తెలుగింటి పిడుగు… ‘బుడుగు’ వెంకటరమణ

ఋణానుబంధ రూపేణా అంటారు పెద్దలు. సూర్యుడు ఉదయించే గోదావరికి తూర్పున వుండే రాజమహేంద్రవరం శివారు ధవళేశ్వరంలో జూన్ నెల 28, 1931 న ఆదిలక్ష్మి కడుపున తొలి మగ సంతానంగా పుట్టాడు ‘బుడుగు’. బుడుగు పుట్టిన రెండేళ్లకు గోదావరికి పశ్చిమాన వున్న నరసాపురంలో ఉదయించాడు బుడుగు కి బొమ్మలేసే బాపు. బుడుగు-బాపులు చెట్టపట్టలేసుకుని డెబ్బై ఏళ్ళకు పైగా నడిచారు… కాదు పరుగెత్తారు. “సృష్టిలో తీయని స్నేహమేనోయి” అని ఇంద్రగంటి వారన్నట్టు వీరిద్దరూ స్నేహానికి మారుపేరుగా నిలిచారు. బాపుకి ప్రధమ కోపం… తిక్క దూకుడు. ముందు అపార్ధం చేసుకోవడం… తరవాత అర్ధం చేసుకోవడం బాపు నైజం. అపార్ధం చేసుకునే ‘అపార్థసారథి’ ని ఋణానుబంధంతో గట్టిపరచుకోవడం బుడుగు చేసిన పని. ఒకరి సుగుణాలు నచ్చినప్పుడు ప్రేమించడం సహజం. కాని నచ్చని గుణాలు కనిపించినప్పుడు వాటిని సహించడం, భరించడం, వాటిని సరీగా అర్ధం చేసుకుని స్నేహదీపాన్ని అఖండదీపంగా వెలిగిస్తూనే వుండడం గొప్పగుణం. అదే బుడుగు మనస్తత్వం. “ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకోపేరు పిడుగు. ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైము లేదు. కావలిస్తే మా నాన్నని అడుగు” అంటూ తనని తాను పరిచయం చేసుకున్న ఆ బుడుగు ఎవరో కాదు… బహుముఖ ప్రజ్ఞాశాలి, నిర్మాత, రచయిత అన్నిటికీ మించిన ఆత్మీయ స్నేహశీలి ముళ్ళపూడి వెంకటరమణ. ఆరుద్ర భాషలో చెప్పాలంటే ‘బుడుగు వెంకటరమణ’. బాపు-రమణలు వేరు కాదు. మనుషులు వేరు… ఆత్మలు ఒకటే. ఇద్దరూ 1942 నుండి మద్రాసులో కలిసి చదువుకున్నారు. ఇద్దరూ తెలుగు పాఠకుల్ని ఆత్మీయంగా ఆడుకున్నవారే! అలాగే పాఠకులు కూడా వారిద్దరిన్నే యేదో ఒక సందర్భంలో గుర్తుచేసుకోనిరోజు వుండదు. ఈ అనుబంధం విచిత్రం… ఒక రచయితకీ, చిత్రకారుడికీ దక్కిన ఋణానుబంధం. వెంకటరమణను ఒక్కడిగా ఊహించుకోలేం. ప్రక్కన బాపు వుండాల్సిందే! ఇద్దరూ ఒకేసారి రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. అలాగే ఇద్దరూ ఒకేసారి పద్మశ్రీ పురస్కారాలు కూడా స్వీకరించారు. ఉత్తమ సినీ రచయితగా రమణ ఆరుసార్లు నంది పురస్కారాన్ని అందుకున్నారు. వర్ధంతి సందర్భంగా ఆ ‘బుడుగు’ ను గురించి కొన్ని విశేషాలు….

