ఇంజనీర్లకు గురువు – ఇరిగేషన్కతడు నెలవు

విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.

ధృవతారలు – 5

ప్రపంచ ప్రఖ్యాత భారత రత్నం సర్ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య మన తెలుగు వారి వారసుడు. ఎన్నో కష్టనష్టాలను దాటుతూ.. తన ప్రతిభను చాటుతూ.. సివిల్ ఇంజనీరింగ్ మాంత్రికునిగా ఎదిగిన ఘనుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. తన ఇంజనీరింగ్ హెూదాలో తొలి విజయంగా.. హైదరాబాద్ నగరాన్ని తరచూ వరదలతో ముంచెత్తుతున్న “మూసీ” నదికి ముక్కుతాడు వేసి దానికి మోక్షం ప్రసాదించాడు ఈ మోక్షగుండం. దీనివల్ల మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశం అంతటా కీర్తిని సంపాదించుకున్నాడు. కర్నాటకలో ఈయన ఆసియా ఖండంలోనే అతిపెద్ద రిజర్వాయర్ అయిన కృష్ణరాజసాగర్ డ్యామ్ ను పునాది నుండి పూర్తయ్యే వరకూ నిలబడి తన స్వంత పర్యవేక్షణలో ఆ నిర్మాణం కొనసాగించి తనకూ మనకూ “ఖండాంతర ఖ్యాతి” ఆర్జించారు. తిరుమల తిరుపతి ఘాట్ నిర్మాణంలోనూ వీరి ప్రమేయం అమేయం. ఆ తరువాత విశాఖ రేవును “కోరివేత “వెతలనుండి కాపాడి తన మేధో శక్తికి మరింత పదును పెట్టిన ఘనుడీతడు”. ఏథెన్స్ నగరంలోను నీటి వ్యవస్థనూ సరిదిద్దాడు. కనుకనే ఈయనకు ఆంగ్లేయుల ద్వారా పతకం, బిరుదు, మన భారతరత్న, లండన్ లోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ లో సభ్యత్వం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో సభ్యత్వం వంటివెన్నో లభించాయి. తన పుట్టిన రోజైన సెప్టెంబర్ 15ను మనదేశంలో “ఇంజనీర్స్ డే’ గా జరిపించుకుంటున్న భారతీయ ఇంజనీర్ సర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నేటికీ మన ధృవతార.

(మోక్ష గుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సెప్టెంబర్ 15, 1861)

SA: