ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం…!

ఆయన సాహిత్యవారథి. సాంస్కృతిక రథసారథి ..!!
ఆయన జీవితమే సాహిత్యం…. ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం !!
కవిత్వం ఆయన రుచి…. అనువాదం ఆయన అభిరుచి !!
భారతీయ కవిత్వాన్ని పుక్కిట పట్టిన అపరఅగస్త్యుడు !!

ఆయనే కవి, కథకుడు, అనువాదకుడు, వ్యాసకర్త మకుంద రామారావు. ప్రపంచ కవిత్వాన్నీ, భారతీయ భాషల కవిత్వాన్ని తెలుగులోకి అనువదించారాయన. మనల్ని మనకి అద్దంపట్టి చూపించేదీ, స్వీయ సంస్కరణకు దోహదం చేసేదే కవిత్వం అంటున్న ముకుంద రామారావు గారు ‘అమ్మనుడి ‘ మాసపత్రిక అందించే తాపీ ధర్మారావు పురస్కారం -2020 అందుకోబోతున్న సందర్భంగా వారి పరిచయం…..

విశాఖపట్నంజిల్లా అనకాపల్లి సమీపం వెంకుపాలెం ముకుంద రామారావు స్వగ్రామం. ఆయన తాతగారు దుర్గయ్య నాయుడు. ప్రావీణ్యంగల చెరకు రైతు. దక్షిణాఫ్రికాలో కొన్నేళ్ళు వ్యవసాయంచేసి వచ్చి ఖరగపూర్లో స్థిరపడ్డారు. ముకుంద రామారావు తండ్రి యల్లయ్య నాయుడు. రైల్వే ఉద్యోగి. తల్లి యెరుకులమ్మ. 9, నవంబరు, 1944లో ఖరగ్ పూర్లో జన్మించిన ఆయన పూర్తి పేరు ముకుంద రామారావు యల్లపు.
ఖరగ్ పూర్ ఆంధ్రా హైస్కూల్లో చదువుకున్నారు. చిన్నప్పటినుంచీ తాతకు తోడుగా ఆయనతో కలిసి నాటకాలు, హరికథలు, బుర్రకథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటూ, తెలుగుభాషా సంస్కృతులు, సంప్రదాయాలను అలవర్చుకున్నారు. గణితంలో ఎమ్మెస్సీ తర్వాత ఐ.ఐ.టి ఖరగ్ పూర్లో గణితంలో పి.జి. డిప్లమా (డి.ఐ.ఐ.టి) పొందారు. కొంతకాలం టీచర్ గా, జూనియర్ కాలేజీ లెక్చరర్ గా పనిచేశారు.
PO E T సృష్టికర్త నాగపూర్ లోని టాటా కన్సల్టెన్సీలో కొంతకాలం చేశాక, రైల్వే టెలికమ్యూనికేషన్లో చేరిన ముకుంద రామారావు, రైల్వే రిజర్వేషన్ నెట్ వర్కింగ్ సాఫ్ట్ వేర్‌ను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర వహించారు. రైల్వే ప్రయాణీకుల సేవలకోసం POET పేరుతో న్యూమరిక్ కీ ప్యాడ్ను అభివృద్ధి చేశారు. ఆయన కవి కావడంతో, POET అనే పదాలు వచ్చే విధంగా Passeger Operated Enquiry Terminal అని ఆ కీప్యాడ్ కు నామకరణం చేశారు. ఆ తర్వాత ఆయన బహుళజాతి కంపెనీ H Pలో చేరి, అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో పనిచేశారు. న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ కి సాఫ్ట్ వేరు అభివృద్ధి చేశారాయన.

సాహిత్య సుగంధం స్కూల్లో సంస్కృత ఉపాధ్యాయుడి సాంగత్యం వల్ల ముకుంద రామారావుకు సాహిత్యం అబ్బింది. స్కూలు, కాలేజీ స్థాయిలో కథలు రాసేవారు. ‘చిత్రగుప్త’ పత్రికలో ఆయన రాసిన ముఖచిత్ర కథానికలు ప్రచురితమయ్యేవి. కాలేజీ స్థాయిలో ‘తెలుగు తల్లి’ లిఖిత పత్రికను నిర్వహించారు. ఖరగ్ పూర్ కాలేజీలో చదువుతున్నప్పుడు ముద్దంశెట్టి హనుమంతరావు, ఎన్.ఆర్.నంది, వజ్రపాణి, గండి కోట బ్రహ్మాజీరావు లాంటి సాహిత్యవేత్తల సాంగత్యంలో తనను తాను తీర్చిదిద్దుకున్నారు.

హైదరాబాద్ లో ఉన్నప్పుడు శ్రీపతి, చేకూరి రామారావు (చేరా)ల ప్రోత్సాహంతో కవిత్వం రాయడం ప్రారంభించారు ముకుంద రామారావు. తన కుమా ర్తెను మెట్టినింటికి పంపిస్తున్నప్పుడు కన్న ప్రేమను కవిత్వరూపంలో అక్షరీకరించారు. చేరా ఆ కవితకు ‘వలసపోయిన మందహాసం’ అనే శీర్షిక పెట్టారు. అలా ఆయన తొలి కవిత 1993లో ఆంధ్రప్రభలో ప్రచురితమైంది. చేరా మార్గదర్శకత్వంలో కవిత్వ సంక్షిప్తీకరణ, తక్కువ పదాల్లో పుష్కలమైన భావధార అలవర్చుకున్నారు. ముకుంద రామారావు. దాశరథి రంగాచార్యగారు కూడా ఆయనకు మార్గదర్శనం చేసేవారు. ‘వలసపోయిన మందహాసం’ కవిత్వంపై ఎబికె ప్రసాద్ సంపాదకీయం కూడా రాశారు. శివారెడ్డిలాంటి కవుల పరిచయం, సాహిత్య పఠనంతో కవిత్వాన్ని తన మార్గంగా ఎంచుకున్నారు ముకుంద రామారావు.
స్వీయ కవితా సంపుటాలు ‘వలసపోయిన మందహాసం’ అనే టైటిల్ లోనే 1995లో 40 కవితల సంపుటిని వెలువరించారు ముకుంద రామారావు. అలా ఇప్పటివరకు ఆయన కవిత్వం ఎనిమిది సంపుటాలుగా వెలువడింది. రాత్రినదిలో ఒంటరిగా’ కవితా సంకలనానికి మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్ పట్టా పొందారు.

వివిధ గ్రంథాల్లో ఆయన పరిచయ వ్యాసాలు వచ్చాయి. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, బెంగాలీ, మరాఠీ సహా దక్షిణభారత భాషల్లోకి ఎన్నో కవితలు అనువాదాలయ్యాయి. వివిధ సంకలనాలు, దశాబ్ది సంచికలు, వెబ్ సైట్లు, ప్రతిష్టాత్మకమైన పత్రి కల్లో ఆయన కవితలు వచ్చాయి. తెలుగు విశ్వవిద్యా లయం కీర్తిపురస్కారం, సిపి బ్రౌన్ పండిత పురస్కారం (హ్యూస్టన్), గంగిశెట్టి స్మారక మహాంధ్ర భారతి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం… ఇలా ఎన్నో సత్కారాలందుకున్నారు.

ప్రపంచ సాహిత్యాధ్యయనం అమెరికాలో ఉండగా, న్యూయార్క్ లైబ్రరీలో ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేశారు ముకుంద రామారావు. తొలి సూఫీ రచయిత్రి రబియా బాస్త్రి (8వ శతాబ్దం) దగ్గరనుంచి 20వ శతాబ్దం వరకు శతాబ్దాల వారీగా సూఫీ కవిత్వాన్ని అనువదించి తెలుగువారికి పరిచయం చేశారు.
*మూల కవి కవిత్వాన్ని మన భాషలో అద్దం పట్టడమే నా అనువాదాల ఉద్దేశం. అలతి అలతి పదాలతో పరిమితమైన భాషలో చెప్పడంవల్ల, నా అనువాదాల్లో చాలా సారళ్యత ఉంటుంది” అన్నారు ముకుంద రామారావు.

అదే ఆకాశం, అదే గాలి ‘అదే ఆకాశం’, ‘అదే గాలి’ అనే రెండు శీర్షికలతో ప్రపంచ కవిత్వాన్ని, యూరోపియన్ కవిత్వాన్ని అనువ దించారు ముకుంద రామారావు. 1901 – 2018 మధ్య కాలంలో కవిత్వంలో నోబెల్ బహుమతులు పొందిన 37 మంది కవుల ‘నోబెల్ కవిత్వం’, ‘సాహిత్యంలో నోబెల్ మహిళలు’ గురించి రెండు పుస్తకాలు రాశారు.
“ప్రపంచంలో కవిత్వం ఉన్న ఏ దేశాన్ని వదల కుండా నేను చదువుకున్నంత వరకు కవిత్వాన్ని ‘అదే గాలి’ సంకలనంలో ఖండాలవారిగా అనువ దించాను. ఇందులో 20 రీజియన్లకు చెందిన 186 దేశాల కవిత్వం, కవిత్వ చరిత్ర ఉంది” అని వివరిం చారు ముకుంద రామారావు. సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యాన్ని ‘భరతవర్షం’గా, అనేక దేశాలలోని ప్రథమ కావ్యం, పదవ శతాబ్దపు మహా యాన బౌద్ధుల నిర్వాణ గీతాలను ‘చర్యాపదాలు’గా అనువదించారు. ఆయన రాసిన దేశ దేశాల కప్పల కథలు, నిన్ను నువ్వు చూసుకునే అద్దం, వ్యక్తిత్వ వికాసం, ఆనంద మార్గాలు (వ్యాసాలు), అనువాదం -అనుభవాలు కూడా పుస్తకాలుగా వచ్చాయి. 2019లో వచ్చిన ఆయన తాజా సంకలనం ‘అదే నేల’.

