ఆధునిక చిత్రకళకు ఆధ్యుడు ‘పికాసో’

అక్టోబరు 25 న పికాసో జన్మదిన సందర్భంగా …..

మానవులు సృషించే సౌందర్యం, మానవులు సృష్టించని సౌందర్యం ప్రకృతి సౌందర్యం. రెండిటీనీ కూడా రసాస్వాదన చేస్తాడు మానవుడు. కళా సౌందర్యంలో అభివ్యక్తమయ్యే నిర్మాణ కౌశల్యం ప్రకృతి సౌందర్యంలో అభివ్యక్తం కాదు. అయినప్పటికీ కొన్ని ప్రకృతి సౌందర్య రూపాలు కళాసౌందర్యం కంటే కూడా ఎక్కువ కమనీయంగా వుంటాయి. ప్రకృతికి ప్రకృతిని చేయడం ఉత్తమ కళ అనిపించుకోదని కొందరి అభిప్రాయం. అలా పుట్టినదే నైరూప్య చిత్రకళ (అబ్ స్ట్రాఆర్ట్). దృశ్య జగత్తుపై ఆధారపడక మౌళిక చిత్రణ చేయటం అద్భుతమైన కళా ప్రకియ. ఈ కళలు, సౌందర్యాలు, రసానుభూతులు కొంత సేపు మనిషిని తన బాధలను మరిపించి ఆనంద పరచగల మనడంలో సందేహం లేదు.

ఇందులోని ముఖ్యమైన వైఖరి ఏమంటే వాస్తవ వాదం నుంచి విడవడటం సహజ రూపాలలో కంటే అసహజ రూపాల్లో సౌందర్యాన్ని అన్వేషించి, అటువంటి అసహజ రూపాలను చిత్ర కళలో సృష్టించటం. ప్రకృతిలోని రూపాలను వికృతపరచి, దృష్టి క్రమానికి సంబంధించిన నియమాలన్నిటినీ ఉల్లంఘించటం మొదలైన వాటితో ఈ ఆదునిక చిత్రకల అనేది ఆవిర్భవించింది. దీనికి పునాదులు వేసింది పాల్ జాన్ అనే ఫ్రెంచి చిత్రకారుడైనప్పటికీ, ఈ ఆధునిక చిత్రకళకు నిజమైన రూపు, ఊపు తెచ్చింది. స్పెయిన్ దేశస్థుడైన పాబ్లో పికాసో.

Seated woman

పాబ్లో రుయిజీ- పికాసో స్పెయిన్లోని ‘మలగా’లో 25 అక్టోబరు 1881లో జన్మించారు. తండ్రి కూడా చిత్రకారుడు కావడంతో పికాసో బాల్య దశలోనే చిత్రకళా నైపుణ్యాన్ని సంపాదించి తోటి వారిని ఆశ్చర్యపరిచేవాడు. కళ్ళెదుట దృశ్యాన్ని చూస్తూనే క్షణాల్లో కాగితంపై పెట్టేవాడు. తొమ్మిదో ఏటే పికాసో గీచిన చిత్రాలు అందర్నీ అబ్బుర పరిచాయి. 1885లో ఆయన కుటుంబం బార్సిలోనాకు మారింది. తన ప్రతిభతో అక్కడి ప్రఖ్యాత స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ లో సీటు సంపాదించి డిగ్రీ పొందాడు. ఆతర్వాత మాడ్రిలోని ఆర్ట్స్ అకాడిమీలో చేరి తన కళకు మరిన్ని మెరుగుదిద్దాడు. 1900లో పారిస్ పర్యటనకు వెళ్ళిన పికాసో నాలుగేళ్ళు తర్వాత అక్కడే స్థిరపడ్డాడు. కళారంగంలో సంచలనంగా సరికొత్త చిత్రకళా భాషగా పేర్కొనే ‘క్యూబిజం’ ఆద్యుల్లో పికాసో ఒకరు. ‘క్యూబిజం’కు ప్రాముఖ్యాన్ని సంపాదించి పెట్టింది ఆయన పెయింటింగ్సే.

