజయం సాధించిన సిల్వర్ స్టార్ ఇంతటి ఘనకార్యాన్ని సాధించారు.

తన జీవన గమనాన్ని తనకు అనుకూలంగా సుగమం చేసుకుంటూ తన ముగ్గురు బిడ్డల్ని ప్రయోజకుల్ని చేశారు. ఆ ముగ్గురులో ఇద్దరు అమెరికాలో, ఒకరు ముంబై రిలయన్స్ ఫైనాన్స్ లో స్థిరపడటం వీరి కృషికి నిదర్శనం.

బాధ్యత గల పౌరుడిగా కాలానుగుణంగా వస్తున్న సామాజిక మార్పులకు తగ్గట్లుగా అంశాలను జోడించుకుంటూ, (బాల్యంలో తనకు కూడూ, గూడూ లేకపోయినా, కోట్లాది ప్రేక్షకులకు ప్రభావితం చేస్తూ వారి హృదయాల్లో గూడు కట్టుకున్నారు. మిమిక్రీ కళాకారులు సహజంగా ప్రదర్శించే అంశాలకు భిన్నంగా వీరి ప్రదర్శన సాగుతుంది. నాటి పురాణాలు మొదలుకొని నేటి ప్రపంచ యుద్ధ ఘట్టాల వరకు రెండవ ప్రపంచ యుద్ధం, దుర్యోధనుని పాత్ర, శకుని పాత్ర, కీచకుని పాత్ర వీరికి పెట్టింది పేరు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత నాటక రచయిత షేక్స్ పియర్ వ్రాసిన ‘ఒథెల్లో’ నాటకంలోని డెస్టిమోనా-ఒథెల్లో డైలాగులు వింటే గగుర్పాటు కలుగుతుంది. అలాగే అరుంధతి చిత్రంలోని ‘ఒదల బొమ్మాళీ ఒదలా…” అన్న డైలాగ్ వినిపిస్తున్నప్పుడు ఆయన గొంతునుండి వచ్చిన శబ్దం భయకంపితులను చేస్తుంది. అందమైన మనిషికి సుందరమైన సున్నితమైన గొంతునుండి వస్తున్న శబ్దాలేనా ఇవి అనే అనుమానం ప్రేక్షకులకు తప్పక కలుగుతుంది. 2001 సం.నకు గాను ‘ద్వితీయ ఉత్తమ ప్రదర్శన’గా ఆహార్యము, సంగీతము జ్యూరీ అవార్డులతో సహా 4 నంది అవార్డులు గెలుచుకున్న ‘ప్రేమసామ్రాజ్యం’ అనే సాంఘిక నాటకంలో నటించి, దర్శకత్వం వహించారు. ఇది కృష్ణాజిల్లా సాంస్కృతిక చరిత్రకే గర్వకారణం. ఈ విషయంలో ఆంధ్ర లొయోలా కళాశాల అనుబంధ అనుబంధ కళాసంస్థ ‘కళాదర్శిని’ డైరెక్టర్ ఫాదర్ జోసబాస్టియన్, ఫాదర్ రవిశేఖర్ తదితర గురుపుంగవులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

ఇప్పటికి దాదాపు 9,000 లకు పైగా ప్రదర్శనలు ఇస్తూ ఖ్యాతి గడించారు. ప్రముఖ మిమిక్రీ కళాకారులు స్వర్గీయ నేరెళ్ళ వేణుమాధవ్ తర్వాత 1990 నాటికే ఇతర దేశాల్లో ఎక్కువ ప్రదర్శనలిచ్చిన ఘనత సిల్వర్ స్టార్‌కు దక్కుతుంది. యూరోపియన్ తెలుగు అసోసియేషన్ (ETA) పిలుపు మేరకు స్వర్గీయ ఎన్.టి. రామారావు తో కలసి లండన్ వెళ్ళి అక్కడ ప్రదర్శనలు ఇవ్వడం సిల్వర్ స్టార్ జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఇక దుబాయి, అమెరికా, షార్జా, అబుదాబి వంటి దేశాలకు ఏటా వెళ్ళి ప్రదర్శనలివ్వటం జరుగుతూనే వుంది. రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాంతో పాటు ఎందరో ముఖ్యమంత్రులు, రాష్ట్ర గవర్నర్లు,

సినీనటులు, రాజకీయ నాయకుల చేత సన్మానాలు, సత్కారాలు అందుకోవటం విశేషం. ఐదు దశాబ్దాలకు పైగా మిమిక్రీ కళకు జీవం పోస్తూ కళనే నమ్ముకుని జీవిస్తున్న ధన్యజీవి సిల్వెస్టర్. ఆయన అంటారు – ‘The man is born mimic’-అని. 27-2-1987న హైదరాబాద్ లో చైతన్య ఆర్ట్ థియేటర్స్ మరియు యువకళావాహిని వారి ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘సిల్వర్ స్టార్ విజయోత్సవ సభ’లో జరిగిన ఓ సభలో దర్శకరత్న దాసరి నారాయణరావు చేత బంగారు పతకం, మాజీ గవర్నర్ కోనా ప్రభాకర్ రావు చేత ‘ధ్వన్యనుకరణ రత్న’ బిరుదు అందుకున్నారు. 2013లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి ‘ఉగాది పురస్కారం’ ఇచ్చి సత్కరించారు. 2009వ సం.లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ‘ప్రతిభా పురస్కారం’తో సత్కరించింది. 2015వ సం.లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ‘కళారత్న (హంస)’ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు. అప్పటి ప్రతిపక్షనేత, ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు అందుకోవడం గొప్ప విషయం. వీరు అందుకున్న అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు లెక్కకు మించినవి. వాటన్నింటినీ అక్షరీకరించడం అంటే ఓ గ్రంధమే అవుతుంది. పైన ఉదహరించినవి కేవలం ఉదాహరణకు మాత్రమే.

వీరి విజయానికి చేయూతనిచ్చిన వీరి అర్ధాంగి శ్రీమతి ధనలక్ష్మి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా భర్తకు వెన్నుదన్నుగా ఉండి ముగ్గురు పిల్లల బాధ్యత తానే తీసుకుని భర్త చేస్తున్న కళాసేవకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకున్న సాధ్వీమణి. నిరుపేద అయిన సిల్వెస్టర్ ధనలక్ష్మిని వివాహం చేసుకున్నాక ‘ధనానికి కొదువ లేదన్నట్లు’ సమాజానికి సిల్వర్ స్టార్ గా మారి కుటుంబానికి గోల్డెన్ స్టార్ గా నిలిచారు. ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం’ ఎలానో సిల్వర్ స్టార్ నుండే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. వేల సన్మానాలు పొందిన కళాకారునిగా ఎప్పుడూ కన్పించరు. అదే ఆయన్ను ఎందరికో పరిచయం చేస్తూ స్నేహబంధాన్ని ఏర్పరుస్తుంది. ఇంతటి గొప్ప ఘనకీర్తి కలిగిన మహెూన్నత కళాకారునికి కేంద్రప్రభుత్వం ‘పద్మశ్రీ’ ఇచ్చి సత్కరిస్తే మిమిక్రీ కళకే పద్మశ్రీ దక్కినట్లవుతుంది.

www.mimicrystar.com

-డా. తూములూరి రాజేంద్ర ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap