శ్రీమతి అపర్ణ ఎర్రావార్ (43) గారు, డి.డి. కాలనీ, బాగ్ అంబర్ పేట, హైదరాబాద్ నివాసం.
ప్రతి మనిషిలో ఏదో తెలియని ప్రతిభ వుంటుంది. సృజనాత్మక శక్తి వున్నా ఎంతో మంది బయటకు మామూలు గృహిణిగానే కనిపిస్తారు. నలుగురిలో వున్నా, వారిలో ఒక ప్రత్యేకత వుంటుంది. కాని కనిపించరు. ఏదో చేయ్యాలనే తపనే ఏదో ఒకరోజు ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఇలా సృజనాత్మకమైన కళలను చేస్తుంటే, వాళ్ళను మెచ్చుకోకుండా వుండలేము.
అపర్ణ గారు చిన్నతనం నుంచే కళల పట్ల ఆసక్తి ఉండేది. కాని కార్యరూపంలో పెళ్లయ్యాకనే అపర్ణ గారి భర్త అన్ని విధాల ప్రోత్సాహంతో, మొదలు పెట్టారు. దాదాపుగా పది సంవత్సరాలు నుండి సరదాగా, హాబీగా చేస్తున్నారు. ఇప్పటికి మొత్తం ఐదు వందలకు పైగానే క్లే తో మినియేచర్ కళా వస్తువులు. క్విల్లింగ్ పేపర్ తో కూడా 25-30 దాకా కళాఖండాలను చేసారు.ఇవి కాక ఇంకా చాలా వాటిని రిటర్న్ గిఫ్ట్ గా చేసి ఇస్తుంటారంట. ఇలా చేయ్యడం వల్ల మెడిటేషన్ లాగా అనిపిస్తుంది. చిరాకులు,చికాకులు పోతాయి. మానసికంగా ఒత్తిడి తగ్గుతుందని ప్రశాంతంగా చెబుతున్నారు.
వత్తిని పైకి తీస్తే వెలుగునిస్తుంది. మొగ్గను నీటిలో వేస్తే వికసిస్తుంది. నివురును తొలగిస్తే నిప్పు వేడినిస్తుంది. చిన్న పొగడ్త మనసును ఉత్తేజపరుస్తుంది. అలాగే ఒక చిరునవ్వు, ఒక ప్రశంసా మనిషిని, మనసును ఎంతగానో ప్రభావితం అవుతుంది. ఒక గొప్ప వ్యక్తిగా, ప్రముఖ వ్యక్తిగా మార్చేస్తుంది. అంత శక్తి వుంది “ప్రతిభ”లో.
ఇక్కడ అపర్ణ గారు మినియేచర్ ఆర్టిస్టుగా ముచ్చటైన, అందమైన, అద్భుతమైన కళాకృతులను చేస్తున్నారు. అన్నీ చిన్న చిన్న వస్తువులను క్లే తోను, మరియు క్విల్లింగ్ పేపర్ తోను తయారు చేస్తున్నారు. ఎక్కువుగా క్లే తోనే చేస్తుంటారు. క్లే అంటే మట్టి. కాని, కాన్ ఫ్లోర్ అనగా మొక్కజోన్న పిండిని ఫెవికాల్ తో కలిపి స్టౌపైన వేడి చేసుకొని మైనపు ముద్దలాగా, ఇంట్లోనే చేసుకుంటారంట. అలా తయారు చేసుకున్న క్లే తో బొమ్మలు, వస్తువులు, పూలు, పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు, కీచైనులు, ఫొటోఫ్రేములు, ఐస్ క్రీములు, పూలకుండీలు, వివిధ రకాల టిఫెన్ ప్లేటులు, పెన్ స్టాండ్లు, దేవతా మూర్తులు, ఆట బొమ్మలు, తామర పూల కుండీలు, స్వీట్ తో కూడిన ఎన్నో రకాల ప్లేట్లు, బ్యాండ్ మేళం వాయిద్యకారులు, పక్షులు, జంతువులు ఇలా ఎన్నో ఎన్నెన్నో వివిధ రూపాలు, విభిన్న ఆకారాలు రూపొందిస్తున్నారు. ఈ సూక్ష్మ రూపాలు ఎప్పటికీ అలాగే, అంతే అందం, తాజాదనంతో ఉంటాయి. పూవులయితే అప్పుడే వికసించినంత అందంగా వుంటాయి. చాలా తక్కువ బరువుతో, ఎప్పటికైనా సహజంగానే కనిపిస్తాయి. వాటి దగ్గరకు వెళితే గాని తెలియదు అవి క్లే తో తయారు చేసినవని తెలియదు. అంతే కాదు, మినియేచర్ కళాకృతలన్నిటినీ టేబుల్ పైన పేర్చితే “ఘటోత్కచుడు కంటిక ప్రతీది చిన్న చిన్నగా ఎలా కనిపిస్తాయో”, మన కళ్లకు కూడా అలానే కనిపిస్తాయి.
ఏదైన చేయ్యాలనుకున్నప్పుడు ఏ ఆకారం, ఏ రంగులతో చేయ్యాలనుకున్నమో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు అందమైన గులాబీ పూలను అనుకుంటే, మొక్క, కాండం, ఆకులు, పూల రంగు వంటివి ఎంపిక చేసుకోవాలి. కలర్ మిక్స్ చేసి అందమైన గులాబీ పూల మొక్కను మనకు ఇష్టమైన ఆకారంలో అవసరమైన చోట ఫెవికాల్ తో అంటించే విధంగా తయారు చేసుకోవచ్చంటారు అపర్ణ గారు. క్లే కళ లో నైపుణ్యంతో పాటు తనకంటూ ప్రత్యేకతను అలవరుచుకున్నారు. చేసిన వాటిని చూస్తుంటే, ఈ కళపై ఇంకా ఆసక్తి పెరుగుతుందంటారు అపర్ణ గారు. ఇలాంటి కళలను “ఓర్పు-నేర్పు” చాల అవసరము,
చివరిగా ఇలాంటి సూక్ష్మ కళలు కదా అన్న చిన్న చూపు చూడకుండా ప్రాముఖ్యతను ఇవ్వాలని అన్నారు. కార్టూన్లా కాకుండా ఇంకా రియాల్టీగా చేయ్యాలని తపన. అదే నా సంతృప్తి. ఇంత వరకు ఎక్కడా ప్రదర్శనలు పెట్టే అవకాశం రాలేదు. భవిష్యత్తులో అవకాశమొస్తే నా మినియేచర్ కళలను తప్పకుండా ప్రదర్శనలను ఏర్పాటు చేస్తానని అన్నారు శ్రీమతి అపర్ణ ఎర్రావార్.
-దార్ల నాగేశ్వర రావు