బుడుగు బాల్యం…

ధవళేశ్వరంలో రామపాదాల రేవులో మొదటి మేడ వెంకటరమణ గారి ఇల్లు. పక్కనే కొండమీద జనార్దనస్వామి కోవెల. కొండకింద శివాలయం. ఈ రెంటికన్నా, బుడుగు వాళ్ళ ఇల్లే కోలాహలంగా వుండేది. గుమ్మంలో ఎప్పుడూ పందిరి…ఆ పందిట్లోనే హరికథలు, భజనలూ, పెరట్లో చుట్టాలూ… ఆ చుట్టాలు పెరట్లో పెట్టుకునే తద్దినాలూ, పెరట్లోని బావికి అటువేపు పడవ వాళ్లకి బుడుగు తల్లి ఆదిలక్ష్మి పెట్టే భోజనాలూ… మేడమీది వరండాలో మేష్టారు చెప్పే హిందీ పాఠాలు… అన్నిటికీ మించి బుడుగు నానగారు పూజగది పక్కన పాడుకునే భజగోవిందం పాటలూ…. వీటితోనే పెద్ద కోలాహలం. “ఆఫీసు వేళల్లో ఏమిటీ సంత…ఇది ఇల్లా బజారా” అని విసుక్కుంటూ ఆదివారం పూటకూడా బుడుగు నాన్నగారు ఆఫీసుకెళ్ళేవారు. ఒకసారి బుడుగు వాళ్ళ నాన్నగారికి సుస్తీ చేసి ఆసుపత్రికి వెళ్తే, అటునించటే కాటికి వెళ్ళిపోయారు. బుడుగు వాళ్ళ అమ్మమ్మ పడవెక్కి భద్రాచలం వెళ్ళిపోయింది. ఇల్లు చీకటైపోవడంతో చుట్టాలు, బాబాలు, బైరాగులూ, భజనవాళ్ళు అందరూ గాయబ్! దాంతో బుడుగు, బుడుగుతమ్ముడితో పాటు అమ్మ ఆదిలక్ష్మి మద్రాసు వచ్చేసింది. ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయమ్మ పుణ్యమా అంటూ ఆదిలక్ష్మి హిందీ పాఠాలు చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించసాగింది. మద్రాసులో బుడుగు చిన్నమామ్మ సాయం వచ్చింది. మేడమీద చిన్న గదిలో మకాం. పాపం బుడుగు తల్లిగారు హిందీ పాఠాలు చెప్పి, విస్తరాకులు కుట్టి సంసారాన్ని ఈదుకొచ్చింది. ఇస్తరాకులు కుట్టడంలో బుడుగు, తమ్ముడు కూడా సాయపడేవారు. సిపాయిల కోసం కుట్టే బట్టలకు కాజాలు, గుండీలు కుట్టి కొంత సంపాదించేవారు. తల్లి ప్రింటింగు ప్రెస్ లో కంపోజింగ్ చేసేది. కేసరి హైస్కూలులో ఎస్సెల్సీ పూర్తిచేశాక రమణ పెద్దపెద్ద ఇళ్ళల్లో ప్రైవేటు చెప్పేవారు. తన బాల్యం గుర్తుంచుకునే ‘బుడుగు’ కుటుంబం మీద సెటైరికల్ గా కథలు అల్లారు వెంకటరమణ. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే లెఖ్ఖల్లో ప్రతిభను చాటారు. డిబేట్లు, వ్యాసరచనల్లో ప్రధమ స్థానం సాధించారు. నాటకాల్లో వేషాలు వేశారు. హాబీగా పద్యాలు ఆల్లారు. ఈ విద్యే తరవాతి కాలంలో వెంకటరమణ మంచి రచయితగా సుస్థిర స్థానం సంపాదించేందుకు దోహదపడింది.