ఆధునిక చిత్రకళలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పికాసో కూడా ‘ఆది’లో మారుమూల (రియలిజం) చిత్రాలు చిత్రించినవాడే. ఒక రోజున తన స్నేహితుడికి పెయింటింగ్స్ చూపించడానికి తనగదిలో ప్రవేశించిన పికాసోకి ఒక కొత్త పెయింటింగ్ దర్శనమిచ్చింది. ఇది ఎక్కడ నుండి వచ్చిందని పరిశీలిస్తే అది తను చిత్రించిన పెయింటింగ్స్ ను తలకిందులుగా పెట్టడంవల్ల అలా కనిపించిందని గ్రహించి, ఈ విధంగా కూడా చిత్రాలు వేయెచ్చునని పికాసోలో ఆధునిక చిత్రకళకు ఆనాడే అంకురార్పన జరిగింది.

పికాసో చిత్రాల గురించి చెప్పాల్సి వస్తే అన్నిటికన్నా ప్రధానంగా మహత్తర మైనదిగా అంత పేర్కొనేది ‘గెర్నికా’ అంతర్యుద్ధ ఫలితంగా మాతృదేశం స్పెయిన్ వినాశనాన్ని ప్రతిబింబించిన ఈ చిత్రం అందర్ని అద్భుతంగా ఆకట్టుకుంది. దీనిలో రంగులంటూ ఏవీ లేకపోవటం ఒక ఆశ్చర్యకరాంశం. చిత్రంలోని రూపాలన్నిటినీ కేవలం నలుపు, లేత ఊదాతోనే చిత్రించారు. పైగా దీన్ని కాన్వాస్ మీదో, కాగితం మీదో వేయలేదు గోడమీద వేసారు.
పికాసో చిత్రాల్లో ప్రఖ్యాతమైనవన్నీ కళా విమర్శకులు విడమర్చి చెపితేగాని అర్థం కావు. నిజానికి పికాసో ప్రత్యేకంగా ఏ ఒక్క ‘ఇజం’ కూకట్టుబడలేదు. మార్పులకు అణుగుణంగా మారుతూపోయాడు. ఆయన ప్రయోగాలు అసంఖ్యాకం, ఆయనకళ ఫలానాదీ… అని నిర్వచించటం ఎవరికీ సాధ్యం కాదన్నత వైవిధ్యాన్ని పికాసో ప్రదర్శించారు. అలాగే కళా సృష్టికి అవధులు లేవన్నంత విపరీతంగా చిత్రాలు వేసారు.

‘కళ ప్రజల కోసం’ అనేవారి దృష్టిలో అత్యంతాధునిక కళా ప్రయోగాలన్ని మానసిక వెర్రులే కాని, అవాదానికి మూల విరాట్టులైన ఫ్రెంచి కమ్యూనిస్టు పార్టీలో పికాసో ఒకప్పుడు సభ్యుడు. ప్రపపంచ శాంతి సంఘంలోనూ ఆయన కృషి చేసారు. మనమీ నాడు శాంతికి చిహ్నంగా వాడుతున్న పావురాయిని ప్రచారంలోకి తెచ్చింది. పికాసోనీ, ప్రపంచ శాంతి సంఘం. పికాసో వేసిన పావురం చిహ్నాన్ని ఉపయోగించిన నాటి నుంచి అది శాంతికపోతమైంది.
పికాసో ఎంత ప్రఖ్యాతుడో జీవింతంలో అంత నిరాడంబరుడు. అయిదారుగురు భార్యలకు విడాకులిచ్చినా అందరికీ సిరి సంపలు మిగిల్చే వెళ్ళారు. సందర్శకులు, కళాకారులు, జర్నలిస్టులు ఎవరొచ్చినా కూడా కేవలం నిక్కర్, టీషర్ట్ తోనే దర్శనమిచ్చేవారు. అలాగే పెయింటింగ్ వేసేవారు. ఇంటర్యూలు ఇచ్చేవారు.

92 ఏళ్ళు ఆరోగ్యంగా బతికి ప్యారిస్ లో 1973లో ఏప్రిల్ 8న కన్నుమూసిన పికాసో వాస్తవానికి తన జీవిత కాలంలోనే అఖండ కీర్తి పొందాడు. ఆయన గురించి కొన్ని వేల పరిచయాలు, సమీక్షలు, విమర్శలు వచ్చాయో లెక్కలేదు. పుస్తకాలు, ఆయన చిత్రాల ఆల్బమ్ లు వందల సంఖ్యలో వచ్చాయి. ఆధునిక చిత్రకళా చరిత్రలో పికాసో చిరస్మరణీయుడు.
-కళాసాగర్ యల్లపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap