
దండమూడి రామమోహనరావు సంగీత సేవలు ఆదర్శం
దండమూడి రామ్మోనరావు సంగీత సేవలను నేటి యువ సంగీత విద్వాంసులు ఆదర్శంగా తీసుకోవాలని విఖ్యాత వీణా విద్వాంసులు అయ్యగారి శ్యామసుందర్ అన్నారు. శ్రీ దండమూడి లయవేదిక 25వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడ, దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో ఆదివారం 8 మంది మృదంగ విద్వాంసులకు ఆత్మీయ సత్కారం, శతాధిక మృదంగ లయ విన్యాసం కార్యక్రమాన్ని నిర్వహిం చారు. 108మంది మార్దంగికులు పలువురు గాయనీగాయకులు ఈ నీరాజన కార్యక్రమం లో పాల్గొనడం విశేషం. 108 మృదంగాలు ఒకచోట కొలువు తీరి లయవిన్యాసం చేయడంతో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ సందర్భoగా 9మంది మృదంగ వాద్య ప్రముఖులను సత్కరించారు. పద్మశ్రీ దండమూడి సుమతీ రామమోహనరావు గారు ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి శ్యాం సుందర్ గారు జ్యోతి ప్రకాశనం చేశారు.
సభాధ్యక్షులుగా శ్రీ అయ్యగారి శ్యామ్ సుందర్ గారు, ముఖ్య అతిధిగా గౌరవనీయులైన డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ గారు, ఆత్మీయ అతిధిగా భవదీయుడు(JP ) పాల్గొన్నారు. శ్యామసుందర్ మాట్లాడుతూ మృదంగమే జీవితంగా గడిపిన వ్యక్తి రామ్మోహనరావు అని అభివర్ణించారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ వ్యక్తి అని కొనియాడారు. 25వ వార్షికోత్సవం సందర్భంగా మృదంగ విద్వాంసులు కామరాజు విష్ణుమూర్తి, వంకాలయ వెంకటరమణ మూర్తి, ధూళిపాళ శ్రీరామమూర్తి, మండపాక నాగలక్ష్మి, బీవీఎస్ ప్రసాద్, కొమ్మా జోస్యుల సద్గురు చరణ్, గంటుకు వెంకట్రావ్, తిరునగరం ప్రభాకరరావు, పున్న మరాజు మురళీ కృష్ణలను సత్కరించారు.