రచయితగా…

1945లో ‘బాల’ అనే పత్రికలో వెంకటరమణ రాసిన ‘అమ్మమాట వినకపోతే’ అనే కథానిక అచ్చయింది. తరవాత అదే పత్రికలో ‘బాల శతకం’ పేరిట పద్యాలు కూడా ప్రచురితమయ్యాయి. దాంతో వెంకటరమణ తనే స్వయంగా ‘ఉదయభాను’ పేరుతో ఒక పత్రిక నడిపేందుకు నడుంబిగించారు. మిత్రుల సహకారంతో ఒక సైక్లోస్టైల్ మిషన్ కొని బాపుచేత చిత్రాలు గీయిస్తూ, తను కథలు, కథనాలు రాస్తూ కొంతకాలం నడిపారు. తరవాత 1953లో ఆంధ్రపత్రిక డైలీలో ఉపసంపాదకుడిగా ఉద్యోగంలో చేరారు. ఆ పత్రికలో పనిచేస్తున్నప్పుడు ప్రముఖ రచయితలు నండూరి రామమోహనరావు, పిలకా గణపతి శాస్త్రి, సూరంపూడి సీతారాంలతో పరిచయం ఏర్పడింది. తరవాత వెంకటరమణ వారపత్రిక విభాగంలోకి మారారు. అప్పుడే ‘బుడుగు’ వెలుగులోకి వచ్చాడు. వారం వారం ప్రచురితమయ్యే బుడుగు కథలు’వెంకటరమణకు మంచిపేరు సంపాదించి పెట్టాయి. కేవలం హాస్యమే కాకుండా ఆ కథల్లో అంతర్లీనంగా పిల్లలకు మంచి సందేశం వుండేది. బుడుగు కుటుంబంలో నాన్న గోపాళం. అమ్మ రాధ ముఖ్యపాత్రలు. ఇంట్లో బామ్మ బుడుగుని “హారి పిడుగా” అంటుంది. బుడుగును వెనకేసుకొస్తూవుంటుంది. బుడుగుకి ఓ గర్ల్ ఫ్రెండ్ వుంది. పేరు సీగానపెసూనాంబ. బుడుగుకు ఓ బాబాయి. వీధిన రెండు జెళ్ళ సీత వస్తుంటే బాబాయి బుడుగును విజిలేయమంటాడు. బాబాయి దగ్గర బోల్డు లవ్ లెటర్లున్నాయి. బుడుగుకి ఓ ప్రైవేట్ మాస్టారున్నాడు. ఎప్పుడూ లెఖ్ఖలు చేయమంటాడు. చెవి మెలిపెడతాడు…టెంకిజెల్లలు, మొట్టికాయలు వేస్తాడు. అలా ఈ సంక్షేమ కుటుంబంతో బుడుగు కథలు నడుస్తాయి. వాటిని నడిపించేది వెంకటరమణ. అందుకే వెంకటరమణ భావనలో పుట్టిన ఆ బుడుగు ఆకారాన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన బాపుకి సార్ధకత. మల్లాది రామకృష్ణ శాస్త్రి అంతటివారు బుడుగు భాషను అనుకరించారంటే అది ఆ వెంకటరమణుడికి లభించిన అరుదైన అక్షరాశీర్వచనం. “నా రాత అతని గీత, మా సినిమా తీతకు పునాదులు వేశాయి” అంటూ వెంకటరమణ తమ సినీపయనం గురించి చెప్పడంలో కూడా హాస్యం పెల్లుబుకుతుంది. వెంకటరమణ ఆంధ్రపత్రికలో ‘సినిమా పేజి’ నిర్వహించేవారు. తరవాత విజయవాడలో అక్కినేని వెలిగించిన ‘జ్యోతి’ పత్రికకు బాపు, రమణలు అహర్నిశలూ కష్టపడ్డారు. ఆ పత్రిక ఒక వెలుగు వెలిగింది. కానీ, ప్రధాన భాగస్వామి వి.వి.రాఘవయ్య వ్యాపార పోకడ నచ్చక ఇద్దరూ బయటకు వచ్చేశారు. అప్పుల ప్రహసనంతో కూడిన ‘ఋణానందలహరి’, సినీ మాయాలోక విచిత్రజీవనం గురించి ‘విక్రమార్కుని మార్కు సింహాసనం’, సినిమాలపై సెటైర్లు విసురుతూ ‘గిరీశం లెక్చర్లు’, రాజకీయ చదరంగాన్ని తూర్పారబట్టుతూ ‘రాజకీయ బేతాళ పంచవిశంతి’ వంటి పుస్తక రచనలు చేశారు. ఈ పుస్తకాలన్నింటికీ బాపు బొమ్మలు సమకూర్చారు. ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్యాన్ని ఎనిమిది సంపుటాలుగా విశాలాంధ్ర పబ్లిషింగ్ సంస్థ ప్రచురించింది. వీటిలో చలనచిత్రాల ప్రముఖులపై వ్యాసాలు (సినీరమణీయం) వంటివి కూడా చోటుచేసుకున్నాయి. ఆంధ్రపత్రికలో పనిచేసేటప్పుడే ముళ్ళపూడికి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, నిర్మాత డూండేశ్వర రావు (డూండీ)వంటి వారితో పరిచయాలు ఏర్పడ్డాయి.

సినీరంగప్రవేశం…

ప్రముఖ మళయాళ రచయిత కె.పి. కొట్టారకర్ర అన్నాచెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో రాసిన కథను రాజమణి పిక్చర్స్ వారు తమిళంలో ‘పాశమలర్’ పేరుతో ఎ. భీంసింగ్ దర్శకత్వంలో నిర్మించారు. బాక్సాఫీస్ హిట్టయిన ఈ చిత్రాన్ని సుందర్లాల్ నహతా, డూండీ తెలుగులో ‘రక్తసంబంధం’ పేరుతో పునర్నిర్మించారు. ఈచిత్రానికి సంభాషణల రచయితగా నిర్మాత డూండీ వెంకటరమణను నియమిస్తే, కామెడీ రచయిత ఇంతటి బరువైన కథకు సంభాషణలు కూర్చగలరా అనే విమర్శ సినీలోకంలో చర్చనీయాంశమయింది. పైగా ముళ్ళపూడి కి సంభాషణల రచయితగా ఈ చిత్రమే తొలి చిత్రం కావడం కూడా ఒక కారణం. కానీ డూండీ నిర్ణయం మారలేదు. ముళ్ళపూడి ఈ చిత్రానికి అలతి పదాలతో అనంతార్ధాన్ని స్పురింపజేసే పదునైన మాటలు రాశారు. రామారావు సావిత్రితో “నిన్ను వదలి వెళ్ళడం లేదమ్మా, ఇల్లు వదలి వెళ్ళుతున్నానంతే” అనడం చిన్న ఉదాహరణ. ఇందులో రమణ అప్పుల అప్పారావు, అతని ప్రియురాలు రెండుజెళ్ళ సీత (రేలంగి-గిరిజ) పాత్రల్ని ప్రవేశపెట్టడం విశేషం. ఈ సినిమాలో సంభాషణల రచయితగా తనను పరిచయం చేసినందుకు, రమణ తన పుస్తకం ‘సినీరమణీయం’ ను నిర్మాత డూండీకి అంకితమిచ్చారు. ఈ చిత్రం 11 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకొని రమణకు తరవాతి సినిమా ‘గుడిగంటలు’ కి కూడా మాటల రచయితగా స్థానం సంపాదించిపెట్టింది. తరవాత అన్నపూర్ణా వారు నిర్మించిన ‘ఇద్దరు మిత్రులు’(1961), ‘వెలుగు నీడలు’(1964), పూలరంగడు’(1967), బాబూ మూవీస్ వారి ‘మూగమనసులు’(1963), ‘తేనెమనసులు’(1965), ‘కన్నెమనసులు’(1966), పద్మశ్రీ వారి ‘ప్రేమించిచూడు’(1965), ‘ప్రాణమిత్రులు’(1967), ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి ‘నవరాత్రి’(1966), డి.బి.ఎన్ వారి ‘దాగుడుమూతలు’(1964) వంటి అనేక బాక్సాఫీస్ హిట్ చిత్రాలకు కథ, మాటలు సమకూర్చి మంచి సినీ సంభాషణల రచయితగా పేరుగడించారు. ‘మూగమనసులు’ సినిమా విషయంలో ఒక చిన్న సందర్భాన్ని గుర్తుచేయాలి. పునర్జన్మపై ఎక్కడో పత్రికలో వచ్చిన చిన్న వార్తను, హిందీ చిత్రం ‘మధుమతి’ తో మిళాయించి ఆదుర్తి సుబ్బారావు రాసుకున్న కథ ‘మూగమనసులు’. ఆత్రేయకు ఈ కథ వినిపిస్తే సినిమాకి పనికిరాదని తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఆదుర్తి వెనక్కి తగ్గలేదు. దాంతో ఆదుర్తి ముళ్ళపూడి వెంకటరమణ చేత ఆ కథకు ట్రీట్మెంటు రాయించారు. కీ డైలాగులతో రమణ రాసిన ట్రీట్మెంటును ఆత్రేయకు ఇచ్చి పూర్తి డైలాగులు రాయమని అబిడ్స్ తాజమహల్ హోటల్లో ఉంచితే, నాలుగు రోజులు ఆ స్క్రిప్టు తో కుస్తీ పట్టి, ఆత్రేయ అదుర్తిని పిలిచి “నీ కథ బాగుంది. రమణ ట్రీట్మెంట్ లో ఒక్క అక్షరం కూడా మార్చాల్సిన అవసరంలేదు” అంటూ కితాబిచ్చారు. దీన్నిబట్టి ఈ సినిమా స్క్రిప్ట్ ని రమణ ఎంత పకడ్బందీగా తయారుచేశారో ఊహించవచ్చు. ఒక పడవకుర్రాడు, ఒక జమిందారుగారి అమ్మాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్నట్టు వారికే తెలియదు. ఇక పెళ్లి కూడా అసాధ్యం. కానీ వాళ్ళ ప్రేమని చూపటం ఎలా? నదీ గర్భంలో ప్రవహించే అంతర్వాహినిలా కథను నడిపి, చావుతో ఇద్దర్నీ కలిపారు రమణ. అప్పుడు రమణ సావిత్రికి రాసిన డైలాగు …. “గోపీ, చావు అందరినీ విడదీస్తుంది. కాని, కొందరిని కలుపుతుందిరా. మనలాటి వాళ్లకి చావులోనే కలయిక సాధ్యం” అనేది. ఈ డైలాగు చెప్పించి సినిమాకు శుభం కార్డు వేశారు. ఇక ముళ్ళపూడి రమణతోబాటు ఈ సినిమాకి బాపు ఇచ్చిన సహకారం యెంతోవుంది. సినిమా టైటిల్స్ లో నాగేశ్వరరావు పేరుకి బదులు ఒక పడవ బొమ్మ, సావిత్రి పేరుకి ఒక ముద్దబంతిపువ్వు, జమున పేరుకి ఒక పంగలకర్ర వచ్చి వృత్తంలో ఇమిడిపోవడం గొప్ప ప్రయోగం. ఈ సినిమాకి అదే లోగో. పబ్లిసిటీ అధికారం ఎస్.ఏ.నాయర్ దే అయినా, అందులో అదృశ్యహస్తం మాత్రం బాపుదే!

