శ్రీమతి అనూష దీవి, నివాసం నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్.
ఎంబీయే చదువయ్యాక, ఓ విమానయాన సంస్థలో ఏడాదిన్నర పాటు ఉద్యోగం చేసారు. అందుకే వీరు ఆలోచనలోను, ఆచరణలోను విమానంలా దూసుకుపోతున్నారు. ఒక సంవత్సరంపాటు “ఈనాడు వసుంధర గ్రూపులో మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమము” పేరున ఎన్నో వర్క్ షాపులను నిర్వహించారు.
చిన్నప్పటి నుంచీ ప్రతిరోజూ ఏదో ఒకటి వైవిధ్యంగా చేయాలనే ఆకాంక్ష ఎక్కువుగా ఉండేది. మనసుకు నచ్చినట్టుగా ఏదైనా చేస్తేనేగాని తృప్తిగా ఉంటుందని గట్టి నిర్ణయం తీసుకుని చేసే ఉద్యోగం మానేసారు. తన అభిరుచికి తగ్గట్టుగా చిత్రకళా రంగంలో, ముఖ్యంగా తంజావూరు కళను అత్యంత ఇష్టంతో చేయడం మొదలుపెట్టారు. తంజావూరు పేయింటింగ్స్ లో ప్రఖ్యాత గాంచారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ స్థాయిలో “యంగ్ అచీవర్” గా అవార్డ్ ను అందుకోవడంతో, తంజావూరు కళపై ఎందరో స్త్రీలకు శిక్షణ ఇచారు.
వీరు రూపొందించిన కళాఖండాలతో గ్రూప్ షోలో మూడుసార్లు, సోలోగా ఐదుసార్లు ప్రదర్శనలలో పాల్గొన్నారు.
సృజనాశక్తి ఉండాలేకానీ….. ప్రతి సందర్భాన్నీ అందంగా, వినూత్నంగా చేస్తూ, ఆర్థికంగా సంపాదించుకోవచ్చని, అందుకు కావలసిందల్లా మన చుట్టూ జరిగేవాటిని కాస్త వైవిధ్యంగా చేస్తే చాలని నిరూపించారు అనూష. తనలోని కొత్త ఆలోచనలతో ఎంతో మందికి ఉపాధిగా కల్పిస్తున్నారు. కార్పోరేట్ సంస్థలకు, కాలేజీ యువతకు తగ్గట్టుగా కళాత్మకమైన బహుమతులను రూపొందిస్తూ, అంచెలంచెలుగా ఎదిగారు. అందుకు కారణం వీరి భర్త, మరియు కుటుంబ సభ్యులు ప్రోత్సాహమే అంటున్నారు అనూష.
ప్రాముఖ్యత చెందిన చేనేత చీరలకు డిజైన్ లను కొద్దిగా మార్పులు చేసి, నేటి యువతకు నచ్చేలా నూతన డిజైన్ లను చేయడంతో అనూహ్యమైన ఆదరణ వచ్చింది. అంతేకాదు నేడు చీర, జాకెట్టుకే కాదు. వాడుకునే ప్రతి వస్తువు విషయంలోనూ కళాత్మకంగాను, సృజనాత్మకంగాను కొత్తదనాన్ని ఇష్టపడుతున్నారు నేటి యువతలు. పెళ్ళిలో కాశీయాత్ర ఘట్టంలో వాడే నల్లని గొడుగును వెల్వట్, జర్దోసీ ఉపయోగించి నూతన అందాలు జోడించి గొడుగులను రూపొందించడం, పెళ్ళిరోజు ఉంగరాల ఆటకు వాడే పానకం బిందెలు, అడ్డు తెరలు, పసుపూ, కుంకుమ ప్యాకెట్లు, ట్రేలు…ఇలా ప్రతిదాన్ని అందంగా మలచి అందించిడంలో అందె వేసిన చెయ్యి అనూష గారిది. కాలేజీ అమ్మాయిల షూలకు పేయింట్స్, ఆసుపత్రులకు, ఇన్ఫోసిస్ సంస్థలకు, ఐటీ కంపెనీలకు, కార్పోరేట్ కంపెనీలకు పేరు-హోదా తెలిపే నేమ్ బోర్డులపై “పెరల్ పేయింటింగ్స్ తో అందంగా రాయడం, కీ హోల్డర్లూ, విజిటింగ్ కార్డులు పెట్టుకునే హోల్డర్లు, పిల్లలకు-పెద్దలకు నచ్చేలా ఫొటో థీమ్స్ ని రూపొందించి అందిస్తున్నారు. ఇకపోతే అనూష చేసే ప్రక్రియలు గురించి తెలుసుకుంటే, “కళలో ఇన్ని రకాలుగా ఉంటాయా” అన్న ఆశ్చర్యంతో ఔరా అనకుండా ఉండలేరు.