మనల్ని అద్దంలో చూపించేదే కవిత్వం “కవిత్వం ఎప్పుడూ మార్గనిర్దేశం చేసేది కాదు, పరిష్కారాలను సూచించదు, మనకు బోధనలు చేయదు, ఉపదేశాలు చేసేది కవిత్వం కాదు, కవిత్వం తనకు తానుగా మెసేజ్ ఇవ్వదు, మనల్ని మనకు అద్దంలో చూపిస్తుంది కవిత్వం. ఒకవిధంగా చెప్పాలంటే కవిత్వం హృదయభాష. మనల్ని మనం విశ్లే షించుకోవడానికి, మనల్ని మనం సంస్కరించుకోవ డానికి దోహదపడేది కవిత్వం” అన్నారు ముకుంద రామారావు. “ప్రస్తుత ఒత్తిడి సమాజంలో కవిత్వం రిలాక్సేషను తప్పకుండా ఉపయోగపడుతుంది, కానీ చాలామందికి కవిత్వం అంటే ఎవెర్షన్. అందుకే పాఠకులు కవిత్వానికి దూరం అవుతున్నారు. ఒక సరళభాషలో సున్నితంగా పాఠకుల్ని తాకుతూ, వారి జీవితాల్ని స్పృశించే అంశాలున్నప్పుడు తప్పకుండా పాఠకులు కవిత్వానికి చేరువ అవుతారు” అన్నారాయన.

“కవి ఏదో ఒక వర్గానికే పరిమితమైపోతే చాలా కోల్పోతాడు. అందువల్ల కవి దేన్నైనా నిస్పక్షపాతంగా చూడగలగాలి” అన్నారాయన.
“ప్రపంచ కవిత్వాన్ని సంపూర్ణంగా చదవడానికి జీవితకాలం సరిపోదు. ప్రపంచ కవిత్వాన్ని నేను విహంగ వీక్షణం చేశాను. ఎక్కడైతే బాగా నచ్చిందో అక్కడ ఎక్కువసేపు ఆగాను, మళ్ళీ మరోచోటకు ఎగిరిపోయాను. భారతీయ కవిత్వం, యూరోపి యన్ కవిత్వంలో స్పానిష్ కవిత్వం, ఫ్రాన్స్, జర్మనీ, రష్యన్, పోలెండ్, పొలిష్ కవిత్వం నాకు బాగా నచ్చింది., ఇజ్రాయిలీ కవిత్వం మనకు దగ్గరగా ఉంటుంది” అని చెప్పారు ముకుంద రామారావు.

“తక్కువ మాటల్లో ఎక్కువ కవిత్వ ప్రయోజనం ఆసియాదేశాల్లో కనిపిస్తుంది.
కానీ పాశ్చాత్య దేశాల్లో వచనం కూడా కవిత్వంలానే హాయిగా కనిపిస్తుంది. ఆసియాదేశాల కవిత్వంలో కనిపించి నంత విశ్వజనీనత పాశ్చాత్య కవిత్వంలో అంతగా కనిపించదు” అంటారు ముకుంద రామారావు, ఎక్కడైతే బాధితులున్నారో అక్కడ ప్రజల హృదయాల్లోంచి కవిత్వం వస్తుంది. మార్పుకోసం జరిగే పోరాటాలు, జీవనం కోసం చేసే పోరాటంలోంచి భిన్న మైన భావాల కవిత్వం, కదిలించే కవిత్వం, రక్తాన్ని ఉడికించే కవిత్వం వెలికి వస్తుంది” అన్నారాయన.


కుటుంబం ముకుంద రామారావు భార్యపేరు సుభాషిణి. వారికి ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి లావణ్య. అల్లుడు రామనాయుడు. విశాఖపట్నం రైల్వే ఆర్వీ ఎన్ఎల్ లో జనరల్ మేనేజర్. మనవరాలు నిషిత స్వీడన్ ఎవియేషన్లో పనిచేస్తుండగా, మనవడు నిశ్చయ్ మహింద్ర కంపెనీకి క్యాంపస్లో సెలక్ట య్యారు. రెండో అమ్మాయి చైతన్య. అల్లుడు శంకర్. అమెరికాలో స్థిరపడ్డారు. మనవరాలు సుప్రియ, మెడిసిన్ స్టూడెంట్. మనవడు శివేన్, తొమ్మిదో తర గతి చదువుతున్నాడు. ముకుంద రామారావు కుమారుడు కళ్యాణ చక్రవర్తి. అమెరికాలోని ఒక కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. కోడలు రాధిక, మనవరాలు నేహాకృతి, మనవడు నీవ్.
– రామ్మోహన్

1 thought on “ఆయన సాహిత్యం ఓ విశ్వ సందేశం…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap