అమ్మను మించిన దైవమున్నదా …

ఎవరు రాయగలరు… అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం… అంటూ సినీ కవి అన్నట్లు…అమ్మ గురించి ఎంత రాసినా ఇంకా రాయాల్సింది మిగిలే వుంటుంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాల్సి వుండనే వుంటుంది. ప్రతి తరంలో ప్రతి మనిషి అమ్మ గురించి పలవరించడం సహజం. ‘అమ్మ’కు గోర్కీ ‘అమ్మ’ని చదివి వినాపించాలని కలలు గన్నవారు ఎందరో వుండి వుంటారు. దశాబ్దాలు గడిచినా గోర్కీ ‘అమ్మ’ అజరామరంగా నిలిచివుంది. అమ్మని అంత గొప్పగా సృజించి, దేశదేశాల ప్రజలకు ఆరాధనీయ గ్రంథంగా మలిచిన గోర్కీ జరామరణాల్ని జయించిన రచయిత. అమ్మ ప్రాశస్త్యాన్ని ఎవరికి వారు తమ ఊహాశాలితతో రూపు గట్టించే ప్రయత్నం చేస్తున్నందునే ఇప్పటికీ ‘అమ్మ’ సృజనాత్మక ఇతివృత్తంగా నిలిచి వెలుగుతోంది. కవిత్వం రాసే వారు దాదాపుగా ఏదో ఒక సందర్భంలో అమ్మ గురించి రాసి వుంటారు. ఇది అమ్మ గొప్పతనం. అమ్మలో నిక్షిప్తమై వుండే సహజాతి సహజమైన అనురాగపు ఔన్నత్యానికి సంకేతం.
అమ్మ గురించి కవులే కాదు, కథకులు, నవలాకారులు, నాటక రచయితలు రాస్తూనే వున్నారు. కొందరు అమ్మ జీవితచరిత్రల్ని రచించారు. ప్రతి అమ్మకు తనదయిన జీవితం వుంది. రాయగలిగినవారు అమ్మ గురించి తరచి చూస్తే ఎన్నో గాథలు వెలుగు చూస్తాయి. నిజానికి అమ్మ జీవితచరిత్ర అంటే అందులో కేవలం ఆమె మాత్రం ఉండదు. అమ్మ-అమ్మకు అమ్మ-అమ్మమ్మ-కూతురు-మనవరాలు అనే అయిదుతరాల చరిత్ర గ్రంథస్తమవుతుంది. ఈ ప్రయత్నం చేస్తే అదే ఒక – గొప్ప నవలగా, చరిత్రగా మిగిలిపోతుంది. సృజనాత్మక రంగంలో ఉన్నవారు తమ గురించి, తమ చుట్టూ ఉన్న జీవితం గురించి రాస్తుంటారు. కానీ తమ తల్లి, అమ్మమ్మల చరిత్రని రికార్డు చేయడానికి ప్రయత్నించే వారు అరుదు.
ప్రపంచ సాహిత్యంలో వచ్చే నవలల్లో ఈరకమైన ఆత్మకథాత్మక రచనలే ఎక్కువ. కనుక అమ్మ గురించి రాసేందుకు సంకల్పిస్తే ఎంతో రాయొచ్చు. ఈ వైపు దృష్టి సారించాలన్న ఆలోచన ఉండాలి. తెలుగునాట స్త్రీవాదం వచ్చాక మహిళల జీవితానికి సంబంధించి పలు కోణాల్లో ఆలోచిస్తున్నారు. సున్నితంగా స్పందిస్తున్నారు. మగవారిలోనూ హృదయ సంస్కారానికి అనువైన భావాల్ని పాదుకొల్పింది. అయితే రచనారంగంలో ఇంకా విస్తృతి అవసరం. అమ్మల జీవితాల్ని రికార్డు చేసే ప్రయత్నం చేస్తే స్త్రీవాద సాహిత్యమే కాదు, మొత్తం తెలుగు సాహిత్యం బహుళ వైశాల్యం సంతరించుకుంటుంది.
మదర్స్ డే సందర్భంగా అమ్మల్ని తలపోయడం సహజం. అక్కడితో సరిపెట్టకూడదు. మళ్ళీ మాతృదినోత్సవం(మదర్స్ డే) నాటికి అమ్మ గురించి ఒక పుస్తకం రాయాలి. అమ్మ బాల్యం , యవ్వనం, పెళ్ళి, వివాహానంతర జీవితంలోని విభిన్న అనుభవాల్నీ, అనుభూతుల్నీ రికార్డు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో! అసలు ఎవరయినా అమ్మ చిన్నప్పుడు ఆడిన ఆటల గురించి తెలుసుకున్నారా? అమ్మమ్మ మన అమ్మని ఎలా చూసుకుందో అడిగారా? పెళ్ళి తరువాత తెలియని చిత్రమైన ఆందోళనో, ఆనందమో- మనసుని ఊగించి శాసించిన రోజులు తెలియకనే గడిచిపోయిన సంగతుల్ని తలపోసేలా చేశారా? ఒక్కసారి అమ్మల్ని కదిలించండి. మనసు అట్టడుగున పేరుకుపోయిన జ్ఞాపకాల చెలిమెని తడమండి. కదిలిస్తే అమ్మ తనని తాను అభివ్యక్తీకరించుకుంటుంది. మీరు ఏం రాస్తారో తెలియదు, కానీ తన గురించి తెలుసుకోవాలనుకుంటున్న బిడ్డల ఆరాటానికి ఆనందాశ్రువులతో తడిసి ముద్దవుతుంది. రాయగలిగితే మీరు ముందుతరాలకు అందించే మరపురాని అపురూప కావ్యమై ఆవిష్కృతమవుతుంది. మరి ప్రయత్నిస్తారా?
మాతృదినోత్సవం(మదర్స్ డే) శుభాకాంక్షలు…
కళాసాగర్

చిత్రకారుడు: కోటేష్

1 thought on “అమ్మను మించిన దైవమున్నదా …

  1. ఈ ఏడాది మాతృ దినోత్సవానికి మంచి స్పందన సర్వత్రా కనిపించింది. కరోనా కష్టాల్లో ఇంట వండివార్చి ప్రతి ఇల్లాలు అమ్మను మరిపించారు. కోటేష్ గారి చిత్రాలు అమ్మను గుర్తుచేశాయి 

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link