•తంజావూరు పేయింటింగ్ తోపాటు
•మలబెర్రీ ఫ్లవర్స్,
•పేపర్ క్విల్లింగ్,
•పెన్సిల్ షేడ్ కార్డ్స్,
•పేపర్ ట్విస్టింగ్,
•ఒరుగామి ఆర్ట్,
•మధుభని,
•గ్లాస్ పేయింటింగ్స్,
•కాఫీ పేయింటింగ్స్,
•వర్లీ ఆర్ట్,
•ఆఫ్రికన్ ఆర్ట్,
•ఈజిప్టియన్ ఆర్ట్,
•సాండ్ పేయింటింగ్స్
•మొజాయిక్,
•నిబ్ వర్క్,
•మీనాకారి ఆర్ట్,
•ఫొటో థీమ్స్,
•కీ చైన్ హోల్డర్స్,
•మ్యూరల్ ఆర్ట్,
•కాలీగ్రఫీ,
•క్యాండిల్ మేకింగ్,
•క్రిస్టల్ ఆర్ట్,
•చాక్లెట్ బొకెట్,
•దివాళీ ఐటమ్స్,
•ఫ్యాన్సీ గిఫ్ట్ ఐటమ్స్,
•ఫన్ విత్ క్యాండీ స్టిక్స్,
•ఇటాలియన్ ఆర్ట్,
•జ్యూవలరీ మేకింగ్,
•టెర్రకోట,
•క్విల్లింగ్,
•కంటెంపరరీ జ్యూవలరీ,
•వాల్ హ్యాంగింగ్స్…..మొదలగునవి “హరిద్రా క్రాఫ్ట్స్” సంస్థ పేరుతో కోర్సులను నేర్పిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అనూష గారి చేయి దేనిమీదైనా పడితే అది ఓ సృజనాత్మకం.
అది ఓ ప్రయోగాత్మకం.
అది ఓ కళాత్మకం.
అది ఓ వినూత్నం.
ఒకొప్పుడు వారానికి 20-30 మందికి శిక్షణ ఇచ్చేవారని తెలిపారు.
ఇప్పుడు ఫేస్ బుక్ ద్వారా ఆర్డర్లు తీసుకొని చేస్తుంటారు. ఈ కళారంగంలో నూటికి నూరు శాతం తృప్తిగానే వుందని, అలాగే ఆర్థికంగా కూడా బాగుందని వివరించారు. అందుకే ఫుల్ టైమ్ జాబ్ లా ఇంట్లోనే వుండి చేస్తున్నానని అన్నారు. భవిష్యత్ లో గ్యాలరీని ఏర్పాటు చేయ్యాలని ఆశయమని కూడా చెప్పడం జరిగింది. అనూష గారి గురించి పూర్తిగా తెలుసుకున్నాక, “వయసులో చిన్న-వర్క్ లో మిన్న” అనుకోకుండా ఉండలేము.
చివరిగా “చదువు-వుద్యోగం మాత్రమే కాకుండా ఏదైనా కళారంగంలో సాధన చేస్తే మంచి భవిష్యత్ తోపాటు, గుర్తింపు కూడా వుంటుందని” ఎంతో గట్టి అభిప్రాయాన్ని చిరునవ్వుతో వెలిబుచ్చారు శ్రీమతి అనూష దీవి.
డా.దార్ల నాగేశ్వర రావు