Sakshi Krishna

పూర్తి అవుట్ డోర్ లో ‘సాక్షి’ సినిమా…

ఒకవైపు ఇద్దరూ సినిమాలకు పనిచేస్తూనే, సొంతగా సినిమా తీయాలనే నిర్ణయానికొచ్చారు. 1952లో ‘హై నూన్’ అనే ఇంగ్లీష్ సినిమా వచ్చింది. గ్యారీ కూపర్, థామస్ మిచెల్ నటించిన ఆ చిత్రానికి నాలుగు ఆస్కార్ బహుమతులు, నాలుగు గోల్డన్ గ్లోబ్ బహుమతులు లభించాయి. ఆ సినిమా ప్రభావంతో రమణ 1959 ప్రాంతంలో ఆంధ్రపత్రికలో ‘సాక్షి’ అనే కథను రాశారు. ‘హై నూన్’ సినిమాలో కౌబాయ్ పాత్రను బల్లకట్టు కిష్టప్పగా మార్చి ఆ కథనే మరికొన్ని మార్పులతో సినిమాగా తీస్తే బాగుంటుందని ప్రయత్నాలు మొదలెట్టారు. స్టార్ వాల్యూ జోలికి పోకుండా కథనే సూపర్ స్టార్ చేస్తూ, కధనంలో మాత్రం వేగం ఉండేలా పూర్తిగా అవుట్ డోర్ లో సినిమా నిర్మిస్తే మంచి ప్రయోగమవుతుందని పకడ్బందీగా స్క్రిప్టు తయారుచేశారు. అంతకుముందే నవయుగ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావుతో రమణకు పరిచయం ఉండడంతో అతణ్ణి కలిసి ఒక లఘుబడ్జెట్ సినిమా తీయాలని, అందుకు ఆర్ధిక సహకారం అందించాలని కోరారు. కృష్ణ, విజయనిర్మల, జగ్గారావు, విజయలలిత, రాజబాబు, రామన్న పంతులు ప్రధాన తారాగణమని, మహదేవన్ సంగీత దర్శకుడని, బాపు దర్శకత్వం వహిస్తారని రెండులక్షలు పెట్టుబడి పెడితే యాభైవేలు తమవంతుగా వేసుకొని సినిమా తీస్తామని శ్రీనివాసరావుకు చెప్పారు. నవయుగ సంస్థకు అక్కినేని, దుక్కిపాటి చాలా సన్నిహితులు. రమణకు అక్కినేని ప్రియమిత్రులు. అయినా వారి సిఫారసుతో రాకుండా, కథ మీద నమ్మకంతో రావడం శ్రీనివాసరావుకు నచ్చి పెట్టుబడి పెట్టేందుకు ఒప్పుకున్నారు. కొంచెం పారితోషికం ఎక్కువైనా, శ్రీనివాసరావు సలహామీద సెల్వరాజ్ ను ఛాయాగ్రాహకునిగా తీసుకునేందుకు అంగీకారం కుదిరింది. పాతికరోజుల్లో ఒకటే షెడ్యూలుతో పూర్తి అవుట్ డోర్ లో సినిమా నిర్మాణం పూర్తి చేస్తామంటే శ్రీనివాసరావుకు నమ్మశక్యం కాలేదు. కానీ వీరు కృష్ణార్జునులు కదా…వారికి సాధ్యంకానిదంటూ వుండదు. అలా ‘సాక్షి’నామ సంవత్సరానికి బాపు రమణలు బాటలు వేశారు. గంటన్నరలో ఒక కథను సినిమాగా తీస్తే ఎలావుంటుందో తెలుగు ప్రేక్షకులకి చూపాలని బాపు చేసిన ప్రయోగమే నందనా ఫిలిమ్స్ పతాకం మీద నిర్మించిన ‘సాక్షి’. పూర్తి అవుట్ డోర్ లో నిర్మించిన ఈ సినిమాని పంతొమ్మిది రోజుల్లో పూర్తిచేశారంటే నమ్మగలమా! అదీ రమణ నిర్వహణా సామర్ధ్యం, బాపు పనితనం. ఈ సినిమా షూటింగు సౌలభ్యం కోసం ఏకంగా ఒక కాలనీనే పులిదిండి గ్రామంలో యేర్పాటు చెయ్యడం విశేషం. ఆ ఊళ్ళో నీలాటి రేవు, ఆ రేవు దగ్గర పెద్ద రావిచెట్టూ, నావలూ, రాదారి పడవలు, అవతలి గట్టున తిరిగే చిన్నపాటి బస్సులు, పుల్లట్లు, పుణుకులువేసే చిన్నపాటి హోటలు, రేవుకి పక్కగా బల్లకట్టు… ఇవే సాక్షి సినిమాకు సహజసిద్ధమైన సెట్టింగులయ్యాయి. పులిదిండిలో తడికలతో యూనిట్ సభ్యులకోసం ఇద్దరు, నలుగురు ఉండేలా డార్మెటరీలు, ఆరు బాత్ రూములు, టాయిలెట్లు కట్టించారు. పెద్దపెద్ద తారు డ్రమ్ములతో వేడినీళ్ళు కాచి అందించడానికి, ఎప్పటికప్పుడు క్లోరిన్ పొడి చల్లుతూ మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచడానికి మనుషుల్ని నియమించారు. సాక్షి షూటింగుకు పులిదిండి గ్రామ వాసులేకాక ఆ చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలవారు కూడా అన్నివిధాలా సహకరించడం విశేషం. షూటింగు స్థానం మారేటప్పుడు వారంతా సామానులు మోసేవారు. భోజనాల వేళ కాగానే వెళ్ళిపోయేవారు. ఎన్నడూ యూనిట్ సభ్యులనుంచి కనీసం వారు మంచినీరు కూడా ముట్టుకోలేదు. అంతకన్నా ముఖ్యంగా చెప్పాల్సింది వారు అవలంభించిన క్రమశిక్షణ. షూటింగు ప్రదేశానికి చాలా దూరంగా వుంటూ చిత్రీకరణను సులభసాధ్యం చేశారు. ఇక భోజనాల విషయానికి వస్తే, సాధారణ ‘మెనూ’ తోబాటు పూతరేకులు, పచ్చళ్ళు, పొడులతో షడ్రసోపేతమైన భోజనాలు అందరికీ సహపంక్తినే వడ్డించేవారు. ‘బుద్ధిమంతుడు’, ‘అందాలరాముడు’ సినిమాలు నిర్మించినప్పుడు కూడా ‘దేవీపట్నం’ ఇసుక తిన్నెల్లో ఇలాగే గుడారాలు వేసి షూటింగు జరిపించారు రమణ. ఇక రమణ-బాపు నిర్మించిన ‘బంగారు పిచిక’ సినిమా విషయానికి వస్తే…1967లో సిల్వియా కోస్కినా, డేవిడ్ మెక్కల్లం నటించిన అమెరికన్ కామెడీ సినిమా ‘త్రీ బైట్స్ ఆఫ్ ఎన్ ఆపిల్’ చూసి, బాపు తక్కువ బడ్జెట్ తో అవుట్ డోర్ లో సినిమా తీద్దామని రమణను కథ అల్లమంటే, సినిమా ఆడదని రమణ ముందే చెప్పారు. అయినా బాపు మాట తోసేయ్యలేక ‘బంగారు పిచిక’ సినిమాకు రూపమిచ్చారు. తొలుత ‘స్వయంవరం’ అనే పేరుపెట్టి పబ్లిసిటీ కూడా ఇచ్చారు. కోనసీమలో కాకుండా హైదరాబాదు చుట్టుపక్కల గండిపేట గెస్టుహౌసు, షాపూర్వాడి రాజమహలు, వికారాబాదు రోడ్డు లోకేషన్లలో షూటింగు చేశారు. ఇందులో వరహాలరాజు వేషానికి అప్పట్లో గంధర్వుడు ‘బాలు’ ని మొదట అనుకున్నా చివరకు చంద్రమోహన్ కు ఆ పాత్ర దక్కింది. కానీ, సినిమా జనానికి ఎక్కలేదు. ప్రేక్షకులు “టూ ఎర్లీ” అన్నారు. “సరేలే” అనుకొని పాతికేళ్ళు ఆగి, ఈ సారి రమణ ప్రోద్బలంతో అదే సినిమాని ‘పెళ్లికొడుకు’ పేరుతో నరేష్ ని హీరోగా పెట్టి మరలా తీశారు. అక్కడా తుస్సుమంది. జనం “టూ లేట్” అన్నారు. ‘అందాలరాముడు’ సినిమా కూడా అంతే. సెకండ్ రన్ లో బాగా ఆడింది.

