మాతృభాషలో విద్యనేర్పితేనే పిల్లలకు అవగాహన కలుగుతుంది
గిడుగు జయంతి వేడుకల్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టి.డి. జనార్ధన్
ప్రజలు వ్యవహరించే భాషకు, పుస్తకాల భాషకు మధ్య తేడాలు వుండకూడని వ్యావహారిక భాష కోసం ఉద్యమించి భాషలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన గిడుగు వేంకట రామమూర్తి చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎన్టీఆర్ లిటరేచర్ & వెబ్సైట్ కమిటీ ఛైర్మన్ టి.డి. జనార్ధన్ అన్నారు. స్థానిక ఠాగూర్ గ్రంథాలయంలో నవ్యాంధ్ర రచయితల సంఘం, గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ మరియు శంకరం వేదిక సంస్థల ఆధ్వర్యంలో గిడుగు జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు బిక్కి కృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన టి.డి.జనార్థన్ మాట్లాడుతూ- రాష్ట్రం విడిపోయాక తెలుగు యూనివర్శిటీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాల్సిన అవసరముందని, అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారితో చర్చలు జరుపుతున్నామన్నారు. తెలుగు వెలుగుల కవులు కళాకారుల నిక్షిప్తప్రాంగణం పేరుతో అమరావతిలో ఒక కళాభవన్ ను నిర్మించమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళబోతున్నామన్నారు. తెలుగుభాషా దినోత్సవాన్ని ఇంకా బాగా వాడవాడలా జరుపుకునేలా మనందరం కృషి చేయాల్సిన అవసరం వుందన్నారు. చంద్రబాబునాయుడుగారొచ్చాకే కళారత్న, హంస అవార్డులు ఏర్పాటు చేసి కవులు రచయిలను ప్రోత్సహించారన్నారు. తెలుగుజాతి వున్నంత వరకు తెలుగుభాష వుంటుందన్నారు. మాతృభాషలో విద్యనేర్పితేనే పిల్లలకు అవగాహన కలుగుతుందన్నారు. ఆ తర్వాత అవసరమైతే ఇంగ్లీషే కాదు ఎన్ని భాషలు నేర్చుకున్నా తప్పులేదన్నారు.
నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ మాట్లాడుతూ – గిడుగు వేంకట రామమూర్తి భాషా సేవకుడే కాదని, సవరలు, హరిజనులూ అంటరాని జనాలని అంటుండే ఆ కాలంలోనే సవర విద్యార్థులకు తన ఇంట్లోనే బస ఏర్పరచి, భోజనం పెట్టిన దీనజనోద్దారకుడన్నారు. పత్రికలు వ్యావహారిక భాషలోకి మారడానికి ముఖ్యకారకుడు గిడుగేనన్నారు.
రాజధాని ఫైల్స్ నిర్మాత కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ కవులు, కళాకారుల కోసం ఒక బృహత్తర కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో గిడుగు వారసురాలు, గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ ఛైర్మన్ కాంతికృష్ణ, విజయవాడ పూర్వ మేయర్ తాడి శకుంతల, సాహితీవేత్త జల్ది విద్యాధరరావు, డా. కత్తి వెంకటేశ్వర్లు, సంఘ సేవకులు కె. శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గిడుగు జీవన సాఫల్య పురస్కారాలు, కళా, సాహిత్యసేవా పురస్కారాలు అందజేశారు. తొలుత జరిగిన కవి సమ్మేళనంలో పలువురు కవులు తెలుగుభాషపై స్వీయ కవితలు చదివి సభికుల్ని అలరింపజేశారు. అతిధులు జ్యోతి ప్రకాశనం చేసి గిడుగు చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.