విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుబావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 43
ఆసియా ఖండంలోనే అగ్రగామి అయినటువంటి ‘రామన్ మెగసెసే’ అవార్డు అందుకొన్న తొలి భారతీయ మహిళ, భారతదేశపు అత్యుత్తమ పురస్కారం “భారత రత్న” అందుకొన్న తొలి వనిత, సంగీతజ్ఞురాలు, కాళిదాసు సమ్మాన్ పురస్కార గ్రహీత, అంతర్జాతీయ వేదికపై భారతీయ కర్ణాటక సంగీత సుధారసములు చిలికించిన సంగీత శిరోమణి, మధురై షణ్ముఖ వడివు సుబ్బులక్ష్మి యం.యస్. గా సంప్రదాయ సంగీత అభిమానులకు ఆరాధ్యురాలు. ఈమె 10 ఏళ్ళ ప్రాయంలోనే తొలి రికార్డింగ్ విడుదల చేయించుకొని రికార్డు సృష్టించిన బాలగాన సరస్వతి. 13 యేళ్ల చిరుప్రాయంలోనే తొలి కర్ణాటక సంగీత గాత్రసభను చేసి అప్పటివరకూ పురుషాధిక్యతలో కొనసాగిన సంప్రదాయాన్ని తన స్వరార్పణతో నూతన శకానికి అంకురార్పణ చేసింది. పలు భారతీయ భాషలలో కూడా తన సంగీత మధురిమలను పంచిన సంగీత శాస్త్ర విదుషీమణి. మీరా, సావిత్రి వంటి చలన చిత్రాలలో కూడా తన ప్రతిభను రాణింపచేసుకున్న ఈ సంగీత రత్నాకరి తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయనిగా సుప్రభాతంతో వేంకటేశ్వరునితో పాటు యావత్ భక్త ప్రపంచాన్ని నేటికీ మేలుగొలిపే భక్త శిఖామణి. విష్ణు సహస్రనామం, భజగోవిందంలను కూడా అనన్య సామాన్యంగా ఆలపించి ఆధ్యాత్మికతకు ఆలవాలమై కొన్ని వందల గాన సభలలో ఆర్జించిన కోటి రూపాయిలకు పైగా ధనాన్ని ధార్మిక సంస్థలకు దానం చేసిన ఘనదాత ఈ సంగీతమాత. భారతరత్న, సంగీత తపస్విని, సుస్వరలక్ష్మి, అష్టమస్వరం, భారత గాన కోకిల, పద్మభూషిణి, పద్మ విభూషిణి శ్రీమతి యం.యస్. సుబ్బులక్ష్మీ నేటికీ మన ధృవతార !
(సుబ్బులక్ష్మి యం.యస్. జన్మదినం సెప్టెంబర్ 16, 1916)