ANR cinema poster

ఇది బాపు గారి సినిమా..

1969లో బాపు-రమణలు భారీ తారాగణంతో ‘బుద్ధిమంతుడు’ సినిమా తీశారు. 1952లో జూలియన్-డు-వీవియర్ దర్శకత్వంలో ఫెర్నాన్డేల్, జినో సెర్వి నటించగా నిర్మించిన “ది లిటిల్ వరల్డ్ ఆఫ్ డాన్ కేమిల్లో’ అనే ఇటాలియన్ సినిమా ఆధారంగా రమణ మలిచిన కథ ఈ సినిమాకు ఆధారం. ఒకరకంగా ఇది చారిత్రాత్మక రోమన్ కేథలిక్ మతాధికారి డాన్ కేమిల్లో వలోటా యదార్ధ గాథ. రమణ మలిచిన కథలో సద్బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములలో పెద్దవాడు వేణుగోపాల స్వామి ఆలయ పూజారి, పరమ ఆస్తికుడు. తమ్ముడు ఆధునిక భావాలతో మానవసేవే మాధవ సేవగా భావించే నాస్తికుడు. కథ చాలాబాగా కుదిరింది. అది విన్నాక అక్కినేని రెండు పాత్రల్నీ తనే చేస్తానన్నారు. ఇందులో పూజారి పాత్ర విప్రనారాయణను తలపించేదిలా వుంటుంది. అక్కినేని నటిస్తున్నారని తెలిసి రమణగారికి భానుమతి కబురంపింది. కథ విని తనుకూడా అందులో నటిస్తానంది. నిజానికి తమ్ముని పాత్రకే హీరోయిన్, పూజారి పాత్రకు హీరోయిన్ లేదు. విజయ నిర్మలను అక్కినేనికి జంటగా అనుకున్నారు బాపు-రమణలిద్దరూ. అదే విషయాన్ని భానుమతికి చెబితే, ఏదో ఒక వేషమైనా ఇమ్మంది. అందులో గుమ్మడి నటించిన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వేషాన్ని ఆఫర్ చేశారు రమణ. సినేరియో త్వరగా రాసుకు రమ్మంది. మూడ్రోజుల తరవాత భానుమతి గారి భర్త రామకృష్ణ నుంచి రమణకు కబురొచ్చింది. రమణ వెళ్ళి భానుమతిని కలిశారు.“ఈ సినిమాలో పాటలెన్ని” అని అడిగింది భానుమతి. “ఎనిమిది” అని చెప్పారు రమణ. అందులో తనకెన్నని అడిగితే, “నిల్” అని సమాధానమిచ్చారు రమణ. “కనీసం స్కూలు పిల్లని ఉత్సాహపరుస్తూ పాడేలా ఒక పాటైనా పెట్టండి” అని భానుమతి అడిగింది. అంతా ఫిక్సయిపోయింది, ఇప్పుడు మార్చలేమని రమణ చెప్పారు. ఆ మాటకు భానుమతి కోపంతో ఊగిపోతూ “షూటింగు చెయ్యకుండానే అంతా ఫిక్సయి పోయిందా, ఇదేమన్నా కె.వి. రెడ్డిగారి సినిమానా” అంటూ దెప్పిపొడిచింది. అందుకు సమాధానంగా రమణ “ఇది మాత్రం బాపు గారి సినిమా” అని కూల్ గా చెప్పి బయటికొచ్చేశారు బాగా ఎదిగిన ‘బుడుగు’.

ముత్యాలముగ్గుకు అన్నగారి అభినందన…

1974లో బాపు-రమణలు ‘ముత్యాలముగ్గు’అనే కమనీయ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాకు నటరత్న ఎన్టీ రామారావు ఇచ్చిన కితాబే పెద్ద గీటురాయి. బాపు ‘ముత్యాలముగ్గు’ సినిమాను ఎన్టీఆర్ కి చూపించారు. సినిమా ప్రదర్శన పూర్తయ్యాక పులకిత వదనంతో ఎన్టీఆర్ “బ్రదర్! మీ సినిమా మా శోభంనం రోజులను గుర్తుచేసింది. పెరట్లో వెన్నెల నీడలో మల్లెపందిరి కింద కొత్తగా పెళ్ళైన జంట. విరిగిన ఇటుకగోడల మధ్య, తెల్లటి పక్కమీద శోభనం… వాహ్! అద్భుతం. అర్ధరాత్రి పెళ్లి ముహూర్తాలలో తరచూ కనిపించే తేనీరు సేవనం, పేకాటలు, కొబ్బరిచిప్పల్లో సిగరెట్ నుసి దులపటాలు సహజత్వానికి దగ్గరగా వున్నాయి. బాలవర్ధిరాజు మాయల ఫకీరు గుహలో దూరినట్లు క్లైమాక్స్ బాగుంది” అంటూ బాపు-రమణలను మెచ్చుకున్నారు. ‘షోలే’ సినిమాలో గబ్బర్ సింగు డైలాగులతో ఆరోజుల్లో రికార్డులు విడుదలై జనంలోకి దూసుకెళితే, ‘ముత్యాలముగ్గు’లో రావు గోపాలరావు డైలాగులతో విడుదలైన రికార్డులు కూడా మోతమోగించేశాయి.

ఇలా చెప్పుకుంటూ పొతే చాలా సినిమాలగురించి చర్చించాల్సివుంటుంది. ముఖ్యంగా ‘సంపూర్ణరామాయణం’, ‘భక్త కన్నప్ప’’ ‘సీతాకల్యాణం’, ‘గోరంతదీపం’, ‘మనవూరిపాండవులు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘మిస్టర్ పెళ్ళాం’, ‘రాధా గోపాళం’, ‘సుందరకాండ’ వాటిలో కొన్ని. 1995లో ప్రతిష్టాత్మక రాజాలక్ష్మి అవార్డు ముళ్ళపూడిని వరించింది. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ముళ్ళపూడికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఫిబ్రవరి 24, 2011 న రమణ చెన్నైలో కాలధర్మం చెందారు. కానీ రమణ రచనలు, సినిమాలు మరికొన్ని శతాబ్దాలవరకు పదిలంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap