ఐరన్ మ్యాన్.. మోదీ!

ఇనుప వ్యర్థాలతో (Iron scrap) 14 అడుగుల ప్రధాని విగ్రహం తయారుచేసిన తెనాలి శిల్పకారులు
ఇనుప వ్యర్థాలతో ప్రధాని నరేంద్ర మోదీ నిలువెత్తు విగ్రహాన్ని తెనాలికి చెందిన సూర్యశిల్పశాల శిల్పకారులు రూపొందించారు. ఇప్పటికే భారీ విగ్రహాల తయారీతో దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న కాటూరి వెంకటేశ్వరరావు, వారి కుమారుడు రవిచంద్రలు ఈ 14 అడుగుల మోదీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు గతంలో వీరిద్దరూ 75 వేల ఇనుప నట్లు (Iron scrap) ఉపయోగించి జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని తయారుచేశారు. ఇది తెలుసుకున్న బెంగళూరుకు చెందిన ఓ సంస్థ ప్రధాని మోదీ విగ్రహ తయారీకి ఆర్డరు ఇచ్చిందని కాటూరి వెంకటేశ్వర రావు చెప్పారు. రెండు టన్నుల ఇనుప వ్యర్థాలను ఉపయోగించి.. 2 నెలల పాటు రేయింబవళ్లు శ్రమించి మోదీ విగ్రహాన్ని తయారు చేశామని తెలిపారు. ఆర్డర్ ఇచ్చిన వారు కూడా దీన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ప్రజలు సందర్శించేందుకు కొన్నిరోజుల పాటు ఈ విగ్రహాన్ని తెనాలిలోనే ఉంచుతామని చెప్పారు. అనంతరం బెంగళూరుకు పంపిస్తామన్నారు. కాగా, తెనాలిలోని సూర్యశిల్పశాల వద్ద ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ విగ్రహ ప్రదర్శనను తెనాలి ఎమ్మెల్యే అన్నా బత్తుని శివకుమార్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్పులను ఎమ్మెల్యే అభినందించారు.

SA: